Tuesday, June 5, 2012

అస్తవ్యస్త వ్యవస్థకు ఇక ఆఖరి రోజులా!

నలభైరెండేళ్ల నాడు నాటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు తనకు రాసిన ఒక లేఖను పాఠకుడొకరు అపురూపంగా దాచుకుని ఈ మధ్య దాని ప్రతిని మాకు పంపారు. అప్పట్లో రాజకీయవాదుల వ్యవహార సరళి మీద తన బాధను, విరక్తిని బి. బాలగోపాలం అనే ఆంధ్రజ్యోతి పాఠకుడు సంపాదకుడితో పంచుకున్నారు. దానికి 1970 ఆగస్టు 13 నాడు నార్ల ఇంగ్లీషులో ఇచ్చిన జవాబుకు ఇది తెలుగు:

ప్రియమైన బాలగోపాలం గారు,

మీరు 'ఆంధ్రజ్యోతి'కి శ్రద్ధాసక్తులున్న పాఠకులని తెలిసి సంతోషం కలిగింది. రాజకీయనాయకులు, వాళ్లే పార్టీకి, గ్రూప్‌కు చెందినవారైనా కానీ, అవకాశవాదులే. పదవులు, అధికారం అనే స్వార్థ ప్రయోజనాల ప్రాతిపదికగానే వాళ్ల ప్రవర్తన ఉంటుంది. ఇది సర్వకాలాలకు, సర్వదేశాలకూ వర్తించే మాటయినప్పటికీ, వర్తమాన భారతదేశం విషయంలో మరింత సత్యం. ఈ సత్యాన్ని మీరు గుర్తెరిగితే, ఈ రాజకీయవాది ఏం చేస్తున్నాడు, ఆ రాజకీయవాది ఏం చేస్తున్నాడు వంటి విషయాలపై ఇంతగా బాధపడరు.

మీ వి.ఆర్. నార్ల

నార్ల వంటి విద్వాంసుడూ రచయితా సంపాదకుడూ రాజకీయవ్యవస్థ గురించి అంతటి నిస్పృహను, నిరసనను కలిగి ఉండడం కొందరికి సహజమే అనిపించినా చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అది ఇంకా ఇంతగా చెడిపోయిన కాలం కాదు కదా, ఇంకా తులసిమొక్కలు మిగిలిఉన్న కాలమే కదా, అంతటి వైరాగ్యం ఆయనకు అవసరమా అనీ ప్రశ్న రావచ్చు. అందరినీ ఒకే గాటన కట్టడమేమిటి, మంచి రాజకీయాలనేవే లేవా అని
కోపమూ కలగవచ్చు. నార్లవారి లేఖలోని తీవ్రతను వడబోసి చూస్తే, నవస్వతంత్రదేశపు కలలు కరిగిపోతున్న నడిమితరగతి ఆక్రోశం కనిపిస్తుంది. నాయకశ్రేణిలో చేరిన అల్పులను అనర్హులను చూసి కలిగిన ఆగ్రహం క నిపిస్తుంది. అందరినీ కలిపికొట్టినా ఆయన గురి కాంగ్రెస్ మార్కు రాజకీయాలమీదనే అని అర్థమవుతూనే ఉంటుంది. అంతకు పదేళ్ల ముందే, స్వాతంత్య్రం వచ్చి డజన్ వసంతాలు గడవకముందే 'అవినీతి బంధుప్రీతి చీకటిబజారూ అలముకున్న ఈ దేశం ఎటు దిగజారూ' అంటూ శ్రీశ్రీ సినిమాపాట జనం నాడిని పలికింది. నెహ్రూప్రతిష్ఠ, నవభారతనిర్మాణపు అతిశయమూ- అన్నీ అతి త్వరలోనే తెరమరుగైపోయి, వ్యవస్థ తన నిజస్వరూపంలోకి దిగుతున్నప్పుడు, మొదటగా దేవతావస్త్రాలు జారిపోయినవి రాజకీయవాదులకే! వ్యవస్థపై అవిశ్వాసం ఒక తిరుగుబాటు మార్గంగా అరవైల చివరలోనే దేశరాజకీయపటం మీద ఆవిష్కృతమైంది మరి!

ఇంతకీ వ్యవస్థలపై విశ్వాసం అనే దానికి అర్థమేమిటి? ప్రజాస్వామ్యమే కానక్కరలేదు, ఏ రాజ్యమైనా ఏదో ఒక ఆమోదనీయత ఆధారంగానే ఉనికిలో ఉంటుంది. దానిని నిలబెట్టే నైతికత ఏదో దానికి ఉంటుంది. మహా మహా సామ్రాజ్యాలు సైతం కుప్పకూలిపోవడం ఆ నైతికత భ్రష్ఠం కావడం వల్లనే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల నైతికత కానీ ఆమోదనీయత కానీ కేవలం ఎన్నికల తీర్పుల మీదనే ఆధారపడి ఉంటాయని అనుకుంటాము. కానీ అది వాస్తవం కాదు. పాత రాజ్యాల సంగతి చెప్పలేము కానీ, ప్రజాస్వామ్యవ్యవస్థ అని చెప్పుకునే చోట్ల ప్రభుత్వాలు ప్రజల ఆమోదాన్ని నిరాఘాటంగా అనుభవించే అవకాశం తక్కువే. అందుకే, ఆ ప్రభుత్వాలు ఇతర మార్గాల నుంచి జనామోదాన్ని సాధించే ప్రయత్నం చేస్తాయి. ఇందిరాగాంధీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మొదట 'అభ్యుదయ' చర్యల వంటి వాటిని ఆశ్రయించారు. అది కూడా తనకు తిరుగులేని బలం ఇవ్వలేదు అని తెలుసుకున్న తరువాత, పాకిస్థాన్‌తో యుద్ధాన్ని, బంగ్లాదేశ్ విముక్తిని తనకు అనుకూల పరిణామాలుగా మలచుకున్నారు. 'దేశభక్తి'ని ప్రయోగించి ఎన్నికల తీర్పును తెచ్చుకున్నారు. అట్లా సాధించిన తిరుగులేని అధికారాన్ని పార్టీలోని ప్రత్యర్థులను, ప్రతిపక్షాల వారిని అణచివేయడానికి ఉపయోగించారు. జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని ప్రతిపక్షపోరాటం ఉధృతమై జనామోదాన్ని పొందుతున్న వేళ, న్యాయస్థానాలు కూడా ధైర్యం తెచ్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పులు చెప్పగలిగినప్పుడు- నిరంకుశాధికారాలను ఇందిర ప్రయోగించారు. అక్కడే, ఆమె నైతికత లేదా ఆమోదనీయత దెబ్బతిన్నాయి. కాంగ్రెసేతరపక్షాల కూటమి అధికారంలోకి వచ్చింది కానీ, దానికి పునాదిగా ఉన్న నియంతృత్వ వ్యతిరేకత, ప్రజాస్వామ్యస్ఫూర్తి ఇతర ఆలంబనలు లేక త్వరలోనే బలహీనపడ్డాయి. సమర్థత నినాదంతో తిరిగి ఇందిర అధికారంలోకి రాగలిగారు. వచ్చిన తరువాత, దేశ సమగ్రత, సమైక్యత నినాదాలను పాలనకు భూమికలుగా ప్రయోగించారు. సార్వజనీనమైన అణచివేత ప్రతికూల ఫలితాలను అందిస్తుందని గ్రహించిన ఇందిర, నిర్బంధాన్ని ప్రత్యేక వర్గాలమీద ఎక్కుపెట్టారు. న్యాయస్థానాలతో సహా సమస్త వ్యవస్థలు, 1980ల తరువాతి నిర్దిష్ట నిర్బంధాల అమలులో ప్రభుత్వాలకు సహకరించాయి.

పాలకుల అవినీతి ఒక అంశంగా ప్రభుత్వాన్ని గడగడలాడించింది బోఫోర్స్ సందర్భంగా మాత్రమే. అది రాజీవ్ ప్రభుత్వాన్ని దింపగలిగింది కానీ, వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్లీ అల్పాయుష్షే అయింది. 1991 తరువాత అయితే, ప్రభుత్వాలు నైతికత మీద, ఆమోదనీయత మీద కాక, కొనుగోళ్ల మీద అమ్మకాల మీద నిలబడుతూ వచ్చాయి. ఇవాళ, దేశప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ మీద 2జి కుంభకోణం సందర్భంగాను, కొత్తగా వేదికమీదకు వచ్చిన బొగ్గుకుంభకోణంలోను ఆరోపణలు ఉన్నాయి. ఈ దేశానికి ప్రతిపక్షంగా ఉన్న బిజెపి అధ్యక్షుడి కుటుంబం మీద బొగ్గుకుంభకోణం లబ్ధిదారుడన్న ఆరోపణ వచ్చింది. పార్లమెంటు సభ్యులు డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేస్తారన్న ఆరోపణను ఎదుర్కొన్నారు. మంత్రులు జైలుపాలవుతున్నారు. దేశరక్షణ వ్యవస్థ సైతం అవినీతికి అతీతంగా లేదు. సాక్షాత్తూ దేశసైన్యాధిపతిగా పనిచేసిన వ్యక్తే తనకు లంచాలు ఇవ్వజూపారని ఆరోపించారు.

ఇక న్యాయవ్యవస్థ సంగతి ఏమి చెప్పాలి? సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఒకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నాలుగు దశాబ్దాల కిందట- కేవలం రాజకీయవాదులపై మాత్రమే గురిపెట్టిన అవిశ్వాసం, ఇప్పుడు సమస్త వ్యవస్థలకు- ప్రభుత్వం, అధికారులు, న్యాయవ్యవస్థ, రక్షణవ్యవస్థ, మీడియా- వ్యాపించింది.

ఒక రాజకీయపార్టీ మీద నమ్మకం సడలితే మరో పార్టీ, ప్రభుత్వం మీద సడలితే న్యాయవ్యవస్థ, వ్యక్తులు మొహం మొత్తితే కొత్త మొహం, ఏమున్నా లేకపోయినా ప్రజాస్వామ్యం ఉన్నదనే భరోసా ఇచ్చే మీడియా- ఇట్లా యావత్ వ్యవస్థకు కొనవూపిరి మిగల్చడానికి, కొత్త చిగుళ్లు వేయడానికి ప్రత్యామ్నాయాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ అవిశ్వాసాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తే, ఏమిటి గతి?

గత్యంతరం ఏమిటి అనే ప్రశ్నలో తిరకాసు ఉన్నది. ఎవరికి గత్యంతరం? వ్యవస్థల మీద విశ్వాసం ఉంచుకుని తీరాల్సిన కర్తవ్యం ప్రజలకేమున్నది? అవిశ్వాసాలు ముదరితే విప్లవాలు వస్తాయన్న భయం ఆయా వ్యవస్థల ఉనికిలో తలదాచుకుంటున్నవాళ్లకు ఉండాలి కాని! ఇప్పుడు ప్రతినాయకులుగా వినిపిస్తున్న ప్రత్యేకమైన వ్యక్తులను, సంస్థలను పక్కన పెడితే, మొత్తంగా అంతా సంక్షోభం ఆవరించిన పరిస్థితి కనిపించడం లేదా? యథాతథస్థితిని కొనసాగించడానికి వీలులేని విధంగా అంతర్గత వైరుధ్యాలు ముదిరిపోలేదా? దీన్నుంచి తమదైన సొంత విముక్తిని, తమ ఎజెండా ఆధారంగా జరిగే పరిణామాలను రచించుకోవలసిన బాధ్యత, అవసరమూ సామాన్య ప్రజానీకానికే ఉన్నది. ఒక్కడంటే ఒక్కడు, ఒక్కటంటే ఒక్కటి ఆధారపడదగిన మనిషీ, వ్యవస్థా లేనప్పుడు ఎండమావులవైపు చూడవలసిన, గుడ్డిలో మెల్లతో సరిపెట్టుకోవలసిన అగత్యం జనానికేమిటి? వారికి అర్థం కావడం లేదు మరి, ప్రత్యామ్నాయాలను నిర్మించుకోవలసింది తామేనని!

సమాజపు సమష్టి సంపదను కొల్లగొట్టిన ఒక 'గనుడు' డబ్బు విదిలించి ఒక పార్టీని అదుపులో పెట్టుకున్నాడు, ఒక ప్రభుత్వాన్ని అల్లల్లాడించాడు, అదే ధీమాతో కోటానుకోట్లు విదిలించి న్యాయాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. తిమ్మిని బమ్మి చేసి, జనం సంపదను జేబులోకి వేసుకోగలిగిన జగన్నాటకులు నేటి కథానాయకులు కావడానికి కారణం- కొల్లగొట్టిన సొమ్ములో తమ కోటా కోసం వెంపర్లాడేవారు అన్ని వ్యవస్థల్లోనూ ఉండడమే. పెన్షన్ల కోసం, రోగాలకు చికిత్స కోసం, రేషన్‌కార్డులకోసం, ఉచిత బియ్యం కోసం, కరెంటు కోసం, చదువుల కోసం జనం కూడా అటువంటి నేతల మీదనే ఆశలు పెట్టుకోవడం మొత్తం రాజకీయ వ్యవస్థ నిష్ఫలతను, నిరర్ధకతకు సంకేతం.

5 comments:

 1. మీబ్లాగ్ చదివినప్పుడల్లా,మీ ఏడిటోరియల్ కాని.మీ కాలములు కాని,అలాగే అర్కే గారి కాలములు కాని తులనాత్మకంగానే రాస్తారు విమర్శన చేస్తారు. అదే వార్తలు దగ్గర మాత్రము పూర్తి వ్యతిరేకం.ఇది జగన్ గురించి అని కాదు మీరు పత్రిక నడిపేతీరు ఒక కమర్షియల్ సినిమాకు హంగులు అద్దినట్లు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

  ReplyDelete
 2. అయ్యా ! ఎవరు తక్కువవాళ్లు ? బయట తిరుగుతున్నవాళ్ళంతా పవిత్రులా ? లోపలున్నవాళ్ళంతా పతితులా ? ఎవరికవకాశం వస్తే వారు దేశాన్ని దోచుకు తినడానికి సిద్ధంగా ఉన్నారు. తిన్నారు కూడా ! ఆ అవకాశం లేనప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ నీతులు చెబుతున్నారు. మీ జాబితాలో మీడియాని కూడా కలిపారు. సంతోషం. మీరు పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి అలాంటి మీడియాకి ఒక మంచి ఉదాహరణ.

  ReplyDelete
 3. చాలా మంచి విషయాలు ఇందులో చర్చించారు. ధన్యవాదాలు. మీరన్నట్టు అస్తవ్యస్త వ్యవస్థకు ఇవి ఆఖరి రోజులని భావించ లేమనుకుంటాను. ఏది తులసి మొక్కో, ఏది గంజాయి మొక్కో కూడా తెలీని అయోమయంలో ఉన్నాం కదా. నా వరకూ డబ్బుకున్న పవర్ ఇంత కలుషితంగా ఇంతకు ముందు ఉండేది కాదనుకుంటాను. ఆ గబ్బు కంపు వదిలే వరకూ నిరాశామయ లోకంలో ఈదులాడ వలసినదే కాబోలు. దేవుడా ! రక్షించు నా దేశాన్ని.

  ఆలోచనాత్మక మయిన టపాలతో మీరు ఒక సామాజికునిగా మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది పొగడ్త కాదు. బుద్ధి జీవుల మౌనం కానీ, దాట వేత ధోరణి కానీ, కప్పి పుచ్చే టక్కరి తనం కానీ ప్రమాదాలలో కెల్లా ప్రమాదకారి కదా.

  ReplyDelete
 4. @అస్తవ్యస్త వ్యవస్థకు ఇక ఆఖరి రోజులా!

  చిన్న పార్టీ అభ్యర్దులో, ఇండిపెండెంట్ అభ్యర్ధులో 'ఎక్కువగా' విజయాన్ని సాదిస్తున్నపుడు ఆఖరి రోజులు వస్తున్నాయి అనుకోవచ్చు . కాబట్టి నా సమాధానం 'కాదు' అనే

  ReplyDelete