Monday, September 24, 2012

తిరణాల జరిపితే తెలుగు బతుకుతుందా?


డీజిల్ ధరలు డీకంట్రోల్ అవుతున్నాయనీ, ఏడో గ్యాస్‌బండ గుదిబండ అవుతుందని, అమెరికా వాళ్లొచ్చి మనదేశంలో ఉప్పూ పప్పూ అమ్ముకుంటారని, విమానయానం దగ్గర నుంచి కేబుల్ వ్యాపారం దాకా ప్రపంచ పెట్టుబడి చేతుల్లోకి పోతుందని- బాధపడడానికి కూడా ఓపిక లేదు. పదవి ఊడితే ఊడింది, నేను చేయవలసింది చేసి తీరతాను అని మన్మోహన్‌సింగ్ తెగబడినట్టే, ఎంత పెంచుకుంటారో ఎంత పంచుకుంటారో దేశాన్ని ఎవరికి కట్టబెడతారో మీ ఇష్టం అని జనమూ చేతులెత్తేశారు. ఏదన్నా చర్చ జరుగుతూంటే, తర్జనభర్జన జరుగుతుంటే, జనాభిప్రాయాన్ని ఎవరైనా కోరుతుంటే- వాటి గురించి మాట్లాడుకుంటే అర్థం ఉంది కానీ, బుల్‌డోజర్‌లతో ఏమి మాట్లాడగలం? మంచిమాట చెప్పినప్పుడు వినకపోతే, చెడిపోయినప్పుడు చూడవలసివస్తుందని సామెత. చూద్దాం, ఎవరు చెడిపోతారో, ఎవరు గెలుస్తారో?

అవినీతులు అక్రమాలు దుర్భరమైపోతున్న జీవనపరిస్థితుల మధ్య తెలుగుభాష గురించి మాట్లాడుకోవడమంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. విదేశీసరుకులు అంగళ్లను ముంచెత్తుతున్న నేటి కాలంలో - అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్, దేశిసరుకుల నమ్మవలెనోయ్ - అని చెప్పిన మహాకవి గురించి మాట్లాడుకోవడం అసందర్భంగానే ఉంటు ంది. సంపాదనా స్వార్థమూ మాతృభాషలుగా చెలామణి అవుతున్నవేళ ఆర్భాటంగా ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు చేసుకోవడం కించిత్ సిగ్గుగానే ఉంటుంది. కానీ, మాట్లాడుకోగలిగినంత వేదన ఇంకా వ్యక్తమవుతున్నప్పుడు మాట్లాడుకోవడమే మంచిది. రాజకీయాల మీదా దేశభవిష్యత్తు మీదా
ఆవరించినంత నిర్లిప్తత ఇంకా భాషాసాహిత్యాలపై ముసురుకోనప్పుడు, ఎంతో కొంత గుండెలుబాదుకోవడమే మంచిది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య పాత్రికేయులను పిలిచి, డిసెంబర్‌లో జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభలకు మీడియా సహకరించాలని కోరారు. ఏలినవారు తెలుగుకోసం ఏమన్నా చేస్తానంటే, సహకరించని పత్రికో చానెలో ఉంటుందా? ప్రభుత్వం వారు ఏమీ చేయడం లేదనే కదా బాధ అంతా? అయితే, ఏదో ఒకటి చేస్తే చాలు అని సంతృప్తి పడడం కుదరదు కదా? పాతిక కోట్లో ముప్పై కోట్లో ఖర్చుతో డిసెంబర్ 27 నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం పెద్ద విషయమే. అంతా బాగానే ఉన్నప్పుడు తిరణాలల వంటి కార్యక్రమాలు జరిపితే పరవాలేదు కానీ, నిత్య ఆకలితో ఉండేవాడికి ఒకపూట విందుభోజనంతో సమస్య తీరుతుందా?

సభలు ఎట్లా జరపాలో అడిగారు కానీ, తెలుగుభాష పరిస్థితిని మెరుగు చేయడానికి ఏమి చేయాలో అభిప్రాయసేకరణ చేశారా? అంత పెద్ద బడ్జెట్ ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు- తెలుగుభాష కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరచవచ్చును, తెలుగుభాషాభివృద్ధికి ఒక ప్రత్యేక సంస్థను నిర్మించవచ్చు. ఒక కోటితోనో రెండు కోట్లతోనో తెలుగుభాషకు సమగ్ర నిఘంటు నిర్మాణ ప్రాజెక్టును సంకల్పించవచ్చు. కొనవూపిరితో ఉన్న అంతర్జాతీయ తెలుగుసంస్థను, ఆరిపోయిన తెలుగు సాహిత్య అకాడమీని పునరుజ్జీవింపజేయవచ్చు. నాలుగు కాలాల పాటు నడిచే, ఒక ప్రభావశీలమైన ఫలితాన్ని సాధించే పని ఏదైనా చేయవచ్చు. వీటన్నిటి గురించి మాట్లాడకుండా, సదస్సులు, కళాప్రదర్శనలు, సన్మానాలతో సాధించేది ఏముంది?

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ రెండు రోజుల కిందట గురజాడ సదస్సు నిర్వహించింది. తెలంగాణ వేడి బలంగా ఉన్న తరుణంలో ఆ సదస్సు విజయవంతంగా జరగడం విశేషం. ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష వారిలో తగ్గకపోగా, మరింత తీవ్రంగా ఉన్నది. అయినా, సదస్సులో ఆసక్తిగా పాలుపంచుకోవడం విద్యార్థులలో క్రమేపీ పెరుగుతున్న అవగాహనను, పరిపక్వతను సూచిస్తోంది. ఉస్మానియా తెలుగుశాఖ విద్యార్థులు, తాము తెలుగుభాష కోసం ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. వారి సమస్య ఒకటే. విద్యాలయాల్లో, ముఖ్యంగా జూనియర్ కళాశాలల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా అంతరించిపోతుండడం.

సంస్కృతమో, ఫ్రెంచో, మరో భాషో రెండో భాషగా తీసుకునే అవకాశం ఉండడం, ఆ సబ్జెక్టుల్లో అధికస్కోరింగ్‌కు అవకాశముండడం- తెలుగు పోస్టుగ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలను కుదించివేస్తున్నాయి. ఇంటర్మీడియేట్ రెండోభాషగా తెలుగును సరళీకరించాలని, మార్కుల విధానాన్ని సవరించాలని వారు కోరుతున్నారు. ఇక్కడ భాష స్పష్టంగా ఒక ఉపాధి సమస్య. అట్లాగే, పరిపాలన, న్యాయ వ్యవహారాలు తెలుగులో జరగడం తెలుగువారి సాధికారతను అధికం చేస్తుంది. తెలుగు భాషను ప్రమాణీకరించడం, ఆధునీకరించడం మొదలైన ప్రక్రియలను శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఈ రాష్ట్రం నుంచి మౌలిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనకు, సామాజిక పరిశీలన లకు ప్రోత్సాహం లభిస్తుంది. అన్నిటికి మించి- జ్ఞానానికి, అవకాశాలకు అడ్డుగోడగా ఉన్న భాషాసమస్య పరిష్కారమవుతుంది.

తెలుగుభాష గురించి మాట్లాడడమంటే తెలుగువారి గురించి మాట్లాడడమే. భాషాసేవ అంటే కేవలం పుస్తకాల ప్రచురణో, అవార్డుల ప్రదానమో కాదు. తెలుగు భాష అంతరించిపోవడం ఒక సామాజిక, ఆర్థిక సమస్య కూడా. విశిష్ట భాషహోదా సంపాదించుకున్న తరువాత దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఏమి చేసింది? ప్రభుత్వానికి ఈ అంశాలపై సలహాలిస్తున్నవారు ఏమి ఆలోచిస్తున్నారు? వారికి ఒక దూరదృష్టి కలిగిన ప్రణాళిక, భవిష్యత్ వివేచన ఉన్నాయా? ఉంటే, వారు ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? పాతిక కోట్ల బడ్జెట్‌కు ఒప్పించగలిగినవారు వాస్తవమైన దీర్ఘకాలిక ప్రణాళికకు ఎందుకు ఆమోదం సాధించలేరు?

తెలుగు మహాసభలు అట్టహాసంగా జరిగే సంబరాలుగా మిగిలిపోతాయని, వాటి దీర్ఘకాలిక ఫలితాలు ఏమీ ఉండబోవని గురజాడ నూటాయాభై ఏళ్ల ఉత్సవాల విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్లనే అనుమానం కలుగుతున్నాయి. ఒక పక్కన జాతీయ స్థాయిలో రవీంద్రనాథ్‌టాగూర్ నూటయాభైఏళ్ల జయంతి ఉత్సవాలు దేశమంతా ఉత్సాహంగా జరగడమే కాకుండా, మరో ఏడాది పాటు ఉత్సవాలను పొడిగించారు.

సాక్షాత్తూ ప్రధానమంత్రి రవీంద్ర ఉత్సవాల కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. గురజాడ అప్పారావు ప్రాసంగికత కానీ, ప్రాముఖ్యం కానీ తెలియని మన రాజకీయ నాయకత్వం మొక్కుబడిగా ప్రారంభ ఉత్సవాలను జరిపి, సంవత్సరమంతా నిష్క్రియగా గడిపింది. తిరిగి, ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. గురజాడ నూటాయాభై ఏళ్ల కార్యక్రమాల ప్రారంభ సమావేశానికి గైరుహాజరయిన విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఈ నెల 21న ముగింపు ఉత్సవాలకైనా వస్తారా అన్నది సందేహమే.

కన్యాశుల్కం ఎనిమిదిగంటల నాటకప్రదర్శన, విజయనగరంలో, హైదరాబాద్‌లో గురజాడ ఆడిటోరియాల ప్రతిపాదన- వంటి కార్యక్రమాలు తప్ప చివరకు జరిగిందేమీ లేదు. సుప్రసిద్ధ నృత్య కళాకారిణి చేత మధురవాణి నాట్యప్రదర్శన చేయించడం- ఏవిధంగా గురజాడ స్ఫూర్తిని ప్రతిఫలిస్తుంది? గురజాడ రచనల్లో అత్యధికం అచ్చులో లేక చాలా కాలమైందని కూడా గుర్తించకుండా, సుమారు ఐదుకోట్ల ఖర్చుతో చేస్తున్న గురజాడ ఉత్సవాలకు అర్థమేమిటి? లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి లేకుండా కార్యక్రమాలను జరిపేవారు, తెలుగు మహాసభలను మాత్రం సక్రమంగా నిర్వహిస్తారా?

మహాసభలను బహిష్కరించాలని, పోటీ సభలు పెట్టాలని తెలంగాణవాదులు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తిరిగి ఉధృతమయ్యేవేళ, తెలుగువారందరూ ఒకటే అన్న సందేశం ఇవ్వడానికే ఈ సభలు ప్రతిపాదించారని, ఇవి ఉద్యమానికి వ్యతిరేకమైనవని వారు భావిస్తున్నారు. ఉద్యమకారులు అట్లా ఆలోచించడం సహజం. వారి విమర్శలను ఖాతరు చేయకుండా, అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యంతో సభలను విజయవంతం చేయడానికి ఎంతటి రాజకీయ సంకల్పం కావాలి? తెలంగాణ వాదులే కాదు, తెలుగుభాష కోసం ఉద్యమం చేస్తున్న భాషోద్యమ సమాఖ్య కూడా ఈ సభలను వ్యతిరేకిస్తున్నది. విధానపరమైన నిర్ణయాలతో తెలుగుకు జీవం పోయవలసింది పోయి, శుష్కమైన కార్యక్రమాలతో సభలను నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని వారు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని తెలుగువారే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, తెలుగుకు ఏర్పడిన ముప్పు పై ఆందోళన చెందుతున్నారని, దాన్ని ఉపశమింపజేసి భరోసా ఇవ్వగలిగే రీతిలో ప్రభుత్వ చర్యలుండాలని వారు ఆశిస్తున్నారు. అధికారభాషాసంఘాన్ని నిర్వీ ర్యం చేసి, విద్యారంగంలో తెలుగుభాషకు అనుకూలంగా ఉన్న ఉత్తర్వులను అమలుచేయడంలో అశ్రద్ధచూపుతూ- ప్రభుత్వం తెలుగుసభలను జరపడంలో అర్థం లేదన్నది వారి వాదన. ఈ అభ్యంతరాలకు, విమర్శలకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి సమాధానాలూ లేవు. మాతృదేశంలోకి వాడెవడో వచ్చి చొరబడుతున్నాడు. మాతృభాషను మనవాళ్లే చంపేస్తున్నారు.

1 comment:

  1. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు సార్!తెలుగుభాష పరిస్థితి విద్యారంగంలో రానూరాను తీవ్రంగా దిగజారుతున్న విషయం అందరికీ స్పష్టమే. అయినా ఎంత అభిమానమున్నవాళ్లకైనా ఏం పాలుపోనిస్థితి. ప్రస్తుత ప్రపంచీకరణ మాయాజాలంలోబతికిబట్టకడుతున్న ఇతర రాష్ట్రాల, దేశాల భాషలు ఆంగ్లాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులపైన నవీన దృక్పథం కలిగిన మీలాంటి వాళ్లతో అధ్యయనం జరిపించాలి.
    ఇక ఇంటర్మీడియట్ తెలుగు విషయానికొస్తే, అక్షరదోషాలు కుప్పలు రాసిపోసినట్లున్నాయి.ఉదాహరణకు రెండో సం. లోని నార్ల వారి 'అజంతా చిత్రాలు" చూడండి. ( మీకు అందుబాటులో దొరకడమూ కష్టమే.. అలా ఏడ్చింది మన తెలుగు భాష విద్యారంగంలో.)
    ప్రభుత్వానికి చిత్తశుద్ధి, తెలుగు బతకాలన్న ఏమాత్రం ఆశ ఉన్నా ఇంటర్ రెండో భాషగా తెలుగును స్వీకరించే పరిస్థితులు తీసుకురావాలి.

    ReplyDelete