Friday, March 9, 2012

సారొస్తారొస్తారా? వచ్చేశారా?

దక్షిణ తమిళనాడులో తిరునల్వేలి జిల్లాలో కన్యాకుమారికి దగ్గరగా ఉన్నది కూడంకుళం. అక్కడ వెయ్యి మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసే అణుశక్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్టు స్థలానికి చుట్టుపట్ల ముప్పైకిలోమీటర్ల మేర సుమారు 15 లక్షల మంది నివసిస్తున్నారు. అణువిద్యుత్‌కేంద్రం స్థాపనపై మొదటినుంచి భయాందోళనలు ఉన్నప్పటికీ, జపాన్‌లోని ఫుకుషిమాలో ఏడాది కిందట సునామీ కారణంగా జరిగిన అణుప్రమాదం అనంతరం కూడంకుళంలో ఉద్యమం ప్రారంభమైంది.   అమాయకులు, నిరక్షరాస్యులు అయిన కూడంకుళం మత్స్యకారులు మాత్రమే కాదు, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం వంటి అభివృద్ధి చెందిన ఐరోపాదేశాల పాలకులు కూడా భయపడ్డారు. అమెరికా, ఇంగ్లండ్‌లలోని పౌరసమాజం కూడా భయపడింది. పాత కేంద్రాలను మూసివేయాలని, కొత్తవి ప్రారంభించాలనే ఆలోచనలు విరమించుకోవాలని అనేక ప్రభుత్వాలు నిర్ణయించాయి.

కూడంకుళం అణుశక్తివ్యతిరేక ఆందోళన చాలా తీవ్రమయింది. అధికారంలోకి వచ్చాక సంగతేమిటో తెలియదు కానీ, అప్పటివరకూ జయలలిత కూడా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి, స్థానికుల ఇష్టానికి అనుగుణంగానే నిర్ణయం జరగాలన్న వైఖరి తీసుకున్నారు. ప్రాజెక్టుపై ప్రజలకున్న అనుమానాలను, భయాందోళనలను తొలగించడానికి అబ్దుల్ కలామ్ మొదలుకొని అనేకమంది శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రయత్నించారు. మరోవైపు, ప్రజల సందేహాలు తోసిపారేయదగ్గవేమీ కావని అణుశక్తిరంగంలో పేరుప్రఖ్యాతులు వహించిన శాస్త్రవేత్తలు కూడా గొంతుకలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారిక నిపుణులు అందరూ ప్రయత్నించినా ప్రజలను ఒప్పించలేకపోయారు. తామెందుకు విఫలమవుతున్నామో ప్రభుత్వాలకు అర్థం కాలేదు. సామాన్యప్రజలకు సొంతంగా విచక్షణ
ఉంటుందని, శాస్త్రసాంకేతిక అంశాలు ముడిపడిన ఒక అభివృద్ధి ప్రాజెక్టు పర్యావరణ పర్యవసానాలను, ప్రమాదావకాశాలను గుర్తించి నిలకడగా ప్రతిఘటించగలరని నమ్మకంలేని పాలకులు, ఒక భూతాన్ని కనుగొన్నారు. ఇందిరమ్మ దగ్గర నుంచి నేటిదాకా పదే పదే ప్రయోగిస్తున్న అస్త్రం అది. విదేశీహస్తం. తాము చెప్పే మాటల కంటె విదేశీనిధులతో నడిచే స్వచ్ఛందసంస్థలు చెప్పే మాటలనే ప్రజలు నమ్ముతున్నారని ప్రభుత్వాధినేతలే చెబుతున్నారంటే, తమ విశ్వసనీయతపై వారికి ఎంతటి గురి ఉన్నదో అర్థం అవుతుంది. భారతదేశం ఇంధనరంగంలో స్వయంసమృద్ధం కావడం అమెరికాలోని కొన్ని శక్తులకు ఇష్టం లేదట. వారు ఇక్కడి ఉద్యమకారులకు నిధులూ మద్దతూ అందిస్తున్నారట. ఈ మాటలను బాహాటంగా అనడమే కాకుండా, కూడంకుళం ప్రాంతంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను కేంద్రం రద్దు చేసింది.   ఒక జర్మన్ పర్యాటకుడిని వెనక్కిపంపి విదేశీయుల ప్రమేయమున్నదనే ప్రచారం చేసింది. ఇంకా అనేక సంస్థల లెక్కలను తనిఖీ చేయాలని ఆదేశించింది. విదేశీమారక నియంత్రణ చట్టం నిబంధనలను ఝళిపించి, దేశంలోని స్వచ్ఛంద సంస్థలన్నిటినీ అదుపులోకి తెచ్చుకోవాలని చూస్తున్నది.

భారత దేశంలోని స్వచ్ఛంద రంగం చాలా సంక్లిష్టమయినది. సంపన్నదేశాలలోని అనేక దాతృత్వ సంస్థలకు, ఆ దేశాల ప్రభుత్వాలకు సంబంధం ఉంటుంది. ఆ సంస్థలు భారతదేశంలోని క్షేత్రస్థాయి స్థానిక స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందిస్తాయి. ఏ రంగంలో ఆ నిధులు వ్యయం చేయాలనేదాన్ని దాతృత్వ సంస్థల విధానాలు, వాటిని ప్రభావితం చేసే ఆయా దేశాల ప్రాధాన్యాలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా, సంపన్నదేశాలలోని మతసంస్థలు, వ్యక్తులు కూడా దాతృత్వ సంస్థలను నిర్వహిస్తాయి. వారు తాము ఎంచుకున్న ప్రాధాన్యరంగాలలో పనిచేస్తూ, బడుగుదేశాలలోని క్షేత్రసంస్థలకు సహాయం అందిస్తాయి. విదేశీనిధులపైనే ఆధారపడేవి, పాక్షికంగా మాత్రమే బయటినిధులను తీసుకునేవి, కేవలం దేశీయ దాతల నుంచే సహాయాన్ని తీసుకునేవి, ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలలో పాలుపంచుకునే స్వచ్ఛంద సంస్థలు- ఇలా రకరకాల ఎన్జీవోలు మన దేశంలో కనిపిస్తాయి. అన్నిటి గురించి ఒకే రకంగా వ్యాఖ్యానించడం కానీ, నిర్ధారించడం కానీ చేయలేము. విదేశీనిధులతో నడిచే సంస్థలను, లేదా వాటి ప్రాధాన్యాలను ఏకమొత్తంగా కొట్టిపారేయలేము. ఒక విశ్లేషకుడు ప్రశ్నించినట్టు- ప్రపంచీకరణ యుగంలో సంపన్నదేశాల ప్రాధాన్యాలు మాత్రమే ప్రపంచవ్యాప్తం కావాలా? సంపన్నదేశాలలోని నిరసనలు, ప్రభుత్వవ్యతిరేక ధోరణులు మాత్రం ప్రపంచమంతా విస్తరించకూడదా? అణువిద్యుత్ ప్లాంట్లను వ్యతిరేకించే సంస్థలు అమెరికాలో లేవా?

అమెరికా కార్పొరేట్ ప్రపంచీకరణను నిరసించే సంస్థలు, ఉద్యమాలు అమెరికాలోనే అనేకం ఉన్నాయి. నిజంగానే, అణుశక్తిని పర్యావరణ దృష్టినుంచో, ప్రజాభద్రత దృష్టినుంచో వ్యతిరేకించే ఉద్యమసంస్థలు, భారత్‌వంటి దేశాల్లో అణువిద్యుత్ ఉద్యమాలకు సహాయం చేస్తే తప్పేమిటి? ప్రమాదాలకు బాధ్యత వహించే క్లాజును బలహీనపరచాలని అమెరికన్ కంపెనీలు భారత్‌పై ఒత్తిడి తెస్తుండగా లేనిది, అణువిద్యుత్ ప్లాంట్లను ఉపసంహరించుకోవాలని ఎన్జీవోలు ఉద్యమిస్తే తప్పేమిటి? తప్పనిచెప్పే నైతికత ప్రభుత్వానికి ఎక్కడిది? కూడంకుళంలో నెలకొల్పే రియాక్టర్ రష్యన్ తయారీది కావడం వల్లనే ఇదంతా జరుగుతోందనే వారూ ఉన్నారు. నిజానికి భారత-అమెరికా పౌరఅణుశక్తి ఒప్పందం జరగకపోతే, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ మన దేశంలో అణువిద్యుత్‌ప్లాంట్లను నెలకొల్పే అవకాశం లేదు. ఆ ఒప్పందంతో అధికలాభాన్ని పొందేది అమెరికాయే అయినప్పటికీ, అణ్వస్త్రక్లబ్‌లోని ఇతర దేశాలకు కూడా తలా కొంత వాటా దక్కుతుంది. ఆ ఒప్పందం సాధ్యం కావడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ సర్వశక్తులూ ఒడ్డారన్నది తెలిసిందే. వామపక్షాల మద్దతు పోయి ప్రభుత్వం పతనం అయినా పరవాలేదన్నారు, ఇతర పక్షాలు కూడా అడ్డుపడితే రాజీనామా చేస్తాను జాగ్రత్త అనీ బెదిరించారు. సింగ్ పట్టుదల వెనుక ఆయన అమెరికా అనుకూలతో, ప్రపంచీకరణ విధేయతో ఉన్నాయని విమర్శించినవారికి కొదవ లేదు. ఇప్పుడున్నట్టుండి, అమెరికా ముద్రను ఉద్యమకారుల మీద మన్మోహన్ ఎందుకు వేస్తున్నట్టు? కూడంకళం వంటి ప్లాంట్ల ద్వారా ఏ దేశీయ అణుశక్తిసాంకేతికతకు, స్వావలంబనకు పట్టం కడుతున్నారని దేశభక్తులంతా కొత్త అణుశక్తిప్లాంట్లకు జై కొట్టాలి?

పెరుగుతున్న ఇంధన అవసరాలకు అణుశక్తి కావాలని, బొగ్గు కొరత పెరగడం వల్ల ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాలని వాదించి అణు ఒప్పందానికి ఆమోదనీయత సాధించాలని ప్రధాని ప్రయత్నించారు. నిజానికి మన ఇంధన అవసరాలను, అవకాశాలను నిజాయితీగా చర్చించిన సందర్భమే లేదు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అన్వేషించడంలో కానీ, వాటికి పెట్టుబడులు సమీకరించడంలో కానీ చిత్తశుద్ధి చూపిందీ లేదు. రియాక్టర్లు అమ్మదలచుకున్నవారి అభిమతానికి అనుగుణంగా ఒప్పందాన్ని రూపొందించి, అతి కష్టం మీద ఆమోదం పొందారు. కూడంకళంలో కూడా అక్కడి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, వారిని విశ్వాసంలోకి తీసుకుని వ్యవహరించాలని కానీ ప్రయత్నించింది లేదు. సామాన్యులను ఎక్కడినుంచి వీలయితే అక్కడినుంచి తొలగించవచ్చునన్న ధీమా, అహంకారం అని తప్ప ఈ వైఖరికి మరో వ్యాఖ్య చెప్పలేము.

అణువిద్యుత్ వ్యతిరేక ఆందోళనల్లో అమెరికా హస్తం ఒక అభాండం మాత్రమే. కానీ, అమెరికా పెద్దన్నే తలచుకుంటే, సరిహద్దులే ఉండవు. పార్లమెంటులోనైనా, ప్రధాని కార్యాలయంలో నైనా పాగా వేయగలడు. అంతెందుకు, ఇండియాలో తమ ప్రత్యేక బలగాలున్నాయని అమెరికా సైనిక అధికారే స్వయంగా చెప్పాడు. అడ్మిరల్ రాబర్ట్ విలర్డ్ అనే అమెరికా పసిఫిక్ కమాండ్ చీఫ్ వాషింగ్టన్‌లో కొద్దిరోజుల కిందట పార్లమెంటరీ విచారణలో ప్రకటన చేస్తూ, పసిఫిక్ అసిస్ట్ బృందాలనే పేరుతో ప్రత్యేక భద్రతాబలగాలు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భారత్‌లలో ఉన్నాయని చెప్పారు. దీన్ని భారతదేశం ఖండించింది. ఏ రూపంలో కూడా అమెరికన్ సేనలు భారత భూభాగంలో లేవు అని స్పష్టం చేసింది. మరి ఆ అధికారి, పార్లమెంటరీ కమిటీ ముందు అబద్ధం చెప్పే సాహసం చేస్తాడా అనే సందేహం మిగిలే ఉంటుంది. భారత్ ఖండన చూస్తే, అమెరికన్ బృందాలు దౌత్యకార్యాలయాల్లో బసచేసి ఉన్నారా అని అనుమానం వేస్తున్నదని ఒక పత్రిక తీవ్రమైన వ్యాఖ్య చేసింది. అయితే, ఉగ్రవాదం పై పోరాటంలో అమెరికాతో కలసి పనిచేస్తున్న సంగతిని భారత్ ఖండన కూడా కాదనలేదు.

పశ్చిమాసియాలో ప్రారంభమై పాకిస్థాన్ దాకా వచ్చిన అమెరికన్ సైనిక ఉనికి భారత్ దాకా రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని అనుకుంటున్నదే. వ్యాపార, రాజకీయ రంగాలలో తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకున్న అమెరికా, సైనికంగా కూడా చాప కింద నీరులాగా విస్తరించే అవకాశం ఉండనే ఉన్నది. అది ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాల రూపంలోనో, శిక్షణల రూపంలోనో ఉండవచ్చును. భారత్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికాలో జరిగే విచారణ రూపంలో ఉండవచ్చును, ఎఫ్‌బిఐ, సిఐఎ తరచుగా భారత్‌నేలపై చేసే దర్యాప్తుల రూపంలోనూ ఉండవచ్చును.

అమెరికా వచ్చేసింది. కూడంకుళం వైపు చూడమంటుంది ప్రభుత్వం. కానీ, వాస్తవాలు మాత్రం ప్రభుత్వం వైపే చూడమంటున్నాయి.

1 comment: