Tuesday, March 27, 2012

పాలమూరులో పొలమారిన ఉద్యమం

ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిరోజులలో జరుగుతుందనగా, ఒక రాష్ట్ర మంత్రి మహబూబ్‌నగర్ కొల్లాపూర్ నియోజకవర్గం ఫలితం గురించి ఒక వ్యాఖ్య చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థి గెలిస్తే తెలంగాణవాదం గెలిచినట్టు, అట్లా జరగకపోతే, తెలంగాణవాదంపై ఒక రెడ్డివాదం పై చేయి అయినట్టు- అన్నది ఆ వ్యాఖ్య. ఆ వ్యాఖ్య చేసిన మంత్రిగారు కూడా రెడ్డి కులస్థులే. తెలంగాణ ఉద్యమనాయకత్వం అగ్రకులాలకు చెందినదని బడుగు దళిత కులాలవారు విమర్శించడం మనకు తెలుసు. ఆ విమర్శను కొన్ని రాజకీయపక్షాలు ఉపయోగించుకోవడమూ తెలుసు. కానీ, స్థానిక అగ్రకులాల మధ్య ఉండే అధికారపోరాటం తెలంగాణ వాదానికి అవరోధం కావడం ఆశ్చర్యమే. కొల్లాపూర్‌లో తెలంగాణవాదమే గెలిచింది కానీ, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాత్రం ఫలితం అంత స్పష్టంగా లేదు. దాన్ని తెలంగాణవాదపు విజయంగా కంటె, తెలంగాణ ఉద్యమనాయకత్వం తీరుతెన్నులపై ప్రజల్లో ఉన్న నిరసనల విజయంగా ప్రత్యర్థులు, పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు కానీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థిస్తున్న భారతీయ జనతాపార్టీ అభ్యర్థి గెలిచారు. తెలంగాణ రాష్ట్రసాధనలో బిజెపి పాత్ర మీద ఉన్న విశ్వాసంతోనే ఓటర్లు తనను గెలిపించారని విజేత యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీం మాత్రం - గెలిచింది మతతత్వమేనని కుండబద్దలు కొట్టారు. ఓటమి వేదనలో ఆయన అప్పుడట్లా అన్నారేమో అనుకున్నారు కానీ, ఇప్పుడు తెలంగాణ అంతా ముస్లిం మైనారిటీలు మహబూబ్‌నగర్ ఫలితం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామానికి బాధ్యులు కెసిఆర్, కోదండ్‌రామ్‌లేనని ఆరోపిస్తూ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి రెడ్డి విజయానికి కోదండరామ్ రెడ్డి సాయపడ్డారని నేరుగా నిందిస్తున్నారు.

ఏ ప్రాంతపు వర్తమానానికైనా చారిత్రక భారాలు, సంక్లిష్టతలు ఉంటాయికానీ, నిత్యపోరాటాల క్షేత్రం కావడం వల్లనేమో తెలంగాణకు అవి ఎక్కువ. దేశీయసంస్థానపు పాలనలో ఉండడం, ఆ పాలనకు అనేక చీకటి కోణాలు ఉండడం, మైనారిటీ మతానుయాయుడు పాలకుడు కావడం వల్ల ప్రజల్లో కూడా మతపరమైన విభజన ఏర్పడడం, తెలంగాణ పాలకశ్రేణికి సంస్థానపు చీకటిరోజుల నేపథ్యం ఉండడం, భూస్వామ్యాన్ని ఓడించి, సామాజిక, భూసంబంధాలను ప్రజానుకూలం చేయడానికి అనేక పోరాటాలు జరగడం, వీటన్నిటి మధ్య సకలవర్గాలతో సహా ఈ ప్రాంతం బాధిత ప్రాంతం కావడం- తెలంగాణ వాస్తవికతను జటిలం చేశాయి. తెలంగాణ ఎప్పుడూ తనలో తాను పోరాడడమూ తనవారితో తాను పోరాడడమూ చేస్తూ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు మాత్రమే తెలంగాణ అంతా ఒకటిగా బయటివారితో పోరాడినవి. తెలంగాణ ఒకటిగా నిలబడడంలో గతం నుంచి వర్తమానం దాకా
కొనసాగుతున్న వైరుధ్యాలన్నీ సమస్యలుగా ముందుకువచ్చాయి. తెలంగాణ ప్రత్యేకతను వ్యతిరేకించేవారు ఆ వైరుధ్యాలను ఆధారం చేసుకోవడానికి ప్రయత్నించే మాట నిజమే అయినప్పటికీ, వైరుధ్యాలు వాస్తవమన్నది కూడా గుర్తించవలసిన సత్యం. ఆ వైరుధ్యాలను సర్దుకోవడానికి గానీ, సరళం చేసుకోవడానికి గాని ప్రయత్నం చేయవలసింది తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి నాయకత్వం వహించే శక్తులూ వ్యక్తులే.

తెలంగాణలోని అగ్రకుల భూస్వామ్యవర్గానికీ, అశేష ప్రజానీకానికీ ఉన్న వైరుధ్యం తెలిసిందే. అనేక పోరాటాలకు అది భూమిక. అనేక ప్రధాన స్రవంతి రాజకీయ పరిణామాలకూ అది వేదిక. అటువంటిదే మరో వైరుధ్యం ముస్లిం మైనారిటీలకు సంబంధించినది. నైజాం పాలనకు సంబంధించి, హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనం జరిగిన కాలానికి సంబంధించి- కొన్ని జ్ఞాపకాలు ఇక్కడి మెజారిటీ ప్రజలకు ఉన్నాయి. అట్లాగే, మైనారిటీలకూ ఆ కాలానికీ, వర్తమానానికీ సంబంధించి కొన్ని జ్ఞాపకాలున్నాయి. ఈ జ్ఞాపకాలన్నీ నూటికి నూరుపాళ్లు సత్యమని చెప్పలేము. వాటిలో పాక్షికత చాలా ఉన్నది. చేదూ చాలా ఉన్నది. ఏది ఏమైనా పరస్పర సుహృద్భావానికి అవి కొద్దిపాటి అవరోధాలుగానే ఉంటూ వచ్చాయి. ఎంఐఎం ప్రభావంలో ఉన్న ముస్లిములు తెలంగాణ ప్రత్యేకవాదాన్ని వ్యతిరేకించడానికి అవొక కారణం. సమైక్య రాష్ట్రంలోనే మైనారిటీలకు రక్షణ సాపేక్షంగా అధికమని వారి విశ్వాసం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో, చిన్న పట్టణాలలో ఉన్న ముస్లిములు మొదట అనాసక్తంగా ఉన్నప్పటికీ, క్రమంగా తెలంగాణ వాదంవైపు మొగ్గుతూ వచ్చారు. వారిలో విశ్వాసం కలిగించడానికి ఉద్యమనాయకత్వం చేసింది స్వల్పమే అయినప్పటికీ, ప్రాంతీయ అస్తిత్వ వాదం వారిని తమలోకి బలంగా ఆకర్షించింది. అటువంటి సమయంలో మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని పోటీలోకి దింపింది.   ఉద్యమంలో సహచరపార్టీగా ఉన్న తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా టిఆర్ఎస్ అభ్యర్థులను, స్థానాలను ప్రకటించినందుకు ఆగ్రహంతో బిజెపి రంగంలోకి దిగిందని మొదట భావించారు. కెసిఆర్ నాయకత్వ సరళి మీద నిరసనగా బిజెపి పోటీలోకి దిగడం ఒకందుకు మంచిదేనని ఉద్యమాభిమానుల్లో కొందరు ఆనందించారు కూడా. మిత్రపక్షాలు అవగాహన కుదరక మైత్రీపూర్వక పోటీలకు దిగడం కొత్త విషయమేమీ కాదు. కానీ, తెలంగాణ వాద ముస్లిం అభ్యర్థిపై తెలంగాణవాద బిజెపి అభ్యర్థి పోటీచేయడం పరిస్థితికి కొత్త కోణాన్ని జతచేసింది.

ఒక ప్రాంతంలోని ప్రజల మధ్య ఉన్న అంతర్గత వైరుధ్యాలను ప్రాంతీయ అస్తిత్వ వాదం తాత్కాలికంగానైనా అప్రధానం చేసి, విశాల ప్రాతిపదికన ఐక్యతను సాధిస్తుంది. తెలంగాణ విషయంలో కూడా దాన్ని చూడవచ్చు. తాము రాజీలేని పోరాటం చేసి, గ్రామాలనుంచి తరిమివేసిన భూస్వామ్యవర్గాల ప్రతినిధులు తిరిగి తెలంగాణవాదులుగా వస్తే ప్రజలు ఆహ్వానించారు. టిఆర్ఎస్ వ్యతిరేకులు ఎంతగా వైరుధ్యాన్ని ఎత్తిచూపుతున్నా, తెలంగాణకు వారిని నాయకులుగానే అంగీకరిస్తున్నారు. తాజా ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన పరస్పర దూషణల పర్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, టిఆర్ఎస్ నాయకత్వంపై తెలుగుదేశంవారు చేసిన తీవ్రవిమర్శలన్నీ భూస్వామ్య నేపథ్యాన్ని, అవినీతిని, స్వార్థపరత్వాన్ని ఆపాదిస్తూ సాగినవే. అయినా, తెలంగాణ ఓటర్లు వాటిని ఖాతరు చేయలేదు. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల్లో నాయకత్వాన్ని గుర్తించే పద్ధతులు వేరు, ప్రాతిపదికలు వేరు. ఒక అగ్రకులాలు- బడుగులు అన్న వైరుధ్యాన్ని పక్కకు పెట్టినట్టే, మెజారిటీ-మైనారిటీ వైరుధ్యం కూడా తెలంగాణలో వెనుకపట్టు పట్టింది. ఈ సానుకూల వాతావరణాన్ని అనువుగా చేసుకుని, నాయకత్వం- తెలంగాణలోని నిమ్నవర్గాలకు, మైనారిటీలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. తెలంగాణ ఉద్యమంలో, రాజకీయ జెఎసిలో భాగస్వామిగా ఉన్న బిజెపి రాజకీయ, సామాజిక దృష్టికోణం భిన్నమైనది.   ఉద్యమకార్యాచరణలో కూడా వారు కొంత ఎడం పాటిస్తూనే వచ్చారు. సీమాంధ్ర పెత్తనం, వలసవాదం వంటి మాటలు వారి తెలంగాణ వాదంలో వినిపించవు. అయితే, తెలంగాణ గతానికి సంబంధించిన సున్నితమైన అంశాల విషయంలో వారు చేసే ప్రస్తావనలు అప్రియంగా ఉంటాయి. నిజాం ధిక్కారం, పటేల్ సాహసం, రజాకార్ల అత్యాచారాలు- వంటి అంశాలను ప్రస్తావించడంలో వారికి సంకోచం ఉండదు. మహబూబ్‌నగర్‌లో తమ పార్టీ అభ్యర్థి తరఫున చేసిన ప్రచారంలో కూడా బిజెపి- అటువంటి వివాదాస్పద అంశాలను ఉపయోగించుకున్నదని తెలుస్తోంది. టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే రజాకార్లకు వేసినట్టే- అని వేదికలపైనే నేతలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సమపాత్ర వహిస్తున్నామని భావిస్తున్న ముస్లిములను ఆ ప్రస్తావనలు సహజంగానే బాధించాయి. ఇద్దరు తెలంగాణవాద అభ్యర్థుల మధ్య పోటీ, రెండు భిన్నమతాల అభ్యర్థుల మధ్య పోటీగా మారిపోయింది. ఓటర్లలో మతప్రాతిపదికన చీలిక వచ్చిందనలేము కానీ, ఆ ప్రాతిపదిక ఓటింగ్‌ను ప్రభావితం చేసిందనే భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ వంటి సున్నితమైన పట్టణ ప్రాంతంలో ప్రచారం దగ్గర నుంచి లెక్కింపు దాకా వాతావరణం కొంత ఉద్రిక్తతను సంతరించుకున్నది. ఎన్నిక ఫలితం యావత్ తెలంగాణలో ముస్లిములలో అనుమానాన్ని, బాధను మిగిల్చింది. టిఆర్ఎస్ నాయకత్వం కానీ, జెఎసి అధినాయకత్వం కానీ చేయవలసినంత చేయకుండా పరోక్షంగా బిజెపి గెలుపునకు సహకరించారనే ఆరోపణలు రాసాగాయి.

ఈ విషయంలో టిఆర్ఎస్, జెఎసి నాయకత్వాలను అనుమానించలేము కానీ, మహబూబ్‌నగర్‌లో అటువంటి ఉద్రిక్తపోటీని నివారించే ప్రయత్నం ఆదిలోనే జరిగి ఉంటే బావుండేది. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం దగ్గరనుంచి, జెఎసిలో సహభాగస్వాముల విషయంలో పెద్దన్న ధోరణిలో వ్యవహరించడం దాకా- టిఆర్ఎస్ నాయకత్వం దోషం ఇందులో ఉన్నది. మహబూబ్‌నగర్‌లో ఫలితం మరో రకంగా ఉంటే ఎట్లా ఉంటుందో అన్న ఊహ కూడా లేకుండా, అతి విశ్వాసంతో ముందుకు వెళ్లింది. నిజంగానే ఉద్యమ సహభాగస్వాముల మధ్య ఎన్నికల అవగాహనే అవసర మనుకుంటే మహబూబ్‌నగర్ స్థానాన్ని బిజెపికి వదిలివేసినా బాగుండేది.   అప్పుడు మైనారిటీలు కూడా అధికసంఖ్యలో ఆ పార్టీకి ఓటు చేసేవారేమో? ఇంతకాలం తెలంగాణ ఉద్యమం సాగుతున్న తీరును దగ్గరగా చూస్తూ వస్తున్న బిజెపి, తెలంగాణ ప్రజల్లో కొత్త విభజనలు రాకుండా టిఆర్ఎస్‌తో సర్దుకుని పోయినా బాగుండేది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను కాదని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణకి ముస్లిములు ఓటువేసిన సందర్భం వారికి గుర్తు వచ్చి ఉంటే, కనీసం ప్రచారాన్ని తెలంగాణ వాదానికే పరిమితం చేసి ఉండేవారు. టిఆర్ఎస్ దూకుడుకు ఒక బ్రేక్ వేయాలనుకోవడం బాగానే ఉంది కానీ, ఆ ప్రయత్నంలో ఉద్యమవాతావరణం దెబ్బతినకుండా చూడవలసింది.

ఈ విజయంతో తెలంగాణలో మరింత విస్తరించాలనుకుంటున్న బిజెపి, మొదట గుర్తించవలసింది- అది ఈ ప్రాంతీయ ఉద్యమంలో ఉద్యమానుగుణమైన వైఖరినే అనుసరించాలి తప్ప, తక్కిన దేశంలోను, గతకాలంలోను అనుసరించిన విధానాలు ఫలితం ఇవ్వవని. ప్రజలలో చీలికలు తెచ్చి లబ్ధి పొందాలనుకుంటే, తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని. ఎంఐఎంపై విముఖంగా ఉన్న ప్రజలను తిరిగి అటువైపు నెట్టడం అవుతుందని.

జరిగింది జరిగిపోయాక, ఇక ఇప్పుడు చేయగలిగేది మరెవరికీ లేకపోవచ్చును కానీ, టిఆర్ఎస్‌కు, జెఎసికి ఉన్నది. ఒక స్థానంలో ఓడిపోయినా, ఒక నాలుగు స్థానాలు గెలిచాము లెమ్మని, తక్కిన రెండూ తెలంగాణవాదులవే కదా అనీ టిఆర్ఎస్ సాధారణ అభిమానులు సంతృప్తి చెందవచ్చు. కానీ, ఉద్యమంలోని మైనారిటీలకు అట్లా సంతోషించే పరిస్థితి లేకుండా పోయింది. వారిలో విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత, మహబూబ్‌నగర్ పరిణామంలో తమ దోహదం లేదని నిరూపించుకోవలసిన అవసరం కూడా వారికి ఉన్నది. మనసుంటే, సంకల్పం ఉంటే అది పెద్ద పని కాదు.

No comments:

Post a Comment