Thursday, January 19, 2012

మిన్ను విరిగి మీద పడుతున్నది, చూస్తున్నామా?

ఒకప్పుడు తెల్లవారుజాము హైదరాబాద్ ఆకాశమంటే ఎండాకాలమైనా సరే మంచుముసుగు కప్పుకునే ఉండేది. రాజధానిని రెండుగా చీల్చే మూసీదారి పక్కగా వెడితే, అంగుళం దూరంలో కూడా ఏమున్నదో పొద్దుటిపూట కనిపించేది కాదు. అన్ని రుతువులూ ఆహ్లాదంగా ఉండే ఆ రోజుల్లో సలసలకాగే ఎండాకాలం మాటే లేదు, మాటవరసకు మే మాసంలో మాత్రం కొంచెం ఉక్కపోసేది.

బాగున్నవాటిని పాడుచేయడమే మనుషులం చేసే పని. ఏ కొండకోనల్లోనో ఏ దేవుణ్ణో కనుక్కోవడం, ఆ చోటు అపవిత్రం అయిపోయేదాకా కిక్కిరిసిపోవడం, పర్వతసానువుల్లో చల్లదనపు చలివేంద్రాలను కనిపెట్టడం, అక్కడ ఉక్కపోతను ప్రతిష్ఠించేదాకా పర్యాటకం చేయడం- ఇదీ మనుషుల అలవాటు. ఎవరెస్టుదారినే ప్లాస్టిక్ చెత్తతో నింపేవారికి, పర్యావరణ ద్వీపాలను కాపాడుకోవడం ఎట్లా తెలుస్తుంది? పేదవారి ఊటీగా, ఆరోగ్యానికి ఆలవాలంగా, ఆహ్లాదమే నిత్యరుతువుగా ఉండిన హైదరాబాద్ కూడా అట్లాగే ధ్వంసమయిపోయింది. ఒడిపట్టనంత జనసమ్మర్దం, పచ్చదనాన్ని కబళించే కాంక్రీట్ విప్లవం నగరంలో రుతువుల గతినే మార్చివేశాయి.

తెల్లటి మేలిముసుగు కప్పుకుని చేతులు పైకి సాచి అనంతశూన్యాన్ని అందుకుంటున్నట్టు కనిపించే చార్మినార్ ఇప్పుడు హేమంతంలో సైతం మాసిన వెలిసిపోయిన కట్టడంలాగానే కనిపిస్తుంది. అల్లంతదూరం నుంచి చూస్తే, మసకమసకగా బాలాహిస్సార్ అంచులు మాత్రమే లీలగా కనిపించే గోలకొండ- ఒకనాడు దక్షిణాదిని ఏలిన సామ్రాజ్యపు రాజధాని- ఇప్పుడు ముప్పేటగా ముట్టడించిన భవనసైన్యం ముందు మరుగుజ్జు
అనిపిస్తుంది. చరిత్ర వద్దనుకున్న మనిషి, ఎండావానల వైవిధ్యాన్నీ వద్దనుకున్నాడు, ఉద్యానవనాల వైభవాన్నీ కాదనుకున్నాడు. సిమెంటు కట్టడాలు, సైబర్ స్వప్నాలు, ఫైబర్ వ్యక్తిత్వాలు- హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చివేశాయి.

ఈ ఏడాది ఎందుకో నగరానికి చలి జ్ఞాపకం వచ్చింది. ఇంతటి చలిసంక్రాంతి వచ్చి చాలా ఏళ్లయింది. ఇంత దట్టమైన పొగమంచులో ఊరు బద్ధకంగా తెల్లవారడం కూడా ఈ మధ్య ఎప్పుడూ లేదు. ఈ చలి రుతుసహజమైనది కాకపోవచ్చు, ఏ వైపరీత్యమో ఆకసాన్నావరించిన ఏ అల్పపీడనమో కావచ్చు. కానీ, మళ్లీ ఒక పురాశీతలస్మృతి నగరాన్నావహించింది. ధనుర్మాసపు చీకటి ఉదయాలూ హేమంతపు చలిమంటలూ అన్నీ క్షీ ణించిపోతుండవచ్చును కానీ, నగరం కడుపులో దాగిన సవాలక్ష పల్లెలు ఇంకా సంక్రాంతిని మననం చేసుకుంటూనే ఉన్నాయి.

ఇరుకిరుకు సందులలో, బండలు పరచిన గల్లీలలో, సిమెంటు, తారు రోడ్లపైనా ముగ్గులు ఏ మాత్రం తగ్గలేదు. ఏ పల్లెటూరినుంచో ఒక గంగిరెద్దు, ఒక హరిదాసు పలకరిస్తూనే ఉన్నారు. డాబాల మీద పిల్లలు పోటీలు పడి పతంగులు క్రీడిస్తూనే ఉన్నారు. ఒక పర్వదినం తన పుట్టుకనాటి పవిత్రతనూ, సందర్భాన్నీ కోల్పోయినా, వేడుక మాత్రం అవశేషంగా కొనసాగుతూనే ఉన్నది. మహానగరానికి సంక్రాంతి ఒకానొక పండుగ కావచ్చును కానీ, పల్లెలకు మాత్రం దానితో పేగుబంధం. అక్కడా సందర్భం అంతరిస్తూనే ఉన్నది. పంటలు ఇంటికి వచ్చేవేళన పండగ ఏర్పడి ఉండవచ్చును కానీ, ఇప్పుడు కాలంతో పాటు పంటకాలాలూ మారిపోయాయి. అప్పులతోనే పుట్టి, అప్పులతోనే ముగుస్తున్న సేద్యం ఇప్పుడు ఫలసాయాన్ని బండ్లమీద ఇండ్లకు తరలించడం ఎక్కడ? ఆహారపంటలే కరువవుతున్న మెట్ట ప్రాంతాల్లో ఇళ్లకు తరలేది ఏ ధాన్యం? గొబ్బిళ్లు పెట్టడానికి పేడ కూడా కరువవుతున్న రోజులివి. బండ్లు లేవు, బండ్లను లాగే ఎడ్లూ లేవు. గొడ్డుచాకిరీ చేసే దున్న పోతులూ లేవు. పాలిచ్చే పాడిపశువులకు మాత్రం బతుకు మిగిలింది, కృత్రిమ గర్భోత్పత్తీ, హార్మోన్ ఇంజెక్షన్లూ, రసాయన ఆహారమూ తిని ఆవులూ గేదెలూ ఇచ్చే పాలు ఇప్పుడొక వాణిజ్య ఉత్పత్తి. గోవధ నిషేధించాలని ఆరాటపడే వాళ్లు, సంకరమైపోతున్న భారతీయ గోసంతతి గురించి, అంతరించిపోతున్న దేశీయ పశుజాతుల గురించి, రైతు ఇళ్ల నుంచి నిష్క్రమిస్తున్న గొడ్డూగోదా గురించీ ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు.

సంక్రాంతి పండగ ప్రత్యేకమైనది. దసరాదీపావళి వంటి పండగలకు కూడా మతప్రమేయం లేని సాంస్కృతిక మూలాలు కానీ, నైసర్గికమైన కారణాలు ఉండవచ్చును కానీ, మనం చెప్పుకునేవి మాత్రం పురాణ సందర్భాలే. సంక్రాంతి పూర్తి లౌకిక పర్వదినం. సూర్యుడు ధనుస్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రమణం. సౌరమానంలో రాశుల సంక్రమణానికి పవిత్రత ఉంటుంది. మకరరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు ఇకపై తూర్పుదిశన ఉత్తరపు మూలగా పయనిస్తాడు. దాన్నే ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణంలో కన్నుమూస్తే ఉత్తమగతులు దొరుకుతాయని నమ్మేవారు ప్రాణాలు బిగపట్టుకుని సంక్రాంతిదాకా ఎదురుచూస్తారు. శీతాకాలపు నడిసమయంలో వచ్చే ఈ పర్వదినం- పంటలు చేతికివచ్చి గ్రామీణులు వేడుక చేసుకునే రోజు. రేగిపళ్లు, నువ్వులు, బియ్యంపిండితో చేసిన పిండివంటలు - ఈ పర్వదినానికి ప్రత్యేకం. సంక్రాంతి వెళ్లిన మరునాడు మాంసాహారపు పండుగ. జనం ప్రకృతినీ తమ కష్టఫలాన్నీ ఉత్సవీకరించుకునే సందర్భం సంక్రాంతి.

ప్రపంచానికి ఇప్పుడు ప్రమాదం స్వార్థపరుడైన మనుషుల నుంచి, వారిచేతుల్లో ప్రకృతికి జరుగుతున్న అపచారం నుంచి. మానవ ప్రస్థానంలో పాత ఆచారాలు, పద్ధతులు మారడం సహజమే కావచ్చును కానీ, మార్పు మానవీయంగా జరగాలి. నేడు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, పర్యావరణానికి జరుగుతున్న అపకారాలు- మనుషులకు మేలు చేసేవి కావు. ప్లాస్టిక్ గాలిపటాలతో, మట్టి గొబ్బెమ్మలతో, గ్రాఫిక్స్ గంగిరెద్దులతో చేసే పర్వదినాలు అభివృద్ధికి కాక, పతనానికే చిహ్నాలు.

అక్కడెక్కడో వాయు ఆవరణం పొలిమేరల్లో ఓజోన్ పొర ఛిద్రమవుతున్నదంటే కలవరపడుతున్నాం. కానీ, చూడగలిగితే మన కళ్లముందే అనేక అపశకునాలు! ఒకప్పుడు పల్లెలను పట్నాలను చల్లగా చూసిన ప్రకృతి, ఇప్పుడు మన ఆకాశాల మీది మంచుపొరలను తొలగిస్తున్నదంటే అంతకు మించిన ప్రమాదసూచిక ఏమి కావాలి? ఒక్క పశువూ లేని పల్లెలు పెరుగుతున్నాయంటే అంతకు మించిన హెచ్చరిక ఏమి కావాలి? సాయంత్రాలు తలెత్తిచూస్తే పలకరించే కొంగలబారులు పలచబారడం, ఊరపిచ్చుక చచ్చిపోవడం మనకేమీ బోధించడం లేదా?

తలచుకుంటే తిరిగి మళ్లీ మనం శీతాకాలాన్ని బతికించుకోగలం. మకరసంక్రాంతిని ప్రాకృతికమైన పండుగగా జరుపుకోగలం.

1 comment:

  1. జనవరి అంటేనే పతంగులు, నుమాయిష్, తెల్లారి మంచు, మస్తు ఖుషి. కొత్త సంవత్సంలో అయినా ఏలిన వారికి బుద్ది రావాలని కోరుకుందాం. ఇది తెలంగాణా అవతరణ వర్షంగా చరిత్రలో మిగిలి పోవాలి.

    ReplyDelete