Wednesday, August 1, 2012

తేనె తుట్టెను కదిలించిన తివారీ కేసు

మఱచిన దలపింపగ నగు!
నెఱుగని నా డెల్లపాట్ల నెఱిగింప నగున్
మఱి యెఱిగి యెఱుగ నొల్లని
కఱటిం దెలుపంగ గమలగర్భుని వశమే!
మరచిపోతే గుర్తుచేయవచ్చు, తెలియనివాడికి తెలియజేయవచ్చు. కానీ తెలిసీ కూడా తెలుసునని ఒప్పుకోవడానికి ఇష్టపడని వంచకుడిని ఎవరు మాత్రం ఏమి చేయగలరు?- ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుని, ఒక బిడ్డకు తల్లినిచేసిన దుష్యంతుని ఎదుట నిస్సహాయంగా నిలబడ్డ శకుంతల అంతరంగ మథనం అది. ఎంత ప్రాధేయపడింది ఆమె! నిజం చెప్పమని కోరింది. సత్యవాక్యం మహత్యమేమిటో చెప్పింది. కొడుకును కావలించుకుని చూడమంది. అశరీరవాణి చివరకు కల్పించుకుంటే కానీ, దుష్యంతుడు దారికి రాలేదు.

నారాయణ్‌దత్ తివారీ విషయంలో శకుంతల కాదు, భరతుడే నాలుగేళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు. తివారీ శాయశక్తులా అడ్డుకున్నాడు. నిరాధారం అన్నాడు, నిజం కాదన్నాడు, రక్తం ఇవ్వనన్నాడు. కొత్త విజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి, ఫోరెన్సిక్ పరీక్షలో నిజం తేలిపోయింది. ఆ నిజం బహిర్గతం కాకుండా ఆపడానికి చివరి నిమిషం దాకా తివారీ ప్రయత్నించాడు. రోహిత్ శేఖర్- తివారీ, ఉజ్జ్వల శర్మల రక్తం పంచుకుని పుట్టినవాడేనని కోర్టు ప్రకటించింది.

ఎంత కాదన్నా ఇంగ్లీషు భాషలో కొన్ని సదుపాయాలున్నాయి. సాంకేతికంగా ఖచ్చితమైన అర్థాలిచ్చే మాటలు ఇంగ్లీషులో దొరుకుతాయి. తివారీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక వాక్యంలో తీర్పు ప్రకటించారు- "తివారీ ఈజ్ రిపోర్టెడ్ టు బి ది బయలాజికల్ ఫాదర్ ఆఫ్ రోహిత్ శేఖర్ అండ్ ఉజ్జ్వల శర్మ ఈజ్ రిపోర్టెడ్ టు బి ది బయలాజికల్ మదర్''. బయలాజికల్ ఫాదర్, మదర్ అన్న మాటలను తెలుగులో ఎట్లా చెప్పాలి? తివారీ, ఉజ్జ్వల శర్మల ఔరసపుత్రుడు రోహిత్ శేఖర్ అని చెప్పవచ్చు.

కానీ, ధర్మశాస్త్రాల ప్రకారం ఔరసపుత్రుడంటే, దంపతుల మధ్య దంపతులకే కలిగిన సంతానం. తివారీ, ఉజ్జ్వల భార్యాభర్తలు కారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ అవివాహితులు కారు. రోహిత్‌శర్మను కన్నప్పుడు
ఉజ్జ్వల మరో వివాహంలో ఉన్నది. ఒక వివాహంలో ఉన్న మహిళ బయటివ్యక్తిద్వారా సంతానం కంటే, ఆ పుత్రుడిని ఏమనాలో కూడా మనుస్మ­ృతి, యాజ్ఞవల్క్యస్మ­ృతి చెప్పాయి. చెప్పడమే కాదు, పితరులకు శ్రాద్ధం పెట్టగలిగే యోగ్యత ఉన్న పన్నెండు రకాల పుత్రసంతానంలో ఒకడిగా పేర్కొన్నాయి కూడా.

ఒకనాటి కేంద్రమంత్రి కుమార్తె, అఖిలభారత మహిళా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన ఉజ్జ్వలకు, యువజనకాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తివారీతో పరిచయం ఏర్పడింది. అనేక వాగ్దానాల నేపథ్యంలో శారీరక సంబంధమూ ఏర్పడింది. అప్పటికే ఆమె వివాహిత. భర ్త బి.పి. శర్మ తో విభేదాలు ఉండేవి కానీ, విడిపోలేదు. రోహిత్ కడుపులో పడే నాటికి ఆ వివాహం చెల్లుబాటులోనే ఉండింది. శర్మకు ఆమెకు కూడా ఒక కుమారుడున్నాడు.

ఉజ్జ్వల భర్తతో విడిపోయిన తరువాత, రోహిత్‌ను చేరదీస్తానని, ఉజ్జ్వలను పెళ్లిచేసుకుంటానని చెబుతూ వచ్చిన తివారీ, 1995 నుంచి పూర్తిగా మొహంచాటేస్తూ వచ్చారు. తనకూ, తన సోదరుడికి తండ్రులు వేర్వేరు అని తల్లిద్వారా, అమ్మమ్మద్వారా చిన్నప్పుడే తెలుసుకున్న రోహిత్ 2006 నుంచి తివారీపై పోరాటం ప్రారంభించారు. ఉజ్జ్వల తన భర్తతో కలసి ఉన్న కాలంలోనే పుట్టిన రోహిత్ తన కుమారుడు కాడని తివారీ ఖండిస్తూ వచ్చారు. కోర్టుకు కూడా అదే చెప్పుకున్నారు.

తాను 'అక్రమ' సంతానం కాదని నిరూపించుకోదలచుకున్నానని, తన తండ్రి తనను అధికారికంగా గుర్తించాలని కోర్టును ఆశ్రయించిన రోహిత్‌కు న్యాయస్థానం ఉదారంగా అందుకు అవకాశం ఇచ్చింది. మైనారిటీ తీరిన తరువాత మూడేళ్ల లోపు మాత్రమే అటువంటి వ్యాజ్యానికి వెళ్లడానికి ఆస్కారం ఉండగా, ఏడేళ్లు ఆలస్యమైనా రోహిత్‌కు అవకాశం దొరికింది. తివారీని పరీక్షించడానికి ముందు ఉజ్జ్వల భర్త శర్మ రక్తపరీక్ష జరిపించి, అతను రోహిత్ 'సొంత' తండ్రి కాదని న్యాయస్థానం నిర్ధారణ పొందింది.

వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉన్న ఈ వ్యాజ్యంలో, ఆసక్తికరమైన అంశం- ఇంతకీ రోహిత్ ఏమి కోరుకుంటున్నారన్నదే. అధికారికంగా శర్మ తనయుడిగా నమోదు అయిన రోహిత్, తనకు సామాజికమైన మచ్చ ఉన్నదని ఎందుకు భావించారు? కోర్టు నిర్ధారణ ద్వారా అతను ఏమి సాధించదలచుకున్నాడు? తివారీ ఆస్తుల మీద తనకు ఆసక్తి లేదని అతను, అతని తల్లి చెబుతూ వస్తున్నారు. బయలాజికల్ సంతానంగా నిర్ధారణ అయినంత మాత్రాన, పూర్తి వారసత్వం కానీ, ఆస్తిలో హక్కుగానీ సంక్రమిస్తాయని చెప్పలేము. అందుకు సుదీర్ఘమైన న్యాయపోరాటం జరగవలసి ఉంటుంది.

తివారీని బాధ్యతారహితుడైన, పురుషాహంకారిగా, దుర్మార్గుడిగా నిరూపించడమే రోహిత్ ఉద్దేశం అయితే, అందుకు అతను ఇంతటి శ్రమ తీసుకోవలసి ఉండిందా? అన్నది మరో ప్రశ్న. తివారీ వ్యక్తిత్వం ఏమిటో, అతని నైతికత ఏమిటో ఆంధ్రప్రదేశ్‌లో వెల్లడయిన అంశాలే చెబుతున్నాయి. రోహిత్ వ్యాజ్యం అప్పటికి ప్రాథమికదశలోనే ఉంది. అప్రదిష్ఠ పాలుచేయడమే అతని ఉద్దేశం అయితే, గవర్నర్ గిరీని వదులుకుని ఇంటిముఖం పట్టవలసిరావడంతో తన ప్రమేయం లేకుండానే అది నెరవేరింది.

శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు తీర్పు తరువాత రోహిత్ ఒక వ్యాఖ్య చేశారు. "నేను అతని అక్రమసంతానం కాదని,అతనే నాకు అక్రమ పిత అని నిరూపణ అయింది''. అభినందనీయమైన వ్యాఖ్య. తల్లిని చెడిపోయిన స్త్రీ అని, పిల్లలని అక్రమసంతానమని నిందించే సమాజం ఎప్పుడూ మగవాడిని వేలెత్తి చూపదు. రోహిత్ అన్నట్టుగానే, ఇందులో అతని ఆత్మాభిమానం, వ్యక్తిత్వం నిరూపితమై, తివారీ దుర్మార్గమే ఆవిష్క­ృతమైంది.

తన పోరాటం ఇంకా కొనసాగుతుందని చెబుతూ రోహిత్, మన చట్టాల్లో నుంచి అక్రమసంతానం, ఉంపుడుగత్తె, బాస్టర్డ్ వంటి మాటలను తీసేయాలని, పెళ్లి లేకుండా సహజీవనాన్ని అనుమతిస్తున్న ప్రస్తుత కాలంలో ఆ మాటలకు కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించాడు. సమాజం విసిరే తిట్లకు, చేసే ఆపాదనలకు వ్యతిరేకంగా మాత్రమే రోహిత్ పోరాటం చేసి ఉంటే, అదొక చరిత్రాత్మకమైనది. ఫలానా వ్యక్తి తనను కుమారుడిగా అంగీకరించాలని ఇట్లా పోరాడడం దేశంలో మునుపెన్నడూ జరగలేదు.

దేశంలో వివాహ, మానవసంబంధాలను నిర్వచించే సామాజిక విలువలు కానీ, నియంత్రించే చట్టాలు కానీ కాలానుగుణమైన సవరణలు పొందాలని రోహిత్ కేసు సూచిస్తున్నది. సంతానంపై తండ్రులకు ఇప్పటికీ తిరుగులేని అధికారాన్ని ఇస్తున్న చట్టాలు ఒకవైపు, తన సంబంధాలను, సంతానాన్ని గుర్తించను పొమ్మనే పురుషులు మరొకవైపు ఈ సమాజంలో సహజీవనం చేస్తున్నారు. ఆస్తిపంపకాలు, వారసత్వం, కులం- ముడిపడి ఉన్న వివాహ, వారసత్వ స్మ­ృతులు పురుషుడు కేంద్రంగా, సంపన్నులకు కులీనులకు అనుకూలంగా కొనసాగుతున్నాయి.

మరొక వివాహంలో ఉండగా ఇతరుల వల్ల కలిగిన సంతానానికి ఎటువంటి హక్కులు ఉంటాయనే విషయంలో న్యాయపండితులు రేపు తలలు బద్దలు కొట్టుకోవలసి వస్తుంది. ఎందుకంటే, ఏ సంతానమైనా ఆ తల్లి భర్తకే చెందినదని మన ధర్మశాస్త్రాలు, చట్టాలు విశ్వసిస్తాయి. వివాహం వెలుపలి వ్యక్తికి పితృత్వహక్కు ఇవ్వాలనుకుంటే, ఎన్నో అనుబంధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే, ఢిల్లీ న్యాయస్థానం- ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ బయలాజికల్ పితృత్వాన్ని మాత్రమే నిర్ధారించింది. రక్తం పంచుకున్నవాడని అంగీకరించినంత మాత్రాన తివారీ ఆస్తులను రోహిత్ పంచుకోగలడో లేదో తెలియదు.

పాలక రాజకీయాలలో తలపండిన వారి వ్యక్తిగత జీవితంలోని బాధ్యతారాహిత్యం, అనైతికతను మరొకసారి రోహిత్ కేసు బట్టబయలు చేసింది. ఇది నా వ్యక్తిగత జీవితం, నేనెవరికీ జవాబుదారీని కాదు- అన్న తీరులో తివారీ వ్యాఖ్యానిస్తున్నారు. రాజభవన్ ఉదంతం బయటపడినప్పుడు సైతం ఆయన- నేనే తప్పు చేయలేదు, అయినా క్షమాపణలు చెబుతున్నా- అన్నారు. మానవసంబంధాలు ఎంతటి వ్యక్తిగతమైనప్పటికీ, వాటిలోని భాగస్వాముల మధ్య స్వేచ్ఛాయుతమైన అంగీకారం, బాధ్యత లేకపోతే- అవి సమాజానికి సమస్యలే అవుతాయి. అసహాయులైన చిన్నపిల్లలతో లైంగిక సేవలు తీసుకోవడం వ్యక్తిగత వ్యవహారం కాదు. తనకు వారసులు లేరు కాబట్టి, సంతానం కావాలని కోరి ఆ తరువాత మొహం చాటేయడమూ వ్యక్తిగతం కాదు. మానవసంబంధాలలో వస్తున్న ప్రజాస్వామికతను పాత తరం విలువలతో అడ్డుకోవడం ఎట్లా తప్పో, కొత్త విలువల పేరు చెప్పి పాతరకం లైంగికదోపిడీని కొనసాగించడం కూడా అట్లానే తప్పు.

పురుషవిలువలతో లుకలుకలాడే సమాజం, పురుషాహంకార బాధిత స్త్రీలనే కాదు, వారి సంతానాన్ని కూడా నీచంగా చూస్తుంది. కుమిలిపోకుండా, చాటుమాటుకు వైదొలగి కించపడకుండా బాహాటంగా అన్యాయాన్ని ఎదిరించడానికి సాహసించే కొత్త తరాన్ని రోహిత్ కేసు పరిచయం చేసింది. రక్తపరీక్షకే తివారీ విలవిలలాడాడు. రోహిత్, అతని తల్లి ఈ దేశ సామాజిక చిత్రపటం మీద అంతకంటె పెద్ద పరీక్షకు నిలబడ్డారు.

3 comments:

 1. తీర్పు వచ్చిన రోజున, రోహిత్ ఒక అద్భుతమైన మాట అన్నారు. తాను అక్రమ సంతానం కాదని, తివారీనే అక్రమ తండ్రి అని. నిజమే మరి. ఈ మధ్యనే ఒక సినిమా చూశాను "టీ విత్ ముస్సోలినీ " అందులో ఒక పాత్ర ఈ విధంగా అంటుంది:

  There are no illegitimate children in this world. There are only illegitimate parents.

  ఈ విషయంలో మరిన్ని తెలియని విశేషాలను తెలియచేశారు. Thank you.

  ReplyDelete
 2. చాలా బాగా విశ్లేషించారు, నాకు బాగా నచ్చింది.

  హిందూ ధర్మశాస్త్రం ఆకాలంలో అలాంటి సంతానానికి ఆస్థి హక్కులగురించి ఏమి చెప్పినా, అలాంటి సంతానానికి ఈ కాలానికి తగినట్టుగా న్యాయం జరగాలి. మత విశ్వాసాలకు అతీతంగా పౌరులందరికీ సమంగా వర్తించేలా Uniform Civil Code ఆవశ్యకతను తెలియజేస్తోంది.

  మీ చక్కటి వ్యాసానికి, ధన్యవాదాలు.

  ReplyDelete