Wednesday, May 30, 2012

తల్లులేమి చేయగలరు పాపం!

రాష్ట్రంలో ఇప్పుడు రణరంగ సదృశంగా, ఉత్కంఠభరితంగా ఉన్న రాజకీయాల్లో ఒక పిడకల వేట ప్రవేశించింది. ఉరుమురిమి మంగలం మీద పడినట్టు ఆడవాళ్లకు కొత్త కష్టం ఒకటి ముంచుకొచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భ్రష్ఠత్వానికి ఆయన తల్లి విజయమ్మ పెంపకమే కారణమన్నట్టుగా విమర్శించే ధోరణి పెరిగిపోయింది. నీ కొడుకును నువు సరిగ్గా పెంచి ఉంటే అతను ఇంతటి దుర్మార్గుడు అయ్యేవాడు కాదని ఒకరు విమర్శిస్తే, నీ కొడుకును నువ్వు దారిలో పెట్టుకోవాలమ్మా అని మరొకరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరో ప్రముఖ నేత అయితే, జగన్ వంటి కొడుకు ఏ తల్లిదండ్రులకూ పుట్టకూడదు- అని తీర్మానించేశారు. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ, ఆర్థిక అంశాల గురించి, అతనిపై ఉన్న నేరాభియోగాల గురించి చర్చ కాదిది. సమాజంలో అవాంఛనీయమైన పోకడల వ్యక్తిత్వాలు రూపొందడానికి, లేదా రూపొందకుండా ఉండడానికి తల్లులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమనేది ప్రశ్న.

పిల్లల్ని కన్నాం గానీ వాళ్ల రాతల్ని కన్నామా? అని అడుగుతుంటారు తల్లిదండ్రులు గతి తప్పిన సంతానం పోకడలను తలచుకుని. అడ్డాలనాడు పిల్లలు కానీ గడ్డాల నాడు పిల్లలా అనీ చేయిదాటిపోయిన కొడుకుల మీద విరక్తితోనూ అనుకుంటుంటారు. తల్లుల కడుపు జెడపుట్టారని నిందించడం వింటాము కానీ, చెడుకడుపున పుట్టావని ఎవరినీ దూషించము. కొడుకులను వీరులుగా తీర్చిదిద్దిన తల్లుల గురించి ప్రశంసగా చెప్పుకోవడం ఉన్నది కానీ, వీరపుత్రుల బాధ్యత అంతా తల్లులదే అని భావించలేము. మగపిల్లల్ని తండ్రులు,
గురువులు, సమాజమూ, వారి అభిరుచులూ తీర్చిదిద్దుతాయి. ఆడపిల్లల విషయంలో మాత్రం 'కూ తురు చెడుగై యుండిన మాతది తప్పన్నమాట' లోకంలో ఉన్నది. మీ అమ్మ నిన్నిట్లాగే పెంచిందా- అని ఆడపిల్లను అన్నట్టు మగపిల్లాణ్ణి అనడం ఎక్కడా వినం.

పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు తమ కోవలో వెళ్లాలని, సమాజం అంగీకరించే దారిలో నడవాలని తండ్రులు అనుకున్నట్టుగా తల్లులు అనుకోరు, అనుకునే అవకాశమూ లేదు. వారి మీద విధించిన విలువల చట్రంలో మాతృత్వం అన్నది బేషరతు సంబంధం. పిల్లలు ప్రహ్లాదులైనా, నిగమశర్మలయినా, గుణనిధులయినా తల్లులకు ఒకటే. తండ్రి చెప్పినట్టు వినవచ్చు కదా- అని లీలావతి కుమారుడిని బుజ్జగించాలని చూస్తుంది తప్ప, విష్ణుమూర్తి మార్గం మంచిదో హిరణ్యకశ్యపుడి మార్గం మంచిదో ఆమెకు తెలియదు.

తండ్రుల దాష్టీకం నుంచి, కర్కశమయిన పెంపకం నుంచి పిల్లల్ని రక్షించుకోవాలని మాత్రమే తల్లులు చూస్తారు. వాళ్లు సంఘం దృష్టిలో చెడిపోతున్నారో ప్రయోజకులవుతున్నారో గమనించడం కంటె, ప్రేమా ఆప్యాయతలను అందించడమే వారికి ముఖ్యం. పిల్లల విషయంలోనే కాదు, భర్తల విషయంలో కూడా స్త్రీలకు రాజకీయ, సామాజిక అభిప్రాయాలేమీ ఉండవు. భర్త ఎటువంటివాడయినా అతన్ని అనుసరించడమే భార్య ధర్మమని సంప్రదాయం చెబుతుంది. భర్త తన మతం కాకపోతే వదిలేయమని వీరశైవం వంటి తీవ్రమతశాఖలు చెప్పాయేమో కానీ, నిష్ఠాగరిష్ఠుడైనా నాస్తికుడైనా భార్యకు భర్తే ప్రత్యక్షదైవం. కాశ్మీర్ మిలిటెంట్ల చేతిలో బందీగా ఉన్న భర్తను ఒక ఆధునిక యువతి ఎట్లా రక్షించుకుంటుందో మణిరత్నం 'రోజా' సినిమాలో చూపిస్తాడు. బందీగా ఉన్న పురుషుడికి తప్ప ఆ స్త్రీకి దేశభక్తి పెద్దగా ముఖ్యం కాదు. తన భర్తే మిలిటెంట్ అయినా ఆమె అతన్ని రక్షించుకోవడానికే చూస్తుంది.

పిల్లల్ని ముస్తాబు చేసి బడికి పంపించడం, ఇంటికి వచ్చాక దగ్గర కూర్చుని హోంవర్క్ చేయించడం తప్ప ఆధునిక మాతృమూర్తికి, చదువుల్లో ఏమి చెబుతారో ఉత్తమ వ్యక్తిత్వానికి ఏది ప్రాతిపదికో అవసరం లేదు. చదువుల్లోను, ఉద్యోగాల్లోను పిల్లల విజయాలు తల్లులకు ఆనందాన్నిస్తాయి, కానీ పిల్లల ఆ సామాజిక జీవితంతో వారికి ఎటువంటి పరిచయమూ ఉండదు. ప్రాథమిక విద్య స్థాయి నుంచే పిల్లల బోధకుల హోదాను ఉపాధ్యాయులే సంపాదించుకుంటారు. తల్లులు కేవలం పరిచారికలుగా మాత్రమే మిగులుతారు.   అటువంటప్పుడు, పిల్లల వ్యక్తిత్వాల మంచిచెడ్డలకు తల్లుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది? చేయవలసివచ్చే నానా రకాల చాకిరీకి తోడు, పిల్లలను సత్ప్రవర్తకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తల్లుల నెత్తిన ఎందుకు? పైగా, పిల్లల మనస్సుల్లోకి పరమ చెత్తను, విషభావాలను, ప్రలోభాలను, వ్యసనాలను నిరంతరం సమాజం పంప్ చేస్తుండగా, వాటిని మాతృమూర్తులు అరచేత్తో అడ్డుకోగలరా? తల్లిదండ్రులు సరే, పాఠశాల మాత్రం పిల్లలకు నీతులు చెప్పే స్థాయిని మిగుల్చుకుందా? అతి పురాతన కాలం నుంచి విద్యాబోధన కానీ కొన్ని రకాల ఆధ్యాత్మికబోధనలు కానీ, మనిషికి మంచిమాటలే చెప్పాయి.

మితజీవనాన్ని, లోభరాహిత్యాన్ని బౌద్ధం ఏనాడో ప్రతిపాదించింది. రెండువేల ఏండ్ల కిందటి పంచతంత్రం- అతి సంచయేచ్ఛ కూడదని చెప్పింది. 'తటాకోదర జలమునకు పరివాహము వలె సమార్జిత విత్తములకు త్యాగమే రక్షణము' అని చెప్పింది. మనకు ఏ అపకారం జరిగితే బాధపడతామో ఇతరులకు దాన్ని చేయకూడదని భారతం చెప్పింది. త్యాగాన్ని, దానాన్ని, వినయాన్ని, అధ్యయనాన్ని గొప్ప విలువలుగా బోధించని గురువులే లేరు. అయినప్పటికీ, చరిత్ర నిండా స్వార్థపరులు, ఆక్రమణదారులు, అహంకారులు, మూర్ఖులు పెద్ద పెద్ద స్థానాల్లో కనిపిస్తారు. కుటుంబమూ విద్యాలయమూ- వీటిని మించిన శిక్షణాలయం సమాజం. స్వార్థమూ దుర్మార్గమే రాచవిలువలుగా చెలామణీ అయ్యేచోట మంచిమాటలు ఉపదేశాలలోనే మిగిలిపోతాయి.

జగన్మోహన్‌రెడ్డికి అతని తండ్రి కూడా ఎన్నో మంచిమాటలే చెప్పి ఉంటారు. విజయమ్మ కూడా మంచిచెడ్డలు ఎన్నో బోధించే ఉంటారు. కానీ జగన్‌ను నడిపించిన విలువలు వేరు. ఆ విలువలను పోషించి పెంపొందించినవారిలో రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. జగన్ పోరాడుతున్న సోనియాగాంధీ కూడా ఉన్నారు. సమాజ వృక్షానికి కాసిన కాయలే అన్నీ. వేల కోట్ల అనాయాస ఆదాయమూ, అందుకోవడానికి అవకాశమున్న అధికారపీఠమూ- కనిపిస్తున్నప్పుడు మనిషిని నడిపించేవి నీతులు కావు. తండ్రిని కోల్పోయి, అతని రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న జగన్ వ్యక్తిత్వంలోని మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా అతన్ని ప్రేమించి, ఆశీర్వదించవలసిన పాత్రలో విజయలక్ష్మి ఉన్నారు. కొడుకు చేస్తున్నది ధర్మయుద్ధమో కాదో ఆమెకు అక్కరలేదు, కొడుకుకు వీరతిలకం దిద్ది పంపడమే ఆమెకు సంప్రదాయం ఇచ్చిన బాధ్యత. ఆమె మాత్రమే కాదు, నేటి సమాజంలోని తల్లులందరూ చేస్తున్న పని అదే. బహుశా మనుషులను బాధ్యత కలిగిన పౌరులుగా, మంచి మనుషులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకునేవారు సమాజంలో ఇప్పుడెవరూ లేరు. సాహి త్యం ఆ పనిచేయవచ్చు, కానీ ఇప్పుడు దాన్ని చదివేదెవరు? మతం ఆ పనిచేయా లి. నిజమైన భక్తులెవరు, అనుయాయులెవరు? పాఠశాల ఆ పనిచేయాలి. ర్యాం కుల వేటలో కాసులచప్పుడు చేస్తున్న క్లాసురూముల్లో వ్యక్తిత్వాలకు స్థానమెక్కడ?

తల్లులకు కుటుంబంలోను, విద్యావిధానంలోను, సమాజాన్ని నియంత్రిస్తున్న, నడిపిస్తున్న సమస్త రంగాలలోను సాధికారమైన స్థానం ఇవ్వగలిగినప్పుడు- బహుశా వారినప్పుడు, వారి భర్తలను కూడా కలుపుకుని మనం అడగవచ్చు. ఇట్లా ఎట్లా పెంచారండీ పిల్లల్ని?

6 comments:

 1. @@@తల్లులకు కుటుంబంలోను, విద్యావిధానంలోను, సమాజాన్ని నియంత్రిస్తున్న, నడిపిస్తున్న సమస్త రంగాలలోను సాధికారమైన స్థానం ఇవ్వగలిగినప్పుడు-@@


  --జగన్ పేరు ను ఉదాహరణ గా తీసికొని చెప్పారు కాని, అలా కాకుండా మన చుట్టూ ఉన్న చాల మంది సమస్యలకి కారణం, ఎంత మంచి తల్లిదండ్రులు అయినా తల్లికి కుటుంబం లో ఉన్న అతి తక్కువ సాధికారత వల్ల (వంటింటి లోను, చీరలు, నగలు కొనడం లో ఉన్న సాధికారత కాదు ) పిల్లలు స్వార్ధ పరులు గాను, మొండివారు గాను, సోమరిపోతులుగాను ఇంకా భార్యల్ని హింసించే భర్తలు గా కుడా ఎదుగుతున్నారు. వీరు గురించి కుడా వ్రాయాల్సింది.

  ReplyDelete
 2. 'కె. శ్రీనివాస్' మీపేరు ఎక్కడో విన్నట్లు ఉంది అండీ, జాజిమల్లి గారి పుస్తకం పై సమీక్ష వ్రాసింది మీరేనా? మీరే అయ్యుంటారు లేకుంటే, ఇంత మంచి వ్యాసం ఇంకెవరు వ్రాయగలరు !

  ReplyDelete
  Replies
  1. మౌళీ,
   మీరు శ్రీనివాస్ గారిని ఇలా గుర్తించడం నా మట్టుకు నాకు చాలా గర్వంగానే ఉంది... కానీ...మీకు బాగా నచ్చిన ఈ బ్లాగర్ ఆంధ్ర జ్యోతి పత్రికకి ఎడిటర్.సమకాలీన తెలుగు సమాజపు మేధావి.సాహితీ విమర్శకులు.మంచి వచనం రాయగలిగిన కొద్దిమందిలో మొదటివారు.మీ ప్రశ్నలు చాలా వాటికి ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి.(శ్రీనివాస్ సర్ ఈ కామెంట్ బ్లాక్ చేస్తే నా హక్కుని హరించినట్లే)
   malleeswari.

   Delete
 3. మౌళి గారు,,
  మీ పేరు నాకు పరిచయమే. . కొన్ని బ్లాగ్స్లో చూస్తుంటాను. ఒకే సారి అనేక వ్యాఖ్యలతొ, ప్రశంసలతొ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసారు. . క్రుతజ్ఞతలు.
  నెను పాత్రికేయుడిని. ఆంధ్ర జ్యోతి పత్రికలొ పనిచేస్తాను. మల్లీశ్వరి గారి పుస్తకానికి ముందుమాట రాసింది నేనే.

  ReplyDelete
 4. శ్రీనివాస్ గాను నిజం చెప్పారండి. తల్లి మాటలు పిల్లలు ఎంతవరకు వింటున్నారు..ఆవిడ ముందుకొచ్చి మాట్లాడుతుందని కొడుకు చేసిన తప్పులకు ఆమెదే బాధ్యత అనడం ఈ పెద్దలకు తగునా. అసలు ఎంతమంది రాజకీయ నాయకుల తల్లులు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారు..

  ధాంక్ యూ..

  ReplyDelete
 5. చాలా బాగా చెప్పారండి శ్రీనివాస్ గారు. కొద్ది రోజులుగా నాలో కూడా ఇవే ఆలోచనలు. ఏదో చిన్నిపిల్లాడిని మందలించలేదన్నట్టు తల్లిని అంటున్నారే ఈ పెద్దమనుషులు అని..

  ధాంక్ యూ

  ReplyDelete