Wednesday, August 22, 2012

అంబేద్కర్ కు దివిటీ కావాలా?

1956లో కనుమూసిన అంబేద్కర్ 1980లకు వచ్చేసరికి మరింతగా ప్రాసంగికం అయ్యారు. 1990ల్లో భారత రాజకీయాలను, సామాజిక సంచలనాలను నిర్దేశించారు. దళితులకే కాదు, సమస్త బహుజనులకూ ఆత్మగౌరవానికీ, అస్తిత్వ పోరాటానికీ ప్రేరణాత్మకమైన సంకేతంగా మిగిలారు. భారతదేశ చరిత్రను, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త వనరుగా అంబేద్కర్ అవతరించారు. 1990 దశకం చివరలో అంబేద్కర్ రచనలు విస్తృత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాక, స్థిరపడిపోయిన ఆలోచనలు అనేకం కల్లోలానికి గురి అయ్యాయి.

భారతదేశంలో వ్యక్తిఆరాధన చావలేదు. ఇంకా ఈ దేశంలో విగ్రహారాధన రాజ్యమేలుతోంది. మతంలోనూ విగ్రహారాధనే, రాజకీయాల్లోనూ విగ్రహారాధనే. మహానాయకులు, మహానాయకారాధన మన రాజకీయాల్లో ఒక కఠోర వాస్తవం. అటువంటి ఆరాధన ఆరాధకులను హీనపరుస్తుంది, దేశానికి చేటు చేస్తుంది. విమర్శను నేను స్వాగతిస్తాను, ఎందుకంటే, మనం నెత్తినపెట్టుకుని పూజించడానికి ముందు ఆ మనిషి నిజంగా గొప్పవాడో కాదో నిర్ధారించుకొమ్మని ఆ విమర్శ మనల్ని హెచ్చరిస్తుంది. కానీ అటువంటి విమర్శ సులభం కాదు. పత్రికలు చేతిలో ఉన్న ఈ రోజుల్లో గొప్పవ్యక్తులను తయారుచేయడం తేలిక. (రనడే, గాంధీ, జిన్నా- వ్యాసంలో బాబాసాహెబ్ అంబేద్కర్, 1943)

గాంధీ తరువాత అతి గొప్ప భారతీయుడెవరు? అన్న హాస్యాస్పదమైన ప్రశ్నతో కొన్ని మీడియాసంస్థలు, సర్వేసంస్థలు కలసి నిర్వహించిన వివాదాస్పదమైన అధ్యయనంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రస్థానంలో నిలిచారట. నిర్వాహకులు ఏ ఫలితం వస్తుందని ఊహించారో, లేదా ఆశించారో, వచ్చిన ఫలితం వారికి ఆశ్చర్యం కలిగించిందో లేదా ఆనందం కలిగించిందో తెలియదు. చిన్నా పెద్దా పత్రికలూ ఛానెళ్లూ మాత్రం ఇదో పెద్ద విశేషం అయినట్టు నానా హంగామా చేస్తున్నాయి. నెహ్రూను జాతి మరచిపోయిందనీ, పటేల్ గ్లామర్ పెరిగిపోయిందనీ, ఇందిరాగాంధీ చెల్లుబాటు తగ్గిపోయిందని, లతామంగేష్కర్ శకం ముగిసిపోయిందనీ రకరకాల నిర్ధారణలు చేస్తున్నాయి.

ఈ సర్వే తతంగం అంబేద్కర్‌కు ఏమంత గౌరవప్రదమైంది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే, మౌలికంగా అధ్యయనమే అశాస్త్రీయంగానూ, అసంబద్ధంగానూ జరిగింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, సెల్‌ఫోన్ తరానికి చెందిన వారు అత్యధికంగా ఈ సర్వేలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమానమైన శాంపిల్ తీసుకోవడం కానీ, విడిగా నిర్వహించిన మార్కెట్ సర్వేలో అన్ని ప్రజావర్గాలను కలుపుకోవడంగానీ, 28 మంది జూరీలో సామాజిక

Tuesday, August 14, 2012

పాలన వానాకాలం, ఫలితం దైవాధీనం

మన పాలకులు చేతకానివారు కాదు. ఘటనాఘటన సమర్థులు. ఆరునూరైనా అవరోధాలెన్ని వచ్చినా చేయదలచుకున్నది చేయగలరు. ఆలోచన వచ్చినదే తడవు దేశం మొత్తాన్ని నలువరసల రహదారులతో స్వర్ణచతుర్భుజం చేయగలరు. అంతర్జాతీయ క్రీడల కోసం మహానగరాలను ముస్తాబు చేయగలరు. ఏడాది తిరిగే సరికి ఆకాశహర్మ్యాలను అవలీలగా నిర్మించగలరు. తలుపులన్నీ తెరిచి, దేశమంతా సరికొత్త సంస్థానాలను అనుమతించగలరు. అన్నవస్త్రాల లోటు మరచి, అణ్వస్తప్రయోగాలు చేయగలరు. అంగారకుడిపైకి లంఘించడానికి కూడా ఆశపడగలరు.

కానీ, కొన్ని చిన్న చిన్న పనులు కూడా వారు చేయలేరు. పల్లెల్లో వానలు పడకపోతే ఏమి చేయాలో వారికి తెలియదు. పట్నాల్లో వర్షం పడితే ఏమి చేయాలో వారికి పాలుపోదు. పోలియోను నిర్మూలించామంటారు, హెచ్ఐవీ మీద యుద్ధం చేస్తున్నామంటారు, హెపటైటిస్-బి కోసం టీకాల విప్లవం చేస్తామంటారు. కానీ, మలేరియాకు ఏమి చేయాలో తెలియదు. అతిసారం ప్రాణాలు తీయకుండా చేయలేరు. దోమ కుడితే, పాము కరిస్తే ప్రాణం కాపాడే మార్గం తెలియదు. పాతాళానికి లోతులు తీస్తారు కానీ, బోరుబావిలో పాపలు పడకుండా చేయలేరు.

ఇంత పొడుగున్నావు, పాము మంత్రం రాదా?- అన్నట్టు, ఇంత ఘనత వహించిన ఆధునిక ప్రభుత్వాన్ని అల్పమైన సమస్యల మీద నిలదీయడం భావ్యం కాదనుకోవచ్చు. టన్ను బరువు ఎత్తగలిగే వస్తాదు కూడా గుండుసూదిని వంచలేకపోవచ్చు. సమస్త శాస్త్రాల ఆవలితీరాన్ని అవలీలగా చేరుకునే పండితుడు, ఒక చిన్న వాగును కూడా లంఘించలేకపోవచ్చు. కానీ, ప్రభుత్వాలనేవి ఏకవ్యక్తి వ్యవస్థలు కావు. వేయి కళ్లతో చూస్తాయి, వేయి చేతులతో పనిచేస్తాయి, వ్యక్తులు, గుంపులు చేయలేని పనులను సునాయాసంగా చేయగలుగుతాయి. కనీసం సైద్ధాంతికంగా, ప్రభుత్వాలనేవి జనసమష్టికి పర్యాయాలు. ఎన్నుకున్న ప్రతినిధుల కనుసన్నలలో పనిచేయవలసిన యంత్రాంగాలు.

కానీ, తామే ఎన్నుకున్నప్పటికీ ప్రతినిధులు తమవాళ్లు కానట్టే, తమ కోసమే ఉన్నదనుకునే ప్రభుత్వం కూడా ప్రజలకు తమది కాదు. అందరి తరఫున ఆలోచించవలసిన నాయకత్వం, అందరి కోసం

Wednesday, August 8, 2012

తాలిబన్లను తప్పు పట్టగలమా?

కర్ణాటక హైకోర్టులో మొన్నటి సోమవారం ఒక పిటిషన్‌ పరిశీలనకు వచ్చింది. మంగళూరుకు చెందిన ఎరిక్‌ ఒజీరియో అనే సాంస్క­ృతిక కార్యకర్త వేసిన పిటిషన్‌ అది. కన్నడ, రోమన్‌, అరబిక్‌, మలయాళం, దేవనాగరి-ఈ అయిదు లిపుల్లో రాసిన కొంకణ సాహిత్యరచనలను అవార్డులకు అర్హంగా పరిగణించాలన్నది ఆ పిటిషన్‌ సారాంశం. పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనను వినిపించగానే, కర్ణాటక ప్రధాన న్యాయమూర్తి విక్రమజిత్‌ సేన్‌ దాని మీద తీవ్రమైన స్పందన చూపించారు. " ఇవన్నీ సంస్థాగతమైన వ్యవహారాలు.  మొన్న శనివారం నాడు జరిగిన సంఘటన మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయవచ్చును గదా, అదెంత అమానుషమైన సంఘటన? '' అని వ్యాఖ్యానించారు. " మీరేదో సంస్క­ృతిని కాపాడుతున్నామని చెబుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వారి మీద దాడులు చేస్తున్నారు. అటువంటివి జరగకూడదు''. అని కూడా న్యాయమూర్తి సేన్‌ ఆవేదన చెందారు.

నిజానికి ఆ పిటిషన్‌కు, ప్రధాన న్యాయమూర్తి స్పందనకు ప్రత్యక్ష సంబంధమేదీ లేదు. ఆ పిటిషన్‌ మంగళూరుకు చెందిన వ్యక్తి వేసింది కావడంతో చీఫ్‌ జస్టిస్‌కు, అంతకు రెండు రోజుల ముందు మంగళూరులో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ఉండాలి. న్యాయమూర్తిగా, విద్యావంతుడిగా, పౌరుడిగా తనలో కలుగుతున్న బాధ ను బాధ్యతాయుతంగా ఆ సందర్భంలో వ్యక్తం చేశారు.

ఇంతకీ జులై 28 నాడు మంగళూరులో ఏమి జరిగింది?

మంగళూరుకు ఐదుకిలోమీటర్ల దూరంలోని పడిలు అనే శివారు ప్రాంతంలో మార్నింగ్‌ మిస్ట్‌ అన్న హోమ్‌స్టే (గెస్ట్‌హౌజ్‌ లాంటిది)లో రాత్రి ఏడున్నరకు కొంతమంది యువతీయువకులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకపై  హిందూ జాగరణ వేదిక (హెచ్‌జెవి) కు చెందిన యాభైమంది దాడిచేసి, దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ఆడపిల్లలను కొట్టడమే కాక, బట్టలు చింపి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ దాడికి కారణం- ఆ పార్టీకి హాజరయినవారిలో కొందరు ముస్లిమ్‌ యువకులు కూడా ఉండడం. హిందూ యువతులు, ముస్లిమ్‌ యువకులు

Wednesday, August 1, 2012

తేనె తుట్టెను కదిలించిన తివారీ కేసు

మఱచిన దలపింపగ నగు!
నెఱుగని నా డెల్లపాట్ల నెఱిగింప నగున్
మఱి యెఱిగి యెఱుగ నొల్లని
కఱటిం దెలుపంగ గమలగర్భుని వశమే!
మరచిపోతే గుర్తుచేయవచ్చు, తెలియనివాడికి తెలియజేయవచ్చు. కానీ తెలిసీ కూడా తెలుసునని ఒప్పుకోవడానికి ఇష్టపడని వంచకుడిని ఎవరు మాత్రం ఏమి చేయగలరు?- ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుని, ఒక బిడ్డకు తల్లినిచేసిన దుష్యంతుని ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ శకుంతల అంతరంగ మథనం అది. ఎంత ప్రాధేయపడింది ఆమె! నిజం చెప్పమని కోరింది. సత్యవాక్యం మహత్యమేమిటో చెప్పింది. కొడుకును కావలించుకుని చూడమంది. అశరీరవాణి చివరకు కల్పించుకుంటే కానీ, దుష్యంతుడు దారికి రాలేదు.

నారాయణ్‌దత్ తివారీ విషయంలో శకుంతల కాదు, భరతుడే నాలుగేళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు. తివారీ శాయశక్తులా అడ్డుకున్నాడు. నిరాధారం అన్నాడు, నిజం కాదన్నాడు, రక్తం ఇవ్వనన్నాడు. కొత్త విజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి, ఫోరెన్సిక్ పరీక్షలో నిజం తేలిపోయింది. ఆ నిజం బహిర్గతం కాకుండా ఆపడానికి చివరి నిమిషం దాకా తివారీ ప్రయత్నించాడు. రోహిత్ శేఖర్- తివారీ, ఉజ్జ్వల శర్మల రక్తం పంచుకుని పుట్టినవాడేనని కోర్టు ప్రకటించింది.

ఎంత కాదన్నా ఇంగ్లీషు భాషలో కొన్ని సదుపాయాలున్నాయి. సాంకేతికంగా ఖచ్చితమైన అర్థాలిచ్చే మాటలు ఇంగ్లీషులో దొరుకుతాయి. తివారీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక వాక్యంలో తీర్పు ప్రకటించారు- "తివారీ ఈజ్ రిపోర్టెడ్ టు బి ది బయలాజికల్ ఫాదర్ ఆఫ్ రోహిత్ శేఖర్ అండ్ ఉజ్జ్వల శర్మ ఈజ్ రిపోర్టెడ్ టు బి ది బయలాజికల్ మదర్''. బయలాజికల్ ఫాదర్, మదర్ అన్న మాటలను తెలుగులో ఎట్లా చెప్పాలి? తివారీ, ఉజ్జ్వల శర్మల ఔరసపుత్రుడు రోహిత్ శేఖర్ అని చెప్పవచ్చు.

కానీ, ధర్మశాస్త్రాల ప్రకారం ఔరసపుత్రుడంటే, దంపతుల మధ్య దంపతులకే కలిగిన సంతానం. తివారీ, ఉజ్జ్వల భార్యాభర్తలు కారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ అవివాహితులు కారు. రోహిత్‌శర్మను కన్నప్పుడు