Thursday, June 28, 2012

రెండేళ్ల ముందే చతికిలపడిన ఎన్డీయే

ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలు పూర్తికాలం అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ఒకటి రెండు సంవత్సరాలు గడవగానే ఎప్పుడు ప్రభుత్వాన్ని పడగొడదామా మధ్యంతర ఎన్నికలు తీసుకువద్దామా అని తాపత్రయపడతాయి. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఇది సాధారణంగా జరిగే ఆనవాయితీ. కానీ, అధికార పక్షమూ ప్రతిపక్షమూ ఇద్దరూ ప్రజల ముందుకు వెళ్లడానికి సంసిద్ధత లేక, మధ్యంతర ఎన్నికలను తప్పించే ప్రయత్నం చేయడం అరుదైన విషయం. పరిపాలనలో, ప్రభుత్వ విమర్శలో అధికార ప్రతిపక్షాలు రెండూ విఫలం అయిన సందర్భాలలోనే ఇటువంటి పరిస్థితి తారసపడుతుంది.

సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఇది సహజమే అనిపించవచ్చు. కానీ, మిశ్రమప్రభుత్వాల అనుభవాన్ని దీర్ఘకాలంగా రుచిచూస్తున్న కొన్ని చిన్న యూరోపియన్ దేశాల్లో తరచు ప్రభుత్వాలు పడిపోవడం, ఎన్నికలు రావడం చూస్తుంటాము. 1996 తరువాత మన దేశంలోనూ వరుస ఎన్నికలు వచ్చాయి. 1999 నుంచి ఎన్‌డిఎ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తరువాత 2004లో యుపిఎ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇకనుంచి వంతుల వారీగా రెండు కూటములు అధికారాన్ని పంచుకుంటాయనుకుంటే, 2009లో తిరిగి యుపిఎనే జనామోదాన్ని పొందింది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. ఏడేళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగిన తరువాత కూడా జాతీయ, ప్రాంతీయ ప్రతిపక్షాలు ఇంకా కోలుకోకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ వేయకముందే రాష్ట్రపతిగా ఆయన విజయం ఖరారైపోయింది. అయినా సరే, పి. ఎ. సంగ్మా పోటీ చేస్తున్నారు, ఆయనకు బిజెపితో సహా ఎన్‌డిఎలోపల, బయట ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపాయి. యాభైమూడు శాతం పైగా ఓట్లతో ప్రణబ్ ముందంజలో ఉండగా, సంగ్మా సంపాదించగలిగే ఓట్లు ముప్పైశాతం దాటడం లేదు. ఈ సన్నివేశం 2012లో రాష్ట్రపతి ఎన్నిక ఫలితాన్నే కాదు, 2014

Friday, June 22, 2012

పాఠాలు నేర్చుకోకపోతే, పీఠాలు మిగలవు!

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరచడం ఇదే మొదటిసారి కాదు. ఆశ్చర్యపోయేవారు, ఫలితాలను నిర్దేశించినవారు వేరువేరు కావడం వల్ల ఈ ఆశ్చర్యాలు కలుగుతాయి కాబోలు. నాకు గుర్తుండి 1980లో పెద్ద ఆశ్చర్యం ఎదురయింది. అప్పటికి మూడేళ్ల కిందట జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, దానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగానే కనిపించాయి. కానీ, స్వతంత్ర భారతంలో అనుశాసన పర్వం పేరుతో అంధకారాన్ని నింపిన అత్యవసర పరిస్థితి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉండగా, మూడేళ్లలోనే తిరిగి ఇందిరాగాంధీకి దేశం పట్టం కట్టినప్పుడు- ఏమిటీ ప్రజలు అని ఏవగింపూ ఆశ్చర్యమూ కలిగాయి. ఈ ప్రజలకు ప్రాథమిక హక్కులు అక్కరలేదా, ప్రజాస్వామ్యం అక్కరలేదా, నియంతృత్వమే కావాలా- అని నిర్వేదం కలిగింది. 1983లో రాష్ట్రంలో అవతరించిన ఒక కొత్త రాజకీయశక్తి తెలుగుదేశం పార్టీ ప్రభంజనసదృశంగా అధికారంలోకి వచ్చినప్పుడూ ఆశ్చర్యం కలిగింది కానీ, ఆ పరిణామంలోని అద్భుతత్వం వల్ల కలిగిన ఆశ్చర్యం అది. జనం నిశ్శబ్దంగా అట్లా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి మంగళం పలకగలగడం అబ్బురంగానూ మురిపెంగానూ అనిపించింది. జనం ఏమి ఆలోచిస్తున్నారో తెలియకపోవడం అనే సాధారణ లక్షణం మాత్రం ఆ పరిణామంలోనూ ఉన్నది.

గుజరాత్ మారణకాండ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడి ఓటర్లు నరేంద్రమోడికి పట్టం కట్టినప్పుడు లౌకికవాదులకు షాక్ తగిలింది. ఎట్లా ఎట్లా అది సాధ్యపడింది, అంత ఘాతుకాలు జరిగిన తరువాత, అందుకు బాధ్యుడన్న ఆరోపణలు ఉన్న నాయకుడికి అంతటి ఘనమైన జనామోదం ఎట్లా లభించింది? అన్నది మనసులను తొలచివేసింది. అటువంటి సందర్భాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడెట్లా ప్రవర్తిస్తారో తెలియని మార్మికమైన చిత్తప్రవృత్తిని ప్రజలకు అంటగట్టాలా? జనం కూడా మతతత్వవాదులయ్యారని నిర్ధారించుకోవాలా? అసలు జనం తీర్పునకు ఏటువంటి అర్థమూ లేదని కొట్టిపారేయాలా? లేదా.. ప్రయత్నించి, అందులోనుంచి ఒక హేతుబద్ధమైన వివరణను పొందడానికి ప్రయత్నించగూడదా?

న్యాయం ధర్మం గెలిచి, అన్యాయం అధర్మం ఓడిపోయే తీరులో ఉన్న వ్యవస్థేమీ కాదు మన ప్రజాస్వామ్యం. మంచికీ చెడుకూ మధ్య కాకుండా, రెండు రకాల చెడుల మధ్యనే పోటీ ఉండేలా, ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకునేలా మన ఎన్నికల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజల మధ్య పనిచేస్తూ, ఒక సహజసిద్ధమైన క్రమంలో నాయకత్వం

Tuesday, June 12, 2012

జనంలో ఉన్న జ్ఞానమే జనవిజ్ఞానం

స్పానిష్ జెసూట్ మిషనరీలు దక్షిణ అమెరికాలో అడుగుపెట్టిన తరువాత, పెరూలోని స్థానిక ఇండియన్ తెగలు జ్వర నిదానానికి వాడే ఒక చెట్టు బెరడు గురించి తెలుసుకున్నారు. ఆ బెరడును పొడి చేసి పెరూ వైస్‌రాయ్ భార్యకు వచ్చిన జ్వరాన్ని వారు నయం చేశారు. ఔషధ గుణాలున్న ఆ చెట్టుకు 'పెరూవియన్ బార్క్', 'జిసూట్ బార్క్' అని పేరు పెట్టారు. ఆ బెరడే, తరువాతి కాలంలో మలేరియా నిదానానికి వాడే క్లోరోక్విన్ అవతరణకు కారణమయింది. చరిత్ర తెలియని కాలం నుంచి దక్షిణ అమెరికన్ ఇండియన్లకు తెలిసిన ఒక జ్ఞానం- ఆధునిక వైద్య విజ్ఞానంలో స్పానిష్ వలసవాద మతాధికారుల ఆవిష్కరణగా ప్రచారం అయింది.

అన్నీ వేదాల్లోనే ఉన్నాయనే వాదం ఛాందసమో అతితెలివి అజ్ఞానమో అయితే అయి ఉండవచ్చును కానీ, అటువంటి వాదనలో అంతర్లీనంగా ఉన్న ఒక సత్యాన్ని గుర్తించాలి. ఆధునిక ఆవిష్కరణలన్నీ

Tuesday, June 5, 2012

అస్తవ్యస్త వ్యవస్థకు ఇక ఆఖరి రోజులా!

నలభైరెండేళ్ల నాడు నాటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు తనకు రాసిన ఒక లేఖను పాఠకుడొకరు అపురూపంగా దాచుకుని ఈ మధ్య దాని ప్రతిని మాకు పంపారు. అప్పట్లో రాజకీయవాదుల వ్యవహార సరళి మీద తన బాధను, విరక్తిని బి. బాలగోపాలం అనే ఆంధ్రజ్యోతి పాఠకుడు సంపాదకుడితో పంచుకున్నారు. దానికి 1970 ఆగస్టు 13 నాడు నార్ల ఇంగ్లీషులో ఇచ్చిన జవాబుకు ఇది తెలుగు:

ప్రియమైన బాలగోపాలం గారు,

మీరు 'ఆంధ్రజ్యోతి'కి శ్రద్ధాసక్తులున్న పాఠకులని తెలిసి సంతోషం కలిగింది. రాజకీయనాయకులు, వాళ్లే పార్టీకి, గ్రూప్‌కు చెందినవారైనా కానీ, అవకాశవాదులే. పదవులు, అధికారం అనే స్వార్థ ప్రయోజనాల ప్రాతిపదికగానే వాళ్ల ప్రవర్తన ఉంటుంది. ఇది సర్వకాలాలకు, సర్వదేశాలకూ వర్తించే మాటయినప్పటికీ, వర్తమాన భారతదేశం విషయంలో మరింత సత్యం. ఈ సత్యాన్ని మీరు గుర్తెరిగితే, ఈ రాజకీయవాది ఏం చేస్తున్నాడు, ఆ రాజకీయవాది ఏం చేస్తున్నాడు వంటి విషయాలపై ఇంతగా బాధపడరు.

మీ వి.ఆర్. నార్ల

నార్ల వంటి విద్వాంసుడూ రచయితా సంపాదకుడూ రాజకీయవ్యవస్థ గురించి అంతటి నిస్పృహను, నిరసనను కలిగి ఉండడం కొందరికి సహజమే అనిపించినా చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అది ఇంకా ఇంతగా చెడిపోయిన కాలం కాదు కదా, ఇంకా తులసిమొక్కలు మిగిలిఉన్న కాలమే కదా, అంతటి వైరాగ్యం ఆయనకు అవసరమా అనీ ప్రశ్న రావచ్చు. అందరినీ ఒకే గాటన కట్టడమేమిటి, మంచి రాజకీయాలనేవే లేవా అని