Tuesday, February 28, 2012

కోతల కేటాయింపులు, కేటాయింపుల కోతలు

ఆర్థికరంగం చురుకుగా లేకపోతే, నేటి సంపదే కాదు, రేపటి ఎదుగుదల కూడా దెబ్బతింటుందని కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రసూత్రాన్ని ఉటంకిస్తూ ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమది క్రియాశీలమైన ప్రభుత్వమనీ, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే విధానాలను తాము అమలుచేస్తున్నామని చెప్పుకోవడానికి మంత్రిగారికి ఆ ఉటంకింపు పనికివచ్చి ఉండవచ్చును కానీ, కౌటిల్యుడు అంత మాత్రమే చెప్పి ఊరుకోలేదు, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, వ్యక్తిత్వమూ జ్ఞానమూ గుణమూ కూడా అని చెప్పాడు. పాలకులలో అవి లేనప్పుడు సౌభాగ్యం సాధ్యం కాదన్నాడు. ఆర్థిక సుస్థిరత ఉండాలంటే పాలకులు బాధ్యతగా, జవాబుదారీగా, స్పందనతో ఉండాలని, అందుకు భిన్నంగా వర్తించినప్పుడు వారిని తొలగించే అవకాశం ప్రజలకు ఉండాలని కూడా చెప్పాడు. సూక్తులే కావలసివస్తే కౌటిల్యుడేం ఖర్మ, శుక్రనీతిని, మనుస్మ­ృతినీ కూడా ఉటంకించవచ్చు, అనుశాసనపర్వంలోకి వెళ్లి పాలనకూ నేతలకూ వర్తించే అమూల్య ఆదర్శాలను అనేకం తవ్వితీయవచ్చు. కాసింత ఆంగ్లంలోకి వెళ్లి ఆడంస్మిత్‌నుంచి అమర్త్యసేన్ దాకా అరువు తెచ్చుకోవచ్చు. అంత అవసరమా అనేదే అసలు ప్రశ్న.

ఒకప్పుడు రాష్ట్రబడ్జెట్‌లు కూడా కాసింత ఆసక్తికరంగానే ఉండేవి. బడ్జెట్ ప్రసంగంలో మభ్యపెట్టి, ఆ తరువాత తీరిగ్గా పన్నులు వేయడం యాభైఏళ్లకిందటే మొదలయింది కానీ, కొంతయినా నిజాయితీ మిగిలి ఉండేది. లోటును లోటుగానే చూపించేవారు. రాష్ట్ర ఆర్థిక స్థితి రూపురేఖలు ఎంతో కొంత వాస్తవికంగానే అర్థమయ్యేవి. జీరో బడ్జెట్లో, లోటు లేని బడ్జెట్లో మొదలయ్యాక, బడ్జెట్ కేవలం కాగితాల కట్టగానే మారిపోయింది. ఇప్పుడు ఇక పేపర్‌లెస్ బడ్జెట్ యుగం మొదలయింది. అవే జీవం లేని అంకెలు, అర్థం లేని అంకెలు, అబద్ధాలను జీర్ణించుకున్న అంకెలు
మున్ముందు టచ్‌స్క్రీన్‌లపై మిలమిలలాడతాయి. మన ఆర్థిక వ్యవస్థ లాగానే బడ్జెట్ పత్రాలు కూడా రూపానికీ సారానికీ సంబంధం లేని స్థితికి చేరుకున్నాయి.

బడ్జెట్ అనేది కేవలం వచ్చే ఏడాది జమాఖర్చుల పద్దు మాత్రమే కాదు. అందులో రాష్ట్రంలోని సమస్త ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు ప్రతిఫలిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయార్థిక దృష్టీ, ప్రభుత్వ వైఖరులూ వ్యక్తం అవుతాయి. యావత్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశకు లోబడి, విధించుకున్న తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకోవలసిన పత్రం అది. ఏ సమాజమైనా తన గమనానికి కొన్ని నిర్ణీత వ్యవధులలో ప్రణాళికలు రచించుకోవడమూ, సమీక్షించుకోవడమూ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాలు రూపొందిస్తున్న బడ్జెట్‌ల నుంచి ఆ కర్తవ్యాలను కోరుకోవడం అత్యాశే అవుతుంది. కనీసం, మాయచేయవద్దని కోరడం దగ్గరే మన ప్రతిపక్షాలైనా, పౌరసమాజమైనా నిలబడి ఉన్నాయి.

 సంపద వృద్ధి అనేది వృద్ధి కోసమే కాదు. అది జనజీవనంలో సంతృప్తిగానో, సంతోషంగానో వ్యక్తం కావాలి. ఆ వృద్ధిని సాధించాలంటే ప్రతి సమాజమూ తనలోని శక్తులేమిటో, పరిమితులేమిటో గమనించి, బాహ్య అవకాశాలను బేరీజు వేసుకుని తగిన వ్యూహరచన చేసుకోవాలి. సమష్టి తరఫున ఆలోచించడం కోసమే ప్రభుత్వాలు ఉండాలి. దానికి మించి వాటికి వేరే లక్ష్యాలేవీ ఉండకూడదు. దురదృష్టవశాత్తూ, ప్రభుత్వాలు ఆ పని చేయవు. సమాజంలోని ప్రాబల్యవర్గాలే ప్రభుత్వంలోకి వచ్చే వ్యవస్థలో, ప్రభుత్వ వ్యూహాలు కూడా ఆ వర్గాలకు అనుకూలంగానే వ్యూహరచనలు చేస్తాయి. పోనీ, ఆ వర్గాలకు కలిగించే మేలులోనే అందరికీ ఎంతో కొంత కంటితుడుపు ప్రయోజనాన్నైనా కలిపి ఆలోచించవచ్చు కదా అనుకుంటే, ఇప్పుడు మారిన పరిస్థితులు దాన్ని కూడా అసాధ్యం చేశాయి. మన సమాజాభివృద్ధికి ఏమి కావాలో, మన ప్రజాప్రతినిధులు నిర్ణయించే రోజులు పోయాయి. మన ప్రాధాన్యాలను వేరెవరో నిర్ణయిస్తారు, అంతర్జాతీయ మార్కెట్ దేన్ని విక్రయించాలనుకుంటే, దాన్ని కొనుగోలు చేయడమొక్కటే బడుగుదేశాలకు మిగిలింది. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం అంటే, బైటినుంచి ఎక్కడి నుంచో, ఎవరో పెట్టుబడులు పెట్టడమే. అంతర్జాతీయ ఆర్థికసంస్థలకు లాభసాటిగా అనిపిస్తేనే, మన దగ్గర మనకు అవసరమైన మౌలికవసతుల కల్పనకు గ్రీన్‌సిగ్నల్ దొరుకుతుంది.   విద్య కావచ్చు, వైద్యంకావచ్చు, మెట్ట ప్రాంతాల్లో జలవసతుల కల్పన కావచ్చు- ప్రపంచసంస్థలు కల్పించుకున్నంత మేరకే మన కార్యాచరణ. ఏ ప్రపంచబ్యాంకూ ముందుకు రాకున్నా, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రారంభించిన ప్రాజెక్టు జలయజ్ఞం ఒక్కటే. అయితే, దాన్ని ఆచరణాత్మక దృష్టితో చూసి దశల వారీగా చేపట్టడం కాక, కాంట్రాక్టర్లకు, అటునుంచి స్వప్రయోజనాలకు డబ్బు మరలేవిధంగా రూపకల్పన చేసి రాష్ట్రఖజానాపై ఎడతెగని భారం మోపారు. ఎన్ని ఏళ్లు వేల కోట్లు కేటాయిస్తూ పోతే, ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయో, అప్పటికి వాటికి నీటి అందుబాటు ఉంటుందో ఉండదో, ఆ ఆయకట్టు కింద సేద్యం చేయడానికి రైతు అంటూ మిగులుతాడో లేదో తెలియదు. స్థానికంగా ఉన్న చిన్న చిన్న వనరులను, పంటలను, వృత్తులను దృష్టిలో పెట్టుకుని కుటీరపరిశ్రమలో, ఉపాధి ఆధారిత పరిశ్రమలో ఏర్పాటు చేయాలన్న మాట గతంలో నేతల నోట కూడా ఎంతో కొంత వినిపించేది. అటువంటి కొత్త ఆలోచనలు కానీ, అందుకోసం సంకల్పంతో కూడిన ప్రయత్నం కానీ ప్రభుత్వాలలో కనిపించదు.

రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల నుంచి సమకూరే ధనాన్ని కొంత వేతనాలకు, మరికొంత అవినీతికి, తక్కినది పాలకుల అవ్యవస్థ వల్ల స్వార్థం వల్ల నిరుపేదలుగా మారిన అసంఖ్యాకులకు కంటితుడుపు సబ్సిడీలకు కేటాయించడమే నేడు బడ్జెట్ పేరుతో చెలామణీ అవుతోంది. ఈ పేదలకు విదిలించే సొమ్ముకే రకరకాల నామకరణాలు, కిరణాలు. ఎంఎంటిఎస్ రెండోదశకు కేటాయించిన పాతిక కోట్ల వల్ల ప్రయోజనం శూన్యమైనట్టే, ఈ పథకాల వల్ల ప్రజల మనుగడకు ఒరిగేదేమీ ఉండదు.  విద్యాసంస్థల్లో ఆట మైదానాలే కాదు, ఆటలు కూడా లేకుండా పోయిన వేళ స్టేడియాలు నిర్మించి యువకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం మరో నలుగురు కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికి ఉపయోగం? విశ్వవిద్యాలయాలతో సహా ప్రభుత్వరంగంలోని విద్యాసంస్థలన్నీ నిధులూ, ప్రమాణాలు, పర్యవేక్షణా లేక అణగారిపోతుంటే, నామమాత్రపు కేటాయింపులు ఏమి ఉద్ధరిస్తాయి? ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థలు రోగగ్రస్థమైనప్పుడు, అందుకు తగ్గ చికిత్స ఏదీ, చికిత్సకు డబ్బు ఏదీ? విద్య, వైద్యమూ- ఈ రెండూ యావత్ సమాజానికీ అవసరమైన మౌలిక సదుపాయాలనీ, ఉత్పాదకత, ఆర్థిక ఆరోగ్యమూ ప్రజారోగ్యం మీదనే ఆధారపడి ఉంటాయనీ ఏలినవారికి తెలియదా?

ఏమీ మారదు. వచ్చే ఏడు కూడా ఇట్లానే ఉంటుంది. రాబోయే సంవత్సరాలన్నీ ఇట్లాగే ఉంటాయి. ఎన్నికల ముందు సంవత్సరాలలో బడ్జెట్‌లో కాస్త సంక్షేమ జపం ఎక్కువగా ఉంటుంది. తక్కిన బడ్జెట్‌లలోని కేటాయింపులన్నీ కరిమింగిన వెలగపండ్లే. జనం ఆందోళన చెందకుండా మసి పూసి మారేడు కాయ చేయడానికి బడ్జెట్ పరిమాణాన్ని కొండంతగా చూపించడం, కేటాయింపులకు నెమ్మదిగా కత్తెరవేయడం- ఇదే తంతు. మార్కెట్లో తన కంపెనీని మెరిపించుకోవాలని, మదుపరులకు ఆకర్షణీయంగా కనిపించాలని సత్యం రామలింగరాజు లెక్కలను ఇబ్బడిముబ్బడి చేసి చూపించారు.   ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు, కార్పొరేట్ అవినీతికి పాల్పడినందుకు ఆయనను ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేస్తున్నది. సంవత్సరాల తరబడి ఆయన జైలులో మగ్గారు కూడా. మరి మన ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? లక్షా నలభై ఐదు కోట్ల బడ్జెట్‌లో ఉన్నవన్నీ పెంచి చూపిన అంచనాలు కావా? ఒక వైపు ప్రజలను మభ్యపెట్టడం, మరో వైపు రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి బయటివారికి తప్పుడు చిత్రం అందించడం.

మరి బడ్జెట్‌లో జరుగుతున్నవి మాత్రం ఆర్థిక నేరాలు కావా? వచ్చే బడ్జెట్ నాటికి కేటాయింపులనేకం కోతపడతాయి. లోటును భర్తీ చేసుకోవడానికి అనేక కొత్త పన్నులు పడతాయి. వీటి నుంచి వచ్చే నిరసనలను ఎదుర్కొనడానికి అర్థరూపాయికే కిలోబియ్యమో, ఇంకో వితరణ పథకమో సిద్ధం. బియ్యం సబ్సిడీ ఒక పెట్టుబడి మాత్రమే, అంతకు వందరెట్లు రాబడి మద్యంతో వస్తుంది.  

 కౌటిల్యుడూ చాణక్యుడూ ఒకరే అంటారు. ఆయన చెప్పిన ఆర్థికనీతిని అలవరచుకోలేకపోయినా, మన నేతలు చాణక్యాన్ని మాత్రం ఒంట బట్టించుకున్నారు.

No comments:

Post a Comment