Tuesday, June 12, 2012

జనంలో ఉన్న జ్ఞానమే జనవిజ్ఞానం

స్పానిష్ జెసూట్ మిషనరీలు దక్షిణ అమెరికాలో అడుగుపెట్టిన తరువాత, పెరూలోని స్థానిక ఇండియన్ తెగలు జ్వర నిదానానికి వాడే ఒక చెట్టు బెరడు గురించి తెలుసుకున్నారు. ఆ బెరడును పొడి చేసి పెరూ వైస్‌రాయ్ భార్యకు వచ్చిన జ్వరాన్ని వారు నయం చేశారు. ఔషధ గుణాలున్న ఆ చెట్టుకు 'పెరూవియన్ బార్క్', 'జిసూట్ బార్క్' అని పేరు పెట్టారు. ఆ బెరడే, తరువాతి కాలంలో మలేరియా నిదానానికి వాడే క్లోరోక్విన్ అవతరణకు కారణమయింది. చరిత్ర తెలియని కాలం నుంచి దక్షిణ అమెరికన్ ఇండియన్లకు తెలిసిన ఒక జ్ఞానం- ఆధునిక వైద్య విజ్ఞానంలో స్పానిష్ వలసవాద మతాధికారుల ఆవిష్కరణగా ప్రచారం అయింది.

అన్నీ వేదాల్లోనే ఉన్నాయనే వాదం ఛాందసమో అతితెలివి అజ్ఞానమో అయితే అయి ఉండవచ్చును కానీ, అటువంటి వాదనలో అంతర్లీనంగా ఉన్న ఒక సత్యాన్ని గుర్తించాలి. ఆధునిక ఆవిష్కరణలన్నీ
ఆధునికమైనవి కావు, నోరున్నవాడు బలమున్నవాడు అక్షరం వచ్చినవాడు చేసినవి మాత్రమే ఆవిష్కరణలు కావు. ఒకరినుంచి ఒకరు నేర్చుకోవడం సహజమైన జ్ఞానార్జన అవుతుంది కానీ, ప్రాచీన సమాజాల జ్ఞానాన్ని అపహరించి సొంతం చేసుకోవడం మాత్రం దొంగతనమే అవుతుంది. ఆధునిక విజ్ఞానం అని చెప్పుకుంటున్న దానిలో, చౌర్యం చాలా ఉన్నది.

మూలజ్ఞానం స్ఫూర్తిని యథాతథంగా స్వీకరించి కొత్త అవసరాలకు మలచుకుంటే ఒప్పుకోవచ్చును కానీ, ఆ స్ఫూర్తిని చంపేసి ఆధునికతలోని అత్యాశకు, వ్యాపారీకరణకు, మూఢశాస్త్రీయతకు అనుగుణంగా రూపుమారిస్తే అది ప్రమాదకరమైన చౌర్యం. పెరూవియన్ స్థానిక ఇండియన్లు బెరడును జ్వరాలకు వాడడమే కాదు, ఆ చెట్టు ఆకులను ఆహారంగా తీసుకుంటారట. బెరడులో ఉండే ఔషధం 'క్వినైన్' కలిగించే సైడ్ ఎఫెక్ట్స్‌కు ఆ ఆకులు విరుగుడుగా పనిచేస్తాయట. కానీ జెసూట్ మతాధికారులు, వారి నుంచి 'పెరూవియన్ బార్క్'ను గ్రహించిన ఆధునిక వైద్యులు బెరడు పొడిలోనుంచి క్వినైన్‌ను మాత్రమే స్వీకరించి, ఇతర పదార్థాలను, చెట్టు ఆకులను వదిలివేశారు.

ప్రపంచానికి ఐరోపా ఖండం కేంద్రమని, అక్కడినుంచి జైత్రయాత్రకు బయలుదేరిన యాత్రికులు వివిధ దేశాలను కనిపెట్టారని, అనాగరికతలో అంధకారంలో మగ్గే స్థానిక ప్రజలకు సభ్యతను సంస్కారాన్ని పంచిపెట్టారని చరిత్రలు చెబుతాయి. అమెరికాను కొలంబస్ కనిపెడితే, భారత్‌ను వాస్కోడిగామా కనిపెట్టాడు. వాళ్ల వెనుక వచ్చిన వ్యాపారుల సేనలు దేశాలను ఆక్రమించి, ప్రజల మీద, సమాజాల మీద అధ్యయనాలు చేసి ఆధునిక విజ్ఞానాలను రూపొందించారు. దేశదేశాల్లోని ప్రాచీన కట్టడాలను, పురాతత్వ స్థలాలను వారే ఆవిష్కంచారని పుస్తకాల్లో చదువుకుంటాము. ఈజిప్షియన్ పిరమిడ్లను, హరప్పా మొహంజొదారో శిథిలాలను, బుద్ధగయ స్థలాన్ని, అజంతా ఎల్లోరా గుహలను - ఇంగ్లీషువారే కనుగొన్నట్టు మనం కృతజ్ఞతతో చెప్పుకుంటాము. వలసవాది రాకముందు అమెరికాలో రెడ్ ఇండియన్లు, భారత్‌లో అసలు ఇండియన్లు ఉన్నారని, ఫలానా బ్రిటిష్ అధికారి కనుగొనకముందే స్థానికులకు బుద్ధగయ గురించి అజంతా గుహల గురించి తెలుసునని మనకు గుర్తే రాదు.

నిజమే, ఆధునిక శాస్త్రాలను వలసవాదమే నిర్మించింది. అభివృద్ధి పరచింది. ఐరోపాలో వచ్చిన పారిశ్రామిక విప్లవం, కొత్త మార్కెట్ల కోసం వారి అన్వేషణ, వలసవాద యాత్రలలో వారి అనుభవాలు సరికొత్త జ్ఞానాన్ని ఆవిష్కరించాయి, సందేహం లేదు. ఉష్ణమండల దేశాలలో తెల్లచర్మపు పాలకులు, వారి సేనలు ఎదుర్కొన్న నానారకాల ఆరోగ్యసమస్యలు అనేక ఔషధాల రూపకల్పనకు కారణమయ్యాయి. సమాజాల అధ్యయనం చరిత్రను, సామాజిక శాస్త్రాలను, భాషాశాస్త్రాన్ని నిర్మించాయి.

కానీ, ఈ శాస్త్రాల అవతరణలో స్థానిక సమాజాలే ముడిసరుకుగా పనిచేశాయి. ఈ సమాజాలకు ఉన్న అపారమైన దేశీయ విజ్ఞానం, అయితే ఆధునికతలో జీర్ణమై పోయింది, లేదా, అనుసంధానం కాకుండా వెలిగా మిగిలిపోయింది. స్థానికమైనదంతా నాటుదిగా, అజ్ఞానంతో అశుభ్రతతో మూఢత్వంతో ముడిపడినదిగా, బయటినుంచి వచ్చినదంతా శాస్త్రీయమైనదీ స్వచ్ఛమైనదీగా ప్రచారమైంది. జాతీయవాదం ప్రబలి, ఆర్థిక వలసవాదాన్ని వ్యతిరేకించడం నేర్చుకున్నాము కానీ సాంస్క­ృతికంగా, బౌద్ధికంగా వలసవాదాన్నే ఆలింగనం చేసుకుని ఉన్నాము.

నగ్ననేత్రాలతో ఖగోళాన్ని జల్లెడపట్టిన ఆర్యభట్ట, భాస్కరుడు వంటి అలనాటి ఖగోళశాస్త్రవేత్తలు, మూలికలూ ఆకుల చికిత్సనే కాదు శస్త్రవైద్యాన్ని కూడా వివరించిన చరకుడూ సుశ్రుతుడూ, ఆధునిక భాషాశాస్త్రమే ఆశ్చర్యపోయే వ్యాకరణాన్ని సూత్రీకరించిన పాణినీ, విశ్వంలో అణువణువూ కణాలేనని చెప్పిన భౌతికశాస్త్రవేత్త కణాదుడూ- వీళ్లందరినీ పక్కన బెడదాం. సమాజంలో శాస్త్రీయదృష్టి, పురోగామి అన్వేషణా లేనిదే వ్యక్తులు అవతరించలేరు. నిప్పును కనిపెట్టిన మనిషి, వేటను శాస్త్రంగా తీర్చిదిద్దిన మనిషీ, చర్మంతో చెప్పులు చేసిన మనిషి, గనులు తవ్వి లోహాన్ని మచ్చిక చేసుకున్న మనిషి, రాళ్లను శిల్పాలుగా తీర్చిదిద్దిన మనిషి, భూమిని తలకిందులు చేసి బువ్వ పండించిన మనిషి- ఎంతటి విజ్ఞానాన్ని ఆవిష్కరించారు? చీకటిలోకి చూపులు సాచి సాచి చుక్కలు లెక్కపెట్టిన మనిషి, గ్రహచారాన్నీ గ్రహణదోషాలనీ నమ్మి ఉండవచ్చును గాక, రాశిగతులను నక్షత్రగమనాలను ఎంత ఖచ్చితంగా లెక్కగట్టాడు?

జంతువుల కళేబరాలను చీల్చి చీల్చి శరీర నిర్మాణాలను అర్థం చేసుకున్న మనిషి, తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఎన్నెన్ని ఔషధాలను తెలుసుకున్నాడు? జనం దగ్గర కాకపోతే విజ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? చెట్టును చెట్టునూ పేరుపెట్టి పలకరించే ఆదివాసులు, కార్తె కార్తెకు భూమి అదునుపదునులను, రుతుగతులను చెప్పగలిగిన రైతులు, బంగారం కోసమే కావచ్చు రసవిద్య ద్వారా రసాయనశాస్త్రాన్ని తీర్చిదద్దిన యోగులు బైరాగులు- వీరు కాకపోతే మరెవరు శాస్త్రవేత్తలు?

మేధలు వలస వలలో చిక్కుకున్న మనుషులు- మోటుమనుషులని, నాటు వైద్యమని నిరసించడం నేర్చుకున్నారు. జనం కోసమే పనిచేస్తున్నామని చెప్పేవారు సైతం జనం దగ్గర జ్ఞానముంటుందని గుర్తించరు. సాంప్రదాయిక జ్ఞానవ్యవస్థలన్నిటినీ అపహరించే పని ఒక వైపు సాగుతూనే ఉంటుంది, మరొకవైపున సంప్రదాయమంతా మౌఢ్యమేననే విశ్వాసచట్రం వర్థిల్లుతూనే ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా టీకాలు పొడుస్తుంటే, అమాయకంగా బారులు తీరి నిలుచునే తల్లిదండ్రులను, ఫీజులు ఎక్కువ గుంజడం కోసం చేస్తున్నారని తెలియక పెద్దాపరేషన్ల కోసం సిద్ధపడే మహిళలను, ఏం మందులు ఇస్తున్నారో తెలియకపోయినా స్పెషలిస్టుల క్లినిక్‌ల ముందు బారులు తీరే రోగులను చూసినప్పుడు- తాయెత్తుల కోసం, బూడిద కోసం బాబాలను ఆశ్రయించేవారి కంటె వారేమి నయమనిపిస్తుంది. ఏ వైద్యుడైనా జబ్బును వివరిస్తాడా, తాను ఇస్తున్న మందు మంచి చెడ్డలను చర్చిస్తాడా- లేదే, అయినా ఏ మూఢత్వం వారికి కాసుల పంట పండిస్తోంది?

ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, సాంప్రదాయ జ్ఞానానికి మూలం మానవ అనుభవమే. నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట కొలమానాలకు లొంగి ఒక సూత్రం నిరూపితం కావాలని సైన్స్ చెబుతుంది. సాంప్రదాయ జ్ఞానం నాలుగు గోడల ప్రయోగశాలలో కాక, కాలంలో, సమాజంలో రూపుదిద్దుకుంటుంది, సాంస్కృతికమైన రూపాన్ని కూడా సంతరించుకుంటుంది. పొరపాటు సూత్రీకరణలు, ప్రమాదకరమైన ఫలితాలు రెండు కోవల జ్ఞానాల్లోనూ వచ్చే అవకాశమున్నది.

వలస ఆధునికత వల్ల, భారత దేశ సాంప్రదాయిక జ్ఞానవ్యవస్థలు తరువాతి దశలోకి వెళ్లడం నిలిచిపోయింది, అందువల్ల నేటి అవసరాల వేగం ముందు అవి పురాతనమైనవిగా కనిపించవచ్చు. కొన్ని రకాల సంప్రదాయ జ్ఞానాలు, ఆధునికతలోకి రావడానికి, వ్యాపారీకరణ కావడానికి నిరాకరించవచ్చు. ఆధునికమైన పేటెంట్ల వలెనే, కొన్ని సాంప్రదాయ జ్ఞానాలు కూడా తమ రక్షణకు రహస్యాన్ని ఆశ్రయించవచ్చు. అంతే తప్ప, ఆధునికమైనదే జ్ఞానమని, తక్కినదంతా మూఢత్వమని అనుకోవడం నయామౌఢ్యమే తప్ప మరొకటి కాదు.

చేపమందులో ఔషధగుణాలున్నాయో లేవో, కానీ శుక్రవారం నాడు మృగశిర కార్తె ప్రవేశించిన రోజు వేలాది మంది ఒక ఆశతో హైదరాబాద్‌కు వచ్చారు. ఉబ్బసాన్ని నయం చేయలేని ఆధునిక వైద్యవిధానం వైఫల్యం ఆ ఆశ వెనుక ఉన్నది. ఉబ్బసమే కాదు, రక్తపోటు, మధుమేహం, కేన్సర్.. చివరకు చిన్న జలుబు కూడా మౌలికంగా నయం చేయలేనిది ఆధునిక వైద్యం. దాని పేరు మీద ఇంతటి వ్యాపారం జరుగుతున్నప్పుడు, పరంపరాగతమైన వాడుకగా సేవగా వైద్యం చేస్తున్నవారి మీద సైన్స్ పేరుతో దాడి న్యాయమా?

ఆ దాడే కదా, శుక్రవారం నాటి దురదృష్టకరమైన సంఘటనకు పరోక్షంగా కారణమైంది!

3 comments:

 1. కె. శ్రీనివాస్ గారు,

  చాలా చక్కగా రాశారు. మీ ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ కాలంస్ క్రమం తప్పకుండా చదువుతాను, చదివిస్తుంది కూడాను.

  జాజిమల్లి గారు చెప్పినట్లు " తెలుగు సమాజపు మేధావి.సాహితీ విమర్శకులు.మంచి వచనం రాయగలిగిన కొద్దిమందిలో మొదటివారు. "

  మీ విషయంలో ఇది 100% వాస్తవం.

  ReplyDelete
 2. దాడులు సమర్థించడం లేదు కాని, ఆ 'చేపమందు'లో వున్న రహస్యాన్ని చేదించాల్సిన అవసరం ప్రజలకు, వైద్యశాస్త్రానికి వుంది. శాస్త్రీయంగా ఆ మందుపై పరిశోధన జరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఎంతకాలమని ఓ కుంటుంబం దేశ/ప్రపంచ ప్రజలకు అదకుండా రహస్యంగా వుంచుతారు?

  ReplyDelete