Monday, September 3, 2012

తరమెళ్లిపోతున్నదో..

పందొమ్మిది వందల డెబ్భై దశాబ్దం చివరి సంవత్సరాలు. అప్పుడప్పుడే ప్రపంచంలోకి, అక్షరప్రపంచంలోకి కళ్లు తెరుస్తున్న రోజులు. ఎమర్జెన్సీ చీకటిరోజులో, దందహ్యమాన దశాబ్దపు వేడిసెగలో బయటిప్రపంచంపై ఎంతటి భయభరిత సంచలనాలను నింపుతున్నా, అంతరంగంలో మాత్రం ఉత్తుంగ ఆశాతురంగాల పరుగులు. ప్రపంచం పచ్చగా కాకపోయినా, పరవళ్లు తొక్కుతున్నట్టు, సమృద్ధతతో సాయుధంగా ఉన్నట్టు అనిపించేది. అట్లా అనిపించడానికి ఉండిన అనేకానేక కారణాలలో- ఒక గొప్ప తరం ఇంకా మా మధ్య నడయాడుతూ ఉండడం.

జాషువా 1970 దశకం మొదట్లోనే, విశ్వనాథ 1976కే దాటుకున్నారు కానీ, ఇంకా అనేకమంది దిగ్దంతులు సజీవంగానే ఉన్నారు. కృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటచలం, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, శివశంకరశాస్త్రి... ఒక పెద్ద కొలువుకూటమే సాహిత్యరంగాన్ని పరివేష్ఠించి ఉండేది. వారందరినీ కలిశామా మాట్లాడామా స్నేహం చేశామా కానీ- వారున్నారన్న ధైర్యం ఏదో ఉండేది. ముత్తాతలు, తాతలు బతికి ఉంటే కలిగే ధీమా లాంటిది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవనే లేదు. 70 దశకం చివర మొదలై, కొన్ని సంవత్సరాలపాటు తారలు రాలిపడుతూనే ఉన్నాయి. 1983లో శ్రీశ్రీ చనిపోయినప్పుడైతే, ఒక తరం హఠాత్తుగా ముగిసిపోయినట్టే అనిపించింది. శ్రీశ్రీ ముందూ వెనుకా అంతా శూన్యం- అని అజంతా అన్నాడంటే, అది శ్రీశ్రీ చేసిన ఖాళీలో దిక్కుతోచక చేసిన పలవరింత! అవును, మునుపటి తరం వెళ్లిపోయినప్పుడు, తరువాతి తరం సిద్ధంగా లేనప్పుడు, ఆ నిష్క్రమణలు కాలధర్మంగా కనిపించవు.

బహుశా, జాతీయోద్యమంతో, నాటి సమకాలిక ప్రజా ఉద్యమాలతో అనుబంధం కలిగిన నాయకులు, రచయితలు, కళాకారులు- వీరిని దేశం కోల్పోతున్నప్పుడు ఒక విషాదం ఆవరిస్తుంది. సామ్రాజ్యవాదాన్ని
వ్యతిరేకించి, స్వేచ్ఛను ప్రేమించిన తరానికి సంబంధించి, భౌతిక అవశేషాలు కూడా అంతరించిపోవడం బెంగ కలిగిస్తుంది. ఆ తరం తరువాత, ఆ కాలం తరువాత మనుషులు పాత విలువలను పూర్తిగా విసర్జించారని, లేదా కొత్త విలువలను సమకూర్చుకోలేదని, ప్రయాణాన్ని నిలిపివేశారని అర్థం కాదు. కానీ, స్వాతంత్య్రానంతరపు జాతి ప్రస్థానం గతంతో సంబంధం లేనిదేమీ కాదు.

నిజానికి, రాజకీయస్వాతంత్య్రంతో నిమిత్తం లేకుండా, దేశం ఆధునికత మలుపులోకి తచ్చాడే క్రమంలో ఎదురయ్యే సమస్యలే సంక్షోభాలే ఇప్పటికీ దేశాన్ని ఆవరించి ఉన్నాయి. కానీ, దేశీయులను మానసికంగా ఒకటిగా తలపింపజేసే స్మ­ృతి జాతీయోద్యమానిది, దాని సమాంతర ఉద్యమాలది. అవి సృష్టించిన మేరునగధీరులు, శిఖరాయమాన వ్యక్తిత్వాలు అనంతర కాలంలో కనిపించవు. అందుకు సకలరంగాలలో కనిపించే పతనంతో పాటు, ఏకైక నాయకత్వాలు, మహా వ్యక్తిత్వాల కాలం ముగిసి, బహుళ నాయకత్వాల కాలం అవతరించడం కూడా ఒక కారణం. కొత్త తరం కోసం కాలం ఖాళీ కావడం అవసరమే కానీ, పాత తరం వెళ్లిపోయినప్పుడు గుండెపగలడం కూడా మనుషుల నైజమే. కానీ, ఇప్పుడు పెద్దమనుషులు కాలం తీరి వెళ్లిపోతున్నప్పుడు కలుగుతున్న బాధ భిన్నమైనది. వారితో పాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక గుణాలకు కూడా కాలం చెల్లిందన్న దుఃఖం కలుగుతున్నది.

ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్‌లూ వినోబా భావేలు చరిత్రలోకి నడిచివెళ్లిపోయినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సుందరయ్యా రాజేశ్వరరావూ బసవపున్నయ్యా సీతారామయ్యా ఈమధ్యన సత్యమూర్తీ వెళ్లిపోయినప్పుడు- వాళ్లు వెళ్లిపోయారన్నదొక్కటే కాక, చరిత్ర అటకలమీదికి వాళ్లు ఎక్కేశారన్న దిగులూ ఆవరించింది. ఆ మనుషులకు పర్యాయాలుగా ఉండిన విలువలకు చెలామణీ తగ్గిపోతోందన్న ఆవేదనా కలిగింది. కొనసాగింపులు ఉండవా అంటే, ఉంటాయి, వాటికి అంతటి ప్రతిష్ఠ రావడానికి సమయం పడుతుంది. సోషలిస్టు ప్రపంచం నేతిబీరకాయగా మారిపోయిందన్న నిర్ధారణ ఎప్పుడో జరిగిపోయినా సరే, క్రెమ్లిన్ పతనం చెప్పలేని శూన్యాన్ని నింపింది. చైనా సంగతి సరే సరి, అదింకా అభినయిస్తూనే ఉన్నది. ప్రభాకరన్ ప్రపంచపటం మీదకి పెద్దపులిగా లంఘించినప్పుడు, ఎంతటి విభ్రమ, ఎంతటి ఆశ, మొదటి యుద్ధంలో సద్దాం హుస్సేన్ అమెరికాపైకి తొడకొట్టినప్పుడు, ఒకానొకప్పుడు అమెరికాను గడాఫీ ముప్పుతిప్పలు పెట్టినప్పుడు లోకంలో సమతూకం కాపాడే వీరులున్నారని అనిపించింది. కానీ వారంతా వెళ్లిపోయారెళిపోయారెళిపోయారు. ఉలిపికట్టెలుగా ఉండడానికి సాహసించి, లోకం మీద తమ ప్రగాఢ ముద్రను రచించిన బాలగోపాల్, కన్నబిరాన్ కూడా వెళ్లిపోయారెళిపోయారు.

తరమెళ్లిపోతున్నదో, త్యాగాల స్వరమారిపోతున్నదో- అని గోరటి ఎంకన్న పాట రాశాడు. అణువంత స్వార్థమూ అంచుకూ రానీక వెళ్లిపోయిన తరం గురించి రాశాడు కానీ, నిస్వార్థతా, నిరాడంబరత్వమూ, జనహితమూ- కోరినవారే కాదు, తమ బతుకుతో ఆచరణతో కొన్ని విలువలను వెలిగించిన, కొనసాగించిన నిపుణులూ పండితులూ కళాకారులూ కూడా వెళ్లిపోతున్నారు. ఉర్దూ మరాఠీ తెలుగు భాషల సమ్మిశ్రిత దక్కన్ సంస్కతికి ప్రతిరూపంగా నిలిచిన సదాశివతో పాటు, ఆ కోవ కూడా అంతరించిపోయింది. తెలంగాణలోని చిన్నపట్టణంలో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ, శ్రమజీవనం పలికే కఠినవర్ణాలను కుంచెలో పలికించిన కాపురాజయ్యతో పాటు, ఆ మార్గం కూడా ముగిసిపోయింది. చరిత్రను వెలికి తీయడమంటే వర్తమానాన్ని సుసంపన్నం తీయడమేనని నమ్మి, నిష్ఠతో నైపుణ్యంతో పురాతత్వ పరిశోధన చేసిన వి.వి. కృష్ణశాస్త్రి అస్తమయం, ఒక గతించిపోయిన విలువకు అధికారికమైన ముగింపు.

అదేదో అంతరించిపోతున్న భాషలో ఒకే ఒక వ్యవహర్త ఉండి, ఆ ఒక్కడూ మరణించి ఆ భాష చచ్చిపోయిందట. అట్లా మాయమైపోతున్న భాషలెన్నో ఉన్నాయట. కొన్ని తెగల మనుషులు పోతే, వారితోపాటు అంతరించే చరిత్ర, సంస్క­ృతి ఎంతో. అట్లాగే, కొందరు విశిష్ట వ్యక్తులు కాలధర్మం చెందితే, వారితో పాటు పోయే విద్య ఎంతో. బోధన దగ్గరనుంచి పరిశోధన దాకా, కావ్యరచన దగ్గర నుంచి కళా ప్రదర్శన దాకా- ధనార్జనకో ప్రతిష్ఠ కోసమో కాదని, మానవధర్మాల సాధనలో అవి అత్యున్నత రూపాలని విశ్వసించి బతికిన మనుషులు కన్నుమూయడం అంటే, ఆ విశ్వాసాలు మరణించడమే.

అంకిత భావాన్ని, వృత్తినిష్ఠను, జ్ఞానతృష్ణను బతకనీయకుండా ధనసంస్కృతి విజృంభిస్తున్నంత కాలం, మనం ఎంతో అపురూపమైన వారసత్వాన్ని కోల్పోతూనే ఉంటాము. వివేకవంతులను, ధర్మావేశపరులను అడవులకు తరిమివేసి, న్యాయం కోసం నిలిచేవారిని వేటాడి చంపేసి, జ్ఞానానికి విలువ లేకుండా చేసిన తరువాత- మనకిక మిగిలేదేవరు?

మనమిక ఉన్నవారితో సర్దుకుపోవాలి. దేనిలోనూ అభినివేశం లేక, దేనిలోనూ పాండిత్యం లేక, దేనిలోనూ నిష్ఠ లేక, రాజీలకూపోరాటాలకూ నడుమ ఊగిసలాగే వారితోనే సర్దుకుపోవాలి. రామమనోహర్‌లోహియా, జయప్రకాశ్‌నారాయణ్, కర్పూరీఠాకూర్, జగ్జీవన్‌రామ్, వి.పి.సింగ్, ఇందిరాగాంధీ, పి.వి.నరసింహారావు- ఎవరెటువంటివారైనాసరే- వంటి మహామహులను చూసిన తరువాత ఇప్పుడిక చిదంబరాలతోనూ, జైరామ్‌రమేశ్‌లతోనూ సర్దుకుపోవాలి. తమ జీవితకాలంలోనే వెలిగి ఆరిపోయిన వాజపేయి, అద్వానీ, కరుణానిధి వంటి వారి సంగతి వదిలేద్దాం.

ఇప్పుడు వేదిక మీద మిగిలినవారూ, కొత్తగా వేదికను అలంకరిస్తున్నవారూ అందరూ అర్ధరథులే. కాంట్రాక్టర్లూ, కమిషన్ఏజెంట్లూ, కార్పొరేట్‌వకీళ్లతో లుకలుకలాడుతున్న మన ప్రజాజీవితంలో - డబ్బు తప్ప మరో అధికారభాష ఏది? కీర్తిని ప్రలోభాన్ని ధిక్కరించే అక్షరాలెన్ని? రేపటి మీద ఆశతో పెరుగుతున్న పసిపిల్లలకు సగర్వంగా చూపించగలిగే ఆదర్శమూర్తులెవరు? వీరున్నారులే, లోకం ఒంటిపాదంతో అయినా నడుస్తుంది అనుకోవడానికి ఎవరున్నారు? భవిష్యత్తును అనాథ చేయడం కంటె, మరో మార్గం లేదా? వేమన్నను చదువుకున్నవాళ్లు, జాషువాను పాడినవాళ్లు, శ్రీశ్రీని జపించినవాళ్లు, అంబేద్కర్‌ను అధ్యయనం చేస్తున్నవాళ్లు,, వెళ్లిపోయిన తరం నుంచి అంతో ఇంతో సంగ్రహించినవాళ్లు, ఇంకా మిగిలే ఉన్నారు కదా?

No comments:

Post a Comment