Friday, June 22, 2012

పాఠాలు నేర్చుకోకపోతే, పీఠాలు మిగలవు!

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరచడం ఇదే మొదటిసారి కాదు. ఆశ్చర్యపోయేవారు, ఫలితాలను నిర్దేశించినవారు వేరువేరు కావడం వల్ల ఈ ఆశ్చర్యాలు కలుగుతాయి కాబోలు. నాకు గుర్తుండి 1980లో పెద్ద ఆశ్చర్యం ఎదురయింది. అప్పటికి మూడేళ్ల కిందట జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, దానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగానే కనిపించాయి. కానీ, స్వతంత్ర భారతంలో అనుశాసన పర్వం పేరుతో అంధకారాన్ని నింపిన అత్యవసర పరిస్థితి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉండగా, మూడేళ్లలోనే తిరిగి ఇందిరాగాంధీకి దేశం పట్టం కట్టినప్పుడు- ఏమిటీ ప్రజలు అని ఏవగింపూ ఆశ్చర్యమూ కలిగాయి. ఈ ప్రజలకు ప్రాథమిక హక్కులు అక్కరలేదా, ప్రజాస్వామ్యం అక్కరలేదా, నియంతృత్వమే కావాలా- అని నిర్వేదం కలిగింది. 1983లో రాష్ట్రంలో అవతరించిన ఒక కొత్త రాజకీయశక్తి తెలుగుదేశం పార్టీ ప్రభంజనసదృశంగా అధికారంలోకి వచ్చినప్పుడూ ఆశ్చర్యం కలిగింది కానీ, ఆ పరిణామంలోని అద్భుతత్వం వల్ల కలిగిన ఆశ్చర్యం అది. జనం నిశ్శబ్దంగా అట్లా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి మంగళం పలకగలగడం అబ్బురంగానూ మురిపెంగానూ అనిపించింది. జనం ఏమి ఆలోచిస్తున్నారో తెలియకపోవడం అనే సాధారణ లక్షణం మాత్రం ఆ పరిణామంలోనూ ఉన్నది.

గుజరాత్ మారణకాండ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడి ఓటర్లు నరేంద్రమోడికి పట్టం కట్టినప్పుడు లౌకికవాదులకు షాక్ తగిలింది. ఎట్లా ఎట్లా అది సాధ్యపడింది, అంత ఘాతుకాలు జరిగిన తరువాత, అందుకు బాధ్యుడన్న ఆరోపణలు ఉన్న నాయకుడికి అంతటి ఘనమైన జనామోదం ఎట్లా లభించింది? అన్నది మనసులను తొలచివేసింది. అటువంటి సందర్భాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడెట్లా ప్రవర్తిస్తారో తెలియని మార్మికమైన చిత్తప్రవృత్తిని ప్రజలకు అంటగట్టాలా? జనం కూడా మతతత్వవాదులయ్యారని నిర్ధారించుకోవాలా? అసలు జనం తీర్పునకు ఏటువంటి అర్థమూ లేదని కొట్టిపారేయాలా? లేదా.. ప్రయత్నించి, అందులోనుంచి ఒక హేతుబద్ధమైన వివరణను పొందడానికి ప్రయత్నించగూడదా?

న్యాయం ధర్మం గెలిచి, అన్యాయం అధర్మం ఓడిపోయే తీరులో ఉన్న వ్యవస్థేమీ కాదు మన ప్రజాస్వామ్యం. మంచికీ చెడుకూ మధ్య కాకుండా, రెండు రకాల చెడుల మధ్యనే పోటీ ఉండేలా, ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకునేలా మన ఎన్నికల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజల మధ్య పనిచేస్తూ, ఒక సహజసిద్ధమైన క్రమంలో నాయకత్వం
ఎదిగే పరిస్థితులేమీ మన సమాజంలో లేవు. సాంప్రదాయికంగా ఉన్న ఆధిపత్య, ప్రాబల్య వర్గాలే, తమ పలుకుబడికి ప్రజాస్వామ్యముద్రను సాధించుకోవడం కోసం ఎన్నికల ప్రక్రియను ఆశ్రయిస్తున్నాయి. భారత రాజ్యాంగమూ ప్రజాస్వామ్యమూ కొద్దిపాటి సంస్కరణలను, కొన్ని సమానావకాశాలను మాత్రం ప్రతిపాదించి, వ్యవస్థలోని తక్కిన అంతరాలను, వైరుధ్యాలను యథాతథంగా ఉంచేశాయి. అందువల్లనే, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేనివారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. లేదా, అధికారపు సానువులకు దూరంగా, తమకు తోచిన తీరులో చిన్న చిన్న మార్పులను సాధించడానికి జీవితాలను అంకితం చేస్తున్నారు. ఎంతో త్యాగశీలతతో, ధైర్యసాహసాలతో జనం మధ్య పనిచేసేవారు, బ్యాలట్‌యుద్ధంలో ప్రవేశించినప్పుడు వారికి ధరావత్తులు కూడా గల్లంతుకావడం తెలిసిందే.

భారతదేశంలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా రాజకీయ నాయకత్వం నిర్మితమయ్యే క్రమమూ, దానికి అధికారం సంక్రమించే విధానమూ, ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నికల వ్యవస్థ నిర్వహించే పాత్రా- వీటి మీద సానుకూల విశ్వాసం ఉండి, ఆ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలకు లోబడి రాజకీయ క్రీడ ఆడితే సరే, లేకపోతే, ఎన్నికలనేవి వాస్తవ జనస్వామ్యానికి వేదికలే కావు. ఆట స్వభావాన్ని అర్థం చేసుకుని సరిహద్దులలోపల సంచరిస్తే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని విశేషాలూ చమత్కారాలూ కనిపిస్తాయి. వ్యవస్థ మారకుండానే పాలకులను మారుస్తూ, ఏదో మార్పు జరుగుతున్నదన్న భ్రమ కలిగిస్తాయి. ఎంతటి వారైనా ప్రజల తీర్పు ముందు లొంగితీరవలసిందేనన్న నమ్మకాన్నీ సృష్టిస్తాయి. అందుకే, అనామకులైనవారు, తగిన స్థాయి లేనివారు కూడా ఇందిరాగాంధీ, ఎన్టీయార్ వంటి దిగ్దంతులను ఓడించిన ఉదాహరణలు మన ఎన్నికల చరిత్రలోనే ఉన్నది. ఇతరత్రా ఎంతో ప్రతిష్ఠ కలిగినవారు ఓటుకు కొరగాకపోవడమూ ఇదే చరిత్రలో కనిపిస్తుంది. సారాంశాన్ని మార్చకుండా, రూపాన్ని మారుస్తూ ఉండే ఈ ప్రక్రియలోకి, ఎన్నికల వ్యవస్థకు అతీతమయిన నైతిక చర్చ తీసుకువస్తే సమాధానం ఏమీ దొరకదు.

జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి ఇప్పటి ఉప ఎన్నికల్లో ఇంతటి జనామోదం ఎందుకు లభించిందన్న ప్రశ్న వేసుకుంటున్నప్పుడు, అంతటి అవినీతి నేతను ప్రజలు ఎట్లా ఆదరించారు- అని ఆశ్చర్యపోతే ఉపయోగం లేదు. మన ఎన్నికల ప్రక్రియను గుర్తిస్తూ ఆమోదించేవారు పడకూడని ఆశ్చర్యం అది. ఒకనాడు 60 కోట్ల కుంభకోణానికే కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చిన చరిత్రను గుర్తు తెచ్చుకుని వలపోస్తే లాభం లేదు. ఆ అవినీతి చరిత్ర కాస్తా, రాజీవ్‌గాంధీ హత్య జరిగినవెంటనే ఆవిరైపోయి, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఒక సందర్భంలో అవినీతిని పెద్ద సమస్యగా గుర్తించిన ఓటర్లు అన్ని సందర్భాలలో అదే పనిచేస్తారని గ్యారంటీ లేదు. ప్రస్తుత ఉప ఎన్నికల సందర్భంలో ఓటర్లు అవినీతిని, అది ఎంతటి దుర్మార్గమైన, బ్రహ్మాండమైన స్థాయిలోని అవినీతి అయినా సరే, ఓటింగ్‌కు ఒక ప్రాతిపదికగా గుర్తించలేదనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి మనం సంకోచిస్తున్నామా? మరేవో ప్రాతిపదికలపై ఓటర్లు తమ ఎంపికను చేశారని అర్థం చేసుకోలేకపోతున్నామా?

షాక్ తినవలసి వస్తే, 2009లో రాజశేఖరరెడ్డి రెండో సారి ఎన్నికయినప్పుడే తినాలి. ఎంతటి నిర్బంధం, ఎంతటి అణచివేత, సమస్త ప్రతిపక్షాన్నీ నిరాయుధం చేసి, పౌరసమాజ సంస్థలన్నిటినీ భయభ్రాంతం చేసి, జనాకర్షణ ఆయుధంతో సమాజపు వనరులను కార్పొరేట్లకు హక్కుభుక్తం చేసిన పాలన అది. ఆ పాలనకు వ్యతిరేకత జనం మనస్సులో ఏర్పడింది. దానికి పదునుపెడితే ప్రభుత్వం అప్పుడు పడిపోయేదే. ఇంతలో ప్రజారాజ్యం పార్టీ వచ్చి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, కాంగ్రెస్ పునరాగమనానికి తోడ్పడింది. చిరంజీవి కనుక, తన మీద తెలుగు సమాజం పెట్టుకున్న ఆశలకు అనుగుణమైన నాయకుడిగా ఎదిగి ఉంటే, పరిణామాలే వేరుగా ఉండేవి. అలా జరగలేదు. తిరిగి అధికారం చేపట్టిన వెంటనే రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలుకావడం, రాష్ట్ర రాజకీయాలను చిత్రమైన మలుపు తిప్పింది. జగన్మోహనరెడ్డి కాంగ్రెస్‌ను చీల్చడానికి ప్రయత్నిస్తూ కాంగ్రెస్ వ్యతిరేక శిబిరాన్ని నిర్మించసాగారు. అధికార పార్టీలోని చీలిక, ప్రతిపక్షానికి సహజమైన ఆకర్షణ కలిసి ఒక కొత్త శక్తి కి వేదిక కల్పించాయి. అవినీతిపై విచారణ ఒక వేధింపుగా చిత్రితమైంది.

ఇదంతా సానుభూతి మాత్రమే, పాలపొంగు మాత్రమే, ఓటర్లలోని దిగజారుడుతనం మాత్రమే అని రాజకీయవాదులు వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ శ్రేణుల మనసులపై పడిన పరాజయభారాన్ని ఉపశమింపజేయడానికి, ఆత్మవిశ్వాసం కల్పించడానికి పార్టీలు అట్లా మాట్లాడడం సహజమే కావచ్చు. కానీ, అది భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తుందా? జరిగిన దాన్ని సమీక్షించుకోకపోతే, తమను తాము మెరుగుపరచుకోకపోతే పరిస్థితి ఏమిటి? అవినీతి మార్గాలలో సాధించిన ధనం పారిశ్రామిక వేత్తను చేసినట్టే , సానుభూతిపవనాల మీద తేలివచ్చిన విజయం రాజకీయాల్లో స్థిరపరిచే శక్తినివ్వదా? ఇస్తే అప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీలు మిగులుతాయి? ఏవి పోతాయి? జాతీయ పార్టీగా కాంగ్రెస్, ఎన్ని సార్లు శిరచ్ఛేదం జరిగినా మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది. మరి తెలుగుదేశం పరిస్థితి? విధానాల రీత్యా ఏ మాత్రం తేడా లేని కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ మాత్రమే రంగంలో ఉంటే, కొద్దిగానైనా భిన్నంగా, ప్రత్యామ్నాయధోరణిలో వ్యవహరించే పార్టీ లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిదా?

జరిగిన దాన్ని తేలికపరచి, కొట్టిపారేయడం సులువు. కానీ, అది వివేకం కాదు. పరకాల సంగతే తీసుకుందాం. అక్కడ జరిగినదాన్ని పాలపొంగు అనో, సానుభూతి వెల్లువ అనో అనగలమా? అతి కష్టం మీద మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ నెగ్గుకు రావడం- కొండా సురేఖ స్థానిక ప్రాబల్యం మాత్రమే అనుకోలేము. తెలంగాణ వాదం ఎదుర్కొంటున్న సమస్యల ప్రతిఫలనమే అక్కడి బొటాబొటి విజయం. దాన్ని సరిదిద్దుకోకపోతే, తెలంగాణ ఆకాంక్ష సాధనకే ప్రమాదం ఏర్పడుతుంది. వైఎస్ జగన్ ప్రభావం తీరందాటగలిగినప్పుడు, అదును కోసం వేచిచూస్తున్న శక్తులు దానితో చేతులు కలిపితే, ఏర్పడే పర్యవసానాలు సామాన్యమైనవి కావు. జగన్‌కు ఓటువేస్తే రాష్ట్రం ముక్కలు కావడానికి అనుమతించినట్టే అని ప్రచారం చేసినా అతనికి సీమాంధ్రలో మద్దతు దొరికింది, అదే సమయంలో తెలంగాణవాదానికి అగ్నిపరీక్ష ఎదురయింది.

ఉనికి సమస్య తెలంగాణ రాష్ట్రసమితికి, వాదానికీ మాత్రమే కాదు. తెలుగుదేశానికీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్‌కు కూడా. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నారనేది ఉప ఎన్నికల సంకేతమైతే, దాన్ని తనకు అనువుగా మలచుకునే ప్రయత్నం తెలుగుదేశం చేయాలి. వైఎస్ హయాంలో జరిగిన అవినీతినేరాలను నిగ్గుతేల్చడమే కాదు, నీతివంతమైన పాలనను నెలకొల్పడం ద్వారా జనం మనస్సులను గెలుచుకోవచ్చునేమో కాంగ్రెస్ అన్వేషించాలి. అన్నిటి కంటె ముందు, సమస్య వాస్తవమని గుర్తించాలి. రాష్ట్రంలో కొత్త రాజకీయశక్తి రూపుదిద్దుకుంటున్నది పచ్చి నిజమని గుర్తిస్తే, దాన్ని ఎదుర్కొనడమో, జయించడమో ఎట్లా చేయవచ్చునో ఆలోచించవచ్చు. వ్యవస్థ పరిమితుల్లో అయినా సరే, మెరుగైన నిజమైన ప్రత్నామ్నాయాన్ని అందిస్తే, జనం దాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారని కూడా చరిత్ర చెబుతుంది.

No comments:

Post a Comment