Friday, May 18, 2012

ప్రవాసీ' నేతకు ప్రణామం!

'శ్రీనివాస్ గారూ, వందనాలు' 
మాటలవే కానీ, ఆ ఉచ్చారణకు సరిగ్గా అక్షరరూపం ఇవ్వడం కష్టం. సుమారు రెండు సంవత్సరాల కిందట నాకు ఫోన్ చేసి టి.పి. నాయుడు అట్లా పలకరించారు. అతి కష్టం మీద తెలుగు వాక్యాలు రెండు మాట్లాడి ఆ తరువాత ఇంగ్లీషులోకి మారిపోయారు. ఆ పరిచయం తరువాత ఆరునెలలకు దర్బన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున వీల్‌చైర్‌లో వచ్చి రిసీవ్ చేసుకున్న టి.పి. నాయుడును చూశాను. పర్వాలేదు, ఆయనకు తెలుగు బాగానే వచ్చు. వంద సంవత్సరాల కిందటి తెలుగు. పట్టి పట్టి మాట్లాడే ఉచ్చారణ, విచిత్రమైన యాస. 'నాకు తెలుగు వచ్చు కానీ, మా పిలకాయలకెవరికీ రాదు' అన్నాడాయన. నల్లటికోటులో టిప్‌టాప్‌గా ఉన్న ఆ వృద్ధుడు దర్బన్‌లోని తెలుగువాళ్లకీ, భారతీయులకే కాదు, మొత్తం దక్షిణాఫ్రికాలో ప్రజాజీవితంలో ఉన్నవారందరికీ సుపరిచితుడని, 'అంకుల్ టీపీ'గా ఆత్మీయుడని దర్బన్‌లో ఉన్న మూడురోజులలో తెలిసిపోయింది.

తొలిసయ్య పెరుమాళ్ నాయుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ దక్షిణాఫ్రికాకు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆ సంస్థే నన్నూ మరికొందరు ప్రముఖులనూ ఆ దేశానికి ఆహ్వానించింది. దక్షిణాఫ్రికాలో భారతీయులు అడుగుపెట్టి నూటాయాభై ఏళ్లయిన సందర్భంగా 2010లో మొదలైన ఉత్సవాలలో భాగంగా జరిగిన కార్యక్రమానికి మేం వెళ్లాం. దక్షిణాఫ్రికా మీద భారతీయుడు అడుగుపెట్టడమంటే, కొలంబస్ అమెరికా నేల మీదనో, వాస్కోడిగామా కేర ళ తీరంలోనో కాలుపెట్టినట్టు కాదు. 1869 నవంబర్ 16వ తేదీన ఎస్.ఎస్.త్రురో అనే నౌక నుంచి 314 మంది
భారతీయులు కట్టుకూలీలుగా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారు. ఆ తరువాత యాభై ఏళ్ల కాలంలో ఆ దేశానికి కట్టుకూలీలుగా వెళ్లిన మొత్తం 152184 మంది భారతీయ కూలీలలో వారు మొదటి విడత అక్కడ దిగారు. ఈ వలసకూలీలలో మూడింట రెండువంతుల మంది తమిళులు, తెలుగువారు. బహుశా, ఆ 314 మందిలో మొదటగా ఓడ దిగింది తెలుగువాడేనేమో?

మొదటి విడత కూలీల పరంపర కాదు కానీ, ఆ తరువాత కాలంలో దక్షిణాఫ్రికా వచ్చిన తెలుగువారు టీపీ నాయుడు పూర్వీకులు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తమ పూర్వీకులు వచ్చారనుకుంటున్నానని, కొందరు బంధువులను గుర్తించామని నాయుడు చెప్పారు. భారత ప్రభుత్వం నుంచి 2010లో ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ను అందుకుని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ను కూడా సందర్శించారు.

2011లో మార్చి ఏప్రిల్ మాసాల్లో ఆయన హైదరాబాద్ రావలసి ఉండింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీ ణించి ఉండడం వల్ల చివరినిమిషంలో రద్దయింది. టీపీకి నన్ను పరిచయం చేసి, దక్షిణాఫ్రికా సందర్శనకు సహాయపడిన ఇండియా టూరిజం ఉన్నతాధికారి, కవిమిత్రుడు విల్సన్ సుధాకర్ కూడా బదిలీ అయి తిరిగి రావడంతో, అక్కడి వార్తలు తెలియరావడం లేదు. మే 10 గురువారం నాడు సుధాకర్ ఫోన్ చేసి నాయుడుగారు కన్నుమూశారని చెప్పారు. సుమారు ఎనభైఏళ్ల వృద్ధుడు రాలిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ, ఆయన గురించిన స్ఫురణ అట్లా రాలేదు. ఎంతో ఉత్సాహంగా పనులు చక్కబరుస్తూ, చరిత్రకు, భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో భారాన్ని సంతోషంగా మోస్తూ నాకు పరిచయమైన నాయుడు వ్యక్తిత్వంలో వయస్సు పెద్ద ప్రధానంగా అనిపించలేదు. కానీ, ఆయన ఐదు సంవత్సరాలుగా కేన్సర్‌తో బాధపడుతున్నారని, మేము ఆయనతో ఉన్న రోజుల్లో కూడా ఆయన ఆ వ్యాధితోనే ఉన్నారని ఇప్పుడు తెలిసింది. దక్షిణాఫ్రికాలోని తరువాతి భారతీయ తరాన్ని, ముఖ్యంగా తెలుగువారిని వారి సాంస్కృతిక మూలాలతో అనుసంధించాలన్న ప్రయత్నం - అంపశయ్యపైన కూడా కొనసాగించారని అర్థమైంది.

ఆయన మరణవార్తను ప్రకటించిన దక్షిణాఫ్రికా పత్రికలు- నాయుడును బహుముఖ ప్రతిభాశాలి అని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడని, పాత్రికేయుడు, చరిత్రకారుడు అని అభివర్ణించాయి. కానీ, నాయుడు పాత్ర అంతకు మించినది. దక్షిణాఫ్రికాలో భారతీయుల అస్తిత్వం సంక్లిష్టమైనది. మొదటి దశాబ్దాలలో కేవలం కూలీల వలసే సాగినా, తరువాతి కాలంలో సొంతంగా ఆ దేశానికి ప్రయాణించినవారూ ఉన్నారు. గాంధీ అలా వెళ్లినవారే. గుజరాతీలు పెద్ద సంఖ్యలో వెళ్లి అక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు.

నల్లజాతివారు నివసించే ప్రాంతాలలో చిన్నవ్యాపారులు వారే. తెల్లవారికి కూడా కిరాణా, చిల్లర సరుకుల సరఫరా భారతీయులే చేసేవారు. వర్ణవివక్ష ఒక అధికారిక వ్యవస్థగా రూపొందకముందు, తరువాత కూడా భారతీయుల విషయంలో తెల్లవారు మెరుగైన ధోరణి ప్రదర్శించేవారు. నల్లవారిలో అది అసూయకు, అసమ్మతికి కారణమైంది. దర్బన్ శివార్లలోని ఫీనిక్స్ భారతీయవాడలపైకి నల్లవారు చేసిన అనేక దాడులకు అదే కారణం. అయితే, వర్ణవివక్ష ఉధృతంగా ఉన్న కాలంలో భారతీయులు ప్రతిఘటన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఎఎన్‌సిలో భాగంగాను, దానికి అనుబంధంగాను ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందుకు ప్రతిగా 'విముక్తి' అనంతరం మొదటి రెండు ప్రభుత్వాల్లో భారతీయుల ప్రాతినిధ్యం అధికంగా ఉండడం నల్లజాతివారి విమర్శలకు దారితీసింది. అధికారికంగా మెజారిటీ నల్లవారిలో భారతీయులు కూడా భాగమైనప్పటికీ, వారు అందరితో కలసిపోలేదన్న భావన ప్రజల్లో ఏర్పడి ఉన్నది. ఈ మొత్తం పరిణామాల్లో భారతీయులకు మార్గదర్శనం చేసినవారిలో నాయుడు ఒకరు. వర్ణవివక్ష కాలంలో, ప్రజలను జాతుల వారీగా వేరువేరు నివాసప్రాంతాలకు పరిమితం చేసిన కాలంలో- అక్కడి భారతీయులను ఏకం చేయడానికి సాంస్కృతిక మార్గం ఎంచుకున్నవాడు.

తెల్లప్రభుత్వం విధించిన నిషేధాలను ఉల్లంఘించి, తెల్లవారి నివాసప్రాంతాల్లో భారతీయుల కళాప్రదర్శనలను ఏర్పాటు చేసేవారు నాయుడు. ఆ క్రమంలో అనేక మార్లు ఆయన జైలుపాలయ్యారుకూడా. నల్లజాతి ఉద్యమనాయకులను, రచయితలను, శ్వేతజాతి ప్రజాస్వామికవాదులను అకాడమీ అతిధులుగా రప్పించి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం, భారతదేశం నుంచి కళాకారులను ఆహ్వానించి వారి ప్రదర్శనలు నిర్వహించడం నాయుడు క్రమం తప్పకుండా చేసేవారు. దక్షిణాఫ్రికాలో వర్ణప్రమేయం లేని మొదటి క్రీడాపత్రికను నిర్వహించింది టీపీ నాయుడే.

హైందవ ధర్మం గురించి చెప్పకుండా నాయుడు ప్రసంగం ముగియదు. అయితే, ఆయన హైందవం భిన్నమైనది. అందులో కుల వివక్ష ఉండదు. నూటాయాభై ఏళ్ల నించి దక్షిణాఫ్రికాలో ఉంటున్న భారతీయులు అక్కడి పరిస్థితుల కారణంగాను, వలసవెళ్లినవారిలో స్త్రీపురుష నిష్పత్తి సమానంగా లేకపోవడం వల్లా- తమలో తాము జాతి, కుల, తెగ భేదాలను వదిలివేశారు. భారతసంతతివారిలో ముస్లిములు 12 శాతం దాకా ఉంటారు కానీ, అక్కడ వారంతా ఒకటే.
బాబ్రీమసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన చిన్న సంఘటన మినహా అక్కడ మతసామరస్యానికి ఎటువంటి విఘాతమూ లేదు. స్త్రీలవిద్యపై కానీ, వారి స్వేచ్ఛపై కానీ ఎటువంటి ఆంక్షలు భారతీయ కుటుంబాలలో ఉండవు. నాయుడు గొప్పగా చెప్పుకునే హైందవ ధర్మం- భారతదేశపు ప్రాచీన ఘనత గురించిన స్మృతి ఆధారంగా, ఆచార సాంప్రదాయాలలో, కుటుంబ వ్యవస్థలో ఉండే కొన్ని సానుకూల లక్షణాల ఆధారంగా రూపుదిద్దుకున్నది.

దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రస్తుత ఎఎన్‌సి ప్రభుత్వం మీద నాయుడుకు చాలా ఫిర్యాదులున్నాయి. మండేలా పాలించిన కాలం తప్ప తరువాత అంతా అవినీతి మయమని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటారు. ఆయన ఫిర్యాదుల్లో కొన్ని భారతీయ ప్రయోజనాలకు సంబంధించినవి ఉన్నాయి. మరికొన్ని ఎఎన్‌సిలో అందరూ గమనిస్తున్న క్షీణతకు సంబంధించినవి. రానున్న రోజుల్లో భారత సంతతివారికి అనేక సమస్యలు ఎదురుకావచ్చు. ఈ లోగా తమను తాము స్థిరపరచుకోవడానికి భారతప్రభుత్వంతోను, భారతీయులతోను గట్టి సంబంధాలు పెట్టుకోవాలన్న దృష్టి అక్కడి భారతీయులలో కనిపిస్తోంది. నలుపూ తెలుపూ కాని అస్తిత్వంలో నుంచి పుట్టిన సంక్షోభం అక్కడివారిలో పునాదుల వేటగా పరిణమిస్తోంది.

ఇంకో రెండు వారాల్లో చనిపోతాననగా, నాయుడు, తన అంత్యక్రియల సందర్భంగా చదవవలసిన అంతిమ సందేశాన్ని రాశారట. "యాభై రెండేళ్ల కాలంలో, జాతి, వర్ణ, కుల భేదం లేకుండా సాంస్కృతిక ఐక్యత సాధించడంతో సహా నా ఆశయాలను నెరవేర్చగలగడానికి కేవలం నా లక్ష్యశుద్ధే కారణమనుకుంటాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను కలసిన ఎందరో తరువాత కాలంలో నా ఆత్మీయులయ్యారు. మీ అందరి సహకారంతోనే నేను ఇండియన్ అకాడమీని ఇంతకాలం నడిపించాను. నన్ను ప్రేమించినందుకు, సహకరించినందుకు నా కుటుంబసభ్యులు, మిత్రులు, బంధువులు.. అందరికీ నా కృతజ్ఞతలు.''

మా పిలకాయలకు తెలుగు రాదండీ, బాధగా ఉంది- అని నాయుడు గారు అన్న మాటలు ఇంకా నాకు వినిపిస్తూనే ఉన్నాయి.

2 comments:

  1. చాలా గొప్ప వ్యక్తీ ని పరిచయం చేసారు. థాంక్స్ శ్రీనివాస్ గారు. వారి కర్తవ్య దీక్షకి,అంకిత భావం కి జేజేలు.

    ReplyDelete
  2. awesome sir.
    America Telugus should read this and learn from their experiences.

    ReplyDelete