Tuesday, February 28, 2012

టాగూర్‌కే కాదు, గురజాడకూ 150!

గుర్తింపులో వివక్ష ఉన్నదన్న ఆగ్రహంతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ మీద దాడిజరిగిన విగ్రహవ్యక్తులలో గురజాడ అప్పారావు కూడా ఉన్నారు కానీ, ఆయన కూడా దీర్ఘకాలం గుర్తింపు సమస్యలను, వివాదాలను ఎదుర్కొన్నవాడే. 1915లో మరణించిన గురజాడను, (కొందరు వ్యక్తులను మినహాయించి) ఆయన అనంతర తరం వెంటనే గుర్తించలేదు. తొలితరం ఆధునిక రచయిత అనీ, మంచి హాస్యనాటకం రాసిన చమత్కారి అనీ, వాడుక భాష కోసం పోరాడిన వాడని పరిగణించి కొంతకాలం గుర్తుపెట్టుకుని, ఆ పైన విస్మరించింది. కమ్యూనిస్టులూ అభ్యుదయరచయితలూ వచ్చి గురజాడ తీసుకువచ్చిన మహోదయాన్ని ఆవిష్కరించిన తరువాత కానీ ఆయన మహాకవో, యుగకర్తో కాలేకపోయారు. ప్రగతివాదులు గురజాడను పతాకంగా ధరించడం మొదలుపెట్టగానే, సంప్రదాయవాదులు, నవ్యసంప్రదాయవాదులు ఆయన భావాలను, రచనాశక్తినీ నిరసించడం మొదలుపెట్టారు. విప్లవవాదం ఉధృతంగా ఉన్న కాలంలో, తెలుగు సంస్కర్తలు సామ్రాజ్యవాద అనుకూలురని పేర్కొంటూ విమర్శలు వచ్చాయి. గురజాడ అడుగుజాడ అందరికీ కాదని, ఆయన దళితులకు, తెలంగాణకు మహారచయిత ఏమీ కాదని అస్తిత్వవాదులు ధ్వజమెత్తారు. ఇన్ని దశాబ్దాల నిశిత విమర్శ తరువాత కూడా గురజాడ సారాంశం ఏమిటో సంపూర్ణంగా ఆవిష్క­ృతమయిందనీ, ఆయన చేసిన దోహదాలపై, ఆయన వ్యక్తిత్వ సాహిత్యాలలో అసంపూర్ణతలపై సరిఅయిన అంచనా వచ్చిందనీ చెప్పే పరిస్థితి లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత సాంస్క­ృతిక ప్రదర్శనా కేంద్రంగా నిర్మించిన ఆడిటోరియమ్‌కు రవీంద్రుని పేరు పెట్టడం మీద ఆనాడు శ్రీశ్రీ అభ్యంతరం చెప్పారు. టాగూర్‌కూ తెలుగు సాహిత్యకళారంగాలకూ సంబంధం ఏమిటి? రవీంద్రభారతి అని కాక గురజాడ భారతి అని పేరు పెట్టాలి- అని ఆయన వాదించారు. స్టేడియమ్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి పేరు పెట్టడాన్ని కూడా శ్రీశ్రీ తప్పుపట్టారు.   క్రీడాంగణం దారుఢ్యం, ఆరోగ్యం ఉన్న వ్యక్తి పేరుతో ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కానీ, అర్భకుడిగా కనిపించే శాస్త్రి పేరు పెట్టడం ఏమిటి? కోడి రామమూర్తి పేరు పెట్టడం సబబుగా ఉండేది- అని శ్రీశ్రీ వాదన. హైదరాబాద్‌లోని రెండు ప్రజానిర్మాణాలకు తగిన పేర్లు ఆయనకు ఉత్తరాంధ్ర నుంచే స్ఫురించడం వెనుక ప్రాంతీయాభిమానం ఉందేమో పరిశీలించాలి. అయితే, తెలుగు వారి రాజధానిలో ఇతరుల పేర్లతో వ్యవస్థలు ఉండడమేమిటన్నదే శ్రీశ్రీ ప్రశ్నలోని ఆంతర్యం.

రవీంద్రుడికీ గురజాడకీ శ్రీశ్రీ ఎందుకు పోలిక తెచ్చారో కానీ, పోలికలకు గట్టి ప్రాతిపదికలే ఉన్నాయి. ఇద్దరూ 1862లోనే జన్మించారు. రవీంద్రుడి గీతం దేశానికే జాతీయగీతం అయింది, గురజాడ రాసిన దేశభక్తి గీతం ఎల్లలు లేని గేయంగా ప్రగతిశీలురందరి నోట నానుతున్నది. రవీంద్రుడి సాహిత్య, కళాసృష్టి విస్త­ృతమైనది, విశిష్టమైనది, సందేహం లేదు. ఆయనతో పోలిస్తే, గురజాడ కృషి పరిమాణంలో పరిమితమే కావచ్చును కానీ దేశమంటే మనుషులోయ్ అన్న వ్యక్తీకరణ వెయ్యి మహాకావ్యాల పెట్టు కదా? టాగూర్ వంగదేశీయుడు, ఆంగ్లంలోనూ రాశాడు కాబట్టి, ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు సంక్రమించడం సులువు అయింది.   ఆయన దృష్టిలో రవీంద్రుని కంటె గురజాడ ఎంతో ఉన్నతుడు. అంత దాకా ఎందుకు, టాగూర్ గీతాంజలి కంటె పాంచ్‌కడీదేవ్ అనే డిటెక్టివ్ నవలారచయిత రాసిన 'వాడేవీడు'(అనువాదం) నవలే గొప్పదని శ్రీశ్రీ అనేవారు. తెలుగువారికి ఉన్న స్వభావజాడ్యాల వల్ల, తెలుగువారికి జాతీయస్థాయిలో గుర్తింపు లేకపోవడం వల్ల గురజాడ తపాలాబిళ్లకు కూడా నోచుకోలేకపోయారు. కేంద్ర సాంస్క­ృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా, ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ టాగూర్ నూటయాభై జయంతి వేడుకలు దేశమంతా జరుపుకుంటూ ఉండగా, గురజాడ 150 ఏళ్ల ఉత్సవాలు తూతూ మంత్రంగా కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు. మన జాతీయగీతంలో తెలుగువారి ప్రస్తావనే ఉండదు. 'ద్రావిడ' అన్న మాటలోనే నేటి నాలుగు దక్షిణాది రాష్ట్రాలను రవీంద్రుడు సూచించాడు. ఇక టాగూర్ ఉత్సవాల ధగధగలో గురజాడ ఎక్కడ కనిపిస్తాడు?

గురజాడ పుట్టినరోజు గురించి చిన్న వివాదం ఉన్నది. 1861 నవంబర్30, 1862 సెప్టెంబర్ 21- ఈ రెండు తేదీలు ప్రచారంలో ఉన్నప్పటికీ రెండోదాన్నే ఆయన వంశీకులు ధ్రువపరుస్తున్నారు. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ సాంస్క­ృతిక శాఖ మొదటి దాన్నే పరిగణించి, 2011 నవంబర్ 30 నాడు 150 ఏళ్ల కార్యక్రమం జరిపేసింది. ఆ లెక్కలో 150 ఏళ్ల ఉత్సవాలు ముగిసినట్టే.  ఏడాది పొడువునా జరుపుతామని చెప్పి, చాలా కార్యక్రమాలను ప్రకటించారు కానీ- ఇప్పటికి మూడు నెలలయింది చేతలు గడప దాటలేదు. నాటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావలసి ఉండీ రాలేదు. ఆయన సరే, గురజాడ జిల్లాకు చెందిన నాయకుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అతిథి జాబితాలో ఉండీ గైరుహాజరయ్యారు. ఇక ప్రభుత్వ స్థాయిలో గురజాడ ఉత్సవాల గురించి ఆశించడంలో అర్థం ఏముంది?

ప్రభుత్వం సరే, ఇంతకాలం గురజాడను తలకెత్తుకుని ఊరేగిన కమ్యూనిస్టులు, వారి రచయితల సంఘాలు, ప్రచురణ సంస్థలు ఏమి చేస్తున్నట్టు? గురజాడ పుస్తకాలను ఇంతకాలం పాఠకులకు అందిస్తూ వచ్చినవారు, ఆయన సంకలిత రచనలు ప్రచురించే ప్రయత్నమే చేయలేదు. ప్రముఖ తెలుగు రచయితల సంపూర్ణరచనలను ప్రచురిస్తూ వస్తున్న 'మనసు ఫౌండేషన్'వారే గురజాడ సంపూర్ణ రచనలను ఒకే సంపుటంగా ఈ ఏడాది అందించబోతున్నారు. ఇంకా పుస్తకరూపం తీసుకోవలసిన గురజాడ లఘువ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన చదివిన పుస్తకాల జాబితా ఒక్కటి విడిగా ప్రచురిస్తే, నాటి ప్రజాస్వామిక భావజాలానికి ఇంధనంగా పనిచేసిన రచనలేమిటో తెలుస్తుంది.

సుబ్రహ్మణ్యభారతిని తమిళులు ఎట్లా గౌరవిస్తారో, బెంగాలీలు రవీంద్రుడిని ఎట్లా సొంతం చేసుకుంటారో-అట్లా తెలుగువారికి ఏ రచయితా లేరేమి? తమ వారసత్వాన్ని ఉత్సవీకరించుకునే స్వభావమే తెలుగువారికి లేదా? సొంత వైతాళికులను, సొంత సాహిత్యచరిత్రను, సంప్రదాయాలను నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్న సామాజిక న్యాయశక్తులు, ప్రాంతీయ అస్తిత్వ వాదులు గురజాడ పరిధిని తగ్గించివేస్తున్నారని నిందించడానికి ఈ 'ప్రధాన స్రవంతి' సాహిత్యకారులకు ఏమి హక్కు ఉన్నది? ఆ మూల విజయనగరంలో, రాజాంలో వెలుగు రామినాయుడు ఒక్కడూ ఒంటిచేత్తో నెలనెలా గురజాడ జయంతిని ఈ ఏడంతా నిర్వహిస్తున్నాడు. ఆయనకున్న నిబద్ధత, ప్రేమ- మహామహులు కొలువుదీరిన తెలుగుసాహిత్యవేదికలకు లేవని అనుకోవాలా? తెలుగుభాషా సముద్ధారకులూ, ప్రాచీన భాషాయోధులూ, మాతృభాషోద్యమ ప్రచారకులూ ఎక్కడికి పోయారు?

గురజాడలో ఉన్న అసమగ్రతలు ఆయన కాలానికి చెందినవి. గురజాడలోని కొత్త భావాలు ఆయన కాలాన్ని దాటినవి. గతించిన వ్యక్తుల పై మనం వేసే అంచనాలు వారిపై అభియోగాలో వ్యాజ్యాలో కావు. చరిత్రను సరిదిద్దే ప్రయత్నాలు అవి. ఒక సంధికాలంకో, ఒక సరిహద్దు రేఖపై నిలబడి గురజాడ రానున్న రోజులకు కావలసిన వెలుగులను వెదజల్లాడు. పరివర్తన దశలో ఉన్న సమాజానికి నూతన ప్రజాస్వామిక భావాల ఎజెండాను అందించాడు. సమానత్వం, శాస్త్రీయదృష్టి, ఆర్థిక ప్రగతి- ఆవశ్యకాలని అన్నాడు. దేశమంటే మట్టికాదని చెప్పాడు. మగడు వేల్పన పాత మాట అన్నాడు. దళితుడిని ఆలింగనం చేసుకోనివాడికి భ్రాతృభావం గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు.   భారతీయ చరిత్రరచనలోకి పాకుతున్న మతతత్వాన్ని గుర్తించమన్నాడు. భాషను, సాహిత్యాన్నే కాదు, సమాజాన్నే ప్రజాస్వామ్యీకరించాలన్నాడు. ఎవరైనా ఏ సమాజమైనా స్వీకరించగలిగే అనేక మంచిమాటలు చెప్పాడు. చరిత్రలో అటువంటివారు ఆయనొక్కరే కాకపోవచ్చు. ఆయన కంటె నాలుగుమాటలు ఎక్కువ చెప్పినవారు, తక్కువ చెప్పినవారు, ఇతర కోణాలను ఆవిష్కరించినవారు అనేకులున్నారు. వారందరితో మన చరిత్ర సుసంపన్నంగా ఉన్నది. వారిని స్మరించుకోవడానికి, మరొకసారి వారి మాటల, చేతల ప్రాసంగికతను చర్చించుకోవడానికి, బేరీజువేసుకోవడానికి కొన్ని సందర్భాలు అవసరం. గురజాడ నూటయాభై ఏళ్ల జయంతి- అటువంటి ఒక సందర్భం.

2 comments:

  1. ఇరువురి మధ్య కొన్ని ముఖ్యమయిన తేడాలు గమనించాలి.

    1. టాగూర్ కవిత్వం బెంగాలీ రినైజాన్స్ తీసుకొచ్చింది కానీ గురజాడది ఒంటరి పోరాటం.
    2. టాగూర్ రచనలు బెంగాలీ సమాజంలో అన్ని కోణాలనూ తాకుతాయి. గురజాడది అంత వైడ్ కాన్వాస్ కాదు.

    కట్టె కొట్టె తరహాలో క్లుప్తంగా రాసినందుకు క్షమించండి. పై వ్యాఖ్యను ఇంకొంచం విపులం చేసే ప్రయత్నం మరోసారి చేస్తాను.

    ReplyDelete