Saturday, March 24, 2012

కనికరం లేని కాసుల భాష

.... I must be cruel, only to be kind:
Thus bad begins and worse remains behind
... (Hamlet Act3, Scene 4)

తన తండ్రిని చంపి, తన తల్లిని పెళ్లాడిన క్లాడియస్‌ను చంపుతున్నాననుకుని, హేమ్లెట్ తన ప్రియురాలి తండ్రి అయిన పోలోనియస్‌ను చంపుతాడు. పొరపాటును గుర్తిస్తాడు కానీ, దేవతలు తన చేత ఈ పనిచేయించారని, తాను తలపెట్టిన డేనిష్ రాజసభ ప్రక్షాళనలో ఈ కర్కశత్వం అనివార్యమనీ భావిస్తాడు. క్లాడియస్‌ను కూడా చంపితీరతానన్న సూచన కూడా చేస్తాడు. ఆ సందర్భంలో హేమ్లెట్ మాటలవి.

షేక్స్‌పియర్ నాటకంలోని పై రెండు పంక్తుల్లో మొదటి దాన్ని శుక్రవారం నాడు ప్రణబ్‌ముఖర్జీ ఉటంకించారు. 'దయగా ఉండడం కోసమే నిర్దయగా ఉండకతప్పడంలేదు' అన్నది ఆ పంక్తి అర్థం. దయా దాక్షిణ్యమూ లేని బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, దాన్ని సమర్థించుకోవడానికి ఆయనకు ఆ చరణం బాగా పనికివచ్చింది. దాని తరువాతే ఉన్న మరో పంక్తి గురించి ప్రణబ్ మర్చిపోయారో, మభ్యపెట్టారో తెలియదు. 'ఇప్పటికీ ఈ చెడు జరిగింది, మున్ముందు జరిగేది ఇంకా ఉంది' అన్నది రెండో చరణం అర్థం. ప్రణబ్ తప్పించుకున్నారు కానీ, ప్రతిపక్షసభ్యుల్లో షేక్స్‌పియర్‌ను చదివినవాళ్లు ఎవరయినా ఉంటే అప్పటికప్పుడే గేలిచేసి ఉండేవాళ్లు. తన బడ్జెట్ సారాంశాన్ని అసంకల్పితంగా బయటపెట్టినందుకు అభినందించి ఉండేవారు.

వీళ్లు ఆర్థికమంత్రులే కదా, హార్దిక మంత్రులు కాదు కదా, వీళ్లకు కవిత్వాలతో, కొటేషన్లతో ఏమిటి పని? హృదయం లేని అంకె లనూ గణాంకాలను పరచి, కావలసినవాళ్లకు వరాలూ, కానివాళ్లకు కష్టాలూ ప్రసాదించే బడ్జెట్ ప్రసంగాలలో ఉటంకింపులు లేకపోతే మసాలా ఉండదనుకుంటారో, మాయచేయలేమనుకుంటారో కానీ
ఆర్థికమంత్రులకూ వారి ప్రసంగాలు తయారుచేసే సచివులకూ సూక్తులయితే కావాలి. నూటాయాభై జయంత్యుత్సవం జరుపుకుంటున్న టాగూర్‌ను బాధించడం కూడదనుకున్నారేమో ఆయన కవిత్వాన్ని ప్రతిసారీ అరువుతెచ్చుకునే ప్రణబ్ ముఖర్జీ ఈ సారి ఆయన్ని మినహాయించారు. బెంగాలీబాబు ఈసారి ప్రపంచీకరణ చెంది షేక్స్‌పియర్‌ను దిగుమతి చేసుకున్నారు.

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నన్ని రోజులూ బడ్జెట్ ప్రసంగాలలో తిరువళ్లువర్ ఉండవలసిందే. టాగూర్‌ను ఆయన కూడా ఉటంకించేవారు. ఇక దేశాన్ని ప్రస్తుత అధ్వాన్నశకంలోకి మళ్లించిన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్‌సింగ్ ఇక్బాల్‌నూ, విక్టర్ హ్యూగోనూ కోట్ చేశారు. 'శ్రేష్ఠమైన గ్రీస్, ఫారోల ఈజిప్ట్, చక్రవర్తుల రోమ్- అన్నీ మట్టిలో కలసిపోయాయి, కానీ, మన దేశం ప్రాచీనం అచంచలం, సజీవం నిరంతరం వర్ధిల్లుతోంది' అన్న ఇక్బాల్ కవితాపాదాలను పేర్కొంటూ మన్మోహన్‌సింగ్- వేలాదిఏళ్ల చరిత్రలో వేళ్లూనిన భారతదేశం అస్తిత్వాన్ని మార్కెట్‌తో పెకిలించడం ప్రారంభించారు. చెల్లింపుల సంక్షోభంలో పడిపోయి, ఆర్థికంగా దివాలా తీస్తున్న దేశాన్ని సేదతీర్చి పునరుజ్జీవింపచేయడానికి పరాధీనతనే మందుగా ప్రతిపాదించిన మన్మోహన్‌సింగ్- తన లక్ష్యానికి ఆమోదం కోసం ఒక బంగారు కలను ఆవిష్కరించారు. ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడం ఆ కల. ఒకసారి కల జన్మించిందంటే అది వాస్తవమై తీరుతుందని చెప్పడానికి ఆయన హ్యూగోను ఆసరా తెచ్చుకున్నారు. 'ఒక ఆలోచనకు కాలం కలసివచ్చిందంటే, వాస్తవంగా మారకుండా దాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు' అన్నది హ్యూగో మాట. ఫ్రెంచి విప్లవ స్ఫూర్తితో సాహిత్యంలో రొమాంటిసిజాన్ని, రాజకీయాల్లో రిపబ్లికనిజాన్ని అభిమానించి మూడో నెపోలియన్ చేతిలో బాధితుడైన రచయిత హ్యూగో. అతని మాటల సందర్భానికీ, మన్మోహన్ చారిత్రాత్మక బడ్జెట్ సందర్భానికీ పోలికే లేదు.

అక్రమాల ఆరోపణలపై 1958లో ఆర్థికమంత్రి టి.టి. కృష్ణమాచారి వైదొలగినప్పుడు, స్వయంగా బడ్జెట్‌ను సమర్పిస్తూ నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలోని కొన్ని వాక్యాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. "ఈ బడ్జెట్ అనేది మన ప్రస్థానంలో ఒక చిన్న సంఘటన మాత్రమే. మనమేమి చేయాలి, ఏమి సాధించాలి అన్నది మన దృక్పథం కావాలి. అన్నిటికి మించి, మన విజయం మన మీదనే ఆధారపడి ఉంటుంది, ఇతరుల మీద కాదు అన్నది గుర్తించాలి. మన శక్తి మీద, మన వివేకం మీద, మన ఐక్యత మీద, సహకారం మీద, ఎవరికి సేవ చేయడం మన భాగ్యమో ఆ ప్రజల స్ఫూర్తి మీద మన విజయం ఆధారపడి ఉంటుంది''. ఆర్థికరంగ వృద్ధి రేటు పెంచడం తప్ప మరో లక్ష్యం లేనట్టు, సంస్కరణలను విస్తరిస్తూ పోవడం తప్ప మరో కార్యక్రమం లేనట్టు, అసలు మనకొక సుదీర్ఘ ప్రస్థానమే లేనట్టు, ప్రజలనేవారికి ఈ ప్రక్రియలో స్థానమే లేనట్టు వ్యవహరిస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుంటే- నెహ్రూ కాలంలో మిగిలి ఉన్న ఆదర్శాలో, లక్ష్యశుద్ధో అపురూపమే అనిపిస్తాయి.

చివరకు ఇందిర కాలంలో కూడా ఇంత అన్యాయం లేదు. 1970-71 సంవత్సర బడ్జెట్‌ను ఆర్థికమంత్రిగా కూడా ఉన్న ఇందిరాగాంధీ సమర్పించారు. ఆర్థికరంగ ఎదుగుదల దేశ తక్షణ అవసరమని, అందుకోసం సర్వ శక్తులూ కూడగట్టుకోవాలని చెప్పినప్పటికీ ఇందిర ప్రసంగంలో ఈ మాటలు కూడా ఉన్నాయి. "ఆర్థిక వృద్ధి అత్యవసరమనుకుంటే, కొన్ని నిర్దిష్టరంగాలలో సామాజిక సంక్షేమచర్యలు కూడా అంతే అత్యవసరం. వనరుల సమీకరణ ఎంత అవసరమైనప్పటికీ, ఆదాయాల మధ్య, వినియోగాల మధ్య, సంపదల మధ్య సమానత్వాన్ని సాధించడం అనే లక్ష్యాలను కూడా ద్రవ్యవ్యవస్థ నెరవేర్చాలి''.

సంక్షేమం గురించి మాట్లాడక తప్పని పరిస్థితి జనాకర్షకనేతలకు ఆనాడు ఉండింది. ఆనాటి జాతీయ అధికారిక విధానాలు కూడా నేడున్నంత కర్కశంగా మొరటుగా లేవు. ప్రజలతో కఠినంగా ఉండడం ఒక ఫ్యాషన్‌గా మార్చిన సోషల్ డార్వినిజం ఆనాడింకా ప్రవేశించలేదు. మన్మోహన్‌సింగ్ కూడా 1991 నాటి ప్రసంగంలో ప్రజల విషయంలో దయగా ఉండడం గురించి ప్రస్తావించారు. జాతి ప్రయోజనాల విషయంలో ఎంతటి కాఠిన్యాన్నైనా వహిస్తాను, ప్రజలతో వ్యవహరించేటప్పుడు మాత్రం సుతిమెత్తగానే ఉంటాను, సమానత్వాన్ని, సామాజికన్యాయాన్ని సాధించే విషయంలో వెనుకడుగు వేయను- అని ఆయన వాగ్దానం చేశారు. ఆ మాటలు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చిందంటేనే ఆయన ప్రారంభించిన మార్గంలో ఉండే సమస్యలు సూచితమవుతున్నాయి. ఆ వాగ్దానాన్ని ఆయన ఎంత వరకు నిలబెట్టుకున్నారో, ఇరవయ్యేళ్ల తరువాత ఆయన ఎక్కడున్నారో ప్రజలను ఎక్కడ ఉంచారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

దేశంలో ఉన్న సహజవనరులను, మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని, ప్రజలందరి గౌరవప్రదమైన మనుగడకు, సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవనానికి అవసరమైన దీర్ఘకాలిక సమగ్ర విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించి, ఆ విధానాల్లో భాగంగా తాత్కాలిక ఆర్థిక ప్రణాళికలను రచించుకోవాలి. వాటిని తరచు సమీక్షించుకుంటూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించుకుంటూ ముందుకు పోవాలి. ఏ రంగంలో పెట్టుబడులు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఫలితాలను ఇస్తాయో గమనించి, వివేకవంతమయిన ప్రయత్నాలు చేయాలి. ఈ దేశంలో కాపాడుకోవలసిన, సంరక్షించవలసిన అతి ముఖ్యమైన వనరులు మనుషుల ప్రాణాలు, ఆరోగ్యాలేనని, పెట్టవలసిన అతి పెద్ద పెట్టుబడి విద్యా వైద్యరంగాల్లోనేనని గుర్తించడానికి నిరాకరించే ఆర్థికవేత్తలు హార్వర్డ్‌లో చదివితేనేమి, శాస్త్రాన్ని అవపోశన పడితేనేమి? ప్రజల సాముదాయిక సంపదను, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అతి కొద్దిమందికి అనుకూలంగా మళ్లించడానికి, నిరంతరంగా ఆ వర్గాలకు మేలు చేసే విధంగా విధానాలు రూపొందించడానికి ఇప్పుడు ప్రభుత్వాలు, వాటిని నడిపే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయి. ఆ విధానాలు మున్ముందు ప్రజలకు మేలు చేస్తాయని, అప్పటి దాకా ప్రజలు త్యాగాలు చేస్తూ పోవాలని ఆ పక్షాలూ, వాటి తరఫు మేధావులూ ఊదరగొడుతూ ఉంటారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని, పరిపాలనలో పురోగతిలో భాగస్వాములు కాగలిగే శక్తిని పెంపొందించవలసిన ప్రభుత్వాలు, ఆ ఊసే ఎత్తకుండా, తాత్కాలికమైనవీ, జనాన్ని పరాధీనులను చేసేవీ అయిన సంక్షేమ పథకాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి.

బతకగలిగిన వాడే బతుకుతాడు, లేనివాడు అణగారి నశిస్తాడు- అన్నది జీవపరిణామంలో నిజం కావచ్చును కానీ, మనుషుల విషయంలో అది అమానుషమైన సిద్ధాంతం. నశించేవారు నశించగా, కొనవూపిరులతో ఉండేవారికి నాలుగు మెతుకులు విదిలించి, దేశసంపదను కొందరికి కట్టబెట్టే వ్యవస్థలో - ఉదారవిధానాలంటే కఠినాతి కఠినమైన విధానాలే.

అందుకే, వరుసగా బడ్జెట్లు కఠినంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. సకలమూ సేవారంగంగా మారిపోయి పన్నుల వడగళ్లు కురిస్తే వింతేమీ లేదు. సబ్సిడీలు హరించుకుపోయి, కార్పొరేట్ ప్రోత్సాహకాలు కొనసాగితే ఆశ్చర్యమేమీ లేదు.

హేమ్లెట్ రెండో వాక్యాన్ని దాచిపెట్టి ఒక్క వాక్యాన్నే ఉటంకించిన ప్రణబ్, తన మనసులోని రెండు మాటలను కూడా బయటకు రాకుండా మింగేశారు. ఆ మాటలు కూడా కలుపుకుంటే ఆయన చెప్పవలసింది- "నేను కార్పొరేట్లపై దయగా ఉండడానికే ప్రజలపై నిర్దయగా ఉండకతప్పడం లేదు.''

No comments:

Post a Comment