Thursday, July 12, 2012

విశ్వరహఃపేటికా విపాటన తప్పదు

అణువూ అణువున వెలిసిన దేవా అని పాటలు పాడుకుంటాము కానీ, దేవుడంటే మనకు బ్రహ్మాండమైన ఊహలే ఉంటాయి. అవతారవశాత్తూ తుచ్ఛ మానవ జన్మ ఎత్తవలసి వచ్చినప్పటికీ, అవసరమైనప్పుడు విశ్వరూపం చూపించి దేవుడు తానెవరో వ్యక్తం చేసుకుంటాడు. అవధులు లేకుండా సకల విశ్వాన్నీ ఆవరించే లింగాకారం కానీ, ఇంతింతై వటుడింతై ఆకాశాన్ని అందుకునే వామనమూర్తి కానీ మనిషి ఊహలోని దేవుడి బృహత్ స్వరూపాన్నే సూచిస్తాయి. సర్వాంతర్యామి, ఆదిమధ్యాంతరహితుడు అయిన ఈశ్వరుడిని సూక్ష్మరూపిగాను, చిల్లరదేవుడిగాను చూడడానికి మనసు ఒప్పుకోదు.

మరిప్పుడు దైవకణం దొరికింది కదా, సృష్టి అనే మహాసౌధం ఏ మట్టీ ఇటుకతో నిర్మితమైందో ఆ దినుసే దైవకణం అనుకుంటే దేవుడనే మహాపదార్థపు మూలకం దొరికినట్టే కదా, కంటికి కనపడని అతిసూక్ష్మకణంలో దైవశక్తి నిక్షిప్తం అయిందని అన్వయం చెబుతున్నారు కదా, ఇక వివాదాలెందుకు, అతీతశక్తి ఉనికిని గుర్తించి
శాస్త్రవిజ్ఞానాన్ని అటకెక్కిద్దామా, రకరకాల దేవుళ్ల మూలవిరాట్‌లకు, మతాల సృష్టి సిద్ధాంతాలకు కొత్త రూపం ఇద్దామా? అసలు ఇంతకీ విజ్ఞాన చరిత్రలో సరికొత్త సంచలన ఆవిష్కరణ అయిన దైవకణంతో దేవుడికేమన్నా సంబంధం ఉందా? మతానికీ శాస్త్రవిజ్ఞానానికీ మధ్య చరిత్రాది నుంచి జరుగుతున్న ఘర్షణ పరిష్కారం కావడమో ముగిసిపోవడమో జరుగుతుందా?

విశ్వాన్ని నడిపించే చలనసూత్రాలు భౌతికశాస్త్రం కిందికి వస్తాయి కానీ, ఆ శాస్త్రం చాలా సంక్లిష్టమయినది. ఆసక్తికీ దానికీ ఆమడదూరం. అందువల్లనే తక్కిన శాస్త్రాల మధ్య కంటె భౌతిక శాస్త్రానికీ అధిభౌతిక శాస్త్రానికీ దగ్గర సంబంధం. వేదాల దగ్గర నుంచి భక్త కవుల దాకా విశ్వావిర్భావాన్ని తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానించారు. వైదికానికి దూరంగానూ, వ్యతిరేకంగానూ ఉన్న వైౖశేషికం, బౌద్ధం వంటి తాత్విక మార్గాలు కూడా విశ్వరహస్యాలను చర్చించాయి. వివిధ ప్రపంచ మతాల పవిత్రగ్రంథాలు కూడా సృష్టిక్రమాన్ని తమదైన రీతిలో నిర్వచించాయి. పెద్ద మతాల కోవలోకి రాని ఆదివాసీ, స్థానిక బహుజన సమాజాల సాంస్కృతిక కథనాల్లో సైతం ప్రపంచపు పుట్టుకను గానం చేయడం కనిపిస్తుంది.

అయినంత మాత్రాన, శాస్త్ర విజ్ఞానాన్నీ ఆధ్యాత్మిక చింతనను ఒకే కోవలోని అన్వేషణలుగా పరిగణించలేము. అలాగని, ఆధునిక శాస్త్ర విజ్ఞాన పద్ధతులు ఇంకా అవతరించని కాలంలో, భౌతిక అధిభౌతిక అన్వేషణల మధ్య ఇప్పుడున్నంత స్పష్టమైన విభజన ఉన్నదనీ చెప్పలేము. ఒక మూలకాన్ని మరొక మూలకంలోకి మా ర్చడం సాధ్యమనే ఊహ నుంచే రసవిద్య పరిశోధనలు క్రీస్తుపూర్వం నుంచే మన దేశంలో జరిగాయి. నాగార్జునుడి వజ్రయానం కానీ, యోగి వేమన పరసువేది కానీ తాత్వికతకు, భౌతిక రసాయన శాస్త్రాలకు ఉన్న గతానుగతిక అనుబంధాన్ని తెలియజేస్తాయి.

పరమాణువుల కంటె పరమపరమాణువులున్నాయన్న ఎరుక కలిగిన నాలుగుదశాబ్దాల తరువాత దానికి ఆధారాలు లభించాయి. అణుగర్భిత కణాలలో కొన్నిటికి ద్రవ్యరాశి ఎందుకు ఏర్పడుతోందన్న ప్రశ్నకు సమాధానం వెదికే క్రమంలో, మరో అంతర్గత కణం ఆ ద్రవ్యరాశిని అందిస్తున్నదన్న ప్రతిపాదన వచ్చింది. దాని నిరూపణకు జరిగిన ప్రయోగాలు ఒక కొలిక్కివచ్చి, ప్రోటాన్లకు ద్రవ్యరాశినిస్తున్న అంతర్గత కణం- అదే హిగ్స్ బోసన్- ఆవిష్కృతమైంది. ఈ ఆవిష్కరణను సైన్స్ పత్రికలు ఇండో-ఆంగ్లికన్ విజయంగా అభివర్ణిస్తున్నారు. శాస్త్రీయనామమైన హిగ్స్‌బోసన్‌లోని బోసన్ ఐన్‌స్టీన్ సహచరుడైన సత్యేంద్రనాథ్ బోస్ వల్ల సంక్రమించడమే కాక, ప్రస్తుత పరిశోధనలో పాలుపంచుకుంటున్న బృందంలో వందమందిదాకా భారతీయశాస్త్రజ్ఞులుండడం ఈ ఆవిష్కరణలో మనదేశానికి సహప్రతిష్ఠ రావడానికి కారణం.

భారతదేశపు భాగస్వామ్యం కూడా పశ్చిమదేశాల పరిశీలకులకు, వ్యాఖ్యాతలకు ఆధ్యాత్మిక కోణాన్ని స్ఫురింపజేస్తుంది. అదేమంత గౌరవప్రదమైన స్ఫురణ కాదు. నిజానికి హిగ్స్‌బోసన్ కణానికి దైవకణం అని పేరుపెట్టింది భారతీయులేమీ కాదు. లియాన్ లిడర్‌మాన్ నోబెల్ రచయిత ఈ అంశంపై రాసిన పుస్తకానికి ప్రచురణకర్తలు వ్యాపారదృష్టితో ఎంచుకున్న టైటిల్‌లో 'గాడ్స్ పార్టికల్' అన్న పదబంధం అవతరించింది. బోసన్ కణం ఉనికిని ప్రతిపాదించిన హిగ్స్ నాస్తికుడు. ఆయనకు తన ఆవిష్కరణకు మీడియాలో ప్రచారమైన పేరు నచ్చలేదు. ఆ పేరు దైవభక్తులను అగౌరవపరిచేదే కానీ, సంతోషపరిచేది కాదు- అని ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మభవుడు, నిరాకారుడు, శక్తిస్వరూపం అని రకరకాలుగా భావించే దేవుడిని శకలాలుగా చూడడం ఆస్తికులకు రుచించదనేది ఆయన అభిప్రాయం కావచ్చు.

దైవకణం ఆవిష్కరణ సందర్భంగా మతతాత్వికుల ఊహలను వైజ్ఞానిక నిరూపణలతో పోల్చడం కాక, భౌతికవాదానికి ఉన్న పురాచరిత్రను స్మరించుకోవడం న్యాయం. విశ్వమంతా కణాలతో నిర్మితమైనది అని ప్రతిపాదించిన కణాదుడు ప్రపంచంలోనే తొలి కణపరిశోధకుడు. ఆ నాటి పరిశోధనలు ప్రధానంగా అనుభవ ప్రధానమైనవి కాబట్టి, నేటి ఆవిష్కరణలతో వాటిని సరిపోల్చకూడదు. చేతిలో అన్నపు మెతుకులను సాధ్యమైనంత చిన్నవిగా చిదిపి, సాధ్యం కానంత చిన్నవిగా అన్నకణాలు మారినతరువాత, విశ్వాన్ని నిర్మించినవి అటువంటి అతి సూక్ష్మకణాలే అని కణాదుడు నిర్ధారించాడట. భారతీయ తత్వశాస్త్రంలో వైశేషిక మార్గానికి చెందిన కణాదుడి తరువాతనే గ్రీస్ తాత్వికులు కణసిద్ధాంతాన్ని కనుగొన్నారట. కణాదుడే కాక, బౌద్ధులయిన దిగ్నాగుడు, ధర్మకీర్తి కూడా ఆయన కణవాదాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

ప్రతి ఆవిష్కరణా కొన్ని సందేహాలను నివృత్తి చేయవచ్చును కానీ, అనేక కొత్త ప్రశ్నలను ముందుకు తెస్తుంది. హిగ్స్ బోసన్‌ల నిర్ధారణకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడానికి భౌతిక శాస్త్రవేత్తలే నిరాకరిస్తున్నారు. మొన్న నాలుగో తేదీన ప్రయోగాల ఫలితాలను ప్రకటించే రోజున కూడా వారు అతి జాగ్రత్తగా తమ ప్రకటనను రూపొందించారు. హిగ్స్‌బోసన్ ఉనికిని నిర్ధారించే సూచనలు మాత్రమే కనిపించాయని, భవిష్యత్ ప్రయోగాలతో వాటిని ఖరారు చేసుకోవలసి ఉన్నదని వారు చెప్పారు. ఈ కణం ఉనికిని తెలుసుకోవడం ద్వారా శాస్త్రవిజ్ఞానం పరాకాష్ఠకు చేరిందని కానీ, దైవం లేదా ఒక మహాశక్తి ఉనికి నిరూపణ అయిందని భావించడం పొరపాటే. శాస్త్రవేత్తల్లో అధికులు అంగీకరించే బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం - భారతీయ విశ్వావిర్భావ సిద్ధాంతానికి సమీపంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ, ఆదిశూన్యం వ్యాకోచించి వ్యాకోచించి ఘనీభవించే క్రమంలో విశ్వం ఏర్పడిందనే ఆ ప్రతిపాదనకు దైవం ఉనికి తప్పనిసరేమీ కాదు. పదార్థప్రపంచం స్వయంచోదితంగా, స్వయంచాలితంగా వ్యవహరించే అవకాశాన్ని ఎవరూ నిరాకరించలేరు.

అట్లాగే, హిగ్స్ పరిధిలోకి అణుకణాలు ప్రవేశించినప్పుడు బోసన్‌లు వాటిలో జీర్ణమైపోతాయని, ఫలితంగా ద్రవ్యరాశి సమకూరుతుందని నిరూపితమైన నూతన సిద్ధాంతానికి దైవశక్తిని జోడించి చూసేవారూ ఉంటారు. విద్యుత్‌శక్తి వల్ల దీపాలు వెలగడం, యంత్రాలు తిరగడం శాస్త్ర విజ్ఞానమే కావచ్చును కానీ, ఆ శక్తికి ఆ గుణం అలవడింది దైవం వల్లనే కదా- అని విశ్వనాథ సత్యనారాయణ ఒక సందర్భంలో రాస్తారు. పరమాణుగర్భిత మహాశక్తి వల్లనే పదార్థం అవతరిస్తే, ఆ శక్తినే దేవుడిగా పరిగణించేవారు అన్ని దేశాల్లోనూ అన్ని మతాల్లోనూ చివరకు శాస్త్రవేత్తల్లోనూ ఉండనే ఉంటారు.

ఈ సందర్భంగా రుగ్వేదం విశ్వావిర్భావం గురించి ఏమి చెప్పిందో చూద్దాం. వేదాలనేసరికి, వాటిని అర్థం చేసుకోవడానికి, వర్ణవ్యవస్థ వివరణనే ప్రధానంగా పరిగణిస్తుంటాము. కానీ, సృష్టి గురించి చెప్పిన ఈ గీతం ఆశ్చర్యకరమైనది.

"అప్పుడు ఉనికీ, రాహిత్యమూ రెండూ లేవు. అంతరిక్షమూ లేదు ఆకాశమూ లేదు. కప్పినదేమిటి, కప్పబడినదేమిటి; చీకటిఅగాధాల్లో దాగినదేమిటి?

......సృష్టికర్త ఎవరు, అతనెప్పుడు ఉద్భవించాడు, ఎప్పుడు సృష్టించాడు, విశ్వసృష్టి తరువాతే దేవుళ్లు పుట్టారు, అటువంటప్పుడు ఆదిన ఏమి జరిగిందో ఎవరికి మాత్రం తెలుసును?'' (రుగ్వేదం 10-129)

సృష్టి తరువాతే సృష్టికర్త పుట్టాడని చెబుతున్న వేదం, ఎన్నో సందేహాలను చర్చకు పెట్టింది. అతీతశక్తిపై విశ్వాసమూ అవిశ్వాసమూ మనిషి పుట్టుకల నుంచే ఉన్నాయి. కలడు కలండనెడు వాడు కలడో లేడో- అన్న సందేహం నిరంతరమైనది. 'పెంజీకటి కవ్వల నెవ్వడు' అన్న అన్వేషణ కొనసాగవలసిందే, ఆ పెంజీకటి మన జ్ఞానమే కావచ్చు, ఆవల ఉన్నది విముక్తే కావచ్చు. జ్ఞానానికీ విముక్తికీ మనకు వేరు వేరు అర్థాలూ ఉండవచ్చు.

1 comment:

  1. నాసదీయ సూత్రం(ఋగ్వేదము 10-129) గురించి ఈమధ్యే ఏదో ఆర్టికల్ ద్వారా చూశాను. ఇంత గాఢంగా వేల ఏళ్ళ క్రితం ఆలోచించగలిగేవాళ్ళు ఈ భూమి మీద వుండేవారనే ఆలోచనే అద్భుతంగా అనిపిస్తుంది.

    ReplyDelete