Monday, April 30, 2012

చరిత్ర చెక్కిలిపై సంతకం

చనిపోవడానికి చాలా రోజుల ముందటి నుంచి కె.జి. సత్యమూర్తిగారు స్ప­ృహలో ఉన్నప్పటికీ స్మారకంలో లేరు. ఆయనను పలకరించడానికి కుటుంబసభ్యులు రకరకాల ప్రశ్నలతో ప్రయత్నించేవారు. చాలా వాటికి ఆయన సమాధానం చెప్పలేకపోయేవారు. ఒకసారి, వర్తమాన రాజకీయాల గురించి ఆయనను అడిగారట. 'ఎన్నికలు వస్తున్నాయట, ఓటెవరికి వేయాలి, చిరంజీవికా, చంద్రబాబుకా' అన్నది ప్రశ్న. 'ఎందుకు, సుందరయ్య లేడా?' అని సత్యమూర్తి ఎదురు ప్రశ్న వేశారట. పద్ధెనిమిదో తారీకునాడు విజయవాడలో కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో సత్యమూర్తి భౌతిక కాయం సమక్షంలో జరిగిన నివాళిసభలో ఆయన సోదరి మంజులాబాయి ఆ ఉదంతాన్ని చెప్పారు. దాన్ని విన్న తరువాత అనివార్యంగా శ్రీశ్రీ గుర్తుకు వచ్చారు. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు శ్రీశ్రీ 'స్పెయిన్ నియంత ఎవరు?' అని ప్రశ్నించారట. ఎప్పటినుంచో ఆపేరు గుర్తుకు రాక ఆయన ఆ ప్రశ్న వేసి ఉంటారు. జీవితాంతం సాధకులుగా గడిపినవారు చరమదినాలలో, అంతిమక్షణాలలో ఏ కాలాలలో, ఏ విషయాలలో తమ మనస్సులను నిమగ్నం చేసుకుని ఉంటారో?

తన భావాలను, సాహిత్యసంస్కారాన్ని అమితంగా ప్రభావితం చేసిన 1930ల నాటి స్పెయిన్ అంతర్యుద్ధపు రోజులలోనే శ్రీశ్రీ మనసు కొట్టుకులాడుతుంటే, మార్క్సిస్టు లెనినిస్టు విప్లవకారుడిగా ఇంకా పరిణమించని, తన వ్యక్తిత్వానికి బీజాలు వేసిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజులలో సత్యమూర్తి ఎందుకో పచార్లు చేస్తున్నారు. ఒక సుదీర్ఘ జీవితం, సాయుధ స్వాప్నిక జీవితం, కవిత్వపు జవనాశ్వం మీద పరుగులు తీసిన జీవితం, ఒడిదుడుకుల జీవితం- అన్నిటికి ముగింపు చెప్పి, గాజుపెట్టెలో విశ్రమిస్తున్న సత్యమూర్తిని చూసినప్పుడు అవిశ్రాంత చరిత్ర వలె కనిపించారు. ఆయనలో సుడులు తిరిగిన సంచలనాలతో, సదసదత్సంశయాలతో, రెక్కలు

Tuesday, April 24, 2012

ఆత్మను అమ్ముకోవడమే అసలైన వ్యభిచారం!

స్వభావ ఏష నారీణామ్ నరాణామ్ ఇహ దూషణమ్ అతో అర్థాన్ న ప్రమాద్యన్తి ప్రమాదాసు విపశ్చితః (మనుస్మ­ృతి, 2-213) "మగవాళ్లను ప్రలోభపరచడం ఆడవాళ్ల స్వభావం. అందుకనే వివేకవంతులు ఆడవాళ్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు.'' అదీ ఆ శ్లోకం అర్థం. ఆడవాళ్లను సృష్టించేటప్పుడే వారికి సుఖలాలసత్వాన్ని, నగలపై ప్రేమను, అపవిత్ర వాంఛలపై, దుష్ప్రవర్తన, మోసకారితనాలపై ఇష్టాన్ని సృష్టికర్త అంటగట్టాడని కూడా మనువే రాశాడు (9-17). మనుస్మ­ృతే కాదు, ప్రాచీన నీతిశాస్త్రాలు, మతగ్రంథాలు, కుమారీ శతకాలు ఆడవాళ్ల గురించి అంతకు మించి గొప్పగా చెప్పిన సందర్భాలు కనిపించవు.

సామ్రాజ్యాల యుగంలో కానీ, రాచరికాల మధ్యయుగాలలో కానీ, నిన్నమొన్నటి భూస్వామ్యంలో కానీ స్త్రీ అంటే సమాజంలో సగభాగమూ కాదు, పురుషుడితో సమానమూ కాదు, అసలు మనిషే కాదు. ఆమె పురుషుడి ఆంతరంగిక వ్యవహారం మాత్రమే. నిరంతరం అదుపు చేయవలసిన ఒక అర్ధమానవి. ఆదమరిస్తే ఆమె అతిక్రమించ గలదు. లోబరచుకోగలదు, పురుషుడిని పతనానికి తీసుకువెళ్లగలదు. మగవాడి ఉదాత్తమైన తపస్సులను భంగపరచగలదు. కాపాడవలసిన కులీనతను సంకరం చేయగలదు. ఆశ్చర్యమేమంటే, అత్యాధునిక ప్రజాస్వామ్యయుగంలోనూ, హైటెక్ గ్లోబల్ యుగంలోనూ కూడా స్త్రీ అంటే అంతే. సెకండ్ సెక్స్, సరుకుల ప్రేమిక, సౌందర్యవేదిక, సెక్స్ సింబల్, వయ్యారి, వగలాడి, అంతిమంగా ఒక స్కాండల్.

మాతృస్వామ్యం ఎప్పుడు కూలిపోయిందో, అవ్వల ప్రతిపత్తి పక్కటెముకగా ఎప్పుడు దిగజారిపోయిందో, సమాజం మగవాడికీ, కుటుంబం ఆడదానికీ ఎప్పుడు అసమానపంపకం జరిగిందో - తెలియదు కానీ, సంఘనీతి కూడా బహుశా అప్పుడే అవతరించి ఉంటుంది. పవిత్రత, స్వచ్ఛత, శీలమూ- స్త్రీ పునరుత్పత్తి అవయవాల చుట్టూ కవచాల వలె అప్పుడే ఆవరించి ఉంటాయి. స్వచ్ఛత దేనికోసమో చెప్పనక్కరలేదు. కులగోత్రాలను

Wednesday, April 11, 2012

మన్మోహన్ జర్దారీ, మంచిమాటలు వింటారా?

ఈ ఆదివారప్పూట మనదేశానికో అతిథి వస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక యాత్రికుడిగా వస్తున్నాడు. పనిలో పనిగా మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలసి, నాలుగు మాటలు మాట్లాడి, భోజనం చేసి, ఆపైన అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గా దర్శించుకోవడం ఆయన కార్యక్రమం. ఎంత సొంత పని మీద వస్తుంటే మాత్రం, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ రాకకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? భారత ప్రధానితో ఏం మాట్లాడాలో, ఏ విషయాల మీద గట్టిగా ఉండాలో- పాకిస్థాన్‌లోని రాజకీయనేతలు, మీడియా చెబుతుంటే, జర్దారీతో తేల్చుకోవలసిన విషయాల మీద భారత్‌లో పుంఖానుపుంఖంగా ప్రకటనలు వస్తున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణంలో శిఖరాగ్ర భేటీలు సరదాగానో, లాంఛనంగానో జరుగుతాయని ఆశించలేము కదా? మా సైనికులను, పౌరులను చంపుతావా అంటూ పాకిస్థాన్ అమెరికాకు, నాటో సేనలకు దారులు మూసేసింది. వేలెడంత లేవు, ఇంత ధిక్కారమా అని అమెరికా పాకిస్థాన్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. 26/11 ముంబయి సంఘటనలకు బాధ్యుడని భావిస్తున్న లష్కరే తోయిబా పెద్ద సయీద్‌ను తమకు అప్పగించాలని ఎప్పటినుంచో భారత్ అడుగుతుంటే నిర్లక్ష్యం వహించిన అమెరికా, ఉన్నట్టుండి సయీద్ తలకు 50 కోట్ల వెల ప్రకటించి పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టింది. అమెరికా ప్రకటనతో ధైర్యం పుంజుకున్న భారత్ నేతలు పాకిస్థాన్‌మీద ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. భారత్ తాజాగా అణుజలాంతర్గామిని జలప్రవేశం చేయించడంపై పాకిస్థాన్ కలవరపడుతోంది. సయీద్ విషయం నిలదీస్తే, జర్దారీ ఏమి చెప్పాలో అని సతమతమవుతోంది.

సయీద్ భారతీయుడని మనమూ, పాకిస్థానీ అని ఆ దేశమూ చెప్పుకుంటున్నాయి. మా పౌరుణ్ణి మాకు అప్పగించు అని భారత్ అడుగుతోంది. అతని మీద నేరారోపణలకు సాక్ష్యాలేమీ లేవని పాకిస్థాన్ వాదిస్తోంది. పిట్టపోరును

Wednesday, April 4, 2012

పాషాణ ప్రభుత్వాలకు ప్రాణహారతులా, వద్దు..

తాజాగా ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా సమయం వృధా అయిందని చాలా మంది గుండెలు బాదుకున్నారు. సభలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు ఆటంకం కలిగిందన్నదే వారి ఆవేదన. సభ సాగకుండా వినిపించిన నినాదాలు, పదే పదే పడిన వాయిదాలు అరాచకానికి అద్దంపడుతున్నాయన్నది వారి ఆరోపణ. కానీ, ప్రజాస్వామ్యం వాస్తవ స్ఫూర్తిని అన్వయించుకుని ఆలోచిస్తే, సభ సజావుగా జరగడమే కాదు, జరగకపోవడం కూడా ప్రజాస్వామికమైన పరిణామమే.

ప్రభుత్వాలు వారికి అనువైన చర్చలు, లెక్క ప్రకారం నెరవేరవలసిన తతంగాలు పూర్తి కావాలని ఆశిస్తాయి, ప్రతిపక్షాలు అంతకంటె ప్రధానమైనవని తాము భావించిన అంశాలను తెరమీదకు తేవాలని ప్రయత్నిస్తాయి. ఈ ఘర్షణ సభాకార్యక్రమాల స్తంభనకు దారితీస్తుంది. అవినీతి గురించి, తెలంగాణ గురించి చర్చకు ప్రాధాన్యం లభించాలని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం పూర్తి ప్రజాస్వామికమైనది. అవి ప్రజాసమస్యలు కాకపోతే, మరేమవుతాయి? అసలు ప్రజాసమస్యలు ఎవరి పట్టుదలా అవసరం లేకుండానే ప్రతినిధుల సభలో చర్చనీయాంశాలు కావాలి కానీ, కొందరు డిమాండ్ చేయడం, మరి కొందరు అడ్డుకోవడం ఏమిటి? సభలో ప్రతిపక్షాల కార్యాచరణ రాష్ట్రంలో ప్రజాసమస్యలను సమర్థంగా ప్రతిఫలించింది. సభాకార్యక్రమాల నిర్వహణ వ్యయం వృధా కావడం కాదు, సార్థకం అయింది.

ఆత్మహత్యలు వద్దు అని ఒక సామూహిక విజ్ఞప్తి చేయడానికి కూడా శాసనసభలో ఎంతో ఆందోళన అవసరమైంది. ఒక అసాధారణమైన మానవీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, పార్టీలకు అతీతంగా సంవేదన వ్యక్తం కావాలి. ప్రజాస్వామ్యానికి అత్యంత క్రియాశీలమైన వేదిక అయిన చట్టసభకు కళ్లూ చెవులూ హృదయమూ ఉన్నాయని ప్రజలకు తెలియాలి. చివరకు తెలంగాణ అన్న ప్రాంత నామం కూడా లేకుండా సభ చేసిన విజ్ఞప్తిలో ఆర్తీ ఆవేదనా నూటికి నూరుపాళ్లు పలికాయని చెప్పగలిగే పరిస్థితి లేదు.

రాష్ట్రంలో వివిధ రంగాలలో నెలకొని ఉన్న పరిస్థితులన్నిటిలోకీ తీవ్రమయినదీ, ఆందోళనకరమైనదీ, భయానకమైనదీ ఆత్మహత్యల పరంపర. అకస్మాత్తుగా ఎందుకీ ఆత్మహననకాండకు తెలంగాణ యువత తిరిగి పాల్పడుతున్నది చెప్పడం కష్టమే. తెలంగాణలో జరిగిన ఆరు ఉప ఎన్నికలలోను తెలంగాణవాదులే గెలిచిన తరువాత, ఉన్నట్టుండి ఈ నిర్వేదం ఎందుకు ఆవరించిందో కారణం అంతుబట్టడం లేదు. అలాగని కారణం లేకుండా ఉండదు. ఏ అకాల మరణానికైనా రాజుదే బాధ్యత అని పురాణాలు, కావ్యాలు చెబుతాయి, దాన్ని ఆధునిక యుగానికి అన్వయిస్తే బోనులో నిలబడవలసింది ప్రభుత్వాలే.

ఆత్మహత్యలు అన్ని సందర్భాలలోనూ నిస్సహాయమైన చర్యలు కావు. వ్యక్తిగత బలహీనతలకు మాత్రమే అద్దం పట్టేవి కావు. సామాజిక ఆర్థిక అసమానతలు, జీవన వైఫల్యాలు, ఏకాకితనం, ఆశారాహిత్యం- ఇవన్నీ మనిషికి బాహ్యంగా ఉన్న పరిస్థితులనుంచి ఉత్పన్నమయ్యేవే. అత్తింటి ఆరళ్లను, వరకట్నపు వేధింపులను తట్టుకోలేక స్త్రీలు తమను తాము తగులబెట్టుకుంటున్నప్పుడు, చైతన్యశీలమైన మహిళా ఉద్యమాలు