Wednesday, September 26, 2012

అడుగుజాడ

'ఎవడు బతికేను మూడు యాభైలు' అన్నది ఒక చైనా సామెత. 'మరో మూడు యాభైలు' అన్న పుస్తకం శీర్షికకు మూలం ఏమిటో చెప్పడానికి శ్రీశ్రీ దాన్ని ఉటంకించారు. మూడు యాభైలు బతకడం అంత దుస్సాధ్యమా? 'బ్రతికి, చచ్చియు, ప్రజల కెవ్వడు బ్రీతి కూర్చునొ' అట్టివాడు మూడు యాభైలేమి, అనంతకాలం జీవిస్తాడు, గురజాడ అప్పారావు లాగా.

చరిత్రకు కృతజ్ఞులము కాకపోతే, భవిష్యత్తే లేదు. దారిచూపిన అడుగుజాడలను కళ్లకు అద్దుకోకపోతే వర్తమానానికి అర్థమే లేదు. కొత్తపాతల ప్రాతః సంధ్యలో మహోదయమై మెరిసిన మహాకవి, ఆగామికాలానికి ఆవశ్యకమైన ప్రజాస్వామ్యభావాలను అందరికంటె ముందుగా కనిపెట్టి పంచిపెట్టిన వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు నూటాయాభైయవ జయంతిని
నేడు తెలుగు ప్రపంచమంతా వినమ్రంగా, వేడుకగా జరుపుకుంటున్నది. అనంతరకాలాలకు కూడా సమకాలికుడై, జీవనదియై తెలుగు సాహిత్యక్షేత్రాన్ని సుభిక్షం చేస్తున్న ఆదిమేధావికి, అరుదైన సంస్కారికి అక్షరప్రపంచమంతా అభివాదం చేస్తున్నది.

'ఆయన జన్మించింది 19వ శతాబ్దిలో, వ్రాసింది 20వ శతాబ్ది కోసం, 21వ శతాబ్ది కోసం'- 1962 సెప్టెంబర్21 నాడు గురజాడ శతజయంతి సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో నాటి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రాసిన సంపాదకీయం తొలివాక్యాలు అవి. గురజాడ రచనల అర్థాన్ని, పరమార్థాన్ని సమకాలికులే కాదు, అనంతర దశాబ్దాల సాహిత్యకారులు కూడా గ్రహించలేక పోయిన మాట నిజం. కాలాతీత వ్యక్తిత్వం ఒక ప్రశంసగానో అతిశయోక్తిగానో బాగానే ఉంటుంది కానీ, సమకాలానికి చెందకుండా ఎవరూ ఉండరు. కానీ, ఒక కాలపు అత్యుత్తమ సృజనా దార్శనికతా ఏదో ఒక స్థలానికి సమూహానికి చెందిన వ్యక్తులనో, వ్యక్తినో వాహిక చేసుకుని అవతరిస్తుంది. బహుశా, గురజాడను కాలమే ఎంపిక చేసుకుని ఉండాలి. ఏకకాలంలో అనేక కాలాలు, సమాజాలు సహజీవనం చేసే భారతదేశం వంటి దేశంలో, అత్యున్నతమైన భావధారను వెనువెంటనే అందరూ స్వీకరించే పరిస్థితి ఉండదు.

అంతెందుకు, అనేక ఉద్యమాలతో పెనవేసుకుని ఎదిగిన తెలుగుసాహిత్యరంగమే, ఇంకా గురజాడను పూర్తిగా ఆవిష్కృతం చేసుకోలేకపోయింది. తెలుగునాట ప్రగతిశీల, సామాజిక సాహిత్య ఉద్యమాలు

Monday, September 24, 2012

తిరణాల జరిపితే తెలుగు బతుకుతుందా?


డీజిల్ ధరలు డీకంట్రోల్ అవుతున్నాయనీ, ఏడో గ్యాస్‌బండ గుదిబండ అవుతుందని, అమెరికా వాళ్లొచ్చి మనదేశంలో ఉప్పూ పప్పూ అమ్ముకుంటారని, విమానయానం దగ్గర నుంచి కేబుల్ వ్యాపారం దాకా ప్రపంచ పెట్టుబడి చేతుల్లోకి పోతుందని- బాధపడడానికి కూడా ఓపిక లేదు. పదవి ఊడితే ఊడింది, నేను చేయవలసింది చేసి తీరతాను అని మన్మోహన్‌సింగ్ తెగబడినట్టే, ఎంత పెంచుకుంటారో ఎంత పంచుకుంటారో దేశాన్ని ఎవరికి కట్టబెడతారో మీ ఇష్టం అని జనమూ చేతులెత్తేశారు. ఏదన్నా చర్చ జరుగుతూంటే, తర్జనభర్జన జరుగుతుంటే, జనాభిప్రాయాన్ని ఎవరైనా కోరుతుంటే- వాటి గురించి మాట్లాడుకుంటే అర్థం ఉంది కానీ, బుల్‌డోజర్‌లతో ఏమి మాట్లాడగలం? మంచిమాట చెప్పినప్పుడు వినకపోతే, చెడిపోయినప్పుడు చూడవలసివస్తుందని సామెత. చూద్దాం, ఎవరు చెడిపోతారో, ఎవరు గెలుస్తారో?

అవినీతులు అక్రమాలు దుర్భరమైపోతున్న జీవనపరిస్థితుల మధ్య తెలుగుభాష గురించి మాట్లాడుకోవడమంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. విదేశీసరుకులు అంగళ్లను ముంచెత్తుతున్న నేటి కాలంలో - అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్, దేశిసరుకుల నమ్మవలెనోయ్ - అని చెప్పిన మహాకవి గురించి మాట్లాడుకోవడం అసందర్భంగానే ఉంటు ంది. సంపాదనా స్వార్థమూ మాతృభాషలుగా చెలామణి అవుతున్నవేళ ఆర్భాటంగా ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు చేసుకోవడం కించిత్ సిగ్గుగానే ఉంటుంది. కానీ, మాట్లాడుకోగలిగినంత వేదన ఇంకా వ్యక్తమవుతున్నప్పుడు మాట్లాడుకోవడమే మంచిది. రాజకీయాల మీదా దేశభవిష్యత్తు మీదా

Thursday, September 13, 2012

గజం మిథ్య, పలాయనం మిథ్య

బొగ్గూ, ఇనుమూ అంటే అటవీప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి, ఎవరో అడ్డుకుంటున్నారని అనుకుందాం, ఆకాశంలో ఉండే స్పెక్ట్రమ్‌ను ఎవరూ అడ్డుకోలేదే, అందులో అవినీతికి కారకులెవరు? లక్ష కోట్లకు పైగా నష్టానికి కారణం ఎవరు? ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంతటి ఆర్థిక నష్టం కలిగించిన దృష్టాంతాలున్నాయా? పైరవీలతో ప్రాపకంతో ప్రభుత్వం నుంచి కారుచవకగా బొగ్గునిల్వలను పొంది, వెంటనే మహాలాభానికి మారుబేరం చేసుకునే బేహారులు దేశానికి చేసిన నష్టం ఎంత?

ఈపాటికే నిర్ణయమైపోయి ఉంటాయోమో కానీ, అవకాశం ఉంటే ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి మరో ఇద్దరి పేర్లు పరిశీలిస్తే బాగుంటుంది. వాళ్లు- చిదంబరం, కపిల్ సిబాల్. వారు ఆవిష్కరించిన 'జీరో లాస్' సిద్ధాంతం ఆర్థిక శాస్త్రంలోనే కాదు, సాధారణ మానవ వివేకంలో కూడా సరికొత్త ఆలోచనలను ప్రవేశపెట్టింది. బొగ్గు కుంభకోణం గురించి చిదంబరం ఏమంటారంటే- కేంద్రప్రభుత్వం బొగ్గు నిల్వలను కొన్ని కంపెనీలకు కేటాయించింది కానీ, ఆ కేటాయింపులు పొందినవారు ఇంకా బొగ్గు తవ్వడం మొదలుపెట్టలేదు కాబట్టి, ఆ వ్యవహారంలో నష్టమంటూ ఏమీ జరగలేదు. 2జి కుంభకోణం సమయంలో కపిల్ సిబాల్ కూడా దాదాపుగా ఇదే సిద్ధాంతాన్ని ఉద్ఘాటించారు. గజం మిథ్య, పలాయనం మిథ్య- అంటే ఇదే కావచ్చు.

కొత్త వాదనతో దొరికాడు కదా అని చిదంబరాన్ని ప్రతిపక్ష బిజెపి చీల్చి చెండాడింది. నీ జేబులో డబ్బు ఎవరన్నా దొంగతనం చేస్తే, ఆ దొంగ డబ్బును ఖర్చు చేసే దాకా నీకు నష్టం జరగనట్టేనా- అని ప్రశ్నించింది. ఒకసారి బొగ్గు నిల్వలను నువ్వు కారుచవకగా కేటాయించాక, వాటి మీద నీకు ఏ హక్కూ ఉండదు. వాడు

Wednesday, September 5, 2012

ఘన నాయకులు, ఖల్ నాయకులు


కొలువుకూటంలో ఉన్న పెద్దమనుషులందరినీ పొగడరా కవీ అని ఒక రాజుగారు ఆజ్ఞాపిస్తే, అసలే కడుపుమండి ఉన్న ఆ కవి- ఈ సభలో ఉన్నవారిలో ఎవరికి ఎవరూ తీసిపోరు, కొందరు భైరవాశ్వములు అయితే, మరికొందరు కృష్ణజన్మమున కూసినవారలు.. అంటూ ఇంత పొడుగు విశేషణాలు చదివి, చివరకు అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే- అని ముగించాడు. అందులోని అర్థాన్ని గ్రహించి రాజు ఆ కవికి కొరడాసత్కారం చేశాడో, కఠినపదాల వెనుక ఏదో ప్రశంసే ఉన్నది లెమ్మని కనకాభిషేకం చేశాడో తెలియదు.

అలీనోద్యమ శిఖారగ్రసదస్సు కోసం ఇరాన్ రాజధానిలో మోహరించిన మహామహులను చూసినప్పుడు ఆ చాటుపద్యం గుర్తుకు వచ్చింది. అంతర్జాతీయ వేదికల మీద వీరంతా బలహీనులు, బడుగుదేశాధినేతలు కావచ్చును కానీ, వారి వారి దేశాల్లో నిరంకుశులు, చండశాసనులే. ప్రజాస్వామ్యంలా కనిపించే మన వంటి దేశాలను వదిలేద్దాం. ప్రభాకరన్‌ను తుదముట్టించింది తానే అన్న అతిశయం ఇంకా వీడని రాజపక్సే టెహరాన్ మెహ్రాబాద్ విమానాశ్రయంలో కూడా రొమ్మువిరుచుకునే కనిపించారు. అమెరికా కీలుబొమ్మగా ఆఫ్ఘనిస్థాన్‌ను ఏలుతున్న కర్జాయ్ కూడా తగుదునమ్మా అంటూ సదస్సుకు వచ్చాడు.

ఇరాక్ ప్రధానమంత్రి కూడా తన గొంతు వినిపించడానికి వచ్చారు. తన భూభాగాన్ని అప్పనంగా అమెరికా యుద్ధకార్యాలకు వేదిక చేసి, ఇప్పుడు చింతిస్తున్న పాకిస్థాన్ కూడా అలీనరాగాన్ని ఆలపించడానికి వచ్చింది. మానవరహిత విమానాల ద్వారా తమ దేశంపై అమెరికా దాడులు చేయడం అన్యాయం అని పాక్ విదేశాంగ మంత్రి టెహరాన్ పత్రికాసమావేశాల్లో ధైర్యంగానే మాట్లాడుతున్నారు. పాక్, ఆఫ్ఘనిస్థాన్ మాత్రమేకాదు,

Monday, September 3, 2012

తరమెళ్లిపోతున్నదో..

పందొమ్మిది వందల డెబ్భై దశాబ్దం చివరి సంవత్సరాలు. అప్పుడప్పుడే ప్రపంచంలోకి, అక్షరప్రపంచంలోకి కళ్లు తెరుస్తున్న రోజులు. ఎమర్జెన్సీ చీకటిరోజులో, దందహ్యమాన దశాబ్దపు వేడిసెగలో బయటిప్రపంచంపై ఎంతటి భయభరిత సంచలనాలను నింపుతున్నా, అంతరంగంలో మాత్రం ఉత్తుంగ ఆశాతురంగాల పరుగులు. ప్రపంచం పచ్చగా కాకపోయినా, పరవళ్లు తొక్కుతున్నట్టు, సమృద్ధతతో సాయుధంగా ఉన్నట్టు అనిపించేది. అట్లా అనిపించడానికి ఉండిన అనేకానేక కారణాలలో- ఒక గొప్ప తరం ఇంకా మా మధ్య నడయాడుతూ ఉండడం.

జాషువా 1970 దశకం మొదట్లోనే, విశ్వనాథ 1976కే దాటుకున్నారు కానీ, ఇంకా అనేకమంది దిగ్దంతులు సజీవంగానే ఉన్నారు. కృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటచలం, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, శివశంకరశాస్త్రి... ఒక పెద్ద కొలువుకూటమే సాహిత్యరంగాన్ని పరివేష్ఠించి ఉండేది. వారందరినీ కలిశామా మాట్లాడామా స్నేహం చేశామా కానీ- వారున్నారన్న ధైర్యం ఏదో ఉండేది. ముత్తాతలు, తాతలు బతికి ఉంటే కలిగే ధీమా లాంటిది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవనే లేదు. 70 దశకం చివర మొదలై, కొన్ని సంవత్సరాలపాటు తారలు రాలిపడుతూనే ఉన్నాయి. 1983లో శ్రీశ్రీ చనిపోయినప్పుడైతే, ఒక తరం హఠాత్తుగా ముగిసిపోయినట్టే అనిపించింది. శ్రీశ్రీ ముందూ వెనుకా అంతా శూన్యం- అని అజంతా అన్నాడంటే, అది శ్రీశ్రీ చేసిన ఖాళీలో దిక్కుతోచక చేసిన పలవరింత! అవును, మునుపటి తరం వెళ్లిపోయినప్పుడు, తరువాతి తరం సిద్ధంగా లేనప్పుడు, ఆ నిష్క్రమణలు కాలధర్మంగా కనిపించవు.

బహుశా, జాతీయోద్యమంతో, నాటి సమకాలిక ప్రజా ఉద్యమాలతో అనుబంధం కలిగిన నాయకులు, రచయితలు, కళాకారులు- వీరిని దేశం కోల్పోతున్నప్పుడు ఒక విషాదం ఆవరిస్తుంది. సామ్రాజ్యవాదాన్ని