Tuesday, January 10, 2012

సిద్ధాంతం లేకనే ఈ సంకటం

ప్రతి ఆశయానికీ దాని హేతుబద్ధతను వివరించే ఒక సిద్ధాంతముంటుంది. ఆశయసాధన కోసం చేయవలసిన ప్రయాణం మీద ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం స్థూల కార్యాచరణ ప్రణాళికను ఆశయసంస్థలు రూపొందించుకుంటాయి. దాన్ని వ్యూహమని అనవచ్చు. ఆ ప్రణాళిక ప్రాతిపదికగా చేసుకుని, ఆయా సందర్భాలలో ఇవ్వవలసిన స్పందనలను, తాత్కాలిక చర్యలను ఆ సంస్థలు రూపొందించుకుంటాయి. వాటిని ఎత్తుగడలని అంటుంటారు. ఒక సిద్ధాంతమంటూ లేకుండా, ఎటువంటి భూమికాలేని కార్యాచరణపద్ధతులను అనుసరిస్తూ, ఆశయాలపై వాటి సాధకులకు ఉన్న ఉద్వేగాలమీదనే ఆధారపడుతూ నడిచే సంస్థలకు దీర్ఘకాలిక కార్యాచరణలో కానీ, నిర్దిష్ట సందర్భాలలో కానీ అనేక సంకటాలు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

తెలుగుదేశం పార్టీ విషయంలో తెలంగాణ రాష్ట్రసమితి, అది భాగస్వామిగా ఉన్న సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి)కి అటువంటి సంకటమే తరచు ఎదురవుతున్నది. శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో చేసిన పర్యటన సందర్భంలో అయితే, పరాజయమే సిద్ధించింది. తెలంగాణ ఆశయానికి అవలంబకులుగా ఉన్నవారందరికీ శుక్రవారం నాటి సంఘటనలు మనోబలాన్ని దెబ్బతీశాయి, నిస్ప­ృహలోకి తోసేశాయి. సకలజనుల సమ్మె ముగిసిన నాటి నుంచి గూడుకట్టి ఉన్న నిరాశ పలచబడకుండానే, గోరుచుట్టుపై రోకటిపోట్ల వలె వరంగల్ పరిణామాలు జరిగాయి.

తెలుగుదేశంపార్టీ విధానాలు, దాని నాయకత్వానికి ఉన్న ప్రాదేశిక, సామాజిక స్వభావం- వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని, దాని మీద ఒక సైద్ధాంతిక వైఖరిని తెలంగాణ రాష్ట్రసమితి రూపొందించుకోవలసి ఉండింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధనకు కానీ, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు గానీ తెలుగుదేశం పార్టీ అవరోధం
అని భావిస్తే, ఆ పార్టీని దూరంగా ఉంచాలన్న విధానాన్నీ అనుసరించవచ్చు. కానీ, టిఆర్ఎస్ అటువంటి సైద్ధాంతిక వైఖరులకు వ్యతిరేకం.
సిద్ధాంతాల గొడవ వద్దని, భౌగోళికమయిన తెలంగాణ ఒక్కటే ఆశయమని, లాబీయింగ్‌ద్వారా, ఎన్నికల ద్వారా రాజకీయమైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలని టిఆర్ఎస్ నాయకత్వం నమ్ముతూ వచ్చింది. వాటిని కూడా ఒక సిద్ధాంతంగా పరిగణించవచ్చునేమో తెలియదు కానీ, ఎన్నికల రాజకీయాలకు అవసరమైన కుప్పిగంతులకు ఆస్కారం మిగుల్చుకోవడం మాత్రమే టిఆర్ఎస్ ఉద్దేశ్యం. మహాకూటమి పేరుతో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న తరువాత, ఆ పార్టీని వెలివేయాలన్న వైఖరికి నైతిక సమర్థన ఎట్లా సాధ్యమవుతుంది?

డిసెంబర్9 తరువాత చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చిందని, రెండుకళ్ల సిద్ధాంతాన్ని స్వీకరించాడని అభ్యంతరం ఉంటే కనుక- ఆ వెంటనే ఏర్పడిన జెఎసిల్లో కొంతకాలమైనా తెలంగాణ తెలుగుదేశం వారితో కలిసి ఎందుకు పనిచేసినట్టు? సరే, తెలంగాణ టిడిపి వారిని చంద్రబాబే నియంత్రిస్తున్నాడని అనుకుని, వారిపై రాజకీయ నిషేధం విధించి ఉంటే కనుక, సకలజనుల సమ్మె తరువాత ఆ నిషేధాన్ని ఎందుకు సడలించినట్టు? ఎనిమిదిజిల్లాల్లో అనుమతించిన పర్యటనను వరంగల్ జిల్లాలో మాత్రం ఎందుకు ప్రతిఘటించినట్టు? సైద్ధాంతికంగా ఈ కప్పదాట్లను సమర్థించుకోగలిగితే, ఆ విషయం తెలంగాణవాదులకు వివరించగలగాలి. సమర్థించగలిగే సిద్ధాంతం ఏమీ లేదు కనుకనే, నిందలు దూషణలతోనే జనాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం సాగింది.

తెలంగాణ టిడిపిని కూడా సిద్ధాంతరాహిత్యమే నడిపిస్తున్నది. సకలజనుల సమ్మె తరువాత తెలంగాణ ఉద్యమనాయకత్వం మీద ఏర్పడిన అసంతృప్తి వాతావరణాన్ని టిడిపి ఎట్లా ఉపయోగించుకున్నది? నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే ఉద్దేశ్యమే ఉంటే, పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకుని పోరాటం చేయవలసింది.
తమతో పనిచేయడానికి అభ్యంతరంలేని శక్తులు తెలంగాణలో అనేకం ఉన్నాయి. వారితో కలసి సరికొత్త కార్యాచరణను చేపట్టి ఉండవలసింది. అట్లా చేయకుండా, టిఆర్ఎస్, జెఎసి బలహీనపడిన సందర్భాన్ని టిడిపి అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించడానికి ఉపయోగించుకున్నది. తాము స్వయంగా ఉద్యమించాలన్నది మరచిపోయి, కెసిఆర్ అజ్ఞాతంలో ఉన్నాడనో, ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడనో నిందించడం మొదలుపెట్టింది. కెసిఆర్ తాతముత్తాతల మూలాల్ని ముందుకు తెచ్చింది. ఆత్మహత్యలన్నీ కెసిఆర్ చేసిన హత్యలనే అభియోగం మోపింది. రైతు సమస్యల మీద ఉద్యమించే హక్కు తమ పార్టీకి ఉన్నదనే ప్రాతిపదికమీదనే నిలబడి ఉన్నా, దానికి తగిన ఆమోదం లభించి ఉండేది. తాము తెలంగాణలో సంచరిస్తున్నాము కాబట్టి, టిఆర్ఎస్ బలహీనపడిందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టింది. రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో, తెలంగాణలో అవరోధాలు ఎదుర్కొంటున్న పార్టీకి కొత్త జీవం కల్పించడానికో ఇదంతా చేసి ఉండవచ్చు. అనువుగా దొరికిన వాతావరణంలో అత్యుత్సాహం ప్రద ర్శించిందా, రేప్పొద్దున టీడీపీకి నిజంగానే అనుకూల ఫలితాలు వస్తాయా- అన్నవి చర్చనీయాంశాలు.

ఒకటో రెండో స్థానాల్లో బలం ఉన్న జగన్‌పార్టీయే తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే, తెలుగుదేశం పార్టీ చూస్తూ చూస్తూ తెలంగాణలో పునాదిని వదులుకోదు. రాష్ట్రం ఒకటిగా ఉన్నా, విభజన చెందినా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ కీలకమయిన రాజకీయ క్షేత్రం. బలమైన ప్రజాపునాది, కష్టపడగలిగిన కార్యకర్తల బలం, పద్ధతి ప్రకారం పనిచేసే యంత్రాంగం ఉన్న పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో తమ పార్టీకి చికిత్స అవసరమనే వారి అవగాహనలో తప్పుపట్టవలసింది ఏమీ లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రసమితికి గురిపెట్టడం ద్వారా వారి బలం పెరుగుతుందా అన్నది ప్రశ్న. టిఆర్ఎస్‌నాయకత్వం మీద, ముఖ్యంగా కెసిఆర్ మీద ఎన్ని విమర్శలైనా చేయవచ్చు, చాలా విమర్శలకు ఆయన అర్హుడు కూడా కావచ్చు. కానీ, తెలంగాణ ఉద్యమానికి ఆయన ప్రస్తుతమైతే తిరుగులేనినాయకుడని అంగీకరించక తప్పదు. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి ఏకైక ప్రాంతీయ నాయకుడిగా ఆయనకే గుర్తింపు ఉన్నదనీ ఒప్పుకోవాలి. పదే పదే నిందించినప్పుడు, నిజాంనే సమర్థించే ధోరణి తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయింది. అస్తిత్వ ఉద్యమాల స్వభావం అది. అటువంటప్పుడు, కెసిఆర్‌ను ఒక హద్దు దాటి విమర్శిస్తే, అది తెలంగాణ పైనే విమర్శగా, తెలంగాణకు నాయకత్వం లేకుండా చేయాలనే ప్రయత్నంగా కనిపించకుండా ఉంటుందా? తెలంగాణలో ఉద్యమశ్రేణుల్లో అత్యధికులకు కెసిఆర్ మీద ఏవో ఫిర్యాదులున్నాయి. కానీ, ఆ ఫిర్యాదుల ఉద్దేశం, లోపాలను సవరించుకుని కెసిఆర్ వ్యవహరించాలనే తప్ప, అతన్ని తప్పించి ఉద్యమాన్ని నాయకత్వరహితం చేయాలని కాదు. కెసిఆర్ తప్ప మరెవరూ ఉద్యమనాయకత్వానికి యోగ్యులు లేరని కాదు. కానీ, యోగ్యత వేరు, జనామోదాన్ని పొందే నాయకత్వ లక్షణాలు వేరు. ఆ విషయం అనేక సందర్భాల్లో రుజువయింది.

తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడానా, వ్యవహరించానా అని బహిరంగసభలో చంద్రబాబు ప్రశ్నించారు. దానికి తెలంగాణవాదుల సమాధానాలు వేరే ఉంటాయి కానీ, వరంగల్లు జిల్లాలో పోరాటాలకు పేరుగన్న పాలకుర్తి ప్రాంతంలోకి వెడుతున్నప్పుడు, ఆయన తన వెంట కోడెల శివప్రసాదరావు, కరణం బలరామమూర్తి వంటి సమైక్యవాదులను ఎందుకు తీసుకువెళ్లినట్టు? పాలకుర్తిసభలో పసుపు జెండాలు పట్టుకున్నవారిని మాత్రం ఆ చర్య ఆనందపరుస్తుందా? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి, సీమాంధ్రప్రాంతంలో ఉద్యమాలు నడిపినవారు కూడా తెలంగాణలో నిరసనలకు అతీతంగా సంచరించగలగడం- తెలంగాణ టీడీపీకి మాత్రం ఏమి గౌరవం? శుక్రవారం నాడు జరిగిన లాఠీచార్జిలు కానీ, పోలీసుబలగాల ప్రదర్శన కానీ, తెలంగాణ టీడీపీ నాయకులకు ఇబ్బందికలిగించే సన్నివేశాలే కదా?

టిఆర్ఎస్‌కు అయినా, టీడీపీకి అయినా ఎన్నికల వ్యూహాలే తప్ప, ఉద్యమవ్యూహాలు ఏమీ లేవు. ఎన్ని సార్లు ఎన్నికలు వస్తే, టీఆర్ఎస్‌కు అంత సంతోషం. ఎన్నికల ద్వారా అందలాలు ఎక్కాలని వామపక్షాలు ప్రయత్నించి, తిరిగి తిరిగి మొదటి గడికే చేరుకోవడం తెలియనిదేముంది? వామపక్షాలు సంకోచించే అవకాశవాద స్నేహాలకు కూడా కెసిఆర్ సాహసించగలరు కాబట్టి, అప్పుడప్పుడు కొన్ని విజయాలు సాధ్యం కావచ్చును కానీ, అది అంతిమ ఫలితాన్ని మాత్రం ఇవ్వదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లలో కూర్చుని కోరినప్పుడు వీధుల్లోకి వచ్చే తంతును ప్రజలు మాత్రం ఎంతకాలం సాగిస్తారు? జనంలో ఒకసారి నిర్లిప్తత ఆవరిస్తే, వరంగల్‌లో జరిగిందే తెలంగాణ అంతటా జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణ ఉద్యమనాయకత్వాన్ని విమర్శించేవారిలో తెలుగుదేశమే కాక తక్కిన పక్షాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. కెసిఆర్ విశ్రమిస్తే, వారేమి చేస్తున్నట్టు? కెసిఆర్ తప్ప తెలంగాణ ఉద్యమంలో సమర్థత ఉన్న మరో నేత లేడని వారే అంగీకరిస్తున్నారా? ఆ ఎరుకే కలిగితే, ఎందుకు ఈ తీవ్రవిమర్శలు?నేను రంగంలో లేకపోతే ఏమి జరుగుతుందో చూడండి అని కెసిఆరే ప్రస్తుత పరిస్థితిని అనుమతించారా? కావచ్చునుకూడా.

1 comment:

  1. "తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడానా, వ్యవహరించానా"

    తెలంగాణా పక్షాన నిలవాల్సిన అవసరం వచ్చిన రోజు (డిసెంబర్ 10 ) నువ్వు గమ్ముగున్నవా లేదా? ఎన్నికల వాగ్దానానికి కట్టు బడలేని కుటిల రాజకీయం ఎందుకు?

    ReplyDelete