Thursday, June 28, 2012

రెండేళ్ల ముందే చతికిలపడిన ఎన్డీయే

ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలు పూర్తికాలం అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ఒకటి రెండు సంవత్సరాలు గడవగానే ఎప్పుడు ప్రభుత్వాన్ని పడగొడదామా మధ్యంతర ఎన్నికలు తీసుకువద్దామా అని తాపత్రయపడతాయి. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఇది సాధారణంగా జరిగే ఆనవాయితీ. కానీ, అధికార పక్షమూ ప్రతిపక్షమూ ఇద్దరూ ప్రజల ముందుకు వెళ్లడానికి సంసిద్ధత లేక, మధ్యంతర ఎన్నికలను తప్పించే ప్రయత్నం చేయడం అరుదైన విషయం. పరిపాలనలో, ప్రభుత్వ విమర్శలో అధికార ప్రతిపక్షాలు రెండూ విఫలం అయిన సందర్భాలలోనే ఇటువంటి పరిస్థితి తారసపడుతుంది.

సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఇది సహజమే అనిపించవచ్చు. కానీ, మిశ్రమప్రభుత్వాల అనుభవాన్ని దీర్ఘకాలంగా రుచిచూస్తున్న కొన్ని చిన్న యూరోపియన్ దేశాల్లో తరచు ప్రభుత్వాలు పడిపోవడం, ఎన్నికలు రావడం చూస్తుంటాము. 1996 తరువాత మన దేశంలోనూ వరుస ఎన్నికలు వచ్చాయి. 1999 నుంచి ఎన్‌డిఎ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తరువాత 2004లో యుపిఎ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇకనుంచి వంతుల వారీగా రెండు కూటములు అధికారాన్ని పంచుకుంటాయనుకుంటే, 2009లో తిరిగి యుపిఎనే జనామోదాన్ని పొందింది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. ఏడేళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగిన తరువాత కూడా జాతీయ, ప్రాంతీయ ప్రతిపక్షాలు ఇంకా కోలుకోకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ వేయకముందే రాష్ట్రపతిగా ఆయన విజయం ఖరారైపోయింది. అయినా సరే, పి. ఎ. సంగ్మా పోటీ చేస్తున్నారు, ఆయనకు బిజెపితో సహా ఎన్‌డిఎలోపల, బయట ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపాయి. యాభైమూడు శాతం పైగా ఓట్లతో ప్రణబ్ ముందంజలో ఉండగా, సంగ్మా సంపాదించగలిగే ఓట్లు ముప్పైశాతం దాటడం లేదు. ఈ సన్నివేశం 2012లో రాష్ట్రపతి ఎన్నిక ఫలితాన్నే కాదు, 2014
పార్లమెంటు ఎన్నికల ఫలితాన్ని కూడా ముందుగానే సూచిస్తున్నాయి. తమ బలహీనతను ముందుగానే బహిరంగపరచే పోటీని బిజెపి ఎందుకు ఎంచుకున్నదో తెలియదు. ఎన్‌డిఎ వచ్చే ఎన్నికల్లో కలిగించే ఆశ్చర్యాలేమీ ఉండవనే అంచనాలకు మరింత బలం చేకూర్చడానికా అన్నట్టు బిజెపిలో అంతర్గత పోరు, కూటమిలో నాయకత్వ వివాదం రాజుకున్నాయి. దేశవ్యాప్త ప్రజాతీర్పునకు సంసిద్ధం కావడం అటుంచి, మరింతగా విచ్ఛిన్నత వైపు పయనిస్తున్న జాతీయ ప్రతిపక్షం రాజకీయ కౌశలం మీద ఆశ్చర్యం కలుగుతున్నది.

ఏడేళ్ల కాలంలో బిజెపి ఎందుకు పుంజుకోలేకపోయింది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు బలపడలేకపోయింది?- ఈ ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు లేవు. కేవలం ఎన్నికల రాజకీయాల వ్యూహప్రతివ్యూహాల దృష్టితోనే మాట్లాడవలసి వస్తే, జాతీయ, రాష్ట్ర ప్రతిపక్షాలు పార్టీలో దృఢమైన ఐక్యతను, ప్రజల్లో కొత్త రాజకీయ ఎజెండాను నిర్మించలేకపోయారని చెప్పవలసి వస్తుంది. జాతీయ స్థాయిలో అధికార ప్రతిపక్షాల మధ్య విధానాలలో చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఏమీ లేదు కాబట్టే, ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన జరగడం లేదు. లౌకిక, మతతత్వ ముద్రలు మినహాయించి, దేశంలో అనుసరించే అభివృద్ధి ఎజెండా రెండు పక్షాలదీ ఒకటే. ఆ అభివృద్ధి ఎజెండా అమలు క్రమంలో ఎదురవుతున్న సమస్యలు, సంఘర్షణలను, మొత్తం క్రమంలో భాగంగా కాక విడివిడిగా చూస్తూ, రెండు పార్టీలూ ప్రతిపక్షాలుగా ఉన్న సమయంలో ఉపయోగించుకుంటాయి. ఆర్థిక సంస్కరణల వరకే తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రారంభించిన క్రమాన్నే వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారు. కానీ, చంద్రబాబు 'హైటెక్ ఎజెండా'ను ఓడించి 'గ్రామీణ ఎజెండా'తో అధికారంలోకి వచ్చినవాడిగా వైఎస్ పేరు తెచ్చుకున్నారు.

కేంద్రంలోనూ అంతే, 2004లో అకస్మాత్తుగా గ్రామీణ ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చి, తామేదో ఆర్థిక సంస్కరణల్లో తీవ్రవాదులము కానట్టుగా యుపిఎ ప్రజలముందుకు వచ్చింది. పట్టణ కేంద్రిత అభివృద్ధి, గ్రామాల అలక్ష్యం వంటి అంశాలలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు తెలుసుకున్నట్టు చెబుతున్నప్పటికీ, చంద్రబాబు నాయుడుపార్టీని గ్రామీణ ప్రజలు ఇంకా విశ్వసించకపోవడం తెలుగుదేశం పార్టీని కుంగదీస్తున్నది. ఆ విశ్వాసాన్ని తిరిగి సంపాదించే తారకమంత్రం ఏమిటో తెలియక ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఎన్నికల రాజకీయాలే పరమార్థంగా వ్యవహరించే పార్టీలు అధికారం చేపట్టి చేయగలిగే అద్భుతాలేమీ ఉండవు. ఒక కొత్త ప్రభుత్వం రాగానే ప్రజల్లో కూడా విజయోత్సాహం కనిపించిన సందర్భాలు అతి తక్కువ మాత్రమే కనిపిస్తాయి. అటువంటి సమయాల్లో విజయంతో పాటు కొన్ని విధానపరమైన తీవ్రచర్యలు కూడా అమలులోకి వస్తాయి. ఇందిరాగాంధీ అధికారాన్ని చేపట్టినప్పుడు తొలిసంవత్సరాల్లో పార్టీలో అంతర్గత ఆధిపత్యాన్ని సాధించుకోవడం కోసం బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతిశీల చర్యలు చేపట్టారు. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో భూసంస్కరణలు, వెట్టిచాకిరీ రద్దు వంటి కార్యక్రమాలను ప్రకటించారు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మునుపటి నిరంకుశ ఆత్యయిక పరిస్థితి అవశేషాలను తొలగించే చర్యలు, హక్కులను పటిష్ట పరిచే చర్యలు, విదేశాంగ విధానంలో కీలకమయిన మార్పులు ప్రస్ఫుటంగా కనిపించాయి. 1989లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పుడు మండల్ కమిషన్ నిర్ణయాల ఆమోదం ఒక కీలకమయిన నిర్ణయం. రాష్ట్రంలో 1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భం రీత్యా పరిపాలనలో ఒక కుదుపు కనిపించింది. దీర్ఘకాలం కాంగ్రెస్ పాలనలో ఉన్న ప్రజల్లో మార్పు కోసం కనిపించిన తపన, కొత్త పార్టీతో పాటు రంగం మీదకు వచ్చిన కొత్త శక్తులు కొన్ని ప్రగతిశీల నిర్ణయాలకు కారణమయ్యాయి. పై అన్ని సందర్భాలలోనూ ప్రజల నాడితో, ఆకాంక్షలతో ఆయా రాజకీయపక్షాలకు ఎంతో కొంత సంబంధమూ తెలివిడీ ఉన్నాయి.

ఇక గత రెండు దశాబ్దాల నుంచి ప్రజల అభీష్టంతో, ఎన్నికల తీర్పుతో నిమిత్తం లేకుండా అనేక చాపకింద నీరు నిర్ణయాలు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. బొటాబొటి బలమూ అరువుతెచ్చుకున్న బలమూ కలసి ఐదేళ్లు నెట్టుకువచ్చిన పీవీ నరసింహారావు దేశ ఆర్థికవ్యవస్థ దిశనే మార్చే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సంస్కరణల పేరుతో ద్వారాలు బార్లా తెరచిన నిర్ణయాలకు ప్రజల ఆమోదం కానీ, పార్లమెంటు సమ్మతి కానీ అక్కరలేకపోయింది. జనాకర్షణ లేని నేతలే సంస్కరణల యుగానికి అనువైన సారథులయ్యారు. మిశ్రమప్రభుత్వాల అవతరణ, ఒకపక్క వికేంద్రీకరణను, ప్రజాస్వామ్యంలో పెరుగుతున్న వివిధ వర్గాల భాగస్వామ్యాన్ని సూచిస్తూనే, మరో వైపు ప్రపంచప్రభువులకు కలసివచ్చింది. ప్రాంతీయ, సామాజిక అస్తిత్వాలనుంచి పుట్టుకువచ్చిన పార్టీలు కూడా ఆర్థికఅంశాలలో ప్రపంచీకరణవైపే మొగ్గుచూపుతుండడంతో, ప్రభుత్వాలను ఒక పార్టీ కాకపోతే మరొకటి మద్దతు తెలుపుతూ కాపాడసాగాయి. ఈ క్రమంలో ఆర్థిక అంతరాలు, నిర్వాసీకరణ, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ జీవనాధారాల క్షీణత- ఏ పార్టీకి పట్టని సమస్యలుగా మారాయి.

కాంగ్రెస్‌పార్టీ తెలివిగా 2004లో ఈ అంశాలనే ఎన్నికల ప్రచారానికి వాడుకున్నది కానీ, ఇక ఆ అస్త్రం ఆ పార్టీకి కాని దాని ప్రత్యర్థులకు కాని పనికిరానంతగా అరిగిపోయింది. ఇప్పుడు, ప్రజల జీవన్మరణ సమస్యల మీద జరుగుతున్న పోరాటాలు వేరు, రాజకీయపార్టీలు వేరు. పోరాటనేతలు వేరు, ఎన్నికల నాయకులు వేరు. క్షేత్రస్థాయి వాస్తవికతతో పూర్తిగా తెగదెంపులు జరిగిన రాజకీయపార్టీలు ప్రతిపక్షాలుగా మెప్పును పొంది అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయాచితంగా, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వంతుల వారీగా అధికారం దక్కకపోతుందా అని ఎదురుచూడడం తప్ప, ప్రయత్నించి ఏదో ఒక అంశంమీదో విధానంమీదో జనాన్ని కూడగట్టి లేదా జనాభిప్రాయాన్ని స్వీకరించి ప్రజాస్వామ్యపోరాటం చేయాలన్న ధ్యాస పార్టీలకు లేకుండా పోయింది.

యుపిఎ-ఎన్‌డిఎ పరస్పరం నీరసమైన ప్రత్యామ్నాయాలుగా మారిపోయాయని, రాజకీయవ్యవస్థలోనే స్తబ్ధత ఏర్పడిందని రాజకీయవ్యాఖ్యాతలు తరచుగా చెబుతున్నారు. కానీ, ప్రజాజీవనంలో స్తబ్ధత లేదని, ఏ ప్రధాన రాజకీయపార్టీ అండలేకున్నా, తమకు ఎదురవుతున్న సమస్యలను, ముఖ్యంగా ప్రభుత్వాల అభివృద్ధి విధానాల వల్ల ఎదురవుతున్న సమస్యలను తామే ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించవలసి ఉంది. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నది అంటే ఎన్నికల బరుల్లోని ప్రతిపక్షం బలహీనపడిందని మాత్రమే. జనజీవనంలో మరోగొంతు బలపడుతూనే ఉన్నది. చూసే శక్తి, వినే మనసు ఉన్నవారికి అది తెలుస్తూనే ఉన్నది.

No comments:

Post a Comment