Wednesday, April 11, 2012

మన్మోహన్ జర్దారీ, మంచిమాటలు వింటారా?

ఈ ఆదివారప్పూట మనదేశానికో అతిథి వస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక యాత్రికుడిగా వస్తున్నాడు. పనిలో పనిగా మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలసి, నాలుగు మాటలు మాట్లాడి, భోజనం చేసి, ఆపైన అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గా దర్శించుకోవడం ఆయన కార్యక్రమం. ఎంత సొంత పని మీద వస్తుంటే మాత్రం, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ రాకకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? భారత ప్రధానితో ఏం మాట్లాడాలో, ఏ విషయాల మీద గట్టిగా ఉండాలో- పాకిస్థాన్‌లోని రాజకీయనేతలు, మీడియా చెబుతుంటే, జర్దారీతో తేల్చుకోవలసిన విషయాల మీద భారత్‌లో పుంఖానుపుంఖంగా ప్రకటనలు వస్తున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణంలో శిఖరాగ్ర భేటీలు సరదాగానో, లాంఛనంగానో జరుగుతాయని ఆశించలేము కదా? మా సైనికులను, పౌరులను చంపుతావా అంటూ పాకిస్థాన్ అమెరికాకు, నాటో సేనలకు దారులు మూసేసింది. వేలెడంత లేవు, ఇంత ధిక్కారమా అని అమెరికా పాకిస్థాన్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. 26/11 ముంబయి సంఘటనలకు బాధ్యుడని భావిస్తున్న లష్కరే తోయిబా పెద్ద సయీద్‌ను తమకు అప్పగించాలని ఎప్పటినుంచో భారత్ అడుగుతుంటే నిర్లక్ష్యం వహించిన అమెరికా, ఉన్నట్టుండి సయీద్ తలకు 50 కోట్ల వెల ప్రకటించి పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టింది. అమెరికా ప్రకటనతో ధైర్యం పుంజుకున్న భారత్ నేతలు పాకిస్థాన్‌మీద ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. భారత్ తాజాగా అణుజలాంతర్గామిని జలప్రవేశం చేయించడంపై పాకిస్థాన్ కలవరపడుతోంది. సయీద్ విషయం నిలదీస్తే, జర్దారీ ఏమి చెప్పాలో అని సతమతమవుతోంది.

సయీద్ భారతీయుడని మనమూ, పాకిస్థానీ అని ఆ దేశమూ చెప్పుకుంటున్నాయి. మా పౌరుణ్ణి మాకు అప్పగించు అని భారత్ అడుగుతోంది. అతని మీద నేరారోపణలకు సాక్ష్యాలేమీ లేవని పాకిస్థాన్ వాదిస్తోంది. పిట్టపోరును
అమెరికా పిల్లి తీర్చేసింది. ఏ దేశపౌరుడైతే ఆ దేశానికేమిటి? ఎవరి నెత్తిమీదనైనా బాంబులను గుప్పించే మానవరహిత విమానాలు, మానవత్వ రహిత విధానాలు అగ్రరాజ్యానికి ఉన్నాయి.

రెండు పొరుగుదేశాల మధ్య నిత్యం చిచ్చు రాజేస్తూ, కలహభోజనం చేస్తున్న అమెరికాను కాసేపు పక్కన పెట్టగలిగితే? ఆప్ఘనిస్థాన్ మీద యుద్ధంలో తమ దేశపు నేలను, చివరకు సార్వభౌమాధికారాన్ని కూడా పణం పెట్టి అమెరికాకు సహకరిస్తున్న జర్దారీ, ఆర్థికరంగంలో అమెరికా సారథ్యంలో సాగుతున్న ఆర్థికసంస్కరణలను అంకితభావంతో అమలుచేస్తున్న మన్మోహన్‌సింగ్- ఇద్దరూ వారి వారి విదేశానుబంధాలను పక్కనపెట్టి, నూటికి నూరుపాళ్లు దేశభక్తులుగా మాట్లాడుకోగలిగితే? ఏమి మాట్లాడుకుంటారు? ఏమి మాట్లాడుకోవాలి?

నేటి భారత్, పాక్‌లకు ఒక కీలకమైన పోలిక ఉన్నది. భారతదేశాన్ని ఇప్పుడు పాలిస్తున్న కూటమిలోని ప్రధానపార్టీ అధినేత్రి సోనియాగాంధీ వితంతువు. ఆమె భర్త రాజీవ్‌గాంధీ తమిళటైగర్ల చేతిలో హతులయ్యారు. ఇందిర, రాజీవ్ స్మ ృతుల మీద ఆధారపడే కాంగ్రెస్‌పార్టీ నిలదొక్కుకుంది. సోనియాగాంధీ చేతికి కాంగ్రెస్ పగ్గాలు రావడానికి కారణం ఆమె రాజీవ్ భార్య కావడమే. సోనియాకున్నంత ప్రాబల్యం కానీ, ఆదరణ కానీ జర్దారీకి లేవు కానీ, అతను బేనజీర్‌భుట్టో భర్త. ఆమె గుర్తు తెలియని దుండగులు చేసిన బాంబుదాడిలో చనిపోయారు. బేనజీర్ బతికి ఉండగానే ప్రజాజీవితంలోకి, పదవులలోకి వచ్చినప్పటికీ అపకీర్తి మాత్రమే మూటగట్టుకున్న జర్దారీ, ఆమె మరణం తరువాత పాక్ రాజకీయాలలో ఒక శక్తి అయ్యారు. పాకిస్థాన్ అధ్యక్షులూ అయ్యారు. హింసాకాండకు బలి అయిన నాయకుల సంబంధీకులుగా ఉన్న ఇరుదేశాల ఏలికలు, హింస గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి?

కాశ్మీర్ ఉద్యమం కావచ్చు, ఖలిస్థాన్ పోరాటం కావచ్చు, వాటి బీజాలు స్వాతంత్య్రానికి పూర్వపు భారత్‌లోనే పడ్డాయి. బంగ్లాదేశ్ అవతరణకు నేపథ్యం కూడా వలసపాలనలోనే ఉన్నది. ఆయా ఆశయాల సాధనకోసం జరిగిన, జరుగుతున్న ఉద్యమాల మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా, భారత్‌లోనో, పాక్‌లోనో ఉన్న అనిశ్చిత పరిస్థితులను తమకు అనుకూలంగా వినియోగించుకోవడానికి పరాయిశక్తులు ప్రయత్నించాయి. ఆ ప్రయత్నానికి రెండు దేశాల ప్రభుత్వాలూ సహకరిస్తూనే వచ్చాయి. దేశవిభజన జరిపి, శాశ్వత దాయాదిత్వాన్ని రెండు దేశాల మధ్య నెలకొల్పిన బ్రిటిష్‌వారి నుంచి సామ్రాజ్యవాదపు వారసత్వం పొందిన అగ్రరాజ్యాలు, భారత్-పాక్ వైరాన్ని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్‌యూనియన్ కూడా భారత ఉపఖండాన్ని రణరంగంగా ఉపయోగించుకున్నదే. ఏతావాతా తేలేదేమంటే, భారత్-పాక్ పోరు దేశవిభజన నాటి కల్లోలాల కొనసాగింపుకాదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల ప్రతిధ్వని. అమెరికాను వేలెత్తిచూపుతూ గర్జించిన విజయేందిర గొంతులో రష్యన్ యాస ఉన్నది. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడిన తరువాత వింతేమిటంటే, ఉభయదేశాల నేతల గొంతులోనూ అమెరికన్ కంఠస్వరమే వినిపిస్తున్నది.

పాలస్తీనా చిచ్చును రగిలించి, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కుంపటిని వెలిగించి, చమురు దేశాలపై పెత్తనం కోసం అమెరికా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు- గల్ఫ్‌యుద్ధాలకూ అల్‌ఖాయిదా అవతరణకూ, ఆ మాటకు వస్తే లష్కరేతోయిబా వంటి సంస్థల ఏర్పాటుకూ కారణమయ్యాయి. కాశ్మీర్ పోరాటం ఎంతటి తీవ్రమయినదైనా అది దీర్ఘకాలం ఆ రాష్ట్రం సరిహద్దులు దాటలేదు. పూర్తి స్వాతంత్య్రం కోరుతున్న శక్తులను బలహీనపరచడానికి, పాక్అనుకూల తీవ్రవాదులను ప్రోత్సహించి బలపరచినది ఎవరో, పోరాటపు ఉగ్రవాదరూపం ఢిల్లీని, ముంబయిని తాకడానికి కారకులెవరో లోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తే ఎవరికయినా సులువుగానే తెలుస్తుంది. ఉగ్రవాదంపై యుద్ధం అంతర్జాతీయ యుద్ధం కావడానికి ప్రతిదేశంలోనూ ఒక సెప్టెంబర్11 జరగవలసిన అగత్యం ఎవరికి కలిగిందో కూడా తెలియంది కాదు. ముంబయి మీద దండెత్తి వచ్చిన మూకలకు నాయకుడు సయీదే అయితే, అతన్ని విచారించమనో, అప్పగించమనో పాక్‌ను అడగడం భారత్ హక్కు. పాక్‌లోని ఉగ్రవాదులపై దాడులు జరగకుండా ఏమార్చేందుకు, ముంబయిని లక్ష్యంగా ఎంచుకోవడంలో పాక్‌సైన్యం, ప్రభుత్వం పాత్ర కూడా ఉంటే, దాన్నీ తేల్చుకోవలసిందే. కానీ, ప్రశ్న ఏమిటంటే- ఈ పొరుగుచిచ్చు కుతంత్రానికి మొదలు ఎక్కడ ? దీనికి ముగింపు ఎట్లా?

భారత్ అంటే కొంత కాలం అలీనంగా ఉండాలని ప్రయత్నించింది, మరికొంతకాలం అలీనంలో ఉంటూనే సోవియట్ శిబిరంలో సంలీనం అయ్యేందుకు ప్రయత్నించింది. అప్పుడెప్పుడో లాల్‌బహదూర్‌శాస్త్రి హయాంలో కొంతకాలంలో, జనతాప్రభుత్వం కాలంలో మరికొంత కాలం భారత్ అమెరికాకు అనుకూలంగా వ్యవహరించిందని అంటారు కానీ, వాస్తవానికి అది నిలకడగా అమెరికా వెంటనడుస్తున్నది గత ఇరవై సంవత్సరాల నుంచే. సోవియట్ శిబిరం కుప్పకూలిపోయిన తరువాత, నూతన ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల నిర్మాణాన్ని అమెరికా భుజాన వేసుకున్న తరువాత- మన పోకడ మారిపోయింది. అమెరికా సాన్నిహిత్యం కోసం మనం పాకిస్థాన్‌తో పోటీపడే పరిస్థితి. పాకిస్థాన్‌ను నొప్పించి అయినా ఇండియాను మచ్చిక చేసుకోవలసిన అగత్యం అమెరికాది. రెండుశిబిరాల్లో రెండుదేశాల పరిస్థితి పోయి, ఒక శిబిరంలో పోటాపోటీ స్థితి ఏర్పడింది.

పాక్ చరిత్ర వేరు. దానిది మొదటినుంచి అమెరికా శిబిరమే. అక్కడ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుండానే, సామాజికంగా స్థిరత ఏర్పడకుండానే ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది. జాతిపిత జిన్నా ఆశించింది వేరు, అక్కడ జరిగింది వేరు. సైన్యం పదే పదే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూవచ్చింది. అరాచకపు నేతలతో కంటె, నిరంకుశ సైన్యాధిపతులే మేలని అమెరికా భావించింది. కొన్నిసార్లు కుట్రలను, కొన్ని సార్లు ఎన్నికలను ప్రోత్సహించింది. ఎంతో సేవ చేసిన ముషరఫ్‌ను పక్కనబెట్టి, జర్దారీని గద్దెనెక్కించడంలో అమెరికా ప్రమేయం లేదని జర్దారీ కూడా అనలేడు. బేనజీర్‌ను చంపిందెవరని అడిగితే మాత్రం ఆయనేమీ చెప్పలేడు, అల్‌ఖాయిదా కాదని తప్ప. ఇంతగా అంటకాగినా, పాకిస్థాన్ ఒక దేశంగా సాధించుకున్నది ఏమీ లేదు.

భారత్‌లో జరిగినటువంటి అసమాన అభివృద్ధి అయినా అక్కడ మృగ్యం. శాంతిభద్రతలు శూన్యం. ప్రజలందరిలో అమెరికా అంటే తీవ్రమైన వ్యతిరేకత. అయినా, అదే అమెరికా యుద్ధాలకు వేదిక. ప్రజలంతా దుర్భరదారిద్య్రంలో, ప్రాణాలకు రక్షణలేని స్థితిలో ఉండగా, సైన్యం ఇంకా రాజకీయాలు ఆడుతుండగా, మానవరహిత విమానాలు యథేచ్ఛగా సంచరిస్తూ ఉండగా, జర్దారీ వచ్చి కాశ్మీరీల స్వయంనిర్ణయాధికార హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, అది నిస్సహాయత నిండిన పీల అరుపే అవుతుంది తప్ప, సింహగర్జన కాబోదు.

అందుకని ఏమి చేయాలి?
భారత్- పాక్‌లు రెండూ తాము ఒకప్పుడు ఒకే దేశమని కాసేపు గుర్తు తెచ్చుకోవాలి. జర్దారీ, మన్మోహన్ తాము అన్నదమ్ములమన్న సంగతిని తెలుసుకోవాలి. కాశ్మీర్ సమస్య భూభాగాల సమస్య కాదని, ప్రజల సమస్య అని గుర్తించి, వారి మేలు కోసం ఏమి చేయాలో ఆలోచించాలి. పొరుగింట్లో చిచ్చుపెట్టే కుత్సితాలను కట్టిపెట్టాలి. అప్పగించవలసిన ఖైదీలను అప్పగించుకోవాలి. విడిచిపెట్టవలసిన బందీలను విడిచిపెట్టాలి.

అన్నిటికీ మించి- పశ్చిమాసియానుంచి పాకుతూ వచ్చి ఉపఖండంలో తిష్ఠవేసిన పెద్దన్న సంగతేమిటో ఇద్దరూ కలసి తేల్చుకోవాలి. ఇద్దరూ ఆలింగనం చేసుకుంటే, అమెరికా తంత్రానికి తావే ఉండదని తెలుసుకోవాలి. ఇరాన్‌నుంచి చమురును, గ్యాస్‌ను యథేచ్ఛగా తెచ్చుకోవడం ఎంత లాభమో గ్రహించాలి. చంపడానికి ఇక తాలిబన్లు దొరకక, ప్రజల మీదే పడి కాల్చుకుతింటున్న వారిని వెళ్లిపొమ్మని ఆప్ఘాన్ నేత కర్జాయే అడుగుతున్నప్పుడు, మనమంతకన్నా తక్కువ తిన్నామా అని ప్రశ్నించుకోవాలి. పోరునష్టం, పొందులాభం అని ఒక సంయుక్త ప్రకటనలో తీర్మానించాలి.

4 comments:

 1. శ్రీనివాస్ గారు,

  మీరు పై వ్యాసం రాసేటప్పుడు ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకొని రాస్తారో తెలుసుకోవచ్చా? ఆదేశ ప్రస్తుత పరిస్థితి గురించి మీరు వేటిని ఆధారంగా చేసుకొని అంచనా వేస్తారు? నా ఉద్దేశం ఆదేశo గురించి ప్రముఖులు రాసిన పుస్తకాలు చద్వివాలేక ఆదేశ పత్రికలు చదివా లేక అమేరికా, లండన్ మొదలైన పశ్చిమ దేశాల మీడీయా ద్వార వచ్చే వార్తల ద్వారాన? ఇవేమి కాకుండా మీరు పత్రికా సంపాదకులు కనుక మీకేమైనా ప్రత్యేక చానల్స్/మాధ్యమాలు ఆదేశం లో జరిగే వార్తలు తెలుసు కోవటానికి ఉంటాయా?

  ReplyDelete
 2. అలాగే మీ ఈ వ్యాసన్ని ఇంగ్లిష్ లో కి తర్జుమా చేసి భారత ప్రభుత్వానికి ఏమైనా పంపుతారా? Thanks in advance.

  ReplyDelete
 3. ఏ దేశం గురించి అయినా తెలుసుకోవడానికి ఇప్పుడు అనేక సాధనాలున్నాయి. ఇక పొరుగు దేశాల సంగతి చెప్పనక్కర లేదు. మన దేశంలో కొందరు జాతీయ పాత్రికేయులు నిరంతరం పొరుగు దేశాల గురించి రాస్తారు. అలాగే, ఇంటర్నెట్ లో ఆయా దేశాల పత్రికలూ అందుబాటులో ఉంటాయి. సమాచారం ఎంతగా అందుబాటులో ఉన్నా, దాన్ని జల్లెడ పట్టి వాస్తవాన్ని గ్రహించడానికి మన అవగాహనే కీలకం. వ్యాఖ్యానించే సమర్ధత మన అవగాహన మీద అధికంగా, దొరికే సమాచారం మీద కొంత ఆధారపడి ఉంటుంది.

  ReplyDelete
 4. Righto!

  క్లుప్తంగా ఈరెండు దేశాలూ అమెరికా ప్రయోజనాలగురించో, ధనవంతుల ప్రయోజనాలో, మతప్రయోజనాలో కాకుండా అధిక సంఖ్యాకులైన పేదప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టాలి.

  ReplyDelete