Tuesday, April 24, 2012

ఆత్మను అమ్ముకోవడమే అసలైన వ్యభిచారం!

స్వభావ ఏష నారీణామ్ నరాణామ్ ఇహ దూషణమ్ అతో అర్థాన్ న ప్రమాద్యన్తి ప్రమాదాసు విపశ్చితః (మనుస్మ­ృతి, 2-213) "మగవాళ్లను ప్రలోభపరచడం ఆడవాళ్ల స్వభావం. అందుకనే వివేకవంతులు ఆడవాళ్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు.'' అదీ ఆ శ్లోకం అర్థం. ఆడవాళ్లను సృష్టించేటప్పుడే వారికి సుఖలాలసత్వాన్ని, నగలపై ప్రేమను, అపవిత్ర వాంఛలపై, దుష్ప్రవర్తన, మోసకారితనాలపై ఇష్టాన్ని సృష్టికర్త అంటగట్టాడని కూడా మనువే రాశాడు (9-17). మనుస్మ­ృతే కాదు, ప్రాచీన నీతిశాస్త్రాలు, మతగ్రంథాలు, కుమారీ శతకాలు ఆడవాళ్ల గురించి అంతకు మించి గొప్పగా చెప్పిన సందర్భాలు కనిపించవు.

సామ్రాజ్యాల యుగంలో కానీ, రాచరికాల మధ్యయుగాలలో కానీ, నిన్నమొన్నటి భూస్వామ్యంలో కానీ స్త్రీ అంటే సమాజంలో సగభాగమూ కాదు, పురుషుడితో సమానమూ కాదు, అసలు మనిషే కాదు. ఆమె పురుషుడి ఆంతరంగిక వ్యవహారం మాత్రమే. నిరంతరం అదుపు చేయవలసిన ఒక అర్ధమానవి. ఆదమరిస్తే ఆమె అతిక్రమించ గలదు. లోబరచుకోగలదు, పురుషుడిని పతనానికి తీసుకువెళ్లగలదు. మగవాడి ఉదాత్తమైన తపస్సులను భంగపరచగలదు. కాపాడవలసిన కులీనతను సంకరం చేయగలదు. ఆశ్చర్యమేమంటే, అత్యాధునిక ప్రజాస్వామ్యయుగంలోనూ, హైటెక్ గ్లోబల్ యుగంలోనూ కూడా స్త్రీ అంటే అంతే. సెకండ్ సెక్స్, సరుకుల ప్రేమిక, సౌందర్యవేదిక, సెక్స్ సింబల్, వయ్యారి, వగలాడి, అంతిమంగా ఒక స్కాండల్.

మాతృస్వామ్యం ఎప్పుడు కూలిపోయిందో, అవ్వల ప్రతిపత్తి పక్కటెముకగా ఎప్పుడు దిగజారిపోయిందో, సమాజం మగవాడికీ, కుటుంబం ఆడదానికీ ఎప్పుడు అసమానపంపకం జరిగిందో - తెలియదు కానీ, సంఘనీతి కూడా బహుశా అప్పుడే అవతరించి ఉంటుంది. పవిత్రత, స్వచ్ఛత, శీలమూ- స్త్రీ పునరుత్పత్తి అవయవాల చుట్టూ కవచాల వలె అప్పుడే ఆవరించి ఉంటాయి. స్వచ్ఛత దేనికోసమో చెప్పనక్కరలేదు. కులగోత్రాలను
కాపాడుకోవడం, వంశపారంపర్య వారసత్వాలను పరిరక్షించుకోవడం అనే పరమ భౌతిక అవసరాల కోసం పాతివ్రత్యం అవతరించింది.

మరి స్త్రీకి ఇనపకచ్చడాలనూ, మంగళసూత్రాలనూ ప్రసాదించిన మగసమాజం- శీలాన్ని సార్వజనీనం చేసిందా? తాననుకున్న నీతిని సామాజిక నీతిగా మార్చగలిగిందా? పెళ్లితో పాటే పుట్టిన వ్యభిచారాన్ని నిర్మూలించాలనుకున్నదా? లేదు. తమకే కట్టుబడిన స్త్రీలతో పాటు, తమకు అందుబాటులో ఉండగలిగిన స్త్రీలను కూడా ఏర్పరచుకున్నది. వారకాంతల వాడల వర్ణన లేని మహాకావ్యం ఒక్కటైనా ఉన్నదా? పతివ్రతలై తరించిన మహిళలు గొప్పజీవితాన్ని అనుభవించారని, సాంగత్యసుఖాన్ని ప్రతిఫలానికి అమ్ముకున్న గణికామణులు హీనజీవితం గడిపారని చెప్పగలమా? పగలబడి నవ్వీ నవ్వీ మధురవాణి సంసారులను ఎందుకు వెక్కిరించిందో మనకు తెలియదా?

అందానికో అమ్మతనానికో వయ్యారానికో విలాసానికో ప్రతీకగా మార్చివేసినా సరే, స్త్రీలు అంతఃపురాలకు వంటిళ్లకు పరిమితం కాలేదు. రాజ్యదాహం లాగానే స్త్రీమోహం కూడా రాజులను కుదిపివేసింది. ఓడించిన రాజుల కుమార్తెలను కప్పం కింద తెచ్చుకున్న మహారాజులున్నట్టే, జయించిన పట్టణాలను కొల్లగొట్టే క్రీడలో ఆడవాళ్లను చెరిచిన సైనికులూ ఉండేవారు. బంగారం లాగే, ధాన్యంలాగే స్త్రీ కూడా ఒక సంపద. దాన్ని ధ్వంసం చేయకూడదు. ఖజానాలో కలుపుకోవాలి- అన్నది రాజనీతి. ఇళ్లను కూలగొట్టినట్టే, నిప్పుపెట్టినట్టే స్త్రీలను కూడా పాడుచేయాలి- అది సైనికనీతి. ఇటీవలి యుద్ధాల దాకా ఇదే ఆనవాయితీ. పరస్త్రీలను తల్లులవలె చూడాలని చెప్పేవన్నీ నీతిమాటలే. ఆవకాశం దొరికినప్పుడు అమలులోకి వచ్చేది కేవలం ఆక్రమణ సంస్క­ృతే. రాజూబంటూ తేడా లేనే లేదు.

ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్త్రీలు తమను తాము వెలిగించుకోవడానికి, పలికించుకోవడానికి ప్రయత్నించారు. మగవాడు గీసిన గిరుల మధ్యనే, ఆపాదించిన పాత్రలలోనే తమను తాము రాణింపజేసుకోవడానికి చూశారు. కొంత మగతనాన్ని ఆవాహన చేసుకుని ప్రత్యేక వ్యక్తులుగా నిలబడ్డారు. సౌందర్యమొక్కటే చెలామణీ అయ్యే విలువ అయినప్పుడు, అందగత్తెలుగానే చక్రం తిప్పారు. తెలివితేటలకు గుర్తింపు లేదనుకుంటే, జాణతనమే చాలనుకున్నారు. ఇతరులకు ఉపయోగపడేందుకు విషకన్యలయ్యారు, ఇంద్రుడి పనుపున రుషుల ముందు అప్సరసలయ్యారు. నోరుపెట్టుకుని బతికే గయ్యాళులయ్యారు.

ఆపాదించిన దైవత్వాన్నే అంగీకరించి, సిగమూగే అమ్మలయ్యారు, అక్కమహాదేవులయ్యారు, సహగమనాలు చేసి మహాతల్లులయ్యారు. పురుష రాజకీయాలలోనే రుద్రమ్మలయ్యారు, నాగమ్మలయ్యారు. ఆ పాత్రలలోనే తమ ఉనికిని, ప్రతిభను నిరూపించుకున్నారు. పురుషవిలువల చట్రంలోనే కొంగుకు కట్టుకుని మగవాళ్లను ఆడించారు. గత్యంతరమేమున్నదని? చరిత్ర పగ్గాలు వారిచేతిలోకి వచ్చినదెప్పుడని? మంచిచెడ్డలను నిర్ణయించే స్మ­ృతులను రాయగలిగే స్థానం ఎప్పుడున్నదని? స్త్రీలను ప్రశ్నించగలిగే, తప్పుపట్టగలిగే నైతికస్థాయి మగవాడికెప్పుడైనా ఉన్నదా?

ఆధునిక ధనస్వామ్యంలో స్త్రీ ఒక సరుకు కూడా. ప్రజాస్వామిక పరిభాషలో శృంగార కార్మికురాలు కూడా. మోడల్, సినీనటి, వినోదాల నర్తకి.. ఈ గౌరవాలు దక్కని సందర్భాలలో చవుకబారు సంబోధనలు. కానీ, ఆ సరుకుల వినియోగదారుల సంగతేమిటి? స్త్రీచర్మాన్ని అమ్ముకునే వెండితెరవ్యాపారుల సంగతేమిటి? స్త్రీలను అడ్డం పెట్టుకుని సరుకులను అమ్ముకునే కార్పొరేట్ల సంగతేమిటి? అధికారసానువులలోకి చేరీచేరగానే సమస్తాన్నీ ఆబగా అనుభవించాలనుకునే సరికొత్త రాజకీయ తరం సంగతేమిటి? రాజకీయ-వ్యాపారచట్రం చుట్టూ బతికే పరాన్నభుక్కు చిల్లరదేవుళ్ల సంగతేమిటి? వీరెవరి దోషమూ లేకుండానే, వ్యభిచారాలూ సెక్స్‌కుంభకోణాలూ జరుగుతున్నాయా? పరమ మానవీయంగా, ప్రజాస్వామికంగా సాగవలసిన శృంగారాన్ని సరుకుగా చేయడం ఎంత ఘోరం? అసలు డబ్బిచ్చి మానవ అనుభవాన్ని కొనుక్కోవడం ఎంత అమానుషం? ఎవరైనా సరే, తమ శరీరాన్నే అంగట్లో పెట్టవలసి రావడం ఎంత దయనీయం?

ఉంటారు, ఆ దయనీయ స్థితిలోనే దుర్మార్గులుగా ఎదిగేవాళ్లుంటారు. తన స్థితే హీనం అని తెలియక, ఇంకా నలుగురిని ఆ రొచ్చులోకి లాగేవారు, తోటిస్త్రీల శరీరాలతో వ్యాపారం చేసేవాళ్లు ఉంటారు. వృత్తిపరిచయాలను విస్తరించి రాజకీయాలలోకి, ఆర్థికంలోకి ఎగపాకేవాళ్లుంటారు. పురుషప్రపంచం తమపై విధించిన దుర్గతిని ఒక అవకాశంగా తీసుకుని నెగ్గుకువచ్చేవాళ్లుంటారు. కులాన్ని ఉపయోగించుకునేవాళ్లు, వంశాన్ని నమ్ముకునేవాళ్లు, డబ్బును ఉపయోగించుకునేవాళ్లు, తమ తెలివితేటలను వాడుకునేవాళ్లు ఉన్నట్టే, తమ లైంగికతను, శరీరాలను ఉపయోగించుకునేవాళ్లూ ఉంటారు. అయితేనేం? ఎవరికంటె మాత్రం వారు ఎక్కువ అవినీతిపరులు? ఆత్మలను తీసుకువెళ్లి అగ్రరాజ్యాల పాదాల దగ్గర పడవేసే నేతలతో పోలిస్తే, దేశవనరులను అన్యాక్రాంతం చేయడానికి ఆత్రపడేవారితో పోలిస్తే ఒళ్లమ్ముకునేవారు కోటిరెట్లు పవిత్రులు.

కానీ, సమాజం చిన్నవాళ్లను చూసే వెక్కిరిస్తుంది. బిచ్చగాళ్లను, వికలాంగులను, పిచ్చివాళ్లను హేళన చేసినట్టుగానే, జీవిక కోసం, ఉనికి కోసం వ్యభిచారాలు చేసేవాళ్లను పరిహసిస్తుంది. వారి వృత్తిలో వారే బాధితులని తెలిసినా వారినే తప్పుపడుతుంది. పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్లను, కోట్లకు కోట్లు దండుకునేవారిని గౌరవంగా పరిగణిస్తుంది. మీడియా కూడా అంతే. స్త్రీత్వం ముడిపడి ఉన్న నేరం అనగానే ఎక్కడలేని ఆసక్తి. అందులో దోషులెవరో, నేరం ఎవరిదో అక్కరలేదు. ఒక మానవీయ విషాదం కేవలం కాలక్షేపంగా పరిణమిస్తుంది.

నైతికంగా నిర్ధారణ అయిపోయిన ఒక దుర్మార్గంలో దోషిగా పరిగణన పొందుతున్న వ్యక్తి, అనేక అక్రమాల కేసుల్లో ఎ-2 ముద్దాయిగా ఉన్నవాడు అయిన విజయసాయి రెడ్డి పోలీసుజీపుల్లో సిబిఐ ఆవరణలో మితిమీరిన అతిశయంలో విజయసంకేతాలనిస్తూ ఫోటోగ్రాఫర్లకు పోజులిస్తున్నప్పుడు- ఈ వ్యవస్థ బలహీనత మీద, నిరర్ధకత మీద ఎంత నమ్మకం అతనికి అనిపించింది. నేరవిచారణవ్యవస్థనే అపహసిస్తున్నట్టు కనిపించింది. బలవంతంగా ఇతరులను వ్యభిచారంలోకి దింపుతున్న నేరారోపణపై అరెస్టయి, అనేక సంచలనాత్మక వెల్లడులతో వార్తలలో ఉన్న తారాచౌదరిని మీడియా పదే పదే టీవీతెరల మీద పరేడ్ చేయిస్తున్నప్పుడు- మన సమాజ ముఖచిత్రం మీదనే ఏవగింపు కలుగుతుంది.

ఆమెను చూసినప్పుడు- ఆమెను ఆ దశకు తీసుకువచ్చిన పేర్లు బయటకు రాని పురుషోత్తములు ఈ సమాజంలో పెద్దమనుషులూ నేతలూ అధికారులూ కదా భయం వేస్తుంది. ఎరలు విసిరి, బుట్టలో వేసుకుని, బెదిరించి,.... వంటి మాటలన్నీ ఆమెకు వర్తించేవా లేక ఆమె ఖాతాదారులకు వర్తించేవా అని సందేహం కలుగుతుంది. ఆమె వార్త వచ్చినప్పుడల్లా వెకిలి మాటలతో, ఆకలిచూపులతో నైతికమయిన తీర్పులు ఇవ్వగలిగే మన దుస్సాహసానికి దుఃఖం కలుగుతుంది.

9 comments:

 1. మాటలు రావటం లేదు! మొత్తం కడిగి పాడేశారు!

  ReplyDelete
 2. Righto!

  వివిధకాలాల్లో, సమాజాల్లో జరిగింది ఇదేకదా! దాస్యానికి పాతివ్రత్యమని ముసుగుతొడిగి, బంధాల్ని శీలంపేరుతో, దాని పరిరక్షణపేరుతో సమర్ధించుకొని మొత్తం లోకకల్యాణ భారాన్నీ, బాధ్యతలను స్త్రీల భుజాలపైమోపారు. ఒకడేమో మానవుడి పతనానికి స్త్రీకారణమంటాడు; ఇంకొకడు స్వాతంత్ర్యానికర్హమే కాదంటాడు; మరొకడేమో only half credible అంటాడు. స్త్రీలని పూజించడం అని ఘనంగా రాసుకున్న రాతలన్నీ తల్లిని గౌరవించేలాచేయడంతో సరిపుచ్చుకున్నాయి (ఎక్కడో చదివాను సంబోధనా ప్రధమావిభక్తులన్నీ పెళ్ళాలకోసమట).

  దీనంతటికీ ఇంకో గొప్ప ట్విస్టేమిటంటే చాలామంది ఆడవాళ్ళుకూడా ఈమాయలో పడిపోయి "చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఆచరిస్తున్నాం కాబట్టి మాకింత గౌరవాన్ని ముష్టెయ్యండి" అని డిమాండు(??) చెయ్యడం. ఈ తరహా డిమాండుకి మగిష్టులేమో జవాబు తెలుసుగా "ఇంతమాత్రానికే మిమ్మల్ని గౌరవించాలా?".

  ఫెమినిస్టులు ఏదో ఉధ్ధరిస్తారనుకుంటే వీళ్ళూ అంటే. కాకపోతే సాంప్రదాయవాదులేమో మగాళ్ళదగ్గర అడుక్కుతినమని రాశారు, వీళ్ళేమో దోచుకుతినమని చెబుతారు. అంతేగానీ మీకు మీరు స్వతంత్రంగా వ్యవహరించండి, మీ మనసుకునచ్చిన వాటిని ఆచరించండి, మీకూ ఒక వ్యక్తిత్వం ఉందికదా, దాన్ని ఎవరికీ తాకట్టుపెట్టకండి అని చెప్పినవారిని చాలా కొద్దిమందిని చూశాను.

  ReplyDelete
  Replies
  1. ఇండియన్ మినర్వా గారూ,
   శ్రీనివాస్ గారి ఈ కాలమ్ నిర్ద్వంద్వంగా చాలా అపురూపమైనది.ఎందుకంటే మాతృస్వామ్యం నుంచీ ఆధునిక ధనస్వామ్యం వరకూ స్త్రీల మనశ్సరీరాలు వారివి కాకుండా ఎలా నియంత్రించబడ్డాయో, వాడుకోబడ్డాయో శాస్త్రీయంగా విశ్లేషణ చేసారు.
   ఇక మీ వ్యాఖ్యలో ఈ పేరాలో కొన్ని వాక్యాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి.

   ''ఫెమినిస్టులు ఏదో ఉధ్ధరిస్తారనుకుంటే వీళ్ళూ అంతే. కాకపోతే సాంప్రదాయవాదులేమో మగాళ్ళదగ్గర అడుక్కుతినమని రాశారు, వీళ్ళేమో దోచుకుతినమని చెబుతారు. అంతేగానీ మీకు మీరు స్వతంత్రంగా వ్యవహరించండి, మీ మనసుకునచ్చిన వాటిని ఆచరించండి, మీకూ ఒక వ్యక్తిత్వం ఉందికదా, దాన్ని ఎవరికీ తాకట్టుపెట్టకండి అని చెప్పినవారిని చాలా కొద్దిమందిని చూశాను''.

   అన్నారు మీరు.''సాంప్రదాయవాదులేమో మగాళ్ళదగ్గర అడుక్కుతినమని రాశారు.''అన్నారు...సరే..ఎందుకు అడుక్కుతినమన్నారో దాని వెనుక పని చేసిన వ్యవస్థలు ఏంటో...ఆ చరిత్ర అంతా పక్కన పెట్టినా స్థూలంగా ఆ వాక్యంతో పెద్ద పేచీ లేదు.
   కానీ ''వీళ్ళేమో దోచుకుతినమని చెబుతారు.'' అన్నారు.వీళ్ళు అంటే బహుశా ఫెమినిస్టులు మీ ఉద్దేశంలో...
   మగాళ్ళని దోచుకు తినమని చెప్పిన ఫెమినిస్టులని మీరు ఎక్కడ చూసారు?దోచుకు తినమంటూ వారు ప్రబోధించిన సాహిత్యం ఏది?దానితో ప్రభావితమై ఎంత మంది స్త్రీలు మగవారిని దోచుకు తిన్నారు?దయ చేసి మీ దృష్టి లోకి వచ్చిన దోపిడీ దారులైన ఫెమినిస్టులని చూపగలరు.

   ''అంతేగానీ మీకు మీరు స్వతంత్రంగా వ్యవహరించండి, మీ మనసుకునచ్చిన వాటిని ఆచరించండి, మీకూ ఒక వ్యక్తిత్వం ఉందికదా, దాన్ని ఎవరికీ తాకట్టుపెట్టకండి అని చెప్పినవారిని చాలా కొద్దిమందిని చూశాను''. అంటూ మీరు ప్రశంసించిన ఈ వ్యాసకర్త, అణచివేతకి గురయ్యే,బాధిత అస్తిత్వాలకి వెన్నుదన్నుగా నిలవడమే కాదు స్వయంగా ఫెమినిస్ట్ భావజాలాన్ని అంగీకరించే పాటించే వ్యక్తి,విమర్శకుడు కూడా...మీ పరిశోధన ఇక్కడ నుంచీ మొదలు పెట్టొచ్చు.
   మల్లీశ్వరి.

   Delete
  2. "ప్రబోధిస్తున్న సాహిత్యం" ఇదీ అంటూ చెప్పలేనండీ. కానీ నేను విన్న/చదివిన కొందరు ఫెమిస్టుల వాదనలు నేనన్న దారిలోనే ఉన్నాయండి (Feminist manifesto అనేదేమైనా ఉన్నట్లైతే అది నాకు తెలియదు). క్లుప్తంగా సంపాదనలో భాగాలు కోరడాన్ని అలా అన్నాను. బోధనల్ని ఎక్కువమంది పాటించకపోతే అది వాళ్ళ బోధించినవాళ్ళ failure అవుతుందేగానీ, వాళ్ళసలు దాన్ని బోధించనేలేదన్నట్లు అవ్వదుకదా. ఫెమినిజాంతో నాకే సమస్యాలేదుకానీ, కొన్నిరాతలు చదువుతున్నప్పుడు "ఇది ఫెమిన్ ఇజమెలా అవుతుంది" అనిపిస్తుంది.

   Delete
  3. కూడలి చూడకపోవడం వల్ల మిస్సయ్యనా మీ బ్లాగ్ ఇన్ని రోజులు, ఈ వ్యాసం ఏదయినా పత్రికలో (అన్ని పత్రికలలో ) తప్పక రావాలి.

   Delete
  4. @@@'వీళ్ళేమో దోచుకుతినమని చెబుతారు.''@@@

   ఇండియన్ మినర్వా గారు ,

   దోచుకుతినమని కాదు కాని, సమస్య మరియు సందర్బాన్ని బట్టి మీకు తినే హక్కు ఉంది , మీ హక్కును మీరు వదులుకోవద్దు అని మాత్రమే చెప్పగలరు ఫెమినిస్ట్లేవరైనా ఉంటే .

   కడుపు మాడిపోతున్న వారికి,ఒళ్ళు కాలిపోతున్నవారికి వ్యక్తిత్వం గురించి ఉపోద్ఘాతాలు చెప్తే సరిపోదు :)


   @@@క్లుప్తంగా సంపాదనలో భాగాలు కోరడాన్ని అలా అన్నాను.@@@

   సంపాదనలో భాగం ఎవరికి ఉంటుంది మరి ? ఎవరు కోరుకోవచ్చు, ఎవరు కోరుకోకూడదు ??? :)

   Delete
 3. Srinivas gaaru,
  chaala baaga vraasaaru.
  konta mandikiainaa muriki vadilite baaguntundi.

  Surabhi

  ReplyDelete