Tuesday, February 28, 2012

టాగూర్‌కే కాదు, గురజాడకూ 150!

గుర్తింపులో వివక్ష ఉన్నదన్న ఆగ్రహంతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మీద దాడిజరిగిన విగ్రహవ్యక్తులలో గురజాడ అప్పారావు కూడా ఉన్నారు కానీ, ఆయన కూడా దీర్ఘకాలం గుర్తింపు సమస్యలను, వివాదాలను ఎదుర్కొన్నవాడే. 1915లో మరణించిన గురజాడను, (కొందరు వ్యక్తులను మినహాయించి) ఆయన అనంతర తరం వెంటనే గుర్తించలేదు. తొలితరం ఆధునిక రచయిత అనీ, మంచి హాస్యనాటకం రాసిన చమత్కారి అనీ, వాడుక భాష కోసం పోరాడిన వాడని పరిగణించి కొంతకాలం గుర్తుపెట్టుకుని, ఆ పైన విస్మరించింది. కమ్యూనిస్టులూ అభ్యుదయరచయితలూ వచ్చి గురజాడ తీసుకువచ్చిన మహోదయాన్ని ఆవిష్కరించిన తరువాత కానీ ఆయన మహాకవో, యుగకర్తో కాలేకపోయారు. ప్రగతివాదులు గురజాడను పతాకంగా ధరించడం మొదలుపెట్టగానే, సంప్రదాయవాదులు, నవ్యసంప్రదాయవాదులు ఆయన భావాలను, రచనాశక్తినీ నిరసించడం మొదలుపెట్టారు. విప్లవవాదం ఉధృతంగా ఉన్న కాలంలో, తెలుగు సంస్కర్తలు సామ్రాజ్యవాద అనుకూలురని పేర్కొంటూ విమర్శలు వచ్చాయి. గురజాడ అడుగుజాడ అందరికీ కాదని, ఆయన దళితులకు, తెలంగాణకు మహారచయిత ఏమీ కాదని అస్తిత్వవాదులు ధ్వజమెత్తారు. ఇన్ని దశాబ్దాల నిశిత విమర్శ తరువాత కూడా గురజాడ సారాంశం ఏమిటో సంపూర్ణంగా ఆవిష్క­ృతమయిందనీ, ఆయన చేసిన దోహదాలపై, ఆయన వ్యక్తిత్వ సాహిత్యాలలో అసంపూర్ణతలపై సరిఅయిన అంచనా వచ్చిందనీ చెప్పే పరిస్థితి లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత సాంస్క­ృతిక ప్రదర్శనా కేంద్రంగా నిర్మించిన ఆడిటోరియమ్‌కు రవీంద్రుని పేరు పెట్టడం మీద ఆనాడు శ్రీశ్రీ అభ్యంతరం చెప్పారు. టాగూర్‌కూ తెలుగు సాహిత్యకళారంగాలకూ సంబంధం ఏమిటి? రవీంద్రభారతి అని కాక గురజాడ భారతి అని పేరు పెట్టాలి- అని ఆయన వాదించారు. స్టేడియమ్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి పేరు పెట్టడాన్ని కూడా శ్రీశ్రీ తప్పుపట్టారు.   క్రీడాంగణం దారుఢ్యం, ఆరోగ్యం ఉన్న వ్యక్తి పేరుతో ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కానీ, అర్భకుడిగా కనిపించే శాస్త్రి పేరు పెట్టడం ఏమిటి? కోడి రామమూర్తి పేరు పెట్టడం సబబుగా ఉండేది- అని శ్రీశ్రీ వాదన. హైదరాబాద్‌లోని రెండు ప్రజానిర్మాణాలకు తగిన పేర్లు

కోతల కేటాయింపులు, కేటాయింపుల కోతలు

ఆర్థికరంగం చురుకుగా లేకపోతే, నేటి సంపదే కాదు, రేపటి ఎదుగుదల కూడా దెబ్బతింటుందని కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రసూత్రాన్ని ఉటంకిస్తూ ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమది క్రియాశీలమైన ప్రభుత్వమనీ, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే విధానాలను తాము అమలుచేస్తున్నామని చెప్పుకోవడానికి మంత్రిగారికి ఆ ఉటంకింపు పనికివచ్చి ఉండవచ్చును కానీ, కౌటిల్యుడు అంత మాత్రమే చెప్పి ఊరుకోలేదు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, వ్యక్తిత్వమూ జ్ఞానమూ గుణమూ కూడా అని చెప్పాడు. పాలకులలో అవి లేనప్పుడు సౌభాగ్యం సాధ్యం కాదన్నాడు. ఆర్థిక సుస్థిరత ఉండాలంటే పాలకులు బాధ్యతగా, జవాబుదారీగా, స్పందనతో ఉండాలని, అందుకు భిన్నంగా వర్తించినప్పుడు వారిని తొలగించే అవకాశం ప్రజలకు ఉండాలని కూడా చెప్పాడు. సూక్తులే కావలసివస్తే కౌటిల్యుడేం ఖర్మ, శుక్రనీతిని, మనుస్మ­ృతినీ కూడా ఉటంకించవచ్చు, అనుశాసనపర్వంలోకి వెళ్లి పాలనకూ నేతలకూ వర్తించే అమూల్య ఆదర్శాలను అనేకం తవ్వితీయవచ్చు. కాసింత ఆంగ్లంలోకి వెళ్లి ఆడంస్మిత్‌నుంచి అమర్త్యసేన్ దాకా అరువు తెచ్చుకోవచ్చు. అంత అవసరమా అనేదే అసలు ప్రశ్న.

ఒకప్పుడు రాష్ట్రబడ్జెట్‌లు కూడా కాసింత ఆసక్తికరంగానే ఉండేవి. బడ్జెట్ ప్రసంగంలో మభ్యపెట్టి, ఆ తరువాత తీరిగ్గా పన్నులు వేయడం యాభైఏళ్లకిందటే మొదలయింది కానీ, కొంతయినా నిజాయితీ మిగిలి ఉండేది. లోటును లోటుగానే చూపించేవారు. రాష్ట్ర ఆర్థిక స్థితి రూపురేఖలు ఎంతో కొంత వాస్తవికంగానే అర్థమయ్యేవి. జీరో బడ్జెట్లో, లోటు లేని బడ్జెట్లో మొదలయ్యాక, బడ్జెట్ కేవలం కాగితాల కట్టగానే మారిపోయింది. ఇప్పుడు ఇక పేపర్‌లెస్ బడ్జెట్ యుగం మొదలయింది. అవే జీవం లేని అంకెలు, అర్థం లేని అంకెలు, అబద్ధాలను జీర్ణించుకున్న అంకెలు

Thursday, February 16, 2012

మన ప్రజాస్వామ్యమే ఒక నీలిచిత్రం!

"...నా అనుభవం ప్రకారం శాసనసభ 'బాతాఖానీ క్లబ్' అయిపోయింది. ప్రజల శ్రేయస్సుకు సంబంధించినంత వరకు ఒక రకమైన వేళాకోళం జరుగుతోంది. ..'' భూస్వామ్య, సామ్రాజ్యవాద, అధికార శక్తుల దోపిడీల నుంచి బయటపడేందుకు ప్రజలను కార్యోన్ముఖం చేసే కర్తవ్య నిర్వహణ కోసం సభను వదిలి వెడుతున్నానంటూ 1969 మార్చి 11 నాడు తరిమెలనాగిరెడ్డి చేసిన రాజీనామా ప్రసంగంలోని వ్యాఖ్యలు అవి. 'బాతాఖానీ క్లబ్' అని అన్నప్పుడు ఆయన ఉద్దేశ్యం- ఏవో సరదా కబుర్లతో ప్రజాప్రతినిధులు కాలక్షేపం చేస్తున్నారని కాదు. ప్రజాసమస్యలపై రాజకీయాలపై చట్టసభల్లో జరుగుతున్న చర్చలు పిచ్చాపాటీ మాటల వలె సాగుతున్నాయని, వాటిలో సీరియస్‌నెస్ లోపించిందని ఆయన ఆవేదన చెందారు. నాగిరెడ్డి మాటలకు నలభైఏండ్లు దాటాయి. ఇప్పుడు సీరియస్ అంశాలపై నాన్‌సీరియస్ చర్చలు కావు, నిజంగా పిచ్చాపాటీ సరదాకబుర్లే సభాసమయాన్ని హరిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష వాగ్వివాదాల మధ్య, సభానియమాల పండిత చర్చల మధ్య అసలు సమస్యలు మరుగునపడడం కాదు, సమస్యలు సభగడప తొక్కకుండానే, దూషణభూషణ కాలక్షేపాలతో చట్టసభలు సాగుతున్నాయి. నాగిరెడ్డి ఆనాడు చెప్పింది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాత్రమే వర్తించేదికాదు. సభావర్తనలో ప్రమాణాలు పతనం కావడం దేశవ్యాప్తంగా దాదాపు ఒకేరీతిలో కనిపిస్తుంది.

ఫిబ్రవరి 7వ తేదీ సోమవారం నాడు కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు తీరిగ్గా మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాన్ని చూస్తూ మీడియాకు పట్టుబడ్డారు. గతంలో సభ్యుల ఆసనాలకు రెండువైపులా నిలబడి వీడియో చిత్రీకరణ చేసే ఎలక్ట్రానిక్ మీడియాను భద్రతా కారణాల రీత్యా గ్యాలరీకి తరలించడంతో, గౌరవసభ్యులు చేసిన అగౌరవపు పనిని టీవీ కెమెరాలు క్లోజప్‌లో తీయగలిగాయి. తమను ఎన్నుకున్న ప్రజలను, శాసనసభ గౌరవాన్ని, అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన ఆ ముగ్గురు మంత్రులు పదవులు కోల్పోయారు, వారిని అసెంబ్లీనుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌కూడా ఉన్నది. వారి మీద తీసుకున్న చర్యలు కాక, భవిష్యత్తులో మీడియా అటువంటి క్లోజప్‌లు తీయకుండా కూడా ఏవో నిరోధాలు ఆలోచిస్తున్నారు. సభ్యుల ప్రవర్తనను నియంత్రించలేనప్పుడు, ఆ అరాచకాన్ని ప్రజల కళ్ల పడకుండా చూడడమే మేలన్న నిర్ధారణకు సభాపతులు రావలసివస్తున్నది. అందుకే, ఉన్నట్టుండి సభాకార్యక్రమాలు బ్లాక్అవుట్‌కావడం, మీడియా ప్రతినిధులపై రకరకాల ఆంక్షలు విధించడం. సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుందని చట్టసభల సమావేశాలను కుదించివేసే ప్రభుత్వాలు, దారిమళ్లించే అధికారపక్షాలు ఉన్నప్పుడు- బాతాఖానీకి కూడా భయపడే రోజులొచ్చాయనుకోవాలా?

ప్రజాప్రతినిధుల వ్యవహారసరళిని కేవలం చట్టసభల నియమావళితో మాత్రమే బేరీజు వేయడం సరిపోదు. ప్రజాస్వామిక విలువలను, సాధారణ సభ్యసమాజపు సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, కర్ణాటక అసెంబ్లీలో జరిగింది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. అశ్లీల వీడియోను చూస్తున్న మొబైల్ ఫోన్‌లో ఉడిపిలో జరిగిన రేవ్ పార్టీ దృశ్యాలు కూడా ఉన్నాయట. టూరిజం అభివృద్ధి పేరిట ఉడిపి సముద్రతీరంలో నిర్వహించిన రేవ్‌పార్టీలో

Tuesday, February 7, 2012

తిరుమల కొండా, చిలుకల గుట్టా

తిరుమల కొండ మీద అపచారాల గురించి, పవిత్రతల గురించి పీఠాధిపతులూ ఆగమపండితులూ వాదులాడుకుంటున్న సమయంలో, వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం అరకోటి మంది భక్తులకు స్వాగతం చెప్పడానికి సన్నద్ధమవుతున్నది. కోయగిరిజనుల దేవతలైన సమ్మక్క సారక్కలను స్థానిక ఆదివాసీలతో పాటు, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల ఆదివాసీలు కూడా ఆరాధిస్తారు. వారికి తోడు తెలంగాణ మైదాన ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనేతరులు మేడారం తరలివెడతారు. సీమాంధ్రప్రాంతాల నుంచి కూడా సాధారణ భక్తులు తండోపతండాలుగా రావడం కొత్తగా మొదలైన ఆనవాయితీ. మరి ఈ ఇద్దరు దేవతాస్త్రీలు హిందూమతానికి చెందినవారా కాదా, మేడారంలో జరుగుతున్నదాన్ని దండధారులైన మతాచార్యులు గుర్తిస్తారా లేదా - తెలియదు. ఏ క్షేత్రానికైనా స్థలానికైనా చివరకు ఏ ప్రతిమకైనా పవిత్రతను మనుషులే ఆపాదిస్తారు. మానవనివాసానికి అసాధ్యంగా ఉండే అటవీసానువుల్లో ఏ దేవుళ్లూ ఉండరు. మనుషులు స్ప­ృశించని నదులను ఎవరూ పవిత్రంగా భావించరు. మనుషులు తాము నివసించే, సంచరించే జీవావరణవ్యవస్థల్లోని ప్రాకృతిక శక్తులను, వనరులను భయంతోనో, కృతజ్ఞతతోనో దేవతలుగా భావిస్తారు. ప్రత్యేకమైన, అపురూపమైన సాహసపరాక్రమాలను, త్యాగశీలతను, జ్ఞానమార్గదర్శనాన్ని అందించిన మనుషులకు కూడా కాలక్రమంలో దైవత్వాన్ని ఆపాదిస్తారు. పరంపరాగతంగా గుర్తించి పూజిస్తున్న దైవస్థలాలను, ప్రతిమలను అదే పవిత్రతతో ఆరాధించడానికి కొన్ని ప్రాతిపదికలను కూడా మానవసమాజాలే నిర్ణయించుకున్నాయి. తాము అవినీతిగా, దైవవ్యతిరేకంగా భావించే పనులను దైవస్థలాల పరిసరాల్లో చేయకుండా ఉండడం, మానసికంగా, శారీరకంగా శుచీశుభ్రతలను

Wednesday, February 1, 2012

సిద్ధాంత విమర్శ సరే, ఆత్మ విమర్శ కావాలి

కమ్యూనిస్టుల మీద ఎంతటి వ్యతిరేకత ఉన్నవారు కూడా ఒప్పుకునే విషయం ఒకటుంది. ఇప్పుడున్న ప్రపంచం అన్యాయమైనదని, దాన్ని మరమ్మత్తు చేసి తీరాలని అనుకోవడమే కాకుండా, దాని కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం కూడా గట్టి విశ్వాసంతో, దీక్షతో, సాహసంతో, త్యాగంతో చేస్తారు. ఇప్పుడు నానా గోత్రాలుగా విడిపోయిన కమ్యూనిస్టులందరికీ వర్తిస్తాయా అంటే- కనీసం కట్టుబాటు, వ్యక్తిగత నిస్వార్థత విషయాల్లో వర్తిస్తాయనే చెప్పాలి. అందువల్ల రాజకీయాల్లో కమ్యూనిస్టులను ప్రత్యేకంగా, సీరియస్‌గా పట్టించుకోవలసి ఉంటుంది.

సత్యం ఒకటే కానీ, పండితులు దాన్ని రకరకాలుగా చెబుతారు- అని వేదం అంటుంది కానీ, నిజానికి, సత్యాలు కూడా అనేకం, ఎవరి సత్యాన్ని వారు చెబుతారు. తామనుకున్నదే సత్యం అనుకోకపోతే లోకంలో ఇన్ని అభిప్రాయాలు ఎందుకుంటాయి, ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎందుకుంటాయి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోను, దాన్ని ఎట్లా తమ లక్ష్యానికి అనుగుణంగా మార్చాలనే విషయంలోను కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక తేడాలున్నాయి. ఇతరుల అవగాహనను, పనిపద్ధతులను మితవాదమని, అతివాదమని కమ్యూనిస్టు పార్టీలు