Friday, July 27, 2012

రాహుల్ కోసం జనం ఎదురు చూస్తున్నారా?

"రైలు కిటికీలోనుంచి బయటకు చూశాను. రైలుతో పాటు చాలా మంది ప్లాట్‌ఫామ్ మీద నడుస్తూవస్తున్నారు. వారి ముఖాల్లో ఒక విషాదం. అప్పుడే అనిపించింది, ఆ తండ్రి కుమారుడిగా నాకు ఏదో బాధ్యత ఉన్నదని''- రాజీవ్‌గాంధీ అస్థికలను నిమజ్జనం కోసం తీసుకువెడుతూ అలహాబాద్ రైలెక్కినప్పటి జ్ఞాపకాన్ని రాహుల్‌గాంధీ ఒకసారి విలేఖరులతో పంచుకున్నారు. ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి ఇప్పుడాయన సిద్ధపడుతున్నారు. తాను కొత్త నేతను మాత్రమే కాదని, ఒక కొనసాగింపును కూడా అని ఆయన పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నారు.

ప్రజలు మార్పును కోరుకుంటారు. అలాగే, కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా సంక్షుభిత సమయాలలో కొనసాగింపును కూడా కోరుకుంటారు. స్వతంత్ర భారత చరిత్రలో, ప్రజలు చైతన్యయుతంగా అధికారస్థానాల్లోకి ఫలానా వ్యక్తి లేదా పార్టీ రావాలని (లేదా ఫలానా వ్యక్తి లేదా పార్టీ పోవాలని) కోరుకున్న, కోరుకోగలిగిన
సందర్భాలు అతి తక్కువ. చాలా సార్లు, వారు కోరుకోవలసిన మార్పును వ్యవస్థే శాసిస్తుంది. లేదా, కొనసాగింపే అనివార్యమైన ఎంపిక అయ్యేట్టు పరిస్థితులను కల్పిస్తుంది.

స్వాతంత్య్రానంతరం జాతీయోద్యమ నాయకుల్లోని ఒక ముఖ్యుడిగా ప్రధాని అయ్యారు కాబట్టి, ఆ కొత్త ఉత్సాహం, ఆశావాతావరణం నెహ్రూను జాతిహృదయం మీద ప్రతిష్ఠింపజేశాయి. అంతేతప్ప నెహ్రూయే ప్రధాని కావాలన్నది జనం మనసులో ఉన్న అభీష్టమని చెప్పలేము. లాల్‌బహదూర్‌శాస్త్రి మరణానంతరం ఇందిర ఎన్నిక లో జనం ప్రమేయం లేదు కానీ, 1967 ఎన్నికల్లో, 1971 ఎన్నికల్లో ఆమెను జనం ఇష్టపడ్డారు. ముఖ్యంగా 1971 ఎన్నికల్లో ఆమె ప్రకటిత విధానాలపై జనాకర్షణ బాగా పనిచేసింది.

నిజానికి ప్రజలు, ముఖ్యంగా రాజకీయ అవగాహన ఉన్నవారు. ప్రజాస్వామ్యప్రియులు బాగా కోరుకున్న ప్రభుత్వాలు రెండు. అవి అధికారంలోకి రావడానికి సాధారణ ప్రజలు కూడా సహకరించారు. ఒకటి 1977లో జనతా ప్రభుత్వం. రెండు 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. వ్యక్తిగా పరిగణనలోకి తీసుకుంటే, దేశనాయకత్వం స్వీకరిస్తే బాగుండునని ఒక వర్గం ప్రజలు కోరుకున్న నాయకుడు విశ్వనాథ ప్రతాప్‌సింగ్ ఒక్కరే. అందుకు తగ్గట్టుగానే, అతని పరిపాలన సాపేక్షంగా ఉన్నత ప్రమాణాలతో కొనసాగింది. వాజపేయి గురించి కూడా ఒక వర్గం అటువంటి ఆశలే పెట్టుకుంది కానీ, ఆయనకు సంకీర్ణయుగంలో కానీ అవకాశం దక్కలేదు. ప్రాంతీయ పార్టీలు, సామాజిక పార్టీలు బలం పుంజుకున్న తరువాత జాతీయస్థాయిలో ఏకైక నాయకుడి కోసం జనం ఎదురుచూసే పరిస్థితులే లేకుండా పోయాయి.

పంజాబ్ సంక్షోభ పరిస్థితులలో భాగంగా 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురి అయినప్పుడు, ఆమె వారసుడినే గద్దెనెక్కించవలసిన అగత్యమేదో ఈ దేశప్రజలకు కలిగింది. సానుభూతి అని అంటుంటారు కానీ, అది పూర్తి సరయిన వివరణ కాదు. వారసత్వం కూడా ఒక సహజప్రక్రియే అనుకునే భూస్వామ్య, రాచరిక భావాలు జనంలో బలంగానే ఉన్నాయి. అలాగే, ఒక ప్రాంతంలో, ఒక వర్గం మాత్రమే చేస్తున్న పోరాటాలపై దేశమంతటా సహానుభూతి ఉండదు కాబట్టి, దేశనాయకత్వాన్ని హత్యద్వారా నిర్మూలించడాన్ని జాతివ్యతిరేక చర్యగా భావించి, అందుకు ప్రతిక్రియగా కొనసాగింపును కోరుకునే జాతీయవాద ఉద్వేగాలు కూడా మనలాంటి దేశంలో సహజమే.

1991లో రాజీవ్‌గాంధీ మరణించినప్పుడు కూడా వారసత్వాన్ని సహజమనుకునే భావాలు, వారసుడి ద్వారా కొనసాగింపు జరగాలనే జాతీయవాద ఉద్వేగాలు బలంగానే వ్యక్తమయ్యాయి. అయితే, రెండు విడతల పోలింగ్ విరామంలో రాజీవ్ హత్య జరగడం వల్ల ఆ ఆకాంక్షకు పూర్తి జనామోదం సాంకేతికంగా దొరకలేదు. ఫలితంగా మొదటిసారిగా దేశంలో కాంగ్రెస్‌పార్టీ అత్తెసరు స్థానాలతో, అనుమానాస్పద మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాహుల్‌గాంధీకి కేవలం 21 సంవత్సరాలు. సోనియాగాంధీ సంసిద్ధంగా లేరు. ఫలితంగా- రాజీవ్ హత్యానంతరం జరగవలసిన కొనసాగింపు వాయిదా పడింది. మరో ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత దానికి అవకాశం వచ్చింది.

రెండు దశాబ్దాల కిందట రాజీవ్ హత్య జరిగినప్పటి జాతీయ ఉద్వేగాలు ఇప్పుడు లేవు. కానీ, జాతీయ రాజకీయాలలోని ఏకైక అధిష్ఠాన కుటుంబపు వారసుడికి ఉండే ఒక తిరుగులేని అర్హతకు ఇంకా చెలామణి ఉన్నది. అయితే, ప్రాంతీయపార్టీల నేతల వారసులు సులువుగానే గద్దెలు ఎక్కగలుగుతున్నారు కానీ, జాతీయస్థాయిలో వారసులకు ప్రయాణం నల్లేరు మీద నడకగా లేదు.

ఈ రెండు దశాబ్దాలలో దేశం చాలానే మారింది. జాతీయ స్థాయిలో ప్రభంజనాలు, వెల్లువలు సృష్టించే శక్తి గాం«ధీ-నెహ్రూ కుటుంబానికి ఇప్పుడు లేదు. నిజానికి నినాదాల ద్వారా తప్ప విధానాల ద్వారా జనాన్ని ఆకర్షించే లక్షణం ఆ కుటుంబ నేతలకు లేదు. యథాస్థితిని కొనసాగించడం, తప్పనిసరి అయినప్పుడు తీవ్రమైన మితవాద మార్పులను తీసుకురావడం తప్ప, గత ముప్పై ఏళ్లుగా గాంధీ-నెహ్రూ కుటుంబం దేశరాజకీయాల్లో తీసుకువచ్చిన పెను మార్పులేమీ లేవు. దేశాభివృద్ధిని పారిశ్రామికులకు, అగ్రరాజ్యాలకు అనుకూలంగా నడిపించే కర్తవ్యం నిర్వహిస్తూనే, రాజకీయంగా ఎలాగో ఒక లాగు బండిని నెట్టుకురావడం సంకీర్ణ యుగంలో కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు.

ఇరవయ్యేళ్లుగా అమలు చేస్తున్న నూతన ఆర్థికవిధానాల ఫలితాలు తీవ్రసంక్షోభంగా పరిణమిస్తున్నాయి. అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య ఉన్న అగాధం రకరకాల రూపాలలో వ్యక్తమవుతున్నది. అవినీతి విశ్వరూపం ధరిస్తున్నది. ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. దేశానికి ఒక దిశ అంటూ లేకుండా పోయింది. ఈ తరుణంలో ప్రజలు ఒక కొత్త నాయకత్వం కోసం నిరీక్షిస్తున్నారు. జనజీవనంలో ఒకపాటి మెరుగుదలను తీసుకువచ్చే మార్పు కావాలన్నది ప్రజలలో నిగూఢంగా ఉన్న ఆకాంక్ష. దాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా జనామోదాన్ని పొందడానికి ప్రయత్నించే నేత దొరికితే ప్రజలు స్వీకరిస్తారు. రాహుల్ ఆ కోవలోకి వస్తారా?

ఒరిస్సాలో నియాంగిరి కొండల్లోని ఆదివాసుల ఆవేదనను గుర్తించినప్పుడు, ప్రజాభీష్టాన్ని మన్నించని అభివృద్ధి అనవసరమని చెప్పినప్పుడు రాహుల్ కొంత ఆసక్తిని కలిగించారు. కానీ, అది ఒకానొక ప్రత్యేక సంఘటన మాత్రమే. జానపద యుగంలో రాకుమారుల దేశాటన మాదిరిగా, రాహుల్ కూడా పల్లెనిద్రలు చేసి, దళితుల ఇళ్లలో భోజనాలు చేసి, కాన్వెంటు పిల్లలతో బ్రెయిన్‌స్టార్మింగ్‌లు చేసి లోకానుభవాన్ని గడించడానికి ప్రయత్నించారు కానీ, ఈ దేశమేమిటో దీనికి కావలసిందేమిటో ఆయనకు పిసరంతయినా అర్థమయినట్టు కనిపించదు.

బహుళపక్షరాజకీయ శకాన్ని వెనక్కి తిప్పగలనని భ్రమపడి ఉత్తరప్రదేశ్‌లో చేతులు కాల్చుకున్న రాహుల్‌కు యుగస్వభావం అర్థమే కాలేదు. పార్టీలో యువరక్తాన్ని ఎక్కించడం పేరుతో యువజన కాంగ్రెస్‌లో చేసిన ప్రయోగాలు, కొత్త సీసాలో పాత సారా మాదిరిగానే పరిణమించాయి. కాంగ్రెస్‌పార్టీ స్వభావాన్ని, అందులో నాయకత్వం రూపొందే విధానాన్ని ఆయన తెలుసుకోలేకపోయారనిపిస్తుంది. అధికారం కోసం రాహుల్ వెంపర్లాడని మాట నిజమే కానీ, వెంపర్లాడినా సంక్రమించే పరిస్థితి ఇటీవలి దాకా లేకపోవడం కూడా ఒక వాస్తవం.

కాంగ్రెస్ పార్టీ మహా అస్తిత్వంతో వెలుగొందిన కాలంలో, అది సామాజిక, ఆర్థిక ప్రాబల్యవర్గాలను, వివిధ ప్రజాశ్రేణులను ఒక సమీకరణంలో నిర్వహించడానికి ఎంతో సమర్థత చూపింది. కాంగ్రెస్ శక్తే అందులో ఉన్నది. అయితే, ఇతర రాజకీయపార్టీలు బలపడిన తరువాత, దేశంలోని అనేక ప్రాంతాల, వర్గాల, కులాల రాజకీయ ఆకాంక్షలు పరస్పరం ఘర్షించుకోవడం, అవసరమైనప్పుడు కలసిపనిచేయడం- అనే క్రమంలో కొత్త రాజకీయశక్తులనేకం అవతరించాయి. విచ్ఛిత్తి దశ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఒక సంధానశక్తిగా, విస్త­ృత ప్రజాపునాది ఉన్న సాంప్రదాయ రాజకీయసంస్థగా కాంగ్రెస్‌కు ఇప్పటికీ ప్రాసంగికత ఉన్నది.

అయితే, దాన్ని పూర్వ వైభవ స్థాయికి పునరుద్ధరించడం సాధ్యం కాదు. తన వర్గ, సామాజిక పునాదులను అది పునఃసమీక్షించుకుని ప్రగతిశీలమైన శక్తిగా అవతరించడానికి అంతర్గతంగా పెద్ద కుదుపు రావాలి. ఆ అవసరాన్ని గుర్తించి, తానే ఆ మార్పునకు చోదకుడిగా వ్యవహరించే అవకాశం రాహుల్‌గాంధీకి వచ్చింది. కానీ, తానందుకు సరిపోనని అతను పదే పదే నిరూపించుకుంటూ వస్తున్నారు. అటువంటి రాహుల్ కాంగ్రెస్ భావి నాయకుడైతే, వచ్చే ఎన్నికల్లో దేశప్రధాని కూడా అయితే సాధించగలిగేది ఏమిటి?

ఒక పరిశీలకుడు అన్నట్టు, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా రాహుల్‌గాంధీ రానున్న కాలంలో దేశరాజకీయాలను, విధానాలను నిర్దేశించే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే, అందులో కొనసాగింపే తప్ప, ఇసుమంత కూడా మార్పు అంశం ఉండదనేది ఖాయం.

2 comments:

  1. no one are looking for rahul

    ReplyDelete
  2. ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీల విషయంలో ఆనాటి దేశ పరిస్థితులు అనుకూలించాయి.. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. సంకీర్ణ రాజకీయాల కాలంలో విశాలమైన దేశ ప్రయోజనాలకన్నా ప్రాంతీయ ఆకాంక్షలే ప్రధానమైపోయాయి.. ఇలాంటి పరిస్థితుల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ వచ్చినా, కేతు గాంధీ వచ్చినా రక్షించలేరేమో సార్..

    ReplyDelete