Wednesday, January 25, 2012

భీషణ ప్రతిజ్ఞల భూకంపాలెక్కడ?

లేస్తే మనిషిని కాదు- అని శపథాలు చేసి, లేవకుండా చతికిలపడి కూర్చుంటే ఏమిటర్థం? జనవరి 18 తరువాత తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేస్తాం, భూకంపం పుట్టిస్తాం అని పెద్దమాటలు చెప్పిన పెద్దలు, ఇప్పుడు ఒక దీర్ఘకాలిక నత్తనడక కార్యక్రమాన్ని ప్రకటిస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రత్యేక రాష్ట్ర సాధన మాట పక్కనబెట్టి 2014 ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తే, ఉప ఎన్నికలకో స్థానిక ఎన్నికలకో పనికివచ్చే ప్రణాళికను రూపొందిస్తే సాధారణ తెలంగాణవాది ఏ నిర్ధారణకు వస్తారు? రెండు సంవత్సరాల నుంచి అనుక్షణం ఉద్వేగంతో, ఉత్కంఠతో, తపనతో రగిలిపోయిన ఒక సామాన్య ఉద్యమకార్యకర్త మనోభావాలు ఈ తాజా నిర్ణయాల వల్ల ఎట్లా ప్రభావితమవుతాయి?

జనవరి 20, 21 తేదీల్లో జరిగిన తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి (పొలిటికల్ జెఎసి) సమావేశంలో జరిగిన నిర్ణయాలు చూస్తే, తెలంగాణ సాధన ప్రస్తుతం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. 2014 మీద ఆశపెట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ ఏడాది ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందనికాక, ఎన్నికలలో గొప్ప విజయాలు సాధించడం మీదనే అసలు ఆశ. కాబట్టి, రానున్న రోజుల్లో మృదువైన, సాధారణమైన ఉద్యమకార్యక్రమాలు మాత్రమే సాగుతాయి. ఏప్రిల్ తరువాత మాత్రమే మళ్లీ విజృంభిస్తారట. ఈ లోగా మండలస్థాయి సదస్సులు, ప్రచార కార్యక్రమాలు చేపడతారట. విద్యార్థులకు పరీక్షల సందర్భంగా ఎటువంటి సమస్యలూ రాకుండా, లక్ష ఉద్యోగాల సాధనలో నిరుద్యోగులకు కష్టం కలగకుండా, సాధారణ జనజీవనం స్తంభించిపోకుండా, ప్రభుత్వపాలనలో కిరణ్‌కుమార్‌రెడ్డికి, యాత్రల నిర్వహణలో చంద్రబాబుకు, జగన్మోహన్‌రెడ్డికి, వీలయితే చిరంజీవికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా జాగ్రత్తగా పోరాటానికి రూపకల్పన చేస్తున్నట్టు కనిపిస్తున్నది.

మంచిదే. స్వయంపాలనతో మరింత అభివృద్ధి సాధ్యమన్న దృష్టితో ఉద్యమాలు చేస్తున్నవారు, ఆ క్రమంలో అభివృద్ధికి, భావితరాల పురోగతికి ఆటంకం కలిగే పద్ధతిలో వ్యవహరించకుండా సాధ్యమైనంత జాగ్రత్త పాటించాలి. శాంతియుతంగా, రాజకీయమైన ఒత్తిడిని తీవ్రతరం చేసే పోరాటరూపాలను ఎంచుకోవాలి. పరిపక్వత, నిగ్రహం
కలిగిన ఉద్యమాలు నైతికమైన ప్రభావం వేయగలుగుతాయి. తెలంగాణ ఉద్యమం అటువంటి గమనాన్ని ఎంచుకుంటే, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించేవారు కూడా తమ ధోరణిని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, జెఎసి వారు తమ ఉద్యమాన్ని సమీక్షించుకుని, సంస్కరించుకోవాలనుకుంటే అందులో తప్పుపట్టవలసినదేమీ లేదు. కాకపోతే, వారికి ఈ ఎరుక ఏ నేపథ్యంలో కలిగింది, ఏ ప్రయోజనాల కోసం కలిగింది అని చర్చించక తప్పదు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విద్యార్థియువజనులు ప్రారంభించినప్పటికీ, మర్రిచెన్నారెడ్డి దాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1971 ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి, ఆ వెంటనే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేశారు. ద్రోహమో మోసమో రాజీయో కానీ, అంతా కలిపి మూడునాలుగేళ్లలో విషయం తేలిపోయింది. ఆంధ్ర ప్రాంతంలో జైఆంధ్ర ఉద్యమం వచ్చేనాటికి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం గురించిన తీవ్రతే లేకుండా పోయింది. కానీ, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం మొలకెత్తి పదిహేనేళ్లు గడచిపోయాయి. తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్) ఆవిర్భవించి పదేళ్లు దాటిపోయాయి. పరిష్కారానికి ఇంకా ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. రెండు సాధారణ ఎన్నికలను, అనేక స్థానిక ఎన్నికలను టిఆర్ఎస్ ఎదుర్కొన్నది. ఆ పార్టీ నేత కెసిఆర్ తలపెట్టిన నిరాహారదీక్ష అనేక మలుపుల అనంతరం ఉధృత ఉద్యమానికి దారితీసి, 2009 డిసెంబర్ 9 ప్రకటనకు దారితీసింది. దానికి సీమాంధ్ర ప్రాంతాలలో వ్యక్తమయిన వ్యతిరేకత, వివిధ రాజకీయపక్షాల మాటమార్పిడి వల్ల తెలంగాణలో ఉద్యమం చిన్న విరామాలతో అయినప్పటికీ నిలకడగా, తీవ్రంగా కొనసాగింది. సకలజనుల సమ్మెతో పతాక స్థాయికి వెళ్లిన ఉద్యమం- సమ్మె విరమణ అనంతరం చప్పపడిపోయింది. ఆవేదన పడడానికి, ఆశాభంగం చెందడానికి కూడా ఆస్కారం లేని ఒక నీరస వాతావరణం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం సాధ్యాసాధ్యాల గురించిన వేదాంత ధోరణి ఒకటి తెలంగాణ వాదులను ఆవరించింది. ఆ సందర్భంలో టిఆర్ఎస్, జెఎసి నాయకత్వాలు- జనవరి 18 తరువాత తడాఖా చూపిస్తామన్న ప్రకటనతో తమ ఉనికిని నిరూపించుకునే ప్రయత్నాలు చేశాయి.   ఏవో గొప్ప నిర్ణయాలు జరిగిపోతాయని ఆశపెట్టుకునే పరిస్థితి లేదు కానీ, ఏం జరుగుతుందో చూద్దామన్న ఆసక్తి మాత్రం తెలంగాణవారిలో మిగిలింది. ఒక నిర్వేద వాతావరణం కొనసాగుతూనే ఉన్నది కాబట్టి, జెఎసి తాజా నిర్ణయాలు వారిని కొత్తగా నిరుత్సాహపరిచేదేమీ లేకపోవచ్చు. నిస్సహాయమైన పెదవి విరుపు తప్ప వారి నుంచి ఎటువంటి స్పందనా ఉండకపోవచ్చు. ఆశ లేనిచోట నిరాశకు కూడా తావు ఉండదని కొత్తగా చెప్పుకోనక్కరలేదు కదా?

తాత్కాలిక ఉద్యమాలు కాదు, దీర్ఘకాలిక ఉద్యమాలు నిర్వహించాలి, జెఎసిని మరింత బలోపేతం చేయాలి, భాగస్వామ్యపక్షాలను జెఎసి వెనకేసుకురావాలి- వంటి రకరకాల వ్యాఖ్యలు కెసిఆర్ జెఎసి సమావేశంలో చేశారు. జెఎసి కానీ, అందులో ప్రధాన పక్షమైన టిఆర్ఎస్ కానీ ఉద్యమవైఫల్యాల గురించి చేసుకున్న ఆత్మవిమర్శ ఏదీ ఆ సమావేశంలో వినిపించలేదు. ఉద్యమంలో ప్రధానపాత్ర నిర్వహించిన విద్యార్థులు సకలజనులసమ్మె నాటి నుంచి కార్యాచరణ నుంచి ఎడంగా ఉండడం గమనించవచ్చు. ఉద్యమభారాన్నంతా తమ భుజాల మీద వేసుకున్న ఉద్యోగవర్గాలు- సమ్మెవిరమణ నాటి ఒప్పందాల అమలు గురించి ఆందోళన చెందవలసిన స్థితికి వెళ్లారు. కెసిఆర్‌ను, జెఎసిని విమర్శించే ఇతర ఉద్యమసంఘాలు, నేతలు కూడా జడత్వంలోకి వెళ్లిపోయారు. తిరిగి ఉద్యమాన్ని సజీవస్థితిలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యం ఎవరిలోనూ కనిపించడం లేదు. ఆర్మూర్‌లో జగన్‌కు నిరసన తెలపడానికి ప్రయత్నించిన న్యూడెమొక్రసీ, ఇప్పుడు పోరుయాత్ర నిర్వహిస్తున్న బిజెపి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు కానీ, టిఆర్ఎస్‌లో అయితే చలనమే లేదు. కొత్తగా ప్రకటించిన కార్యాచరణ నీరసంలో ఉన్నవారిని నిద్రపుచ్చేతీరులోనే ఉంది తప్ప, కుదిపివేసే తీరులో లేదు. కావాలనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఉద్యమాన్ని నిద్రలేపి, ఉధృతం చేయవచ్చుననే మొండిధైర్యమేదో కెసిఆర్‌లో, జెఎసి నేతల్లో ఉన్నట్టుంది. కానీ, అన్ని సమయాలూ తమవి కావని, అవకాశాలు పునరావృతం కావడం అరుదని వారికి ఎవరు చెప్పాలి?

కాంగ్రెస్‌పార్టీతో విమర్శనాత్మక స్నేహం, తెలుగుదేశం పార్టీతో రాజకీయవైరం, జగన్‌పార్టీపై అనుమానాస్పద వైఖరి- ఇదీ టిఆర్ఎస్ అనుసరిస్తున్న పంథా. ఆ పార్టీ రాజకీయ అవసరాలను తీసిపారేయలేము. కానీ, ఉద్యమపార్టీకి ఉద్యమలక్ష్యాలే ప్రధానంగా ఉండాలి. 2014 దాకా ఉద్యమాన్ని కొనవూపిరితో ఉంచి, దాని నుంచి మూడో పర్యాయం కూడా రాజకీయ లాభం పొందాలని కాంగ్రెస్ భావిస్తున్నది.  లేకపోతే, సమస్యను తేల్చిపారేయాలనుకుంటే, ఇప్పటి కంటె అనువైన సమయమూ వాతావరణమూ కాంగ్రెస్‌కు దొరకవు. కానీ, ఎన్నికల దాకా ఈ అస్త్రాన్ని దాచుకోవాలని అనుకుంటోంది. టిఆర్ఎస్ కూడా దానికి సహకరిస్తోంది. ఎన్నికల ముందే వైఖరి ప్రకటించి కాంగ్రెస్ ముందుకు వెడుతుందా, వాగ్దానంగా ఉపయోగించుకుంటుందా తెలియదు. ఈ లోగా, ఉత్తరాది ఎన్నికల్లో పరిస్థితి వికటించి, జాతీయస్థాయిలో ప్రమాదం ఎదురయ్యే పక్షంలో- కాంగ్రెస్ తెలంగాణ గురించి ఆలోచించే పరిస్థితిలోనే ఉండకపోవచ్చు.

బంద్‌లూ రాస్తారోకోలూ రైల్‌రోకోలూ చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని, దాడులూ ధ్వంసాలతో బీభత్సం చేయాలని తెలంగాణవాదులెవరూ కోరుకోవడం లేదు. వారు కోరుకుంటున్నదల్లా, స్పందించే నాయకత్వం. చుక్కెదురు అయినప్పుడల్లా కోపగృహంలోకో అజ్ఞాతంలోకో వెళ్లి మొహం చాటేసే నాయకత్వం కాదు. ఇదీ పరిస్థితి, దీన్ని ఇట్లా ఎదుర్కోవాలనుకుంటున్నాము, ఫలానా సమయంలో ఫలానా రీతిలో మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తాము- అని ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని నచ్చచెప్పే పారదర్శకత నాయకత్వంలో ఉండాలి. రకరకాల విమర్శలూ అభియోగాలూ నిందలూ నాయకత్వం మీద వస్తున్నప్పుడు, వాటి గురించి వివరణలు ఇవ్వాలి. ఖండనలు ఇవ్వాలి. ఒక వ్యవస్థితమైన యంత్రాంగంగా టిఆర్ఎస్ రోజువారీ సంఘటనలపై స్పందించాలి, పార్టీని బలోపేతం చేయాలంటే జెఎసి పూనుకోవడం కాదు, జెఎసిని భాగస్వామ్యపక్షాలే పటిష్టం చేయాలి. అవసరమైన స్వతంత్రతను జెఎసి నాయకత్వానికి ఇవ్వాలి. సెంటిమెంటు మీద పార్టీని నెట్టుకుంటూ రావడం కాకుండా, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణాన్ని ఏర్పరచాలి. ఉద్యమపార్టీ అయిన టిఆర్ఎస్‌కు ప్రధానంగా నాయకులూ, అభిమానులూ తప్ప, చెప్పుకోదగ్గ కార్యకర్తల బలం లేదన్నది వాస్తవం. ఉద్యమంలో విరామం లభించినప్పుడు, దాన్ని పార్టీనిర్మాణానికి వినియోగించుకోవడం వివేకవంతుల లక్షణం.

వైఫల్యం వల్ల అంతరాయం ఏర్పడినప్పుడు- ఐకమత్యం సడలుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో అంతర్గత కలహాలు పెచ్చుమీరే అవకాశం ఉంది. బలహీనపడినప్పుడు ప్రత్యర్థుల దాడులు తీవ్రమవుతాయి. మబ్బుల్లో నీళ్లకోసం పరిగెత్తినట్టుగా 2014 మీద గురిపెట్టుకుంటే, ఈ లోగా అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

1 comment:

  1. మీ విశ్లేషణ చాలా ఆచరించదగ్గదిగా ఉంది.కాని అంత ఓపిక ఇప్పుడు ఎవరికీ ఉంది మాస్టారూ.తాత్కాలికమైన లాభాల మీదే అందరి దృష్టి.

    ReplyDelete