Thursday, September 13, 2012

గజం మిథ్య, పలాయనం మిథ్య

బొగ్గూ, ఇనుమూ అంటే అటవీప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి, ఎవరో అడ్డుకుంటున్నారని అనుకుందాం, ఆకాశంలో ఉండే స్పెక్ట్రమ్‌ను ఎవరూ అడ్డుకోలేదే, అందులో అవినీతికి కారకులెవరు? లక్ష కోట్లకు పైగా నష్టానికి కారణం ఎవరు? ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంతటి ఆర్థిక నష్టం కలిగించిన దృష్టాంతాలున్నాయా? పైరవీలతో ప్రాపకంతో ప్రభుత్వం నుంచి కారుచవకగా బొగ్గునిల్వలను పొంది, వెంటనే మహాలాభానికి మారుబేరం చేసుకునే బేహారులు దేశానికి చేసిన నష్టం ఎంత?

ఈపాటికే నిర్ణయమైపోయి ఉంటాయోమో కానీ, అవకాశం ఉంటే ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి మరో ఇద్దరి పేర్లు పరిశీలిస్తే బాగుంటుంది. వాళ్లు- చిదంబరం, కపిల్ సిబాల్. వారు ఆవిష్కరించిన 'జీరో లాస్' సిద్ధాంతం ఆర్థిక శాస్త్రంలోనే కాదు, సాధారణ మానవ వివేకంలో కూడా సరికొత్త ఆలోచనలను ప్రవేశపెట్టింది. బొగ్గు కుంభకోణం గురించి చిదంబరం ఏమంటారంటే- కేంద్రప్రభుత్వం బొగ్గు నిల్వలను కొన్ని కంపెనీలకు కేటాయించింది కానీ, ఆ కేటాయింపులు పొందినవారు ఇంకా బొగ్గు తవ్వడం మొదలుపెట్టలేదు కాబట్టి, ఆ వ్యవహారంలో నష్టమంటూ ఏమీ జరగలేదు. 2జి కుంభకోణం సమయంలో కపిల్ సిబాల్ కూడా దాదాపుగా ఇదే సిద్ధాంతాన్ని ఉద్ఘాటించారు. గజం మిథ్య, పలాయనం మిథ్య- అంటే ఇదే కావచ్చు.

కొత్త వాదనతో దొరికాడు కదా అని చిదంబరాన్ని ప్రతిపక్ష బిజెపి చీల్చి చెండాడింది. నీ జేబులో డబ్బు ఎవరన్నా దొంగతనం చేస్తే, ఆ దొంగ డబ్బును ఖర్చు చేసే దాకా నీకు నష్టం జరగనట్టేనా- అని ప్రశ్నించింది. ఒకసారి బొగ్గు నిల్వలను నువ్వు కారుచవకగా కేటాయించాక, వాటి మీద నీకు ఏ హక్కూ ఉండదు. వాడు
నిల్వలను తవ్వుకున్నాడా లేదా అన్నది ప్రశ్నే కాదు- అని బిజెపి వాదించింది. ఇంత సులువుగా పూర్వపక్షం చేయగలిగే సిద్ధాంతాన్నా చిదంబరం ప్రతిపాదించింది- అని మనం ఆశ్చర్యపోవచ్చును కానీ, అధికారంలో ఉన్నవారికి, అందులోనూ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నవారికి విపరీత బుద్ధులు పుట్టడంలో వింత ఏమున్నది?

అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే చేసిన తప్పులను దిద్దుకుంటున్నారు- అనే సామెత ఇక్కడ పూర్తిగా వర్తించదు. తాను వేసిన పీటముడులను విప్పలేక అయ్యవారు తిప్పలు పడుతున్నారు- అంతే. తప్పులని మాత్రం అంగీకరించడం లేదు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ రోజుకొకటిగా ముందుకు వస్తున్న అవినీతి అక్రమాల ఉదంతాలు, ఇరవయ్యేళ్ల కిందట నాటిన విత్తనానికి కాసిన విషఫలాలు. సమష్టి ఆస్తులను, సంస్థలను, వనరులను సమస్తమూ అంగట్లో పెట్టి, అభివృద్ధి పంట పండిస్తానని చెప్పిన సంస్కర్తలు, దోపిడీసొమ్మును తమలో తాము పంచుకుంటున్న దొంగలను సమర్థించుకునే పనిలో పడ్డారు.

అందినంత మేరకు ఉమ్మడి సంపదను చేజిక్కించుకుని, అందులో రాజకీయులను, అధికారయంత్రాంగాన్ని భాగస్వాములను చేసిన కార్పొరేట్ రంగం - తనను నిలబెట్టే నైతికత కరువై విలవిల్లాడుతున్నది. మకిలి అంటని మనిషి ఒక్కరూ కనిపించని రాజకీయరంగం తనను తానే అపహాస్యం చేసుకుంటున్నది. ఈ విచిత్ర బీభత్స పరిస్థితిలోనుంచే సరికొత్త సిద్ధాంతాలు, డొల్ల వాదనలు పుట్టుకువస్తున్నాయి.

బొగ్గునిల్వలను వేలం వెయ్యాలా, దరఖాస్తుదారులను పరిశీలించి కేటాయించాలా- అన్నది ఇప్పుడు చర్చలో ఉన్న పెద్ద ప్రశ్న. బొగ్గు నిల్వలే కాదు, 2జి స్పెక్ట్రమ్ విషయంలోనూ అదే మహాసమస్యగా ముందుకు వచ్చింది. సహజవనరులను ప్రజానుకూలంగానూ, జాతి భవిష్యత్తు ప్రయోజనాల రీత్యానూ ఏ విధంగా, ఎంత మేరకు వినియోగించుకోవాలి- అన్న విషయంలో ఒక పునరాలోచన, కొత్త పద్ధతుల అన్వేషణ జరగాలని ఏ ఒక్కరూ కోరడం లేదు. సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాధికారపు వికేంద్రీకరణకు, చలనశీలమైన ప్రజాస్వామ్యానికి దారితీయవలసింది పోయి, బాధ్యతారహితంగా ఒక్కో పక్షం వీలయినంత వరకు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతున్నాయి.

2జి స్పెక్ట్రమ్ విషయంలో డిఎంకె పాత్ర దాన్నే నిరూపిస్తున్నది. ఇప్పుడు బొగ్గు నిల్వల కేటాయింపు కుంభకోణంలో ప్రధానమంత్రి మొదలుకొని ప్రతిపక్ష నేతల స్నేహితులు, బంధువులు, వివిధ ప్రాంతీయ పార్టీల సన్నిహితులు- అందరి పాత్రా వివాదాస్పదంగానే కనిపిస్తున్నది. జాతీయ ప్రతిపక్షానికి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఒక కంపెనీకి అనుకూలంగా సిఫారసు ఇవ్వడంలో తప్పేమీ లేదంటాడు. మరో రాజకీయ నాయకుడు, తాను లబ్ధిదారుల కంపెనీలో గౌరవపదవిలో ఉన్నాను తప్ప ప్రయోజనం పొందే హోదాలో లేనంటాడు. జరిగిందేదో జరిగింది లైసెన్సులు రద్దు చేయడం తప్పని, సంస్కరణలకు విఘాతం కలుగుతుందని జాతీయ వ్యాపార, వాణిజ్య రంగాల సమాఖ్యలు వాదిస్తాయి.

వీరిలో ఏ ఒక్కరికీ మౌలిక విధానం మీద అభ్యంతరం లేదు. దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహజవనరులను, ఖనిజాలను, డబ్బును ఏరీతిలో ఉపయోగించుకోవాలన్న ఆలోచనకు ఎవరూ ఉపక్రమించడం లేదు. అయినా, సరే శుష్క అభ్యంతరాలతో ప్రతిపక్షాలు శూన్యంలో కత్తిసాము చేస్తున్నాయి. అందుకే వారి దగ్గర కూడా ఏ మార్గమూ మంత్రమూ లేకుండా పోయింది. ప్రధాని దిగిపోవాలి అన్నదొక్కటే నినాదం. మరోవైపు నిజంగా దిగిపోతే ఎట్లా అని భయం.

దిగిపోవాలన్న డిమాండ్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందన మరో విచిత్రం. ఐదేళ్లు అధికారంలో ఉండాలని తన ప్రభుత్వానికి జనం ఓట్లు వేశారని, దిగిపొమ్మనడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన డిమాండ్ అనీ ఆయన వాదించారు. ఎంత పెద్ద కుంభకోణాలు బద్దలయినా, జనంలో అవిశ్వాసపు వెల్లువ ఎంత బలంగా ఉప్పొంగినా- ఐదేళ్ల హక్కును ఝళిపించడమే ప్రజాస్వామ్యమేమో తెలియదు. అంతకు మించిన సమాధానం చెప్పలేకపోవడం ఆయన పరిమితి. ప్రతిపక్షాల నుంచి, దేశవిదేశ పత్రికలనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంక్షోభసమయంలో ఆయన పనిగట్టుకుని నక్సలిజం మీద కత్తులు నూరుతున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆరితేరిన మేధావి అని ప్రశంసలు పొందే మన్మోహన్‌సింగ్ వాస్తవ బౌద్ధిక స్థాయి మీద పూర్తి అనుమానం కలుగుతోంది. నక్సలైట్లు హింసకు పాల్పడుతున్నారనో, పోలీసులను చంపుతున్నారనో కారణంతో ఆయన మాట్లాడి ఉంటే అదో పద్ధతి.

కాదు. ఆయన తాను నడిపిస్తున్న అభివృద్ధి మహాయజ్ఞానికి ఆటంకంగా ఉన్నారు కాబట్టి, నక్సలైట్లను అణచివేయాలని చెబుతున్నారు. 'మన దగ్గర అపారమైన ఖనిజ నిక్షేపాలు, సహజవనరులు ఉన్నాయి, వాటిని వెలికి తీసి ఉపయోగంలోకి పెట్టకపోతే మనకు పురోగతి లేదు. నక్సలైట్లు వనరుల వెలికితీతను అడ్డుకుంటున్నారు'- ఇదీ ఆయన అభ్యంతరం. బొగ్గూ, ఇనుమూ అంటే అటవీప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి, ఎవరో అడ్డుకుంటున్నారని అనుకుందాం, ఆకాశంలో ఉండే స్పెక్ట్రమ్‌ను ఎవరూ అడ్డుకోలేదే, అందులో అవినీతికి కారకులెవరు? లక్ష కోట్లకు పైగా నష్టానికి కారణం ఎవరు?

ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంతటి ఆర్థిక నష్టం కలిగించిన దృష్టాంతాలున్నాయా? పైరవీలతో ప్రాపకంతో ప్రభుత్వం నుంచి కారుచవకగా బొగ్గునిల్వలను పొంది, వెంటనే మహాలాభానికి మారుబేరం చేసుకునే బేహారులు దేశానికి చేసిన నష్టం ఎంత? ఆ నష్టం నుంచిలాభం పొందినవారిలో కార్పొరేట్లు మాత్రమే ఉన్నారా, వారి మిత్రులయిన రాజకీయవాదులు, మీడియాసంస్థల అధిపతులు, దళారులు- వీరే కదా ఈ దోపిడీని సుసాధ్యం చేసింది?

జగన్ కుంభకోణాన్ని సాధ్యం చేసిన జీవోలతో, కేబినెట్ నిర్ణయాలతో తమకు సంబంధం లేదని వాదించిన అమాత్యులు, తీరా తాము కూడా అభియోగపత్రాలలోకి, జైలుగదుల్లోకి వెడుతున్నప్పుడు, సమష్టి బాధ్యత మంత్రం జపించారు. నిందితుడిగా నమోదయిన తరువాత కూడా మంత్రిని తప్పించడానికి ముఖ్యమంత్రే సంకోచిస్తున్నారు. వైఎస్సే మూలవిరాట్టుగా సిబిఐ పేర్కొన్న తరువాత కూడా ఆయన బొమ్మ తమదే అని కాంగ్రెస్ వాదిస్తున్నది.

గందరగోళం, అభద్రత, తమ తలపైకి పాకుతున్న భస్మాసుర హస్తాలు- అన్నీ కలిసి విచిత్రవాదనలకు జన్మనిస్తున్నాయి. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా మాటల మధ్య పొంతన లేదు, నవ్విపోతారన్న భయం లేదు, ఈ పబ్బం గడిస్తే చాలు, ఇంకో నాలుగురోజులు గద్దె మీద ఉంటే చాలు. అవినీతి జరగలేదు, నష్టం జరగలేదు, కుంభకోణమే లేదు. కాగ్‌దే తప్పు, సిబిఐదే దోషం. తప్పు చేయనిది ఎవరు? అభివృద్ధి కోసం కాసింత అవినీతిని సహించలేరా? - ఇదీ మనకు తారసపడే సూక్తిముక్తావళి. తలాతోకాలేని ఈ మాటలను జనం తలకెత్తుకోవాలి. రాజకీయ వేదికల మీద కనిపిస్తున్న వివేకభ్రష్ఠులను చూసి, వీరిలో ఎవరి మొండివాదనలు ఎంత జనరంజకంగా ఉంటే వారిని ఎన్నుకోవాలి.

1 comment:

  1. /నీ జేబులో డబ్బు ఎవరన్నా దొంగతనం చేస్తే, ఆ దొంగ డబ్బును ఖర్చు చేసే దాకా నీకు నష్టం జరగనట్టేనా- అని ప్రశ్నించింది./
    :))
    మహా తెలివిగా మాట్లాడానని తనకు తానే భుజాలు తట్టుకుంటున్నట్టు చిరునవ్వులు చిందించే చిదంబరాని మట్టి కరిపించిన ప్రతివాదన. మరీ నోరెత్తలేక పోయాడు, చిదంబరం.
    అవినీతి, అవకాశవాదం కాంగ్రెస్, BSP,SP,YSR(C)ల తరువాత స్థానం బిజెపిదే.

    ReplyDelete