Thursday, February 16, 2012

మన ప్రజాస్వామ్యమే ఒక నీలిచిత్రం!

"...నా అనుభవం ప్రకారం శాసనసభ 'బాతాఖానీ క్లబ్' అయిపోయింది. ప్రజల శ్రేయస్సుకు సంబంధించినంత వరకు ఒక రకమైన వేళాకోళం జరుగుతోంది. ..'' భూస్వామ్య, సామ్రాజ్యవాద, అధికార శక్తుల దోపిడీల నుంచి బయటపడేందుకు ప్రజలను కార్యోన్ముఖం చేసే కర్తవ్య నిర్వహణ కోసం సభను వదిలి వెడుతున్నానంటూ 1969 మార్చి 11 నాడు తరిమెలనాగిరెడ్డి చేసిన రాజీనామా ప్రసంగంలోని వ్యాఖ్యలు అవి. 'బాతాఖానీ క్లబ్' అని అన్నప్పుడు ఆయన ఉద్దేశ్యం- ఏవో సరదా కబుర్లతో ప్రజాప్రతినిధులు కాలక్షేపం చేస్తున్నారని కాదు. ప్రజాసమస్యలపై రాజకీయాలపై చట్టసభల్లో జరుగుతున్న చర్చలు పిచ్చాపాటీ మాటల వలె సాగుతున్నాయని, వాటిలో సీరియస్‌నెస్ లోపించిందని ఆయన ఆవేదన చెందారు. నాగిరెడ్డి మాటలకు నలభైఏండ్లు దాటాయి. ఇప్పుడు సీరియస్ అంశాలపై నాన్‌సీరియస్ చర్చలు కావు, నిజంగా పిచ్చాపాటీ సరదాకబుర్లే సభాసమయాన్ని హరిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష వాగ్వివాదాల మధ్య, సభానియమాల పండిత చర్చల మధ్య అసలు సమస్యలు మరుగునపడడం కాదు, సమస్యలు సభగడప తొక్కకుండానే, దూషణభూషణ కాలక్షేపాలతో చట్టసభలు సాగుతున్నాయి. నాగిరెడ్డి ఆనాడు చెప్పింది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాత్రమే వర్తించేదికాదు. సభావర్తనలో ప్రమాణాలు పతనం కావడం దేశవ్యాప్తంగా దాదాపు ఒకేరీతిలో కనిపిస్తుంది.

ఫిబ్రవరి 7వ తేదీ సోమవారం నాడు కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు తీరిగ్గా మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాన్ని చూస్తూ మీడియాకు పట్టుబడ్డారు. గతంలో సభ్యుల ఆసనాలకు రెండువైపులా నిలబడి వీడియో చిత్రీకరణ చేసే ఎలక్ట్రానిక్ మీడియాను భద్రతా కారణాల రీత్యా గ్యాలరీకి తరలించడంతో, గౌరవసభ్యులు చేసిన అగౌరవపు పనిని టీవీ కెమెరాలు క్లోజప్‌లో తీయగలిగాయి. తమను ఎన్నుకున్న ప్రజలను, శాసనసభ గౌరవాన్ని, అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన ఆ ముగ్గురు మంత్రులు పదవులు కోల్పోయారు, వారిని అసెంబ్లీనుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌కూడా ఉన్నది. వారి మీద తీసుకున్న చర్యలు కాక, భవిష్యత్తులో మీడియా అటువంటి క్లోజప్‌లు తీయకుండా కూడా ఏవో నిరోధాలు ఆలోచిస్తున్నారు. సభ్యుల ప్రవర్తనను నియంత్రించలేనప్పుడు, ఆ అరాచకాన్ని ప్రజల కళ్ల పడకుండా చూడడమే మేలన్న నిర్ధారణకు సభాపతులు రావలసివస్తున్నది. అందుకే, ఉన్నట్టుండి సభాకార్యక్రమాలు బ్లాక్అవుట్‌కావడం, మీడియా ప్రతినిధులపై రకరకాల ఆంక్షలు విధించడం. సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుందని చట్టసభల సమావేశాలను కుదించివేసే ప్రభుత్వాలు, దారిమళ్లించే అధికారపక్షాలు ఉన్నప్పుడు- బాతాఖానీకి కూడా భయపడే రోజులొచ్చాయనుకోవాలా?

ప్రజాప్రతినిధుల వ్యవహారసరళిని కేవలం చట్టసభల నియమావళితో మాత్రమే బేరీజు వేయడం సరిపోదు. ప్రజాస్వామిక విలువలను, సాధారణ సభ్యసమాజపు సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, కర్ణాటక అసెంబ్లీలో జరిగింది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. అశ్లీల వీడియోను చూస్తున్న మొబైల్ ఫోన్‌లో ఉడిపిలో జరిగిన రేవ్ పార్టీ దృశ్యాలు కూడా ఉన్నాయట. టూరిజం అభివృద్ధి పేరిట ఉడిపి సముద్రతీరంలో నిర్వహించిన రేవ్‌పార్టీలో
ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా పాల్గొన్నారు. మన ప్రభుత్వాలు ఇట్లా ఉన్నాయని బాధపడాలా, ప్రజాప్రతినిధుల స్థాయి ఇదని బెంగపడాలా, శీలానికీ సద్వర్తనకూ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీ సభ్యులు ఇట్లా దిగజారారేమని ఆశ్చర్యపోవాలా తెలియదు.

కోడిపందేలను పర్యవేక్షించేవారు, అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులను నిర్వహించేవారు, నిత్యం జూదంలో మునిగితేలేవారు, ఫార్మ్‌హౌజుల్లో జల్సాచేసేవారు- మన ప్రజాప్రతినిధుల్లో కూడా ఉన్నారన్నది పెద్ద రహస్యమేమీ కాదు. మర్యాద కోసమని మీడియా పేర్లు దాచిపెట్టినా, వార్తలు గుప్పుమంటూనే ఉంటాయి. ఎవరెవరు లంచగొండులో మద్యం సిండికేట్ల లెక్కల్లో తేలినట్టు, పోలీసు అధికారులతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే రాజకీయుల గుట్లు వెల్లడవుతాయి. తమ పార్టీ టిక్కెట్లపై గెలిచిన ప్రజాప్రతినిధుల ప్రవర్తనలేవో వారి అధిష్ఠానాలకు తెలియవా? ఆ ముగ్గురు మంత్రులూ అటువంటివారని బిజెపికి అప్పుడే తెలిసిందా? అధిష్ఠానాలే అవినీతికి అమ్ముడుపోతుంటే, దూడలు గట్టున మేస్తాయా? సొంత పార్టీ సభ్యులకే లంచాలిచ్చి మచ్చిక చేసుకోవలసిన స్థితిలో పార్టీల హైకమాండ్‌లు ఉంటే ఏ లోక్‌పాల్ మాత్రం అవినీతిని అరికడతారు? రకరకాల అసాధ్యపు వాగ్దానాలతో, మభ్యపరిచే మాటలతో అధికారానికి రావడం, ఆ వెంటనే ప్రజల వనరులను వ్యక్తులకు, కంపెనీలకు అప్పగించడం, వచ్చిన ముడుపులను తలా కొంత పంచుకోవడం- ఇదే రాజకీయమైనప్పుడు, దళారీతనపు సొమ్ముతోనే నేతల సంస్కారాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు-సంస్కరణ ఎక్కడినుంచి మొదలుకావాలి? ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఏదో మంచి చేసి, మళ్లీ గెలవాలనుకోవడం కంటె, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బు సంపాదిస్తే, అదే తమ రాజకీయ భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని నాయకులు అనుకుంటున్నారు. వారికి తగ్గట్టే పార్టీనేతలు కూడా. ప్రజల ఓట్ల నుంచి మెజారిటీ లభిస్తే సరేసరి, లేకపోతే, నోట్ల ద్వారా ప్రజాప్రతినిధులను, వీలయితే చిన్నాచితకా పార్టీలను కొనుగోలు చేయడం రెండుదశాబ్దాల కిందటే మొదలయింది. ప్రభుత్వాలను, పార్టీలను కొందరు వ్యక్తులో, చిన్న బృందాలో నియంత్రించే స్థితి వచ్చినప్పుడు- స్వేచ్ఛగా సాధికారంగా పాలన నెరిపే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుందా?

రాష్ట్రంలో సాగుతున్న తిట్ల పురాణం చూడండి. నాలుకలు కోసేవారు, మూతులు నాకేవారు అశ్శరభ శ్శరభ అంటూ రాజకీయరంగం మీద వీరంగం వేస్తున్నారు. ఎదుటివారిని నిందించేవారు, తాము అదే తప్పు చేయబోరని లేదు, చేయలేదని కాదు. ఆరోపణలు ఆరోపణల కోసమే. వ్యక్తిగత దూషణలతో, గతచరిత్రల నిందలతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నమే తప్ప, అందులో విలువల ప్రసక్తేమీ ఉండదు. ప్రజాసమస్యలను అల్పీకరించి, వాటిని వాగ్వివాదాల అంశాలుగా దిగజార్చడం నేటి నేతల విద్య. చట్టసభలు కాదు, పార్టీల పత్రికా సమావేశాలు పెద్ద బాతాఖానీలుగా మారిపోయాయి.

ఈ అవలక్షణాలకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాకపోవడమే ప్రజలకు నిస్ప­ృహ కలిగిస్తుంది. దేశంలోని అతి పెద్ద పార్టీ, దానికి పోటీగా ఎదిగిన మరో పార్టీ, వాటికి అండదండలు అందిస్తున్న భాగస్వామ్యపార్టీలు, సర్వజన బహుజన రాజ్యం తెస్తామనే పార్టీలు, బూర్జువా వ్యవస్థలోనే శాంపిల్ సోషలిజం సాధించాలనుకున్న వామపక్షాలు- ఎవరిని చూసినా ఏ ఆశా కలగడం లేదు. వ్యక్తిగతంగా సంస్కారాలు, అవినీతి మరక లేనివారు ఈ పార్టీల్లో లేరని కాదు. కానీ, రానురాను వారిసంఖ్య అత్యల్పసంఖ్యాకంగా మారుతోంది. వారి వారి సంస్థల్లోనే వేరుపురుగు ప్రవేశించినప్పుడు, ఒకరిద్దరు మంచిమనుషులు ఏమి చేయగలుగుతారు?

నిజాలన్నీ నిగ్గుతేలితే, అధికారులను, నేతలను బంధించడానికి దేశంలోని జైళ్లు సరిపోతాయో లేదో అనుమానమే. టూజీ స్కామ్‌లో ఇంకా బయటపడని తలకాయలెన్నో తెలియదు. అంతరిక్ష సంస్థల్లోనూ ఆశ్చర్యపరిచే అవినీతి ఒప్పందాలు, సైనికవ్యవస్థలోనూ అనుమానాలు కలిగించే వివాదాలు, న్యాయవ్యవస్థకు చెదలంటిన సమాచారాలు, కేబినెట్ బెర్త్‌ల కేటాయింపుల దగ్గరనుంచి, మద్యం వ్యాపారుల ముడుపుల దాకా తమ వంతు లబ్ధిపొందిన మీడియా ప్రతినిధులు- ఇక ఏ వ్యవస్థ మిగిలిందని కాసింత ఆశ కలగడానికి?

సమాజరంగస్థలం మీదనే తమకు వేళాకోళం జరుగుతోందని గుర్తించే స్థితిలో ప్రజలు లేరు. తామూ ఈ వేలంవెర్రిలో భాగమై పోయారు. కాసింత మెరుగైన మనిషిని, మెరుగైన పార్టీని వెదుక్కునే నిరంతరవ్యసనంలో పడిపోయారు. ఇన్ని చూసి కూడా, నేతల ప్రగల్భాలకు, అధికప్రసంగాలకు జైలు కొడుతూనే ఉన్నారు. ఆ ముగ్గురు కర్ణాటక మంత్రుల అపచారం గురించి ఆలోచించే సమయం కూడా యువతరానికి లేదు. సమయం ఉన్నవారు ఆ మంత్రులు చూసిన వీడియో క్లిప్పింగ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే పనిలో ఉన్నారు.

2 comments:

  1. అయ్యా శ్రీనివాస్ గారు ,వీళ్ళు నీలిచిత్రాలు మాత్రమే చూసారు ,మీకు జ్నాపకం తెచ్చుకోంది ,నిండు సభలో జయలలితకి చీర విప్పలేదా /శాంతి మంత్రం జపించే ఈ ఊసరవెల్లులు కుర్చీలతో ,మైకులతో అసెంబ్లీని రక్త మయం చేయలేదా?నైతిక విలువలు ఎక్కడా లేవండి ,నిజం చెప్పనా ?నేతి ఈ పరిస్తితికి కారణం ప్రజలు కాదా /తప్పు ని ఇది తప్పు అని నిలదీయలేని సంకట స్తితిలో ఉన్నరు తీరుబాతులేని ప్రజలు

    ReplyDelete