Wednesday, August 8, 2012

తాలిబన్లను తప్పు పట్టగలమా?

కర్ణాటక హైకోర్టులో మొన్నటి సోమవారం ఒక పిటిషన్‌ పరిశీలనకు వచ్చింది. మంగళూరుకు చెందిన ఎరిక్‌ ఒజీరియో అనే సాంస్క­ృతిక కార్యకర్త వేసిన పిటిషన్‌ అది. కన్నడ, రోమన్‌, అరబిక్‌, మలయాళం, దేవనాగరి-ఈ అయిదు లిపుల్లో రాసిన కొంకణ సాహిత్యరచనలను అవార్డులకు అర్హంగా పరిగణించాలన్నది ఆ పిటిషన్‌ సారాంశం. పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనను వినిపించగానే, కర్ణాటక ప్రధాన న్యాయమూర్తి విక్రమజిత్‌ సేన్‌ దాని మీద తీవ్రమైన స్పందన చూపించారు. " ఇవన్నీ సంస్థాగతమైన వ్యవహారాలు.  మొన్న శనివారం నాడు జరిగిన సంఘటన మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయవచ్చును గదా, అదెంత అమానుషమైన సంఘటన? '' అని వ్యాఖ్యానించారు. " మీరేదో సంస్క­ృతిని కాపాడుతున్నామని చెబుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వారి మీద దాడులు చేస్తున్నారు. అటువంటివి జరగకూడదు''. అని కూడా న్యాయమూర్తి సేన్‌ ఆవేదన చెందారు.

నిజానికి ఆ పిటిషన్‌కు, ప్రధాన న్యాయమూర్తి స్పందనకు ప్రత్యక్ష సంబంధమేదీ లేదు. ఆ పిటిషన్‌ మంగళూరుకు చెందిన వ్యక్తి వేసింది కావడంతో చీఫ్‌ జస్టిస్‌కు, అంతకు రెండు రోజుల ముందు మంగళూరులో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ఉండాలి. న్యాయమూర్తిగా, విద్యావంతుడిగా, పౌరుడిగా తనలో కలుగుతున్న బాధ ను బాధ్యతాయుతంగా ఆ సందర్భంలో వ్యక్తం చేశారు.

ఇంతకీ జులై 28 నాడు మంగళూరులో ఏమి జరిగింది?

మంగళూరుకు ఐదుకిలోమీటర్ల దూరంలోని పడిలు అనే శివారు ప్రాంతంలో మార్నింగ్‌ మిస్ట్‌ అన్న హోమ్‌స్టే (గెస్ట్‌హౌజ్‌ లాంటిది)లో రాత్రి ఏడున్నరకు కొంతమంది యువతీయువకులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకపై  హిందూ జాగరణ వేదిక (హెచ్‌జెవి) కు చెందిన యాభైమంది దాడిచేసి, దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ఆడపిల్లలను కొట్టడమే కాక, బట్టలు చింపి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ దాడికి కారణం- ఆ పార్టీకి హాజరయినవారిలో కొందరు ముస్లిమ్‌ యువకులు కూడా ఉండడం. హిందూ యువతులు, ముస్లిమ్‌ యువకులు కలిసి విందు చేసుకుంటున్నారన్న కారణంతో ఆ గుంపు దాడిచేసింది. నిజానికి అక్కడ జరుగుతున్నది ఒక యువతి పుట్టినరోజు వేడుక. దానికి ఆ అమ్మాయి ఆడ, మగ మిత్రులు వచ్చారు. సాధారణమైన విందు తప్ప, అక్కడ మద్య సేవనం గానీ, డాన్సులు కానీ ఏమీ జరగడం లేదు. కానీ, హిందూ అమ్మాయిలను దుష్టసంస్క­ృతినుంచి కాపాడడానికి ఆ గుంపు ఆ దాడికి పాల్పడింది.

మంగళూరులో  ఇటువంటి నైతికపోలీసింగ్‌ కొత్తది కాదు. శ్రీరామసేన కార్యకర్తలు కొందరు  2009లో ఒక పబ్‌ మీద దాడిచేసి, అమ్మాయిలను విపరీతంగా హింసించడం గతంలో సంచలనం కలిగించింది. దానితో అక్కడి బిజెపి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది కూడా. ఆడపిల్లలు రాత్రి ఏడు తరువాత బయట తిరగకూడదని, వారి రక్షణ కోసమే తాము అటువంటి చర్యలు చేపట్టామని శ్రీరామసేన బాధ్యులు బాహాటంగా ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఆ దాడికి అమ్మాయిలు పబ్‌లకు రావడమే కారణమని రాష్ట్ర మహిళాకమిషన్‌ వాదించడం మరొక ఎత్తు. ఎవరైనా హిందూ, ముస్లిమ్‌ యువతీయువకులు స్నేహంగా మెలిగితే వారి మీద దాడులు చేయడం ఒక ఉద్యమంగా చేపట్టిన శ్రీరామసేన దాడుల కారణంగా మంగళూరు ప్రాంతంలో మతపరమైన విభజన, ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిపోయాయి.

ఈ మధ్య గౌహతిలో ఒక పబ్‌ ఎదురుగా టీనేజ్‌ అమ్మాయిని నడిరోడ్డు మీద వస్త్రాపహరణం చేసిన సంఘటన- యావత్‌ దేశాన్ని కలవరపరచింది.  అక్కడ దుశ్శాసనానికి పాల్పడింది, స్త్రీశీల రక్షణ కోసం నడుం బిగించిన రామసేనలో జాగరణ వేదికలో కాదు. సమాజంలోని ప్రాబల్యవిలువల్లో కొట్టుకుపోతున్న సగటు యువకులు. అయినా పెద్ద తేడా లేదు. ఆడపిల్లలను కొట్టడానికి అయినా, లైంగికంగా హింసించడానికయినా - ఎవరి నైతిక బాధ్యతలు వారికి ఉన్నాయి. సంస్క­ృతినో, సోదరీమణులనో రక్షించడమే వారి పవిత్ర కర్తవ్యం!   ఆ పవిత్ర కర్తవ్యం గురించిన స్ప­ృహ పెరుగుతోంది కాబట్టే, కులం కట్టుబాట్లను దాటి పెళ్లిచేసుకునే ఆడపిల్లలను పరువుపేరిట హత్య చేయడం అనాగరక ఉత్తరాదిలోనే కాదు, అభివృద్ధిచెందిన దక్షిణాదిలోనూ పెరిగిపోయింది. అవినీతివర్తన పేరుతో మహిళలను హింసించే ధోరణి, దాన్ని బాహాటంగా టీవీ కెమెరాల ముందు వ్యక్తంచేసే ధైర్యం సమాజంలో పెరిగిపోతోంది. మంగళూరు పబ్‌ సంఘటన విడియో క్లిప్పింగులను రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో దర్శించారట. ఆడవాళ్లను కొట్టే సన్నివేశాలను చూసి పరవశించడం మన రక్తంలోనే జీర్ణించుకుపోయింది. కావాలంటే, డెబ్భై యెనభైయ్యేళ్ల సినిమా చరిత్రను తిరగేయండి. నిన్నా రేపూ విడుదలయ్యే సరికొత్త చలనచిత్రాలని చూడండి.  

ఈ మధ్యనే టీవీలో ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన తాజా మరణదండన దృశ్యాలను చూశాం. వివాహేతర సంబంధం కలిగి ఉన్నదనే ఆరోపణపై ఒక తాలిబన్‌ సాయుధుడు, పరదా ధరించిన ఒక స్త్రీని తలకు గురిపెట్టి కాల్చి చంపాడు. అటువంటి సన్నివేశాలను చూసి మనమెంతో నాగరికులమని, సంస్కారులమని సంతృప్తి చెందుతూ ఉంటాము. మన గర్వాన్ని ఒక నిమిషం కూడా నిలవనీయకుండా, అదే చానెల్‌లోనో మరో చానెల్‌లోనో ఒక దేశీయదృశ్యం ప్రత్యక్షమయింది. కరీంనగర్‌జిల్లాలో ఓ గ్రామంలో వివాహేతర సంబంధం ఆరోపణపైనే ఒక స్త్రీని గుంజకు కట్టేసి, ఊరు ఊరంతా కలిసి చెప్పులతో చీపుళ్లతో కొట్టారు, జుట్టుపట్టి ఇష్టమొచ్చినట్టు హింసించారు. చేతిలో తుపాకి లేకపోవచ్చును, ఏదో పవిత్రాశయం కోసం పోరాడుతున్నామన్న అతిశయం లేకపోవచ్చును కానీ- మనకు తాలిబన్లకు మనస్తత్వంలో, విలువల్లో పెద్ద తేడా ఏమీ లేదు.  అయితే, సాధారణ వ్యక్తులు తమకు తారసపడిన సంఘటనల విషయంలో అప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తుంటారు తప్ప, మానవసంబంధాల పవిత్రతను కాపాడాలని, హద్దుమీరేవాళ్లను ముఖ్యంగా ఆడవాళ్లను అదుపులో ఉంచాలని తాలిబన్ల వలె ప్రత్యేకమైన కంకణాలేవీ ధరించరు. ఆ లోపం మాత్రం ఎందుకుండాలని కాబోలు,  మన దగ్గర కూడా అటువంటి స్వచ్ఛంద నైతిక రక్షకభటులు తయారవుతున్నారు. మంగళూరు లాంటి చోట్ల సంఘాలు పెట్టుకుని మరీ పనిచేస్తున్నారు.

వ్యవస్థ కేవలం నేరశిక్షాస్మ­ృతి ఆధారంగా నడవలేదు. దానికి సామాజికుల నీతిశతకాల అవసరం కూడా ఉంటుంది. ఒక వ్యవస్థలో చట్టాలు ఏ అవసరం కోసం పనిచేస్తుంటాయో, ఆ వ్యవస్థలోని నీతి కూడా అదే అవసరాల కోసం మరో స్థాయిలో పనిచేస్తుంటుంది. పురుషాధిపత్యాన్ని, అగ్రకులాధిపత్యాన్ని, రకరకాల ఇతర ఆధిపత్యాలను కొనసాగించాలనుకునే వ్యవస్థలో నీతి కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఆధునిక సమాజాల్లో నేరం నిర్వచనం కిందికి రాని వ్యక్తిగత వర్తనలు సామాజిక బాధ్యత, వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి అంశాల ద్వారా నియంత్రితం కావాలి తప్ప, రాజ్యం కానీ, రాజకీయ సామాజిక ప్రాబల్యశక్తులు నేరుగా అదుపు చేయాలని చూడడం సరికాదు. సమాజంతో పాటు, నైతికత కూడా అదే క్రమంలో, స్థాయిలో పరిణామం చెందుతూ ఉంటుంది. పాత సమాజానికి, పాత విలువలకు అంటిపెట్టుకున్నవారికి, కొత్త సమాజానికి, విలువలకు ఘర్షణ నిరంతరంగా ఉంటుంది. కొత్త విలువలన్నీ ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. నైతికతలోనూ అన్ని కాలాలకూ సరిపడే విలువలు కొన్ని ఉండవచ్చు.  వ్యక్తి స్వేచ్ఛను ఒక విలువగా గుర్తిస్తున్నప్పుడు- దాని ఆచరణలో విశృంఖలత కూడా ఎంతో కొంత వ్యక్తమవుతుంది.  స్వచ్ఛందతకు బాధ్యతను జోడించగలిగే వ్యక్తిత్వాన్ని ఆదర్శం చేయడం ద్వారా ఆ విశృంఖలతను అదుపు చేయాలి తప్ప, పోలీసులు నేరాన్ని చూసినట్టు చూడడం ద్వారా కాదు.

ఆడవాళ్లు పబ్‌లకు వెళ్లవచ్చునా అన్న ప్రశ్నకు అర్థమే లేదు, అటువంటివన్నీ మగవాళ్లకే ప్రత్యేకమైనవి- అని శ్రీరామసేన నేత లాగా నిస్సంకోచంగా చెప్పగలిగితే తప్ప. దేశాన్ని అవినీతి మయం చేసే పనిలో  పురుషప్రపంచం బిజీగా ఉన్నప్పుడు స్త్రీలు ఎందుకు సమాజాన్ని రక్షించే ప్రయత్నం చేయాలో తెలియదు. తాము అభిమానించే పార్టీ శాసనసభ్యులు చట్టసభల్లో నీలిచిత్రాలు వీక్షిస్తున్నప్పుడు, అమాత్యవర్యులు స్వయంగా టూరిజం ప్రమోషన్‌ పేరుతో సముద్రతీర రేవ్‌ పార్టీలు నిర్వహించినప్పుడు- ఆ సంఘసేవకులు వాటిని అనైతికం అని అనుకోలేదు. చట్టాలు నేరుగా ప్రవేశించకుండా దూరంగా మిగిలిపోయే సందర్భాలలో, ముఖ్యంగా వేషభాషలు, స్నేహాలు వంటి వ్యక్తిగత జీవనసరళికి సంబంధించిన అంశాలలో- మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చి బెత్తం ఝళిపించే హక్కు ఎవరికైనా ఉన్నదా? ఉంటే వారిని ఫాసిస్టులని తప్ప మరోపేరుతో పిలవగలమా? 

సమాజంలో స్థిరపడి ఉన్న పురుషాధిక్య విలువలనుంచి బయటపడకుండా మిగిలిన వారు  తమ కుటుంబసభ్యులనో, తోటి సామాజికులనో నైతికంగా అదుపు చేయడానికి పూనుకున్నప్పుడు- వారికి ప్రజాస్వామ్యవిలువలను పరిచయం  చేసి,  మార్పు తేవడానికి అవకాశం ఉంటుంది. కానీ, సరికొత్త హంగులు చేర్చుకున్న మతఛాందసం నుంచి, ఫాసిస్టు రాజకీయ లక్ష్యాల నుంచి స్త్రీల మీద నైతిక పోలీసింగ్‌ విరుచుకుపడుతున్నప్పుడు- దానికి అడ్డుకట్ట వేయడానికి పెద్ద పోరాటమే అవసరం అవుతుంది.

5 comments:

 1. ౨. అభిషేక్ మను సింగ్వి, ND TIwari, medarna, recent haryana ministers not listed in the article? BJP guys might be watching porn. congress guys are making porn. If you see so called 4th estate... media is showing porn and mostly porn. all tv channels showing porn clips repeatedly for hours. if you open TOI you can see porn and links directly from there. they are all secular so its not a crime?
  2. Assom molestation is not related to the BJP or any hindutva orgs.
  3. karimnagar incident also noway related to hindutva orgs.
  4. if you write something in top and bottom about hindutva and add all other unrelated junk in between it wont be counted in hindutva.
  5. I am noway justifying any type of human/women rights.
  6. Why media is covering these issues as trp events rather than showing responsibility?
  7. Media shows so much porn and promote almost pornfilms(i dont need to say about jism)... and media takes moral highground if somebody watches porn.
  8. the day will come when some bjp guys watch porn in times of india in mobile and that news will come in the same site as news.

  ReplyDelete
 2. కరీంనగర్‌జిల్లా సంఘటన లో మీ అభిప్రాయం తో 100 శాతం ఏకీభవిస్తాను.

  ReplyDelete
 3. Don't worry, we too will be culturally advanced like the west. A day will come where no women& men would be mating in parks, pubs in public like animals and conservatives would be sipping coffee beside them without any feelings.

  We are culturally advancing, no doubt if most of our towns would transform in to Los Vegas gambling dens - a 'free' society.

  ReplyDelete
 4. ప్చ్, మీ పోలిక అసంబద్ధంగా వుంది. అసభ్యంగా దుస్తులేసుకుని, బరి తెగించి మగాళ్ళతో విచ్చలవిడిగా తిరగడం చూసి, తమ పిల్లలు అలా తయారవుతారేమో అనే భయంతో శిక్షించడం జరిగివుంటుంది. ఓ సమాజంలో వుంటూ సమాజం కట్టుబాట్లకు విరుద్ధంగా బట్టలిప్పి తిరుగుతా అంటే సమాజం శిక్షలకు తయారయి వుండాలి.

  ReplyDelete
  Replies
  1. మీరు అసభ్యం, విచ్చలవిడి అని దేనిని అంటున్నారో అది నైతిక విలువలు అని సమాజం నిర్వచించుకున్న వాటి మీద ఆధారపడి ఉండదా? అయితే ఆ నైతిక విలువలు ఆదర్శాలు gender, class specific అవ్వడం ఎంతవరకు సబబు?
   By the way public nudity and mating in public are crime in most of the countries including Western countries.

   Delete