Tuesday, May 1, 2012

లక్ష కోట్ల అవినీతుల మధ్య 'లక్ష' లక్ష్మణ్‌కు శిక్ష

ఢిల్లీలో నివసించే ఒక సుప్రసిద్ధ జాతీయ పాత్రికేయుడిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, పి.వి.నరసింహారావు హయాంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జరిగిన ఎంపీల కొనుగోలు అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతంతో పోలిస్తే, ఫిరాయింపు వ్యవహారాలకు అందుబాటులో ఉండే డబ్బు కూడా ఆనాడు తక్కువ కాబట్టి, చవుకగా కొనగలిగే వారిని ఎంపిక చేసి మరీ ప్రయత్నించడం జరిగిందనీ, ముఖ్యంగా దళిత, గిరిజన వర్గాలకు చెందిన పార్లమెంటు సభ్యులకు డబ్బు ఎరవేశారనీ ఆ పాత్రికేయుడు చెప్పారు. బడుగు వర్గాలకు చెందినవారు అవినీతికి సులువుగా లోబడతారన్న అభిప్రాయం పాలకపార్టీలలో ఉన్నప్పటికీ, ఆ అభిప్రాయంలో వాస్తవమున్నదని అంగీకరించే పరిస్థితి లేదని ఆయనే వ్యాఖ్యానించారు. అయితే, పాలకపక్షానికి అమ్ముడుపోయే పరిస్థితి ప్రత్యేక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులలో ఉండడం గురించి, ఆయన సానుభూతితోనే చర్చించారు. పివికి అనుకూలంగా ఓటుచేసిన ఒక ఒరిస్సా గిరిజన ఎంపీ గురించి చెబుతూ, పదిలక్షల సొమ్ము అతనెప్పుడూ చూసి కూడా ఉండలేదని, అది అతనికి, అతనిలాంటి సాటి ఆదివాసీలకు తరతరాలకు సరిపోయే డబ్బు అని, ఆ సందర్భంలో అతని నుంచి నైతికతను ఆశించే హక్కు ఈ వ్యవస్థకు లేదని కూడా ఆ సీనియర్ అభిప్రాయపడ్డారు.

వివిధ నేరాలకు సంబంధించి వేసే శిక్షలు నిందితుల సామాజిక నేపథ్యాల ఆధారంగా ఉండాలని భారతీయ సాంప్రదాయ స్మ­ృతులు చెబుతున్నాయి. ఒకే నేరానికి బ్రాహ్మణులకు ఒక శిక్ష, శూద్రులకు ఒక శిక్ష, దళితులకు మరో రకం శిక్ష - వేయాలని నిస్సంకోచంగా ధర్మశాస్త్రాలు చెప్పాయి. కుల, మత తదితర వివక్షలు లేకుండా
న్యాయం అందించాలని ఆధునిక చట్టాలు చెబుతున్నాయి కానీ, ఆచరణలో అందుకు భిన్నమైన వాతావరణం ఉన్నదని వేరే చెప్పుకోనక్కరలేదు. నేరం అన్న భావన, ఆస్తి హక్కు పరిరక్షణతో, అధికారపీఠాల సంరక్షణతో ముడిపడి ఉన్నప్పుడు, బలహీనులు, దరిద్రులు, పతితులు, భ్రష్ఠులు అధికంగా నేరస్థులుగా నిర్ధారణ పొందుతారు. ఏ కారాగారాన్ని పరిశీలించినా, అందులోని అభాగ్యులు అధికసంఖ్యాకులు ఏ వర్గాల వారో తెలిసిపోతుంది. చలపతిరావు-విజయవర్థనరావు ఉరిశిక్షల వ్యతిరేక ఉద్యమం సందర్భంలో- నేరానికి, న్యాయానికి ఉన్న సామాజిక కోణం గురించిన చర్చ విస్త­ృతంగా జరిగింది. మరి అవినీతికి సంబంధించిన అనేక సంచలనాలు కలుగుతున్న నేటి సందర్భంలో సామాజిక కొలమానాలను చర్చకు తేవలసిన అవసరం లేదా? అన్నది ప్రశ్న.

సాధారణ జనదృష్టిలో నేరాలను, నీతిని చూసే పద్థతి ఎంతో కొంత విచక్షణతో కూడి ఉంటుంది. అనివార్యమైన పరిస్థితుల్లో, దుస్సహమైన, నిస్సహాయమైన పరిస్థితుల్లో మనుషులు గీత దాటినప్పుడు- దాన్ని కొంత సహనంతో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. పేదవాడి దొంగతనాన్ని, పెద్దవాడి దోపిడీని ఒకేరకంగా చూడడం ఉండదు. పెద్ద నేరాలు చేసి కూడా బోరవిడిచి తిరిగే పెద్దలను చూసినప్పుడు, చిన్న తప్పులకే కటకటాలు లెక్కించేవారిని చూసి జాలిపడతారు కూడా. లక్ష రూపాయల లంచానికి బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష న్యాయం లభించినప్పుడు, నీతి గెలిచిందన్న ఆనందం కాక, ఇదేమి న్యాయమన్న ఆశ్చర్యం వెల్లడి కావడం అందుకే!

లక్ష్మణ్ చేసింది తప్పే కావచ్చు. మా వాడే కదా, చిన్న తప్పే కదా, పార్టీ కోసమే చేశాడు కదా అని లక్ష్మణ్ అధ్యక్షుడిగా పనిచేసిన పార్టీ అతన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరేమంటే మాకేమిటి అని నరేంద్రమోడీని లాగా వెనకేసుకు రాలేదు. దళిత నేత కదా, కోరి పార్టీ అధ్యక్షపదవి ఇచ్చాము కదా, కాపాడుకుందామనుకోలేదు. గాలిజనార్దనరెడ్డిని పట్టుకు వేలాడినంత కాలం కూడా, ఆయన్ని అంటిపెట్టుకోలేదు. చేయి కాలగానే జారవిడిచారు. ఇప్పుడు తీర్పు వచ్చాక, అదంతా ఆయన వ్యక్తిగత వ్యవహారం అని చేతులు దులుపుకున్నారు. ఆ ఉదంతంలో మరే ప్రధాన నేత ఉన్నా, అలా జరిగేదా?

సామాజికమైన పలుకుబడే అవినీతి స్థాయిని, పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. అందరూ అన్ని రకాల కుంభకోణాలకు పాల్పడలేరు. ఆ వ్యక్తి చేతిలో ఉన్న అధికారం పరిధి, అతని సామాజిక, ఆర్థిక సంబంధాలు అవినీతి అవకాశాల విస్త­ృతిని నిర్ణయిస్తాయి. ఆస్పత్రిలో గేటు దగ్గర ఉన్న చౌకీదారు రూపాయి అవినీతికి మాత్రమే పాల్పడగలడు. దేశం ఆర్థిక వ్యవస్థ గేటు దగ్గర కాపలా కాయవలసిన మంత్రి లక్షల కోట్ల స్కామ్ చేయగలడు. పారిశ్రామికవేత్తలు బంధువులుగా, ఫైనాన్షియర్లుగా, అస్మదీయులుగా ఉన్న ప్రజాప్రతినిధి అవకాశం వస్తే, నిబంధనలను విదిలించి చాలా మేలు చేయగలడు. ఇప్పుడిప్పుడే బెరుకుబెరుకుగా అధికారసోపానాలను అధిరోహిస్తున్న వర్గాల వారు, ఏవో చిల్లరబేరాలు, చిలక్కొట్టుళ్లు మాత్రమే చేసుకోగలరు. అకస్మాత్తుగా లక్షలో కోట్లో వచ్చిపడితే వాటిని ఏమి చేసుకోవాలో కూడా వారికి తెలియదు. జార్ఖండ్‌కు చెందిన ఆదివాసీ ఎంపీలు పీవీప్రభుత్వానికి ఓటువేసినందుకు పొందిన లంచం డబ్బును తమ అధికారిక ఖాతాల్లోనే జమచేసుకుని దొరికిపోయారు. వారి సంపాదనను నిర్వహించడానికి విజయసాయిరెడ్డి వంటి ఆడిటర్లు ఉండరు. తమ పేర్లు అరువిచ్చి కాపాడే బినామీలుండరు. అవసరమొస్తే అనర్గళంగా వాదించి గెలిపించే న్యాయవాదులూ ఉండరు.


డబ్బాశ కూడా మనుషులను బట్టి మారుతుంటుంది. పెద్దవాళ్ల సంపాదన అత్యాశగానో, ప్రలోభంగానో, కుంభకోణంగానో పెద్దపేర్లు పెట్టుకుంటుంది. పేదవాళ్ల సంపాదన కక్కుర్తిగా, లంచంగా, గడ్డితినడంగా పేరుతెచ్చుకుంటుంది. ఉదారంగా ఉండడానికి, దానకర్ణులుగా వెలగడానికి సంపన్నులకున్న అవకాశం, దరిద్రులకు ఉండదు. దరిద్రం మనిషిని విలువలకు అతీతమైన స్థితిలోకి నెట్టివేస్తుంది. ఆకలి, మనుగడ పోరాటం అనివార్యతలను కలుగజేస్తుంది. «పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ధనికుడైనవాడు, ఈ జన్మలోనూ నాలుగు దానాలు చేసి మళ్లీ ధనికుడిగానే పుడతాడని, దరిద్రుడు ఆ అవకాశం లేకుండా నిరంతరం దరిద్రపు జన్మచక్రంలోనే కొట్టుమిట్టాడతాడని చెప్పే సంస్క­ృత శ్లోకం ఒకటున్నది. దరిద్రమైనా, సంపన్నత అయినా స్వార్జితాలు కావని, సమాజపు అపసవ్యతనుంచి, దుర్మార్గం నుంచి పుట్టిన అంతరాలని తెలుసుకోలేక, అందరమూ డాంబికమే     నైతికత అనీ, పేదరికపు అసంస్కారమే అనైతికత అని భ్రమపడతాము. లాఘవమూ నైపుణ్యమూ లేకుండా దొరికిపోయే తక్కువరకం దొంగలను చూసి అవహేళన చేస్తాము. మూత్రశాలల్లో ఉంచే నాఫ్తాలిన్ గోలీలను దొంగిలించే వాడు అందరికంటె నికృష్టపు దొంగ అని బాబూభాయ్ పటేల్ 'మదర్ ఇండియా' సినిమా పత్రిక ప్రశ్నలూ జవాబుల్లో ఒకసారి సమాధానం చెప్పాడు. ఆ రకపు దొంగతనాలు చేయడానికి పెద్ద పెద్ద వారికి ఏమి అవసరం? సైనికుల శవపేటికలను అమ్ముకోవడం, పిల్లలకు ఇచ్చే పాలపొడిని, పేదలకు ఇచ్చే మధ్యాహ్నభోజనాన్ని భోంచేయడం వంటి పెద్ద పెద్ద పనులే వారు చేస్తారు. లాలూప్రసాద్‌ను చూడండి పాపం, ఆయనేదో పశువుల దాణా వ్యవహారంలో డబ్బు చేసుకున్నాడనుకోండి, దానికీ, ఆయన కులానికీ, ఇంట్లో ఆయన పాడిపశువులను పెంచడానికీ ముడిపెట్టి ఎటువంటి కార్టూన్లూ విమర్శలూ వచ్చాయి? కనిమొళి గురించో కల్మాడీ గురించో అటువంటి చౌకబారు మాటలు రావడానికి ఆస్కారం ఉన్నదా?

అవినీతి అన్నది ఎటువంటి మినహాయింపులు లేకుండా ఖండించవలసిన, అసహ్యించుకోవలసిన దుర్మార్గమే. సందేహం లేదు. పేదవాళ్ల నుంచి, అట్టడుగు సామాజిక వర్గాల నుంచి కొన్ని మెట్లు ఎదిగివచ్చినవారు తక్కిన వారి కంటె మెరుగైన విలువలను పాటించడమూ అవసరమే. కానీ, ఒకే రకమైన నేరానికి ఒకే రకం పరిగణనా, పర్యవసానమూ లేనప్పుడు- నేరాన్ని మాత్రం ఒకేరకంగా చూడడం ఎందుకన్న ధర్మసందేహం కలుగుతుంది. నేరమేలేకుండా పోవాలని అడగవలసింది పోయి, కనీసం నేరాల్లో, శిక్షల్లో సమానత్వం చూపమని అడిగే దశకు చేరుకుంటాము. వ్యవస్థలో, విలువల్లో లేని సమానత్వం ఆచరణలో మాత్రం ఎట్లా వస్తుంది?

2 comments:

  1. మీ చివరిపేరా కొంచెం అర్ధంకాలేదు. నేరం యొక్క పర్యవసానాన్నిబట్టే పరిగణన కదండీ. నేరానికి తగిన శిక్షలుండాలే తప్ప, వ్యక్తుల నేపధ్యాలకి తగిన మినహాయింపులుండాలి అనుకోవడం సరికాదుకదా.

    ReplyDelete
  2. పేదవాళ్ల నుంచి, అట్టడుగు సామాజిక వర్గాల నుంచి కొన్ని మెట్లు ఎదిగివచ్చినవారు తక్కిన వారి కంటె మెరుగైన విలువలను పాటించడమూ అవసరమే.-ఈ లైను నచ్చలేదు.అంటరానితనం తో పాటు అట్టడుగు సామజిక వర్గాల వారికీ ఈ "మెరుగైన విలువలు "అనే అదనపు బరువులు కూడానా?may be it is an another form of untuchability.

    ReplyDelete