Tuesday, May 22, 2012

ఖల్‌నాయకులే నేటి నాయకులు!

గుంటూరు జిల్లా మంగళగిరి నేత వస్త్రాలకు ప్రసిద్ధి. ఈ మధ్య ఆ ఊరు వెళ్లినప్పుడు పానకాల స్వామిని చూసినట్టే, బట్టల దుకాణాలను కూడా చూశాను. చొక్కా బట్టలు చూపిస్తూ, లేత గోధుమరంగులో నిలువుచారల చొక్కాగుడ్డ తాను ఒకటి చూపించాడు దుకాణదారు. సహజమైన సేల్స్‌మన్ షిప్‌తో- ఈ క్లాత్ హాట్‌కేక్‌లాగా అమ్ముడుపోతోందండీ, పొద్దున వచ్చిన తాను సాయంత్రానికి అయిపోతోంది, స్ట్రయిప్స్ కదండీ, జగన్ డిజైన్.. అన్నాడతను. కొంచెం ఆశ్చర్యమే వేసింది. 'జగన్ వేసుకున్న బట్టల్లాంటివి ఎందుకు వేసుకోవాలనిపిస్తుందో' అడుగుదామని కుర్రాళ్లెవరైనా కనిపిస్తే అడగాలనిపించింది కానీ సమయం అందుకు సహకరించలేదు. లోకజ్ఞానం పెంచినందుకు దుకాణదారుకు కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డాను. జనం ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకుంటారో, ఎవరిని మోడల్‌గా ఆమోదిస్తారో, ఎవరిని చూసి అనుకరించాలనుకుంటారో తెలుసుకోవడం కష్టమే. రాజకీయాల్లో ఎంతో ప్రధానమైనవి, కీలకమైనవి అనుకున్న ప్రాతిపదికలను జనం పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనూ వచ్చు. రాజకీయరంగంలో ఉన్న వారికి ఈ కీలకాలు తెలియనివి కాదు. కానీ, నిస్సహాయతో, ఏమరిపాటో వారిని కొన్ని వాస్తవాలకు అంధులను చేస్తాయి.

గుంటూరు నుంచి తిరిగి హైదరాబాద్‌కు ఇంటర్‌సిటీలో వస్తుంటే, మా దగ్గర సీట్లలో అంతటా ఒకే కుటుంబీకులు ఉన్నారు. అర్చకత్వం, పౌరోహిత్యం వంటి వృత్తుల్లో ఉన్న బ్రాహ్మణులు. కాశీకి వెడుతున్నారట. వాళ్ల జనాభాకు తగ్గట్టుగా పెద్ద తెలుగు పత్రికల కట్ట వాళ్ల దగ్గర ఉన్నది. వాళ్లలో ఒకావిడ 'సాక్షి లేదేమండీ' అని అడిగింది. 'సాక్షా, దాన్నిక కొనేది లేదు' అన్నాడు ఓ గృహస్థు. అన్నా హజారే అనుయాయుడేమో, అవినీతిని అంతం చేయడానికి కంకణాలు కట్టుకున్నాడేమో అనుకున్నాను. నా సందేహాన్ని తీరుస్తూ, ఆ పెద్దమనిషే వివరణ ఇచ్చాడు. ' మిగతావన్నీ సరే, ఒప్పుకున్నాం. కానీ అదేమిటి, కొండమీదకి వెళ్లడమేమిటి, క్యూలో ఆ హడావిడి
ఏమిటి, డిక్లరేషన్ ఇవ్వకపోవడమేమిటి' అని ఆవేశంగా వాళ్లవాళ్లతో మాట్లాడుతున్నాడతను. అవురా, తిరుమల కొండ మీద జరిగిన దానికి ఇక్కడ ఇంత రియాక్షనా అనిపించింది. జగన్ మీద కేసులూ ఆరోపణలూ అవన్నీ మీకు అభ్యంతరం అనిపించలేదా, ఇప్పుడు మాత్రమే అనిపించిందా- అని అడిగాను. అవన్నీ మామూలేనండీ, పాలిటిక్స్ అన్నాక ఏవో జరుగుతూ ఉంటాయి, మడిగట్టుకు కూర్చుంటే వాళ్లకు ఎట్లా గడుస్తుంది?- అని నిస్సంకోచంగా చెప్పేశాడా నిష్ఠా గరిష్ఠుడు.

జగన్ మీద ఉన్న నేరారోపణలు, కేసులు చిన్నవి కావు. అతన్ని బోనులో నిలబెట్టడం వెనుక ప్రభుత్వానికి రాజకీయ ఉద్దేశాలు లేవా అని గట్టిగా ప్రశ్నిస్తే కాదనేది ఏమీ ఉండదు. కానీ, ఆరోపణల వెనుక, కేసుల వెనుక వాస్తవాలు లేవా అని అడిగితే అవుననకా తప్పదు. ధిక్కరించినవారివో, ప్రత్యర్థులవో మాత్రమే తప్పులెంచడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యమస్థాయిలో జరుగుతున్న దర్యాప్తులు, విచారణల వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉండడం రహస్యమేమీ కాదు. అయినంత మాత్రాన, జగన్ రాజకీయబాధితుడు మాత్రమే అనుకుంటే పొరపాటు. తన తండ్రి హయాంలో అతను లబ్ధిపొందిన తీరు కేవలం ఒక వ్యక్తి కాసిన్ని డబ్బులు చేసుకోవడానికి సంబంధించిన విషయం కాదు. జగన్ కేసులన్నిటి సారాంశం- అధికార దుర్వినియోగం, పరిపాలనను హైజాక్ చేయడం, ప్రజాధనాన్ని అపహరించడం. కేవలం డబ్బు ఖాతాలు మారడం మాత్రమే జరగలేదు. భూములు చేతులు మారాయి. భూముల్లో ఉన్న ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. దీర్ఘకాలం పోలేపల్లి సెజ్ బాధితులు చేసిన పోరాటం, వాన్‌పిక్ భూసేకరణ బాధితుల ఆక్రోశం కానీ- ఆ డబ్బు వెనుక వినిపిస్తాయి. సొంత లాభాన్ని చూసుకునే అభివృద్ధి ప్రక్రియ అంతటికీ అవరోధంగా ఉన్నారనే పేరిట జరిగిన అణచివేత, నిర్బంధాలు, కాల్పులు, ఎన్‌కౌంటర్లు- 'క్విడ్ ప్రో కో' సొరుగుల్లో దాగిన అస్థికలు. కేవలం ఆర్థిక నేరాలు కాదు అవి, అత్యంత హింసాత్మకంగా సాగిన లావాదేవీలు. ఆ ప్రక్రియ ఆగిందని కాదు, అటువంటివి రేపు జరగకుండా ఆపబోతున్నారనీ కాదు, కానీ, జరిగిన ఒక దుర్మార్గానికి ప్రతీకగా ఒక నిందితుడు బోనెక్కితే, దాని మీద జరిగే విచారణలో ప్రజాప్రయోజనం ముడిపడి ఉన్నది. అది ఒక విధానం మీద జరుగుతున్న విచారణ కూడా. ఆ వ్యక్తి దోషిగా నిర్ధారణ అయితే, అది అతని ఓటమి మాత్రమే కాదు, ఆ విధానపు ఓటమి. జనం నమ్మిన విలువల గెలుపు.

అయినా సరే, జనం ఎందుకు పట్టించుకోవడం లేదు? పెద్దల కుతంత్రాలకు బలి అవుతున్న బాల అభిమన్యుడిగా అతన్ని ఎందుకు చూస్తున్నారు, మా బాబును అందరూ ఇబ్బంది పెడుతున్నారని ఎందుకు వాపోతున్నారు, అతని నిలువుచారల చొక్కాల మీద ఎందుకు మోజుపడుతున్నారు? దానికి జనం అజ్ఞానాన్నో, అమాయకత్వాన్నో కారణమనుకోవడం పొరపాటు.

అతన్నే దిక్కుగా చూసేంత దిక్కులేని తనాన్ని జనం మీద విధిస్తున్నామా? అభివృద్ధి కావాలనో, మా భాగం మాకు కావాలనో అడగడం మరచిపోయి, నాలుగు మెతుకులు విదిలిస్తే చాలన్న స్థితికి వారిని నెట్టేశామా? అంధకారం అలముకున్న ఆకాశంలో వేగుచుక్క అనుకుని తోకచుక్కను ఆశ్రయించేట్టు చేస్తున్నామా? తెలియదు. జనం తెలివైన వాళ్లు కూడా. వారి మనసులో పెద్ద ఊహలే ఉండవచ్చు. జనం మేదకులు కూడా. పదే పదే మోసపోయినా బుద్ధిరాదు.

గతంలో కూడా రాజకీయనాయకులు అవినీతిపరులే. డబ్బున్నవారితో, పారిశ్రామికులతో, వ్యాపారులతో చెట్టపట్టాలు వేసుకుని తోడుదొంగతనం చేసినవారే. దొరికిన వాడే దొంగ అనేసూత్రం ఆధారంగా, వారెప్పుడూ దొరక్కుండా తప్పించుకునేవారు. చట్టంతో వారికి చుట్టరికం. అధికారయంత్రాంగం అంతా అస్మదీయులు. అటువంటి నేతలను చట్టం ద్వారా శిక్షించలేము కానీ, రాజకీయంగా శిక్షించాలన్న దృష్టి ప్రజలకు ఉండేది. 1977లో ఇందిరాగాంధీని అట్లానే శిక్షించారు. 1983లో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను అట్లాగే శిక్షించారు. 1994లో మళ్లీ కాంగ్రెస్‌ను, 2004లో తెలుగుదేశంకు కూడా రాష్ట్రప్రజలు అదే పద్ధతిలో బుద్ధి చెప్పారు. పదవీభ్రష్ఠత్వం విధించాక, అదే పెద్ద శిక్ష అన్న సంతృప్తి ప్రజల్లో ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారినట్టుంది.

చట్టరీత్యా అవినీతికి, అక్రమాలకు పాల్పడినవారిని ప్రజలు రాజకీయంగా శిక్షిస్తారనే నమ్మకం లేదు. అందరూ ఒకే తానులోని గుడ్డలే అయినప్పుడు, తారతమ్యాలు చూసుకోవలసిందే తప్ప ఎవరో ఒకరిని శిక్షించలేమన్న నిర్ధారణకు వచ్చినట్టున్నారు. వంతులవారీగా విజయాన్ని, అపజయాన్ని అందిస్తే పాలనలో ఎంతో కొంత తేడా ఉంటుందన్న అవగాహనా వారికి కలిగినట్టుంది. రాజకీయంగా శిక్షించే అవకాశాలు తగ్గిపోయాయి కానీ, అధికారికంగా చట్టం ద్వారా శిక్షించే ధోరణి పెరిగిపోయింది. ప్రధానిగా ఉండగానే పి.వి.నరసింహారావు కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. ఆ తరువాత రకరకాల వ్యాజ్యాలు, అభియోగాలు రాజకీయవాదులను ముసురుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్రప్రభుత్వాన్ని 2జి స్కామ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కేంద్రమంత్రి పదవిలో ఉన్నవారు పదిహేను నెలల పాటు జైలు ఉన్న సందర్భాన్ని గతంలో ఊహించగలమా? కరుణానిధి కూతురు ఆరునెలలు కారాగారంలో ఉన్నది. అప్పీలు కుదరకపోతే బంగారు లక్ష్మణ్ నాలుగేళ్లు ఖైదీగా బతకవలసిందే. చట్టం తన పనిని తాను చురుగ్గా చేసుకుపోతున్నది. విషాదం ఏమిటంటే, చట్టం దృష్టిలో ముద్దాయిలుగా ఉన్నవారిని జనం మాత్రం వెలివేయడం లేదు. కోర్టుల్లో ఓడిపోయినా, పోలింగ్‌బూతుల్లో మాత్రం గెలిచే నేతల తరం వస్తున్నది.

గతంలోని విలన్లు అయినా, నేటి ప్రతినాయకులయినా వ్యవస్థ కుక్కమూతిపిందెలే. పునాదులలో ప్రక్షాళన జరగకపోతే, వేళ్ల దగ్గరే గొడ్డలి పడకపోతే పెరిగిన విషపు మొక్కలే. తలెత్తిన కొమ్మను నరకడం వల్ల ఫలితం ఉండదు. స్వార్థాన్ని ఒక విలువగా, అపహరణను నైపుణ్యంగా మార్చిన విధానవాతావరణం మారకపోతే, ఈ దేశపు జైళ్లు చాలవు.

3 comments:

 1. చాలా బాగా వ్రాసారండి.very gud article

  ReplyDelete
  Replies
  1. ఇంత మంచి బ్లాగ్ ను ఎలా మిస్ అయ్యాను, Good narration

   Delete
 2. super andi. chala bagundhi. yeppatiki ee banisa manasthatwam nunchi bayata padathamo.

  ReplyDelete