Tuesday, February 7, 2012

తిరుమల కొండా, చిలుకల గుట్టా

తిరుమల కొండ మీద అపచారాల గురించి, పవిత్రతల గురించి పీఠాధిపతులూ ఆగమపండితులూ వాదులాడుకుంటున్న సమయంలో, వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం అరకోటి మంది భక్తులకు స్వాగతం చెప్పడానికి సన్నద్ధమవుతున్నది. కోయగిరిజనుల దేవతలైన సమ్మక్క సారక్కలను స్థానిక ఆదివాసీలతో పాటు, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల ఆదివాసీలు కూడా ఆరాధిస్తారు. వారికి తోడు తెలంగాణ మైదాన ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనేతరులు మేడారం తరలివెడతారు. సీమాంధ్రప్రాంతాల నుంచి కూడా సాధారణ భక్తులు తండోపతండాలుగా రావడం కొత్తగా మొదలైన ఆనవాయితీ. మరి ఈ ఇద్దరు దేవతాస్త్రీలు హిందూమతానికి చెందినవారా కాదా, మేడారంలో జరుగుతున్నదాన్ని దండధారులైన మతాచార్యులు గుర్తిస్తారా లేదా - తెలియదు. ఏ క్షేత్రానికైనా స్థలానికైనా చివరకు ఏ ప్రతిమకైనా పవిత్రతను మనుషులే ఆపాదిస్తారు. మానవనివాసానికి అసాధ్యంగా ఉండే అటవీసానువుల్లో ఏ దేవుళ్లూ ఉండరు. మనుషులు స్ప­ృశించని నదులను ఎవరూ పవిత్రంగా భావించరు. మనుషులు తాము నివసించే, సంచరించే జీవావరణవ్యవస్థల్లోని ప్రాకృతిక శక్తులను, వనరులను భయంతోనో, కృతజ్ఞతతోనో దేవతలుగా భావిస్తారు. ప్రత్యేకమైన, అపురూపమైన సాహసపరాక్రమాలను, త్యాగశీలతను, జ్ఞానమార్గదర్శనాన్ని అందించిన మనుషులకు కూడా కాలక్రమంలో దైవత్వాన్ని ఆపాదిస్తారు. పరంపరాగతంగా గుర్తించి పూజిస్తున్న దైవస్థలాలను, ప్రతిమలను అదే పవిత్రతతో ఆరాధించడానికి కొన్ని ప్రాతిపదికలను కూడా మానవసమాజాలే నిర్ణయించుకున్నాయి. తాము అవినీతిగా, దైవవ్యతిరేకంగా భావించే పనులను దైవస్థలాల పరిసరాల్లో చేయకుండా ఉండడం, మానసికంగా, శారీరకంగా శుచీశుభ్రతలను
పాటించడం వంటి నియమాలేవో, ఆయా సమాజాల నైతిక విలువల వ్యవస్థ ఆధారంగా నిర్మితమవుతాయి. క్షేత్రాల, దేవాలయాల పవిత్రతకు వాటి ప్రాచీనత, వాటి నిర్వహణలో అనుసరించే తంతులు కూడా కీలకమైనవే.

శ్రీవైష్ణవ ఆచార్యులు, నిష్ఠాగరిష్ఠులు తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని పరమ ధార్మిక ప్రదేశంగా గుర్తించరు. దాన్నొక లౌకికమైన సాధారణ క్షేత్రంగా పరిగణిస్తారు. రాముడి కంటె రామానుజుడే అధికుడిగా భావించే వైష్ణవంలో, తిరుమల కంటె శ్రీపెరుంబుదూరు, కర్ణాటకలో తిరునారాయణస్వామి ఆలయం ఉన్న మేల్కొటె వంటి క్షేత్రాలకే పవిత్రత ఎక్కువ. అయితే, అనేక కారణాల వల్ల తిరుమల ప్రాశస్త్యం, ప్రాభవం 20వ శతాబ్దంలో విపరీతంగా పెరిగింది. ప్రయాణ, వసతి సదుపాయాలు పెరిగిన తరువాత భక్తుల తాకిడి మరీ అధికమైంది. ప్రాచీన చరిత్ర, మంచి ప్రాకృతిక పరిసరాలు కలిగిన తిరుమల మీద భక్తుల సందడిని, ఆలయ పవిత్రతలను సమతూకంగా నిర్వహించడంలో అక్కడి నిర్వాహక వ్యవస్థలు విఫలమయ్యాయనడంలో సందేహం అక్కరలేదు. తిరుమల దేవస్థానం సంపాదించే ఆదాయం, దాని పవిత్రతను కాపాడడానికి కాక, మరింత ఆదాయాన్ని సాధించే వ్యవస్థలను నిర్మించడానికి, విస్తరించడానికి ఉపయోగపడుతున్నది. ఒకపక్కన తిరుమల ధగద్ధగాయమానంగా వెలిగిపోతుంటే, రాష్ట్రంలోని అనేక చిన్నా పెద్దా ఆలయాలు దీపం పెట్టే దిక్కు లేకుండా, ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతమైన స్థితిలో పడిపోయాయి.

దేవుడికి నిద్రలేకుండా పోయిందని, ఆయన పరిస్థితి బజారులోని వేశ్యలాగా ఉన్నదని, తిరుమలలో పబ్ సంస్క­ృతి పెరిగిందని- చిన జీయర్ చేసిన విమర్శలు సంచలనం కలిగించడానికి తప్ప, ఆవేదన రగిలించడానికి చేసినవిగా కనిపించవు. కాషాయధారులు తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి కూడా మృదుభాషులుగానే ఉండాలి. అవసరానికి మించి చేస్తున్న అభివృద్ధే తిరుమలను అపవిత్రం చేస్తున్నదని ఆయన చేస్తున్న విమర్శ అర్థవంతంగానే ఉన్నది కానీ, అది పుణ్యక్షేత్రాలకు మాత్రమే పరిమితమైనధోరణి కాదు. చారిత్రక, పురాతత్వ స్థలాలమీద నిర్లక్ష్యంకానీ, తగిన పరిజ్ఞానం లేనివారు వివిధ వ్యవస్థలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కానీ, పబ్‌సంస్క­ృతి కానీ సమాజం అంతటా విస్తరించింది.

దైవప్రతినిధులుగా తమను తాము పరిగణించుకునేవారు సమాజంలోని అనాచారాలను కూడా పట్టించుకోవాలి. కానీ, పీఠాలను, మఠాలను పోషిస్తున్నది, వాటికి హంగూ ఆర్భాటమూ కల్పిస్తున్నది తమ లాభాపేక్షతో సమాజంలోని విలువలను లుప్తం చేస్తున్న శక్తులే అని తెలిసినప్పుడు నిస్ప­ృహ కలుగుతుంది. లాభకాంక్షను తగ్గించుకొమ్మని, మితంగా జీవించడం అలవరచుకొమ్మని, సమాజంలోని సకల స్థలాలకు, సందర్భాలకు ఉండే సాంప్రదాయిక పవిత్రతను దెబ్బతీసే విధంగా విపరీతపు పోకడలను స్వీకరించవద్దని బోధించవలసిన బాధ్యత ధార్మిక గురువులదే. సమాజంలో లేని నీతి పుణ్యక్షేత్రాలలో మాత్రం ఎట్లా వస్తుంది? అక్రమార్జనలో వాటా ఇచ్చి, దేవుడికి వజ్రకిరీటాలు తొడిగే మనుషులున్నప్పుడు, ఆలయానికి పవిత్రత ఏది? దైవదర్శనంలో కూడా తరతమభేదాలను దేవస్థానమే అనుమతిస్తున్నప్పుడు ఇక దేవుడు చేసే న్యాయం ఏది? జనసమ్మర్దంలో మేడారం దేవతల దర్శనం సాధ్యంకాదనుకున్నారేమో ముఖ్యమంత్రి ముందుగానే వెళ్లి వచ్చారు. గిరిజన మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంటే మేడారంలో ఆదివాసుల ప్రమేయం అంతరించిపోతున్నదని అర్థం. తుడిచిపెట్టిన తరువాతనే కదా, అక్కడో ప్రదర్శనశాలను నిర్మించడం? అమెరికాలోని నేటివ్ ఇండియన్ మ్యూజియం అయినా, శ్రీశైలంలోని గిరిజన మ్యూజియం అయినా ఆ విషాదవాస్తవాన్నే చెబుతాయి.

సమ్మక్క సారక్కలను కుంకుమబరిణెలుగా తీసుకువచ్చే చిలుకల గుట్ట చుట్టూ కంచె నిర్మిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జనసమ్మర్దంలో, వాహనాల ధూళిలో ఇప్పుడు మేడారం కాలుష్యభరితంగా తయారయింది. కలపస్మగ్లర్ల చేతివాటం వల్ల అడవి అంతరించిపోతూ, చివరకు చిలుకల గుట్టకు కూడా ముప్పు ఎదురయింది. తిరుమలలో అపచారాలు చేయడానికి భక్తాగ్రగణ్యులే వెనుదీయనట్టు, మేడారంలో కూడా వ్యాపారులకు దైవభీతి లేదు. మనుషులే దేవతలను సృష్టించేదీ, వారికి అపచారం చేసేదీ కూడా. మైనస్ డిగ్రీల లంబసింగి పరిస్థితి చూడండి, త్వరలోనే అది మనుషులతో కిటకిటలాడిపోయి ఉష్ణమండలంగా మారిపోతుంది.

మతమూ దేవుళ్లూ మనుషులకు మంచిచేస్తున్నాయా అన్నది వేరే చర్చ కానీ, అవి నెరవేరుస్తున్న కర్తవ్యాలేవో ఉన్నాయి. నమ్మకమో ఓదార్పో ఆశో- ఏదో ఒకటి దైవం చుట్టూ ఆవరించుకుని ఉన్నది. అర్థరహితంగా, అగమ్యగోచరంగా భ్రమింపజేసే మనిషి ఉనికికి ఒక వివరణను, ఒక అర్థాన్నీ ఇవ్వడానికి ఆధ్యాత్మికత ప్రయత్నిస్తుంది. జీవితాన్ని కలుషితం చేసుకున్న నాగరీకుడు నైతికతను కోల్పోయి అసంతృప్తులతో రగిలిపోయి మరింతగా మతాన్ని ఆలింగనం చేసుకుంటున్నాడు. జీవిత విధానంలోనే ఒక ప్రాకృతికమైన న్యాయాన్ని, నిరాడంబరతని, సొంత నైతికతను అనుసరించే ఆదివాసీ జీవితంలో మతానికి ప్రాధాన్యమే లేదు. జాతర కూడా వారికి ఒక వేడుక. నైవేద్యాలిచ్చే బెల్లపు వాసనా, బలి ఇచ్చే జంతువుల మరణదుర్గంధమూ ఆవరించి ఉన్నా సరే, మేడారంలో ఇప్పటికీ ఒక పవిత్రత ప్రస్ఫుటమవుతుంది.

సమ్మక్కసారక్కలకు ఒక స్థిరాలయం లేదు. అది ఆదివాసీ సంస్క­ృతి కూడా కాదు. మైదాన ప్రాంతంలో లాగా దేవుడూ మతమూ ఆదివాసీలను అనునిత్యం ఆవరించి ఉండవు. ఒక నిర్ణీత వ్యవధిలో దేవుళ్లను తెచ్చుకుని పూజించి సాగనంపడం వారి సంస్క­ృతి. ఇప్పుడక్కడ స్థిర ఆలయం కట్టాలని ఒక ప్రతిపాదన. అదే జరిగితే, అక్కడొక వ్యాపార సామ్రాజ్యం నిర్మితమై, అక్కడక్కడా అవశేషాలుగా ఆదివాసీలు మిగులుతారు. ఇప్పుడు మేడారం జాతరను గుర్తించను కూడా గుర్తించకుండా వ్యవహరిస్తున్న పీఠాధిపతులు సమ్మక్కసారక్కలను కనకదుర్గకో కాళికాదేవికో అవతారాలుగా మారుస్తారు. గర్భగుడిలో ఒక అగ్రవర్ణీకుడిని ప్రతిష్ఠించి దేవుడికీ భక్తుడికీ దూరం పెంచేస్తారు.

తిరుమల కొండా, చిలుకలగుట్టా మాత్రమే కాదు, కొండలన్నీ అపవిత్రం అవుతున్నాయి. నదులన్నీ ఎండిపోతున్నాయి. సముద్రతీరమంతా స్వార్థం మేటవేస్తున్నది. గాలి దుర్గంధం అవుతున్నది. నేరం స్వార్థానిది. నేరం వ్యాపారానిది.

1 comment: