Saturday, March 17, 2012

మనలో మన మాట, మనకెన్ని నాలుకలు?


ప్రకృతి బద్ధమైన సహజ వ్యవసాయం కోసం, రైతాంగం సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు ఈ మధ్య తారసపడి, రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపుల గురించి చర్చించడానికి అధికార, ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వాస్తవ పరిస్థితులపై తమ అవగాహనను ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే, వారు సమస్యలను అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ప్రస్తావిస్తారన్నది ఆ ప్రతినిధి ఆశ. ఆ సమావేశానికి మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించవచ్చును కదా అని అడిగితే, వద్దు లెండి, పత్రికల వాళ్లూ, కెమెరాలూ కనిపిస్తే ప్రతి ఎమ్మెల్యే వారి వారి పార్టీల అవగాహననే మాట్లాడతారు, వారి మనసులో ఉన్న మాట బయటకు రాదు- అన్నాడాయన. 
ఉద్దేశ్యం బాగానే ఉన్నది కానీ, పార్టీల అధికారిక వైఖరులతో నిమిత్తం లేని సొంత అభిప్రాయాలు సాధించేది ఏమిటని? రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా ఎన్నికల ప్రయోజనాల ఆధారంగా పార్టీల ప్రాధాన్యాలుంటాయి. బయటి సంస్థలు, ఉద్యమాలు ప్రాధాన్యాలను నిర్ణయిస్తే, సూచిస్తే వాటిని పరిగణనలోకి తీసుకునే స్థితిలో ప్రజాప్రతినిధులున్నారా? సుమారు ఏడాది కిందట, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న కాలంలో జరిగిన ఒక టీవీ చర్చావేదికలో నాయకులు ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా తమ తమ వైఖరులను
తీవ్రధ్వనిలో వ్యక్తం చేశారు. చర్చానంతరం నేతలు పరస్పరం పలకరించుకుంటూ, మాట్లాడుకున్నది మాత్రం వేరు. మైకులూ కెమెరాలూ ఉన్నాయి కాబట్టి, ఇట్లా మాట్లాడవలసి వస్తున్నది కానీ, ఈ స్థాయికి వచ్చిన తరువాత ఇక విడిపోవడమే మంచిది కదా- అని సమైక్యవాద ఢంకా బజాయించిన నేతలే పిచ్చాపాటీ మాటల్లో అనేశారు. అంటే వ్యక్తిగత స్థాయిలో వారి అభిప్రాయాలేమయినా, పార్టీల ప్రయోజనాల కోసం, స్థిరపడిన వైఖరుల కోసం పరిష్కారం జటిలమూ ఆలస్యమూ అయినా పరవాలేదనే ధోరణి నాయకుల్లో ఉన్నది. బహుశా వారి చేతుల్లో కూడా ఏమీ లేకపోవచ్చు. వాళ్ల కాళ్లూచేతులూ 'విధానాల'కు బంధితమై ఉండవచ్చు. సభ్యుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటే, పార్టీల విధానాలను నిర్ణయిస్తున్నదెవరు? అన్న సందేహం వస్తుంది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఒకరు ఈ మధ్య అసెంబ్లీ భవనంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి పిచ్చాపాటీ మాట్లాడారు. తప్పేమీ లేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు వ్యక్తిగతంగా కత్తులు నూరుకుంటూ ఉండాలని లేదు, స్నేహంగానూ మర్యాదగానూ ఉండవచ్చు. అట్లా ఉండడమే కాదు, ఆయన తన మనసులోని మాటనే కాదు, చాలా పచ్చినిజాన్ని కూడా చెప్పేశారు. "ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను చంద్రబాబు రూపొందిస్తే, మా వాళ్లు పిండుకుని మరీ దోచేస్తున్నారు, సైకిల్ మీద వేగంగా వెళ్లడానికి చంద్రబాబు సిమెంట్ రోడ్లేస్తే, మేం సైకిళ్లను పక్కకు నెట్టి బెంజికార్ల మీద పరుగులు తీస్తున్నాం''- అన్నారాయన. అంతే కాదు, వై.ఎస్. అవినీతి పాపం ఆయనొక్కరిదే కాదని, అప్పుడున్న మంత్రులందరిదీ అనేశారు. ఇంత స్వస్వరూప జ్ఞానం రావిశాస్త్రి నవలల్లో ప్రతినాయకులకు తప్ప మరెవరికీ ఉండదు. ఆ మాజీ అమాత్యులు ఆ మాట మీద నిలబడతారని అనలేము. ఆఫ్‌ద రికార్డ్ అని మాట్లాడినా పత్రికలన్నిట్లో వచ్చేసింది కాబట్టి, సమస్య వస్తే, తాననలేదని, మీడియా వక్రీకరించిందనీ అనే అవకాశం ఆయనకున్నది. 

మనసులోని మాటకీ, పైకి చెప్పే మాటలకు ఎందుకింత దూరం? పార్టీల అవగాహనకీ, ఆ పార్టీ సభ్యుల అవగాహనకీ ఎందుకు ఇంత వ్యత్యాసం? కపటత్వం వల్ల ఈ ద్వంద్వత్వమా లేక నిస్సహాయత వల్లనా? రాజకీయాలకే ఇది పరిమితమా లేక సమాజం అంతటికీ ఇది వర్తిస్తుందా?


ఏవో కొన్ని సిద్ధాంతాలను విశ్వసించి, వాటికి అనుగుణమైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి రాజకీయాలలోకి వచ్చేవారు అతి తక్కువ మంది ఉన్నారని వేరే చెప్పుకోనక్కరలేదు. రాజకీయం ఇవాళ ఒక లాభసాటి అయిన వృత్తి. నోరులేనివారికి, అధికార సోపానాలు ఎక్కలేనివారికీ చిన్న చిన్న పనులు చేసిపెడుతూ ఎదిగే నాయకుడు, పెద్ద పెద్ద వారికి పెద్ద పెద్ద పనులు చేసిపెట్టే స్థాయికి వెళ్లడమే నేటి రాజకీయం. ప్రజాధనాన్ని ప్రజల కోసం వెచ్చించే క్రమంలో సొంత లాభాన్ని సమకూర్చుకోవడం, సొంత లాభం సమకూరేవిధంగా ప్రజల కోసం చేసే వ్యయాన్ని తీర్చిదిద్దడం- ప్రజాప్రతినిధుల పని. ఈ క్రమంలో పార్టీలు నాయకవ్యక్తులకు ఆలంబనలు మాత్రమే. ఎవరు ఏ పార్టీలో ఉంటారనేదానికి ఏ ప్రాతిపదికలూ ఉండవని చెప్పలేము కానీ, రాజకీయవాదుల్లో అధికులు ఏ పార్టీలో అయినా ఇమిడిపోగలిగిన వారే. వారికి భారత రాజ్యాంగమయినా, భారతీయ సామాజిక విలువలయినా, సొంత పార్టీ ప్రణాళికలూ విధానాలూ అయినా పరాయివే. నీతిశతకాల లాగే వల్లె వేయడానికే అవి అవసరం, ఆచరణకు ఉండే ప్రాతిపదికలు వేరు. అందుకే, రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి రెండురకాలుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. పైకి సూక్తులు చెబుతూ, లోపల అక్రమాలకు, అవినీతికి పాల్పడడం ఒక రీతి అయితే, పార్టీల వైఖరుల వల్లా, సమాజంలో ప్రాబల్య భావాల కారణంగా పైకి మూర్ఖంగా, మొండిగా మాట్లాడినా, లోపల మాత్రం విచక్షణ, వివేకం కలిగి ఉండడం మరో రకం. వ్యక్తిగతంగా మతోన్మాది, కులోన్మాది అయిన వారు కూడా పార్టీ వైఖరి కారణంగా సెక్యులరిస్టుగా, సామాజిక న్యాయం కోరేవాడిగా కనిపిస్తాడు. సంపాదనలో ఆరితేరి కూడా సమసమాజాన్ని కోరుతూ ఉపన్యసిస్తాడు. 

దీనంతటికీ మూలం ఆదర్శాల ప్రస్థానం భారతదేశంలో సవ్యంగా జరగకపోవడంలో, భారత రాజ్యాంగం సంపుటీకరించిన విలువలను సువ్యవస్థితం చేయడానికి దేశనాయకత్వం ప్రయత్నించకపోవడంలో ఉందేమో అనిపిస్తుంది. రకరకాల స్థాయిల్లో, మజిలీల్లో ఉన్న వివిధ వర్గాల, శ్రేణుల ప్రజానీకాన్ని ఒకే జాతిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో జాతీయోద్యమం అనివార్యంగా కొంత కాపట్యాన్ని కూడా స్వీకరించిందా అన్నది ఒక సందేహం. అస్పృశ్యతా నివారణను ఉద్యమంలో భాగం చేసిన గాంధీజీ, దళితుల విముక్తిని స్వీకరించలేకపోయారు, వర్ణాశ్రమధర్మానికి యోగ్యతాపత్రం ఇచ్చేశారు. భగత్‌సింగ్‌తో సహా విప్లవకారులనేకమందిని ఉరితీస్తున్నా వ్యూహాత్మకమైన మౌనం పాటించారు.  తాను చెప్పిన ఆదర్శాలను విలువలను చిత్తశుద్ధితో నమ్మి, త్యాగగుణాన్ని నిరాడంబరతను పాటించిన వారి మీద, డాంబికులు, వర్తకులు, రాజకీయ గిరీశాలు పైచేయి అయ్యే క్రమం గాంధీ నెహ్రూల ఆధ్వర్యంలోనే జరిగింది. స్వతంత్రం వచ్చిన తరువాత తొలితరం నేతల నైతికతకే చెదలు పట్టడానికి కారణం అదే. వీటన్నిటికి తోడు సాంప్రదాయిక భారతీయ సమాజం ఆధునికతతో సంపర్కంలోకి వచ్చిన తరువాత కొత్త ద్వంద్వత్వం, ఆత్మవంచనాధోరణి ఉనికిలోకి వచ్చాయి. ఈ అవలక్షణాలకు మధ్యతరగతే వాహిక. వారే సమాజంలోని అధికారిక ఆలోచనావిధానాన్ని, విలువలను ప్రభావితం చేస్తారు. చెప్పేదానికీ చేసేదానికీ మధ్య ఉన్న అంతరాన్ని మన మధ్యతరగతి సమర్థించుకున్నంత సమర్థంగా మరెవరూ సమర్థించుకోలేరు. వరకట్నం కావచ్చు, అస్ప­ృశ్యత కావచ్చు, లంచాలు తీసుకోవడం కావచ్చు, విదేశాలకు ఎగబడడం కావచ్చు, మాతృభాషను విసర్జించడం కావచ్చు- ఏవైనా సరై దర్జాగా అనుసరిస్తూ, అందుకు విరుద్ధమైన ఉపన్యాసాలు ఇవ్వగలరు. 'మనలో మాట'గా మాట్లాడుకునే మాటల్లో, మనలో మనం నమ్మే విలువల్లో వర్తమాన సమాజంలో జరుగుతున్నదంతా చట్టబద్ధమే, న్యాయమే. మనకు దక్కవలసిన వాటా దక్కుతున్నదా అన్నదొక్కటే మనకు మిగిలిన సంశయం. 

ప్రపంచంలో సత్యం ఏదైనా ఉంటే అది ఆన్ ద రికార్డ్ కాక, ఆఫ్ ద రికార్డే అయి ఉంటుందనిపిస్తుంది. అబద్ధమే లేకుంటే, వ్యవస్థలను నిలబెట్టడం సాధ్యమా అని సందేహం వస్తుంది. రెండో నెంబర్ ఖాతా లేకుండా వ్యాపారమూ, ద్వంద్వార్థం లేకుండా సినిమా సంభాషణా బతకగలవా? ఎవరైనా నిగ్రహంతో, వివేచనతో మాట్లాడుతున్నాడంటే అంతరంగంలో ఏ బీభత్సపథకం అల్లుతున్నాడో తెలియదు. ఎవరైనా నినద భీషణ శంఖము పూరిస్తున్నాడంటే వెనుక ఏ రాజీలకు ఎత్తు వేస్తున్నాడో తెలియదు.  వినయం వెనుక కపటం, ప్రగల్భం వెనుక పిరికితనం మాటువేసి ఉంటాయి. జనం ముందు మాట్లాడవలసి వచ్చేసరికి- ఎన్నెన్ని ముసుగులు, నేతలకూ పార్టీలకు? వారి రెండు భాషలను రెండు రకాలుగా అర్థం చేసుకుంటూ సహిస్తున్న, అనుమతిస్తున్న మనుషులది మాత్రం ఏం సంస్కారం? బహుశా ఇప్పుడు కావలసింది, ప్రసంగాలకూ స్వగతాలకూ తేడాను రద్దుచేయడం. నల్లడబ్బు, బినామీ ఆస్తి- ఎట్లా అవినీతులో, రహస్యాభిప్రాయాలూ రెండు నాల్కలూ కూడా అవినీతులే. 

No comments:

Post a Comment