Wednesday, April 4, 2012

పాషాణ ప్రభుత్వాలకు ప్రాణహారతులా, వద్దు..

తాజాగా ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా సమయం వృధా అయిందని చాలా మంది గుండెలు బాదుకున్నారు. సభలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు ఆటంకం కలిగిందన్నదే వారి ఆవేదన. సభ సాగకుండా వినిపించిన నినాదాలు, పదే పదే పడిన వాయిదాలు అరాచకానికి అద్దంపడుతున్నాయన్నది వారి ఆరోపణ. కానీ, ప్రజాస్వామ్యం వాస్తవ స్ఫూర్తిని అన్వయించుకుని ఆలోచిస్తే, సభ సజావుగా జరగడమే కాదు, జరగకపోవడం కూడా ప్రజాస్వామికమైన పరిణామమే.

ప్రభుత్వాలు వారికి అనువైన చర్చలు, లెక్క ప్రకారం నెరవేరవలసిన తతంగాలు పూర్తి కావాలని ఆశిస్తాయి, ప్రతిపక్షాలు అంతకంటె ప్రధానమైనవని తాము భావించిన అంశాలను తెరమీదకు తేవాలని ప్రయత్నిస్తాయి. ఈ ఘర్షణ సభాకార్యక్రమాల స్తంభనకు దారితీస్తుంది. అవినీతి గురించి, తెలంగాణ గురించి చర్చకు ప్రాధాన్యం లభించాలని ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నం పూర్తి ప్రజాస్వామికమైనది. అవి ప్రజాసమస్యలు కాకపోతే, మరేమవుతాయి? అసలు ప్రజాసమస్యలు ఎవరి పట్టుదలా అవసరం లేకుండానే ప్రతినిధుల సభలో చర్చనీయాంశాలు కావాలి కానీ, కొందరు డిమాండ్ చేయడం, మరి కొందరు అడ్డుకోవడం ఏమిటి? సభలో ప్రతిపక్షాల కార్యాచరణ రాష్ట్రంలో ప్రజాసమస్యలను సమర్థంగా ప్రతిఫలించింది. సభాకార్యక్రమాల నిర్వహణ వ్యయం వృధా కావడం కాదు, సార్థకం అయింది.

ఆత్మహత్యలు వద్దు అని ఒక సామూహిక విజ్ఞప్తి చేయడానికి కూడా శాసనసభలో ఎంతో ఆందోళన అవసరమైంది. ఒక అసాధారణమైన మానవీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, పార్టీలకు అతీతంగా సంవేదన వ్యక్తం కావాలి. ప్రజాస్వామ్యానికి అత్యంత క్రియాశీలమైన వేదిక అయిన చట్టసభకు కళ్లూ చెవులూ హృదయమూ ఉన్నాయని ప్రజలకు తెలియాలి. చివరకు తెలంగాణ అన్న ప్రాంత నామం కూడా లేకుండా సభ చేసిన విజ్ఞప్తిలో ఆర్తీ ఆవేదనా నూటికి నూరుపాళ్లు పలికాయని చెప్పగలిగే పరిస్థితి లేదు.

రాష్ట్రంలో వివిధ రంగాలలో నెలకొని ఉన్న పరిస్థితులన్నిటిలోకీ తీవ్రమయినదీ, ఆందోళనకరమైనదీ, భయానకమైనదీ ఆత్మహత్యల పరంపర. అకస్మాత్తుగా ఎందుకీ ఆత్మహననకాండకు తెలంగాణ యువత తిరిగి పాల్పడుతున్నది చెప్పడం కష్టమే. తెలంగాణలో జరిగిన ఆరు ఉప ఎన్నికలలోను తెలంగాణవాదులే గెలిచిన తరువాత, ఉన్నట్టుండి ఈ నిర్వేదం ఎందుకు ఆవరించిందో కారణం అంతుబట్టడం లేదు. అలాగని కారణం లేకుండా ఉండదు. ఏ అకాల మరణానికైనా రాజుదే బాధ్యత అని పురాణాలు, కావ్యాలు చెబుతాయి, దాన్ని ఆధునిక యుగానికి అన్వయిస్తే బోనులో నిలబడవలసింది ప్రభుత్వాలే.

ఆత్మహత్యలు అన్ని సందర్భాలలోనూ నిస్సహాయమైన చర్యలు కావు. వ్యక్తిగత బలహీనతలకు మాత్రమే అద్దం పట్టేవి కావు. సామాజిక ఆర్థిక అసమానతలు, జీవన వైఫల్యాలు, ఏకాకితనం, ఆశారాహిత్యం- ఇవన్నీ మనిషికి బాహ్యంగా ఉన్న పరిస్థితులనుంచి ఉత్పన్నమయ్యేవే. అత్తింటి ఆరళ్లను, వరకట్నపు వేధింపులను తట్టుకోలేక స్త్రీలు తమను తాము తగులబెట్టుకుంటున్నప్పుడు, చైతన్యశీలమైన మహిళా ఉద్యమాలు
ఆ ఆత్మహత్యలను హత్యలుగా గుర్తించారు. 'ఆత్మహత్యలన్నీ హత్యలే' అన్న నినాదం అప్పుడే ప్రారంభమైంది. ఆత్మాహుతి ఒక అణచివేతను, దుర్భరస్థితిని తప్పించుకోవడానికి వ్యక్తిగత స్థాయిలో చేసే చర్య కాదని, సామూహిక వ్యక్తీకరణకు, కార్యాచరణకు అవకాశం లేని స్థితిలో చేసే తీవ్రమైన వ్యక్తిగత రాజకీయ వ్యక్తీకరణ అని కొందరు వ్యాఖ్యానించారు.

వంటింట్లో కిరోసిన్ పోసుకుని తగలబడే స్త్రీయే కాదు, పురుగుపాల పడిన పత్తిచేను మధ్యలో విషం తాగి చనిపోయిన రైతు కూడా - తమ మరణాల ద్వారా ఏదో ఒక నిరసనను తెలియజేస్తున్నారు. అది గాంధీ ప్రతిపాదించిన సత్యాగ్రహం కాకపోవచ్చు, బాబీ శాండర్స్ వంటి ఐరిష్ పోరాటకారులు అనుసరించిన ఉమ్మడి కార్యాచరణ కాకపోవచ్చు, చైనా నేతలు మన దేశం సందర్శించినప్పుడల్లా ఢిల్లీలోనో కలకత్తాలోనో అగ్నిశిఖలాగా మారి నిరసన తెలిపే టిబెటన్ ప్రతిఘటన వంటిదీ కాకపోవచ్చు, ఒక దృక్పథంలో సంకల్పంతో చేపట్టిన చర్య కాకపోవచ్చు. కానీ, ప్రతి బలవన్మరణమూ సమాజంవైపే వేలెత్తిచూపిస్తున్నది, వినగలిగే చెవులకు ఏదో ఆర్తనాదాన్ని వినిపిస్తున్నది.

తెలంగాణ ఉద్యమంలో నిరసనతో చేసుకున్న ఆత్మాహుతులూ ఉన్నాయి, నిర్వేదంతో పాల్పడిన ఆత్మహత్యలూ ఉన్నాయి. బలమైన సామూహికత కలిగిన తెలంగాణ వంటి ఉద్యమంలో వైయక్తికమైన తీవ్రచర్యలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. ప్రతి యువకుడి ఆత్మార్పణా ఉద్యమంలోని తక్కిన శ్రేణులన్నిటినీ దుఃఖంలోకి, ఆత్మన్యూనతలోకి, నేరభావనలోకి నెట్టివేస్తుంది. ఏమి చేయాలో తెలియని నిస్సహాయతలో పడవేస్తుంది. ఎక్కడని ఆపగలము? ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రత్యేకంగా ఉంటారా? ఫలానా ఊళ్లోనో, ఫలానా వీధిలోనో, ఫలానా రకంగానో ఉంటారా? లేదే, మన పక్కన ఉన్నవాడే, మనతో నిన్న సరదాగా మాట్లాడినవాడే, లేదా అప్పటిదాకా పదిమందిలో ఒకడిగా ఏ ప్రత్యేకతా లేకుండా ఉన్నవాడే ఉన్నట్టుండి అగ్గిపిడుగు అయిపోతున్నాడు? ఎక్కడని ఆపాలి, ఎవరు ఎవరికి ధైర్యం చెప్పాలి.

వందల ఆత్మహత్యల పుణ్యం కట్టుకున్న కేంద్రమంత్రి శనివారం నాడు, బతికి సాధించాలని ధైర్యం చెబుతున్నాడు. ఏ మాటా మాట్లాడకుండా నోరుకట్టేసుకుంటే, అతన్ని ఎవరైనా నిలదీస్తున్నారా? ఎందుకు పుండు మీద కారం చల్లే మాటలు? అటువంటి మాటలే కదా, ఢిల్లీ దాకా వెళ్లి యాదిరెడ్డి ఆత్మార్పణ చేసుకోవడానికి కారణమైంది? బాధ్యత లేకుండా, ప్రాణాలతో చెలగాటమాడకూడదన్న స్ప­ృహ కూడా లేకుండా మాట్లాడే నేతలకు ఏదో నిరూపించాలని ప్రాణాలు తీసుకున్న యువకులు ఎందరు లేరు? చేతి రాతను నమ్మడం లేదని గొంతు రికార్డు చేసి చచ్చిపోయాడో పిల్లవాడు ఈ మధ్యన!

నేతలకు బాధ్యతను నేర్పించలేము, ప్రాణాలపై గౌరవాన్ని వారికి అలవరచనూ లేము. చెప్పుకోవలసింది ఉద్యమాలకే. ఉద్యమనాయకత్వాలకే. దయచేసి, విజయం ఆ మూలమలుపులో దాగుందని, రేపే ఫలితం వస్తుందని, చిటికెలో సమస్య తీరిపోతుందని- కార్యకర్తలను ఉత్తేజ పరచడానికైనా చెప్పకండి. ఉద్యమం కష్టనష్టాలు, దాని దీర్ఘకాలిక స్వభావం, పరిమితులు- అన్నీ అందరికీ తెలియజేయండి. వారి కారణాలు వారికి ఉండవచ్చును కానీ, తెలంగాణ ఉద్యమపార్టీలు, సంస్థలు- అట్టడుగు కార్యకర్తల నిర్మాణాన్ని అలక్ష్యం చేశాయి. ప్రధాన పార్టీ అయితే, దాన్ని ఎజెండాలోనే పెట్టుకోలేదు. అందుకే, తెలంగాణ ఉద్యమానికి ఉద్వేగస్థాయిలో ఉన్న మమేకత్వానికీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉండే నిర్మాణానికీ పొంతనే లేదు. తెలంగాణలోని లక్షలాది మంది యువకులు పార్టీల, సంస్థల నిర్మాణాలతో సంబంధం లేకుండానే తెలంగాణ ఆకాంక్షతో భావనాత్మకమైన అనుబంధం పెంచుకున్నారు. ఉద్యమం ఎగుడుదిగుళ్లకు లోనయినప్పుడల్లా, వారి వ్యక్తీకరణ వ్యక్తిగతస్థాయిలో ఉండడానికి అదొక కారణం.

ఉద్యమగమనంమీద యువకులకు ఎక్కువ ఆశ ఉండడం వల్ల, అందులో తేడా వచ్చినప్పుడల్లా అసహనం పెరుగుతోంది. ఆ గమనానికి వేగం జోడించడానికి తాము సొంతంగా ఏదైనా సంచలనాత్మకమైన పనిచేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, అభ్యర్థి విజయాన్ని చవిచూసిన తరువాత కూడా భోజ్యానాయక్ ఎందుకు చనిపోయినట్టు? బహుశా ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఆత్మహత్య ఒక మార్గమని అతను అనుకుని ఉండాలి. అటువంటి ఆలోచనలు కలగడం ప్రమాదకరం, అవాంఛనీయం. ఈ సందేశాన్ని ప్రతి తెలంగాణ అభిమాని గుండెల్లోకి తీసుకువెళ్లగలిగే నైతికత, శక్తిసామర్థ్యాలు, యంత్రాంగం తెలంగాణ ఉద్యమసంస్థలకు లేకపోవడం ఒక విషాదం.

తెలంగాణ ఆత్మహత్యలు కూడా హత్యలే. ఆ హత్యాకాండకు బలికాకుండా యువతరాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు, వ్యవస్థలు సున్నితమైనవని, తమచర్యల ద్వారా వాటిలో స్పందన రేకెత్తించవచ్చుననీ భావిస్తున్న యువకులు, ఆ అభిప్రాయాలు భ్రమాత్మకమైనవని గుర్తించాలి. నేటి ఏలికలకు జ్ఞానేంద్రియాలు మొద్దుబారిపోయాయి. స్పందనగ్రంథులు ఎండిపోయాయి. నైతికత అడుగంటిపోయింది. శిలగా మారిపోయిన దేవుడిముందు గండ కత్తెరలు వేసుకుంటే ప్రయోజనం ఏముంది?

దశాబ్దాలుగా తెలంగాణ తన అమూల్యమైన యువతరాన్ని కోల్పోతూ వస్తున్నది. ఇక చాలు. బతకమ్మను పూజించే నేలలో ఇక చావుకు హారతులెత్తవద్దు. ప్రాణాలే బలిపెట్టడానికి సిద్ధపడినవారికి ప్రత్యామ్నాయాలే దొరకవా? నిలువునా కాలిపోగలిగినవారికి, నిలకడగా పోరాడడానికి ఓపిక ఉండదా?

1 comment:

  1. "నిలువునా కాలిపోగలిగినవారికి, నిలకడగా పోరాడడానికి ఓపిక ఉండదా?"

    ఉంటుంది, ఉండాలి కూడా. బతికే కొట్లాడాలే, కొట్లాడి తెలంగాణా తెచ్చుకోవాలె.

    తెలంగాణా రాలేదని రంది పడొద్దు. ఇయ్యాల కాకపొతే రెపోస్తది, బతుకు పొతే మల్ల రాదు.

    తెలంగాణా అమరవీరులకు ఆత్మశాంతి రాష్ట్ర స్తాపనతోనే వస్తుంది. స్వరాష్ట్ర ఆశయం నిజం కావాలంటే బలిదానాలు ఆగాలి.

    ReplyDelete