Tuesday, May 8, 2012

పొగడరా నీ తల్లి భూమి భారతిని!

పేదవాళ్లంటే ఎవరు అని అడిగితే పల్లెటూర్లలో ఉండేవాళ్లు అని సమాధానం చెప్పారట హైదరాబాద్ మహానగరంలో ఒక డాబుసరి కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. గ్రాడ్యుయేషన్ చదువుతున్నా ఈ పిల్లలకు పేద రికం అంటే ఏమిటో తెలియదు, ఆకలి అంటే తెలియదు, నోట్లోకి పోయే గింజలు ఎట్లా పండుతాయో తెలియదు- అని వాళ్లకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ నిరాశగా వ్యాఖ్యానించారు. వాస్తవికత ఏమిటో తెలియకుండా పిల్లల్ని పెద్దలను చేసే విద్యావిధానం గురించి మరోసారి మాట్లాడుకోవచ్చును గానీ, నిజంగానే పట్టణాల్లో పెరుగుతున్న మధ్యతరగతి, ఆ పై వర్గాల వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిగేల్‌మనే ధనకాంతుల మధ్య, కిక్కిరిసిన ఘరానా అంగళ్ల మధ్య, అందలాలెక్కామన్న అందమైన భ్రమల మధ్య పేదరికం వారి జీవితాల్లోంచి మాయమైపోయింది. నిజంగానే ఒక నడిమితరగతి నగరజీవి కళ్లకు మెరుపులను తప్ప మరిదేన్నీ చూడలేని గంతలేవో బిగుసుకున్నాయి.

పల్లె పట్నం అన్న పెద్ద తేడా లేకుండానే ఇనుపగజ్జెల తల్లి సర్వత్రా తాండవిస్తూనే ఉన్నది. డబ్బారేకు లాగా చప్పుడు చేసే ఫ్యాన్లు, మురుగుకాల్వ ముందే వండుకోవలసివచ్చే అన్నమూ, గోడకు పగిలిన అద్దమూ, పళ్లు విరిగిన దువ్వెనా- గల్లీ చిన్నదీ గరీబోళ్ల కథ పెద్దదీ అంటూ పట్టణాల మురికివాడల్లోని ఇరుకుబతుకుల గురించి గోరటి వెంకన్న గొప్ప పాట రాశాడు. స్థలాలన్నీ బడాబాబుల రెసిడెన్సీలుగా మారిపోతే, కుంచించుకుపోయిన ఒంటిగది ఇళ్లల్లో ఒదిగి ఒదిగి ఈడుస్తున్న బతుకులు మన కళ్ల పడకుండా నగరం నిండా కనిపించని ఇనుపతెరలేవో వేలాడుతూ ఉంటాయి. ఈ 'స్లమ్ డాగ్స్' పొద్దున్నే వెలికి వచ్చి, రంగుహంగుల ప్రపంచానికి సేవలందించి, తిరిగి తమ కుహరాల్లోకి ముడుచుకుంటాయి. పల్లె పేదలు నయం, అక్కడే పుట్టించిన రూపాయికి అక్కడి విలువే పొందుతారు. నగరగరీబుకు పల్లెటూరి ఆదాయం, పట్నపు ఖర్చు!

కన్నుమూసి తెరిచేలోగా రూపు మార్చుకునే పట్టణాల వీధులు చూసి, అడ్డుపరదాల వెనుక ఎదిగి ఉన్నట్టుండి అవతరించినట్టుండే ఆకాశహర్మ్యాలు, విశాలమై అద్దాల్లా మెరిసే రోడ్లు చూసి- ఇదే రకం మార్పు
పల్లెల్లోనూ జరుగుతుందనుకుంటాము. ధగధగలు నిగనిగలు లేకున్నా, కనీసం మినుకుమనే సంపద అయినా అక్కడ వర్థిల్లుతుందనుకుంటాము. సంపదను తాము సృష్టిస్తున్నామనుకుని, అభివృద్ధి అంటే తమదే అనుకునే నాగరిక నవసంపన్నుల స్మ­ృతిలో కానీ, స్ఫురణలో కానీ పల్లెలనేవి తారసపడనే పడవు. నలువరసల రోడ్ల మీద హడావిడిగా పరుగులు తీస్తున్నప్పుడు, పల్లెటూర్లన్నీ బైపాస్ అయిపోతాయి కానీ, ఓ మోస్తరు టౌన్‌లన్నీ బాటసారుల కోసం నగరపు ముస్తాబుతోనే కనిపిస్తాయి. కానీ, రహదారి దిగి సింగిల్ రోడ్డులోకి మళ్లితే, సత్యం నిద్రలేస్తుంది. మొండిగోడల ఇళ్లు, మట్టిగోడల ఇళ్లు మారాయా, పెంకుటిళ్లమీద శ్లాబ్ పడిందా, బోరింగుల ముందు ప్లాస్టిక్ బిందెల వరుస తగ్గిందా, అసలు పగటిపూట ఒక్కగంట అయినా కరెంటుందా- ఇంకాస్త లోపలికి వెళ్లండి. పాడి ఉందా పశువులున్నాయా బళ్లున్నాయా అంతెందుకు తాగేందుకు నీళ్లున్నాయా? మరికాస్త లోపలికి దళితవాడలోకి వెళ్లండి- లేకపోవడం అంటే ఎట్లా ఉంటుందో చూడండి.

అయినప్పటికీ పేదరికం ఒక బ్రహ్మపదార్థమే. కూలి మాటడగండిరా, అన్నాలు చాలవని చెప్పండిరా- అని ప్రాణాలు లేని భగవంతుణ్ణి నిలదీయమని కవి చెబుతున్నాడు కానీ, పస్తులతో గడిచే జీవితం మాత్రమే పేదదని చెప్పలేము. చిరుగుపాతలు, చింకిబట్టలు, ఈడ్చుకుపోయిన డొక్కలు, అట్టకట్టిన జుట్టులు- పేదల ముఖచిత్రం ఇట్లాగే ఉండాలని ఏమీ లేదు. పేదలన్నా పేదరికమన్నా మన మధ్యతరగతి మనసుల్లోని ఊహాచిత్రాలు కానేకావు. ఆరుగాలం కష్టపడవలసి రావడం, రెక్కాడితే కానీ డొక్కాడకపోవడమూ దరిద్రానికి గుర్తులు కావు. సోమరులుగా ఉండాలని, పరాన్నభుక్కులుగా బతకాలని, డాబుసరిగా ఆడంబరంగా బతకాలని సోకాల్డ్ పేదలు ఎప్పుడూ కోరుకుంటారనుకోను. ఊపిరిసలపని కష్టాల కొలిమిలో నిరంతరం కాగుతూ ఉండడమే పేదరికం, చేతినుంచి నోటిదాకా తిండి వెడుతుందని గ్యారంటీ లేని జీవితమే పేదరికం. అనుక్షణం కడుపుకే కాక, మనసుకు కూడా అర్థాకలితో ఉండడం, ఎప్పుడూ తీరని అప్పుల్లో అణగారిపోయి ఉండడం, జీవితం గడుస్తున్న కొద్దీ ఆశ మరింత దూరం జరుగుతూ ఉండడం పేదరికమంటే. వద్దంటే కోలాలు దొరికే చోట, గుక్కెడు మంచినీళ్లు దొరకకపోవడం దరిద్రం అంటే.

అటువంటి జీవితాలను చూడాలంటే ఉట్టి కళ్లతో చూడలేము. మనసున్న కళ్లు కావాలి. చర్మభస్త్రికలు అయిన కళ్లు మనల్ని మోసం చేస్తాయి. ఎప్పుడో ఒకసారి అతని జేబులో మెరిసే వందనోటును భూతద్దంలో చూపిస్తాయి. పేదలంటే తాగుబోతులని, ఉపాధిహామీ కోసం, ఉచితబియ్యం కోసం పాకులాడే సోమరిపోతులని చెబుతాయి. డబ్బు తీసుకుని ఓట్లువేసే లంచగొండ్లుగా భ్రమింపజేస్తాయి. పేదరికం కాక పేదలే ఈ దేశం సమస్యగా ప్రకటింపజేస్తాయి.

దేశంలో నూటికి అరవైశాతం మంది పల్లెవాసులు రోజుకు ముప్పై ఐదు రూపాయల ఆదాయంతో బతుకుతున్నారట. పట్నాల్లో పరిస్థితి కాస్త మెరుగట. ముప్పై అయిదు రూపాయల సగటు కూడా అర్థసత్యమేనట. ఆ సగటు నీడలో రోజుకు పదిహేను రూపాయల ఆదాయంతో బతుకుతున్నవారే అధికమట. నేషనల్ శాంపిల్‌సర్వేలో తేలిన విషయాలు ఇవి. ఆ మధ్య పేదరికానికి ప్రమాణం ఏమిటో ప్రణాళికా సంఘం వారు చెప్పినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. గ్రామాలలో రోజుకు 22 రూపాయలకు మించి ఖర్చు చేయలేనివారు, పట్టణాల్లో 28 రూపాయలకు మించి ఖర్చుచేయలేనివారు పేదలని ప్రణాళికా సంఘం నిర్ధారించింది. ఆ లెక్కన రోజుకు ముప్పై అయిదు రూపాయల ఆదాయంతో బతుకుతున్నవారు హాయిగా జీవిస్తున్నట్టే లెక్క. 22 రూపాయలు, 28 రూపాయలు, 35 రూపాయలు- వాటి విలువ ఏమిటో, వాటితో ఏమేమి కొనుక్కోవచ్చునో చెప్పడానికి పెద్దగా జ్ఞానం అవసరం లేదు. కానీ, ప్రణాళికా సంఘానికి మాత్రం ఆ మొత్తాలు ఘనమైనవిగా కనిపించడమే విశేషం.

పేదలెవరో, వారెక్కడుంటారో, ఎట్లా బతుకుతారో సామాన్యులకు తెలియకపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ, దేశభవితవ్యాన్ని తీర్చిదిద్దవలసిన ప్రణాళికాకర్తలకు తెలియకపోతేనే గుండెలు బాదుకోవలసి వస్తుంది. సరే, ఎవరు పేదలో, ఎవరు నిరుపేదలో చెప్పినవారికి, వారిని ఆ స్థితి నుంచి బయటకు తేవడానికి ఏమి చేయాలో తెలుసునా? ప్రణాళికాసంఘం చేయవలసిన పని అదే కదా? పీకలలోతు రుణభారంలో కుంగిపోతున్న గ్రామీణ ప్రజలను ఎట్లా విముక్తం చేయాలో, పని చేయగలిగినవారికి పని ఎట్లా కల్పించాలో, భౌతిక వనరులను, మానవ వనరులను సంపదగా అనువర్తనం చేయగలిగిన మార్గాలేమిటో సూచించడమే కదా ప్రణాళికా సంఘం పని? రోజుకు 22 రూపాయలకు మించి ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నవారి ఆరోగ్యాలు, విద్యాప్రమాణాలు ఎట్లా ఉంటాయో తెలియదా? గ్రామీణ భారతంలో ఒక కనీసస్థాయి మనుగడకు అవసరమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా ఉనికిలో ఉండవచ్చు.

కానీ ఆ బొటాబొటి వ్యవస్థలో అరకొర జీవితాలు జీవించేవారే అధికసంఖ్యాకులయితే, ఈ దేశం ఏ ఘనత సాధించిందని గర్వించాలి? అరవై ఏండ్ల స్వతంత్ర భారతం, ఇరవయ్యేళ్ల సంస్కరణల భారతం గొప్పలు చెప్పుకున్న పురోగతి ఎక్కడ ఉన్నది? ప్రభుత్వాలు ఇంతకాలం ఖర్చుచేసిన లక్షల కోట్ల సొమ్ము, నిర్మించిన వ్యవస్థలు ఏ మురుగు కాల్వలోకి జారుకున్నాయి? పై వరుసల్లో సృష్టించిన సంపద అంతా నెమ్మదిగా అట్టడుగుకు ఇంకిపోయి, జనమంతా సంపన్నులవుతారని చేసిన మన్మోహన వాగ్దానాలు ఏమయ్యాయి? ఏవీ కోట్ల కొలది ఉద్యోగాలు?

సంక్షేమపథకాల, ఉచిత ఆహారాల, 'ఆధార్'ల పరిధిలోకి వచ్చే ఈ దేశపు దరిద్రులు విదిలింపుల మీద బతికే బదనికలు కారు. నిజానికి విదిలించేవారే పరాన్నభుక్కులు. వ్యవస్థ గుండెకాయకు నెత్తుటిని పంప్ చేసేది పల్లెలే. మరణశయ్యపై ఉన్న గ్రామం నుంచి సంపదను పీల్చి పీల్చి, పట్టణాలు సమృద్ధమయ్యాయి. వారిని అక్కడ జీవన్మ­ృతులుగా మిగల్చడంలోనే వ్యవస్థ ఉనికి మిగిలిఉంది. సంపద కోసం వారి శ్రమ కావాలి. అధికారం కోసం వారి ఓట్లు కావాలి.

రోజుకు ముప్పై అయిదురూపాయలకు మించి సంపాదించుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ దుర్మార్గంలో ఎంతో కొంత భాగస్వాములే. ఇక అప్పనంగా ప్రజల శ్రమనంతా తమ సొంత బొక్కసాల్లోకి తరలించుకుంటున్న పెద్దలయితే నరహంతకులు. ఈ దేశానికే పెద్ద కన్నం వేసి సొమ్ము తరలించుకపోతున్న అంతర్జాతీయ ఘరానా కార్పొరేట్‌లయితే నెంబర్ వన్ ముద్దాయిలు. ఈ ఆర్థిక నిచ్చెనమెట్ల వరుసలో అట్టడుగున ఉన్న వారు ఎంతోకాలం సహనం వహించలేరు. ఓర్పును అసాధ్యం చేసేంతగా అంతరాలు పెరిగిపోయాయి. 'ఇంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండలు' అని అనుకోలేము. అవి లోలోపల క్రోధంతో మండుతున్న గుండెలు.

3 comments:

  1. ఆలోచనలలో వేయి శతఘ్నులను పేల్చిన పచ్చి నిజాల పోస్ట్.. పోస్ట్ ఇది. బాగా చెప్పారు శ్రీని వాస్ గారు.

    ReplyDelete
  2. చాలా బాగా వ్రాసారండి.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు..

    ReplyDelete