Friday, July 27, 2012

రాహుల్ కోసం జనం ఎదురు చూస్తున్నారా?

"రైలు కిటికీలోనుంచి బయటకు చూశాను. రైలుతో పాటు చాలా మంది ప్లాట్‌ఫామ్ మీద నడుస్తూవస్తున్నారు. వారి ముఖాల్లో ఒక విషాదం. అప్పుడే అనిపించింది, ఆ తండ్రి కుమారుడిగా నాకు ఏదో బాధ్యత ఉన్నదని''- రాజీవ్‌గాంధీ అస్థికలను నిమజ్జనం కోసం తీసుకువెడుతూ అలహాబాద్ రైలెక్కినప్పటి జ్ఞాపకాన్ని రాహుల్‌గాంధీ ఒకసారి విలేఖరులతో పంచుకున్నారు. ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి ఇప్పుడాయన సిద్ధపడుతున్నారు. తాను కొత్త నేతను మాత్రమే కాదని, ఒక కొనసాగింపును కూడా అని ఆయన పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నారు.

ప్రజలు మార్పును కోరుకుంటారు. అలాగే, కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా సంక్షుభిత సమయాలలో కొనసాగింపును కూడా కోరుకుంటారు. స్వతంత్ర భారత చరిత్రలో, ప్రజలు చైతన్యయుతంగా అధికారస్థానాల్లోకి ఫలానా వ్యక్తి లేదా పార్టీ రావాలని (లేదా ఫలానా వ్యక్తి లేదా పార్టీ పోవాలని) కోరుకున్న, కోరుకోగలిగిన

Thursday, July 19, 2012

'సంకేత' రాజకీయం, సంక్లిష్ట తెలంగాణ

రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు తెలపాలని జగన్‌పార్టీ నిర్ణయించుకోవడం, ఆ పార్టీ పరిస్థితి తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించే పరిణామమేమీ కాదు. నాయకుడు నిరవధికమైన నిర్బంధంలో ఉన్నాడు. కేంద్రప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడో ఒకప్పుడు కరుణాకటాక్షాలను కురిపించే అవకాశాలను పోగొట్టుకోలేడు. ముస్లిముల నుంచి లభిస్తున్న ఆదరణ రీత్యా బిజెపితో కానీ ఎన్‌డిఎతో కానీ సంబంధం పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల, ఆ పార్టీ రాజకీయాలకు, మద్దతు నిర్ణయానికీ ఎటువంటి వైరుధ్యమూ కనిపించదు. కాకపోతే, జగన్ కూడా కాంగ్రెస్ తానులో ముక్కే, బెయిల్‌కు ప్రతిగా ఓటు- వంటి ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. వాటి వల్ల నష్టం కాంగ్రెస్‌కే తప్ప, జగన్‌కు కాదు. అలాగే, మమతాబెనర్జీ రేపు ప్రణబ్‌కు ఓటుచేయాలని నిర్ణయించుకున్నా పెద్ద ఆశ్చర్యమేమీ కలగదు. ప్రణబ్‌పై ఆమె వ్యతిరేకత సైద్ధాంతికమైనదేమీ కాదు. యుపిఎని ఇబ్బంది పెట్టడం, ఈ సందర్భంలో బెంగాల్‌కు ఏవో ప్యాకేజిలు సాధించడం ఆమె ఉద్దేశ్యాలు కావచ్చు.

కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రణబ్‌ముఖర్జీకి ఓటుచేయడానికి సైద్ధాంతిక, ఉద్యమ అంశాలు అనేకం అడ్డుపడతాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ అంతరాత్మలను ఎట్లా జోకొట్టుకుంటున్నారో తెలియదు కానీ, ప్రజల దృష్టిలో వారి విలువ తగ్గుతుంది. తెలంగాణ పై ప్రజాభిప్రాయం కూడగట్టడానికి ప్రణబ్ ఆధ్వర్యంలో ఏర్పరచిన కమిటీ కాలయాపన తప్ప మరేమీ చేయకుండానే అంతరించిపోయింది. కాంగ్రెస్‌లోను, ప్రభుత్వంలోను రెండో స్థానంలో ఉంటూ వచ్చిన ప్రణబ్, తెలంగాణ ఆకాంక్షకు ఎన్నడూ సానుకూలత వ్యక్తం చేయకపోగా, తరచు వ్యతిరేక భావాలనే ప్రకటిస్తూ వచ్చారు. సోనియా తరువాత కాంగ్రెస్ వైఖరికి బాధ్యత వహించవలసిన వ్యక్తి ప్రణబ్. ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించడం అంటే తెలంగాణ వాదం విషయంలో రాజీ పడడమే. సిద్ధాంతాలూ

Thursday, July 12, 2012

విశ్వరహఃపేటికా విపాటన తప్పదు

అణువూ అణువున వెలిసిన దేవా అని పాటలు పాడుకుంటాము కానీ, దేవుడంటే మనకు బ్రహ్మాండమైన ఊహలే ఉంటాయి. అవతారవశాత్తూ తుచ్ఛ మానవ జన్మ ఎత్తవలసి వచ్చినప్పటికీ, అవసరమైనప్పుడు విశ్వరూపం చూపించి దేవుడు తానెవరో వ్యక్తం చేసుకుంటాడు. అవధులు లేకుండా సకల విశ్వాన్నీ ఆవరించే లింగాకారం కానీ, ఇంతింతై వటుడింతై ఆకాశాన్ని అందుకునే వామనమూర్తి కానీ మనిషి ఊహలోని దేవుడి బృహత్ స్వరూపాన్నే సూచిస్తాయి. సర్వాంతర్యామి, ఆదిమధ్యాంతరహితుడు అయిన ఈశ్వరుడిని సూక్ష్మరూపిగాను, చిల్లరదేవుడిగాను చూడడానికి మనసు ఒప్పుకోదు.

మరిప్పుడు దైవకణం దొరికింది కదా, సృష్టి అనే మహాసౌధం ఏ మట్టీ ఇటుకతో నిర్మితమైందో ఆ దినుసే దైవకణం అనుకుంటే దేవుడనే మహాపదార్థపు మూలకం దొరికినట్టే కదా, కంటికి కనపడని అతిసూక్ష్మకణంలో దైవశక్తి నిక్షిప్తం అయిందని అన్వయం చెబుతున్నారు కదా, ఇక వివాదాలెందుకు, అతీతశక్తి ఉనికిని గుర్తించి

Wednesday, July 4, 2012

సారాంశం, సామాజిక సంక్షోభమే!

ఇరవయ్యేడేళ్ల కిందట కారంచేడు జరిగినప్పుడు అదొక సంచలనం. షాక్. పత్రికా కార్యాలయాల్లో పెద్ద సంరంభం. 'పంట పొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు' అన్న శీర్షికలో దళితుల మారణకాండను మానవీయంగా కథనం చేసిన సందర్భం. మరణాల సంఖ్య పెద్దగా లేకపోవచ్చును. కానీ, ఆ సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కల్లోలితం చేసింది. దళిత కారంచేడు ఖాళీ అయిపోయి చీరాలలో విడిది చేసింది. ఒకనాటి దాడే కావచ్చు, కానీ అది రాష్ట్రంలో దళిత ఉద్యమానికి నాంది పలికింది. సామాజికోద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరచింది.

మరో ఆరేళ్లకు చుండూరు సంఘటన. మరింత దారుణంగా, భీకరంగా, దుర్మార్గంగా దళితులను వేటాడి నరికారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అనేక అంతర్గత విభేదాల మధ్యనే అయినా దళితుల ఐక్యత ప్రస్ఫుటమైంది. దళితుల్లో ఆత్మగౌరవభావన మరింత బలపడింది. మరి మొన్న జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలో జరిగిన మారణకాండ, ఉత్తరాంధ్ర భూసామాజిక సంబంధాల్లోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. కారంచేడు, చుండూరు సంఘటనలనుంచి రూపొందిన దళిత నాయకత్వం లక్షింపేట వెళ్లి నిజనిర్ధారణలు చేసింది. మానవహక్కుల కమిషన్లకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపింది.

విప్లవ, వామపక్ష ప్రజాసంఘాలు, వివిధ ప్రధాన స్రవంతి రాజకీయనాయకులు బాధితులను పరామర్శించారు. కానీ, ఎందువల్లనో, గతంలోని ఆక్రోశం, ఆవేదన, ఆవేశం కనిపించడం లేదు. ఉప ఎన్నికల రాజకీయ సంరంభం వల్ల ఈ సంఘటన మరుగున పడిందని అనిపించినా, అందులో పూర్తి వాస్తవం లేదని అర్థమవుతూనే