Tuesday, August 14, 2012

పాలన వానాకాలం, ఫలితం దైవాధీనం

మన పాలకులు చేతకానివారు కాదు. ఘటనాఘటన సమర్థులు. ఆరునూరైనా అవరోధాలెన్ని వచ్చినా చేయదలచుకున్నది చేయగలరు. ఆలోచన వచ్చినదే తడవు దేశం మొత్తాన్ని నలువరసల రహదారులతో స్వర్ణచతుర్భుజం చేయగలరు. అంతర్జాతీయ క్రీడల కోసం మహానగరాలను ముస్తాబు చేయగలరు. ఏడాది తిరిగే సరికి ఆకాశహర్మ్యాలను అవలీలగా నిర్మించగలరు. తలుపులన్నీ తెరిచి, దేశమంతా సరికొత్త సంస్థానాలను అనుమతించగలరు. అన్నవస్త్రాల లోటు మరచి, అణ్వస్తప్రయోగాలు చేయగలరు. అంగారకుడిపైకి లంఘించడానికి కూడా ఆశపడగలరు.

కానీ, కొన్ని చిన్న చిన్న పనులు కూడా వారు చేయలేరు. పల్లెల్లో వానలు పడకపోతే ఏమి చేయాలో వారికి తెలియదు. పట్నాల్లో వర్షం పడితే ఏమి చేయాలో వారికి పాలుపోదు. పోలియోను నిర్మూలించామంటారు, హెచ్ఐవీ మీద యుద్ధం చేస్తున్నామంటారు, హెపటైటిస్-బి కోసం టీకాల విప్లవం చేస్తామంటారు. కానీ, మలేరియాకు ఏమి చేయాలో తెలియదు. అతిసారం ప్రాణాలు తీయకుండా చేయలేరు. దోమ కుడితే, పాము కరిస్తే ప్రాణం కాపాడే మార్గం తెలియదు. పాతాళానికి లోతులు తీస్తారు కానీ, బోరుబావిలో పాపలు పడకుండా చేయలేరు.

ఇంత పొడుగున్నావు, పాము మంత్రం రాదా?- అన్నట్టు, ఇంత ఘనత వహించిన ఆధునిక ప్రభుత్వాన్ని అల్పమైన సమస్యల మీద నిలదీయడం భావ్యం కాదనుకోవచ్చు. టన్ను బరువు ఎత్తగలిగే వస్తాదు కూడా గుండుసూదిని వంచలేకపోవచ్చు. సమస్త శాస్త్రాల ఆవలితీరాన్ని అవలీలగా చేరుకునే పండితుడు, ఒక చిన్న వాగును కూడా లంఘించలేకపోవచ్చు. కానీ, ప్రభుత్వాలనేవి ఏకవ్యక్తి వ్యవస్థలు కావు. వేయి కళ్లతో చూస్తాయి, వేయి చేతులతో పనిచేస్తాయి, వ్యక్తులు, గుంపులు చేయలేని పనులను సునాయాసంగా చేయగలుగుతాయి. కనీసం సైద్ధాంతికంగా, ప్రభుత్వాలనేవి జనసమష్టికి పర్యాయాలు. ఎన్నుకున్న ప్రతినిధుల కనుసన్నలలో పనిచేయవలసిన యంత్రాంగాలు.

కానీ, తామే ఎన్నుకున్నప్పటికీ ప్రతినిధులు తమవాళ్లు కానట్టే, తమ కోసమే ఉన్నదనుకునే ప్రభుత్వం కూడా ప్రజలకు తమది కాదు. అందరి తరఫున ఆలోచించవలసిన నాయకత్వం, అందరి కోసం పనిచేయవలసిన యంత్రాంగం - కొందరి కోసం ఆలోచించి, కొందరికి ప్రయోజనం చేకూర్చే వ్యవస్థగా వ్యవహరిస్తున్నాయి. పదిమంది లాభం కోసం కోట్ల మందికి నష్టం చేస్తున్నట్టే, తక్షణ లాభం కోసం భవిష్యత్తును అమ్ముకుంటున్నాయి. ఇంటిని కాదని పొరుగుకి వనరులు కట్టబెడుతున్నాయి. స్వేచ్ఛను కాదని పరాధీనతను, ఉమ్మడిని కాదని సొంతలాభాన్ని, ప్రకృతిని కాదని వికృతిని వరిస్తున్నాయి. ఆ లాభసిద్ధాంతంలో అంతా తలకిందుల పురోగతే జరుగుతుంది.

ఆలోచనలు, అవగాహనలు అన్నీ శీర్షాసనమే వేస్తాయి. పేదలే అభివృద్ధి నిరోధకులని, ఆదివాసులే పర్యావరణ విధ్వంసకులని, మేధావులే హింసావాదులని, కార్పొరేట్లు మాత్రమే సంఘసేవకులని ప్రచారం జరుగుతుంది. రోజుకు పాతికరూపాయలతో మనిషి బతకవచ్చునని చెప్పే ఆర్థికవేత్త మూత్రశాలలకు లక్షలు ఖర్చుచేస్తాడు. అవినీతి ద్వారా లక్షల కోట్లు, అధికారికంగా వేల కోట్లు సంపన్నులకు కట్టబెట్టే అధినేత, పేదలకు ఇచ్చే కాసింత సబ్సిడీపై కత్తులు నూరతాడు. ప్రతి ఒక్కరికీ ఒక ఓటున్న పాపానికి కదా, ఇంతింత డబ్బు పంచిపెట్టవలసి వస్తోందని వేదన చెందే ఉదారవాది, అన్ని కోట్ల మంది ఉన్నందుకే కదా ఇంత సంపద సృష్టి జరిగిందని మరచిపోతాడు.

ఈ ఏడాది దేశంలో కనీసం ఐదు రాష్ట్రాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. వానాకాలపు మలిదశలో కొంత మెరుగుదల కనిపిస్తున్నా, ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. వర్షాధార ప్రాంతాల్లో వానలు లేక పంటలు వేయలేదు. బోర్లు పనిచేయడానికి విద్యుత్తు లేదు. కరెంటు ఉత్పిత్తి చేయడానికి, ఆయకట్టు ప్రాంతానికి నీరివ్వడానికి రిజర్వాయర్లలో నీరు లేదు. నీరు లేక పచ్చదనం లేక పశుగ్రాసం కరువు. దానితో పాడిపరిశ్రమకు ఇబ్బంది. మొత్తంగా గ్రామీణాధార జీవనానికి ముప్పు. ఈ దేశ జాతీయాదాయంలో వ్యవసాయం చేసే దోహదం కంటె తమదే అధికమని చెప్పుకునే పారిశ్రామిక, సేవారంగాలు కూడా వానలు లేకపోతే కుదేలయిపోతాయి.

ప్రతిఏడూ సుభిక్షంగా ఉండదని, రుతుచక్రంలో దుర్భిక్షానికి కూడా వంతులు ఉంటాయని తెలిసిన ప్రాచీనులు- చిన్నా చితకా కరువులను తట్టుకోవడం ఎలాగో నేర్చుకున్నారు. వారం పాటు వానలు ఆలస్యమయితేనో, సమయానికి విత్తనాలు ఎరువులు అందకపోతేనో దిగాలు పడవలసిన అవసరం వారికి ఉండేది కాదు. వరుణదేవునికరుణ మినహాయించి, విత్తనాలకు, ఎరువులకి, నీటిని పొలానికి చేర్చే ఇంధనానికీ వారు పరాధీనులుగా లేరు. ఇప్పుడు అభివృద్ధి అతిశయించి, సమస్తమూ బయటినుంచి రావలసిన స్థితికి చేరుకున్నాము. ప్రకృతిసిద్ధంగా లభించేవాటిని రద్దుచేసి మార్కెట్ ద్వారా అందజేస్తామని చెప్పిన ప్రభుత్వాలు- చేతులెత్తేస్తున్నాయి. వానాకాలం చదువులలాగా, దైవాధీనపు పాలన సంక్రమించింది.

మమ్మల్నేం చేయమంటారు చెప్పండి- గట్టిగా అడిగితే పాలకులు చెప్పే సమాధానం అది. అవును, వారికి ప్రకృతిని ధ్వంసం చేయడం వచ్చును కానీ, దాని వైపరీత్యాలను అడ్డుకోవడం రాదు. ఉత్పాతాలను, ఉపద్రవాలను నిరోధించలేరు సరే, తమ చేతుల్లో ఉన్నాయని చెప్పే విషయాలనైనా వారు నియంత్రించగలరా? గ్లోబల్ మాంద్యం రూపాయి పీక పిసికేస్తుంటే ఏమైనా చేయగలరా? చిల్లరవ్యాపారం కూడా మాకే కట్టబెట్టాలి అని అమెరికా శాసిస్తుంటే ఆపగలరా? పెరిగే ధరలను ఆపగలరా? పడిపోయే జీవనప్రమాణాలను నిలపగలరా?

ఏమీ చేయలేరు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది? అది ఉంటుంది, అంతే. నాలుగురోడ్ల కూడలి మీద ట్రాఫిక్ హద్దుమీరకుండా ఆపే తెల్ల పోలీసు కానీ, ఉద్రిక్తతల వేళ లాఠీపట్టుకుని కాపలా కాసే ఖాకీ పోలీసు కానీ- ప్రమాదాల మూలాలను, నేరమూలాలను పరిష్కరించలేరు. వాటిని అదుపు చేస్తారు, అంతే. సంక్షోభాలు తీరం దాటకుండా ప్రభుత్వాలు మాయ చేయడానికి చూస్తుంటాయి. అలలను తరుముతున్నట్టు అభినయిస్తూ, తమ వల్లే కడలి కట్టుబాటులో ఉన్నదని నమ్మబలుకుతాయి.

ఒక ప్రపంచంలో అనేక ప్రపంచాలున్నట్టే, ఒక దేశంలో అనేక సమకాలిక సమాజాలున్నాయి. రెండు సమాజాల విలువలు వేరు, ఒకే రూపాయి చెలామణి విలువ వేరు. అభివృద్ధి నిర్వచనాలు వేరు. తక్షణ అవసరాల ప్రాధాన్యాలు వేరు. అందువల్లనే, అడుగు ప్రపంచంలో తారసపడే సమస్యలను పరిష్కరించడం వారికి తెలియకుండా పోయింది. వ్యాపారం కాని విజ్ఞానం వారికి అవసరం లేదు కాబట్టి, అతిసారకు విషజ్వరాలకు విరుగుడు తెలియదు. పల్లెల్లో, అడవుల్లో, మారుమూల గహనసీమల్లో ప్రాణాలు చవక, కష్టాలు అలవాటు, సహించడం సంస్కృతి.

అక్కడ ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించవచ్చు. నిమ్న ప్రపంచంలోనే కాదు, ఒక్కోసారి తమ సొంత సంపన్న, ఉన్నత, పట్టణ ప్రపంచంలో సైతం ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతుంది. సమస్త సహజసూత్రాలను, లోకజ్ఞానాన్ని విస్మరించి- దురాశ ఒక్కటే విలువగా నిట్టనిలువు అభివృద్ధి పోతపోసిన పట్టణాలు పాలకులకు తరచు ప్రహేళికలవుతాయి. రోడ్లు వాహనాలకు జైళ్లవుతాయి. డ్రెయినేజీలు నోళ్లు తెరుస్తాయి. చెరువులు ఇళ్లలోకి ప్రవహిస్తాయి. రన్‌వేలు మునిగిపోతాయి. భవనాలు కుంగిపోతాయి. అత్యాధునిక జీవన విధానం అపహాస్యం పాలవుతుంది.

బహుశా, పరిపాలన అట్టడుగు నుంచి అక్షరాభ్యాసం చేసుకోవాలి. మెతుకును పట్టుకుని బతుకుబాగోగులను లెక్కవేసే గణాంకశాస్త్రం నేర్చుకోవాలి. అంతరిక్షానికి ఎగిరేముందు, నడకను సరిచేసుకోవాలి. వనరులను పంచుకుంటూ, మంచిని పెంచుకునే విజ్ఞానమేదో తిరిగి అలవడాలి. అందుకోసం, మట్టిమనుషుల చేతికి హక్కులు కాదు, అధికారం కావాలి.

No comments:

Post a Comment