Thursday, July 19, 2012

'సంకేత' రాజకీయం, సంక్లిష్ట తెలంగాణ

రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు తెలపాలని జగన్‌పార్టీ నిర్ణయించుకోవడం, ఆ పార్టీ పరిస్థితి తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించే పరిణామమేమీ కాదు. నాయకుడు నిరవధికమైన నిర్బంధంలో ఉన్నాడు. కేంద్రప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడో ఒకప్పుడు కరుణాకటాక్షాలను కురిపించే అవకాశాలను పోగొట్టుకోలేడు. ముస్లిముల నుంచి లభిస్తున్న ఆదరణ రీత్యా బిజెపితో కానీ ఎన్‌డిఎతో కానీ సంబంధం పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల, ఆ పార్టీ రాజకీయాలకు, మద్దతు నిర్ణయానికీ ఎటువంటి వైరుధ్యమూ కనిపించదు. కాకపోతే, జగన్ కూడా కాంగ్రెస్ తానులో ముక్కే, బెయిల్‌కు ప్రతిగా ఓటు- వంటి ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. వాటి వల్ల నష్టం కాంగ్రెస్‌కే తప్ప, జగన్‌కు కాదు. అలాగే, మమతాబెనర్జీ రేపు ప్రణబ్‌కు ఓటుచేయాలని నిర్ణయించుకున్నా పెద్ద ఆశ్చర్యమేమీ కలగదు. ప్రణబ్‌పై ఆమె వ్యతిరేకత సైద్ధాంతికమైనదేమీ కాదు. యుపిఎని ఇబ్బంది పెట్టడం, ఈ సందర్భంలో బెంగాల్‌కు ఏవో ప్యాకేజిలు సాధించడం ఆమె ఉద్దేశ్యాలు కావచ్చు.

కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రణబ్‌ముఖర్జీకి ఓటుచేయడానికి సైద్ధాంతిక, ఉద్యమ అంశాలు అనేకం అడ్డుపడతాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ అంతరాత్మలను ఎట్లా జోకొట్టుకుంటున్నారో తెలియదు కానీ, ప్రజల దృష్టిలో వారి విలువ తగ్గుతుంది. తెలంగాణ పై ప్రజాభిప్రాయం కూడగట్టడానికి ప్రణబ్ ఆధ్వర్యంలో ఏర్పరచిన కమిటీ కాలయాపన తప్ప మరేమీ చేయకుండానే అంతరించిపోయింది. కాంగ్రెస్‌లోను, ప్రభుత్వంలోను రెండో స్థానంలో ఉంటూ వచ్చిన ప్రణబ్, తెలంగాణ ఆకాంక్షకు ఎన్నడూ సానుకూలత వ్యక్తం చేయకపోగా, తరచు వ్యతిరేక భావాలనే ప్రకటిస్తూ వచ్చారు. సోనియా తరువాత కాంగ్రెస్ వైఖరికి బాధ్యత వహించవలసిన వ్యక్తి ప్రణబ్. ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించడం అంటే తెలంగాణ వాదం విషయంలో రాజీ పడడమే. సిద్ధాంతాలూ
వైఖరీ పక్కన పెడదాం. తెలంగాణపై నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తున్న యుపిఎ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌పార్టీని దారికి తేవడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఒక సందర్భం.

ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకుని ఎవరెవరు ఏమి సాధించుకుంటున్నారో, సాధించదలచుకున్నారో అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి జగన్మోహనరెడ్డి దాకా నేతలను చూస్తే అర్థమవుతూనే ఉన్నది. మరి ఉద్యమ ప్రయోజనాల కోసం రాష్ట్రపతి ఎన్నికల సందర్భాన్ని ఎందుకు తెలంగాణ నేతలు ఉపయోగించుకోరు? కాంగ్రెస్ సంగతి సరే, తెలంగాణ కోసమే పుట్టి, మనుగడ సాగిస్తున్న టిఆర్ఎస్ ఎందుకు ఉపయోగించుకోదు? విలువైన ఓట్లను ఉత్తిపుణ్యానికి కట్టబెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నది?

తెలంగాణ రాష్ట్రసమితి ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం ఆ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణవాదులకు, రాజకీయ పరిశీలకులకు కూడా మింగుడు పడడం లేదు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం త్వరలో తీసుకోనున్నారని తనకు సంకేతాలు అందుతున్నాయని టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు పదే పదే చెప్పడం వెనుక ఏదో మతలబు ఉన్నదని, ప్రణబ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి తగిన వాతావరణాన్ని కల్పించడానికే ఆయన అట్లా మాట్లాడుతున్నారని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు.

సరే, అటువంటి వ్యూహాత్మక ప్రకటనలు కెసిఆర్‌కు అలవాటే కాబట్టి, ఆ ఊహాగానాలు రావడం అసహజమేమీ కాదు. అటువంటి సంకేతాలు తనకు లేవని, పోరాటమార్గాన్ని కొనసాగించవలసిందేనని తెలంగాణ రాజకీయ జెఎసి నాయకుడు కోదండరామ్ చెప్పడం, కాంగ్రెస్ ఎంపి, తెలంగాణవాది అయిన మధుయాష్కి కూడా తెలంగాణ అనుకూల సూచనలేమీ లేవని కుండబద్దలు కొట్టడం- ఒక కొత్త సన్నివేశానికి తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రమే సిద్ధిస్తుంటే ఇక పోరాటాలెందుకని కెసిఆర్ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. గట్టి ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రజాపోరాటాల ఒత్తిడితో ఆశయసాధన చేయడానికి ఆయన మొదటినుంచి ఏమంత సుముఖులు కారు. టిఆర్ ఎస్ ఆవిర్భావం జరిగిన తొలిరోజుల్లోనే ఆయన 'చొక్కాలు చింపుకుంటేనే ఉద్యమమా? మాది ఆ మార్గం కాదు' అని స్పష్టం చేశారు. అలాగని, ఆయన ఉద్యమాలు ముంచుకువస్తే వాటికి ఎడంగా ఉండేవారు కూడా కాదు. ఆ ఉద్యమ ప్రభావాలను, ఫలితాలను తన రాజకీయాలకు అనుగుణంగా మలచుకోవడానికి ఆయన వెనుకాడేవారు కాదు.

2009 దీక్ష సందర్భంగా ఎగిసిన ఉద్యమానికి కెసిఆర్ ఒక ఆలంబన, సందర్భం మాత్రమే తప్ప, అది ఆయన నిర్మించింది కాదని అందరికీ తెలుసు. గత సంవత్సరం మార్చిలో హైదరాబాద్‌లో జరిగిన 'మిలియన్ మార్చ్'కు ఆయన సుముఖంగా లేకపోయినప్పటికీ, నిర్బంధాలను, నిషేధాలను తట్టుకుని జనం తరలివచ్చాక తన సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ సాధనకు తగినదని తాను అనుకున్న రాజకీయ వ్యూహానికి భంగం కలగనంత వరకు, ఉద్యమాలను అనుమతించడానికి కానీ, సొంతం చేసుకోవడానికి కానీ ఆయన వెనుకాడరు. తెలంగాణ ప్రజా ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వపు రాజకీయ వ్యూహానికీ ఇంతకాలం ఒడిదుడుకులతోనయినా ఉంటూ వచ్చిన ఒక సమన్వయం, సర్దుబాటు ఇప్పుడు చెదిరిపోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ పరిణామంలో మంచీ ఉన్నది, చెడూ ఉన్నది.

పదిహేనేళ్ల తెలంగాణ ఉద్యమం తన ప్రస్థానక్రమంలో సమకూర్చుకున్న విలువలు అమూల్యమైనవి. దీక్షను అర్థంతరంగా ముగించబోయిన నేతను దారికి తేవడానికి విద్యార్థిలోకం రంగంలోకి దిగడంతో 2009లో ఉద్యమం పరాకాష్ఠకు చేరింది. అంతకు ముందునుంచే ఉద్యోగ, విద్యాధిక, సాంస్కృతిక రంగాల ద్వారా ఉద్యమానికి పటిష్ఠమైన సైద్ధాంతిక భూమిక సమకూరింది. చిదంబరం ప్రకటన, మాటమార్పు తరువాత వివిధ రంగాలలో ఏర్పడిన సంయుక్త కార్యాచరణ కమిటీలు ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో విస్తరింపజేశాయి. సకలజనుల సమ్మె- ఉద్యమం విశ్వరూపాన్ని పరిచయం చేసింది. నాయకత్వంలో ఎవరు ఉన్నప్పటికీ, ఉద్యమం తనను తాను సమీక్షించుకోవడం, విమర్శించుకోవడం చేస్తూనే వచ్చింది. ఈ విలువలన్నీ కొనసాగవలసినవే. ఒకవేళ తెలంగాణ ఆకాంక్ష సిద్ధించకపోయినప్పటికీ, ఈ విలువలు తెలంగాణ సమాజాన్ని సుసంపన్నం చేస్తాయి.

తెలంగాణను కోరుకునే రాజకీయ సంస్థల, ఉద్యోగ సంస్థల, ప్రజాసంఘాల సంయుక్త కార్యాచరణ వేదికల నుంచి ఆవిర్భవించిన కొత్త నాయకత్వ శ్రేణి ఉద్యమం తీర్చిదిద్దుకున్నదే. కోదండరామ్ అట్లా ఎదిగివచ్చిన నాయకుడు. తెలంగాణ అనుకూల, ప్రతికూల శక్తుల నుంచి వచ్చిన అనేక ఒత్తిడులను తట్టుకుని, సంకీర్ణ ధర్మాన్ని పాటించవలసి వచ్చినప్పుడు దాని పర్యవసానాలను స్వీకరిస్తూ నిలబడ్డ నేత ఆయన. అభ్యర్థులు తప్ప కార్యకర్తలు, యంత్రాంగం పెద్దగా లేని టిఆర్ఎస్ పార్టీ లోపాలను కోదండ్‌రామ్ ఆధ్వర్యంలోని జెఎసి క్షేత్రస్థాయిలో భర్తీ చేసింది.

ఉద్యమస్థాయికి సూచికలుగా ఉప ఎన్నికల ఫలితాలను చూడడం అలవాటైన నేపథ్యంలో, జెఎసి పని మరింత భారంగా మారింది. ఈ సంవత్సరారంభం నుంచి ఉప ఎన్నికలు తప్ప మరో కార్యాచరణ లేని స్థితిలోకి తెలంగాణ ఉద్యమం వెళ్లింది. నిజానికి మహబూబ్‌నగర్, పరకాల ఫలితాలకు కారణాలు - సకల జనుల సమ్మెను అర్థంతరంగా విరమించడం దగ్గర నుంచి, టిఆర్ఎస్ ప్రాబల్యంలో జెఎసి అనుసరించిన సాగదీత వైఖరి దాకా అనేకం ఉన్నాయి. అనుభవాల నుంచి ఆత్మశోధన చేసుకోవడం వల్లనే, ఎట్లాగైనా ఉద్యమాన్ని నిలుపుకోవాలన్న తపన వల్లనే ఇప్పుడు జెఎసి భిన్నస్వరాలు పలకడానికి సాహసించగలిగింది.

తెలంగాణ ఉద్యమం తన విలువలతో పాటు, కోదండరామ్‌ను, జెఎసిలోని భాగస్వామ్యపక్షాల నేతలను, ఉద్యోగ ప్రజాసంఘాల నేతలను కాపాడుకోవాలి. వారి ఉనికి, ఉద్యమం ఏకపక్షం కాకుండా, అవకాశవాద జాడ్యం ఆవరించకుండా కాపాడుతుంది. సెప్టెంబర్ 30న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం తెలంగాణ జెఎసికి ఒక సవాల్. దానికి దూరంగా ఉండాలని కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలను సఫలం కాకుండా జెఎసి ఏమి చేయగలుగుతుందో చూడాలి.

అయితే, తెలంగాణకు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో బలమైన నాయకత్వం కూడా ప్రాణావసరం. మంచో చెడో కెసిఆర్ అటువంటి నాయకత్వాన్ని దశాబ్దానికి పైగా నిలకడగా అందిస్తూ వచ్చారు. ఇతరులు రంగంలోకి వచ్చినప్పటికీ వారెవరూ నిలబడలేకపోయారు. ఎంతో ఆరోగ్యకరమైన విమర్శలను అందించినవారు కూడా నాయకత్వాన్ని అందించలేకపోయారు. రాజకీయ అనుభవం, వాగ్ధాటి, అవగాహన కెసిఆర్‌ను తెలంగాణకు తిరుగులేని నాయకుడిగా చేశాయి. ఆయన మీద ఎన్ని అభ్యంతరాలున్నవారైనా ఆయన సుగుణాలను కూడా అంగీకరించవలసిందే. ఏకఛత్రంగా ఉద్యమాన్ని పార్టీని నడపాలని ఆయన ఆశిస్తారు కానీ, కింది నుంచి ఒత్తిడి వస్తే తనను తాను సవరించుకోక తప్పని పరిస్థితిని అంగీకరిస్తారు కూడా. ఆయన స్థానాన్ని గుర్తిస్తూనే, ఒత్తిడిని సడలించకుండా ఉండడమెట్లాగో ఉద్యమ నాయకత్వం ఆలోచించుకోవాలి.

పార్టీ నాయకత్వం వేరు, ఉద్యమ నాయకత్వం వేరు- అన్న స్థితి తెలంగాణకు మంచిది కాదు. కెసిఆర్‌ది మాత్రమే పై చేయి అయితే, తెలంగాణ ఉద్యమంలో ఇంతకాలం కీలకపాత్ర పోషించిన జనభాగస్వామ్యం అణగారిపోతుంది. అలాగని, ఆయనను పక్కకు తోసేస్తే, బలమైన నాయకత్వం లోపించి క్రమంగా ఉద్యమం సడలిపోయే ప్రమాదం ఉన్నది. ఈ సంక్లిష్ట స్థితిని పరిష్కరించాలని కెసిఆర్ ప్రయత్నించే అవకాశం లేదు కానీ, ఆ భారం కూడా ప్రజలే తీసుకోవాలి, ఉద్యమమే పూనుకోవాలి.

No comments:

Post a Comment