Wednesday, September 26, 2012

అడుగుజాడ

'ఎవడు బతికేను మూడు యాభైలు' అన్నది ఒక చైనా సామెత. 'మరో మూడు యాభైలు' అన్న పుస్తకం శీర్షికకు మూలం ఏమిటో చెప్పడానికి శ్రీశ్రీ దాన్ని ఉటంకించారు. మూడు యాభైలు బతకడం అంత దుస్సాధ్యమా? 'బ్రతికి, చచ్చియు, ప్రజల కెవ్వడు బ్రీతి కూర్చునొ' అట్టివాడు మూడు యాభైలేమి, అనంతకాలం జీవిస్తాడు, గురజాడ అప్పారావు లాగా.

చరిత్రకు కృతజ్ఞులము కాకపోతే, భవిష్యత్తే లేదు. దారిచూపిన అడుగుజాడలను కళ్లకు అద్దుకోకపోతే వర్తమానానికి అర్థమే లేదు. కొత్తపాతల ప్రాతః సంధ్యలో మహోదయమై మెరిసిన మహాకవి, ఆగామికాలానికి ఆవశ్యకమైన ప్రజాస్వామ్యభావాలను అందరికంటె ముందుగా కనిపెట్టి పంచిపెట్టిన వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు నూటాయాభైయవ జయంతిని
నేడు తెలుగు ప్రపంచమంతా వినమ్రంగా, వేడుకగా జరుపుకుంటున్నది. అనంతరకాలాలకు కూడా సమకాలికుడై, జీవనదియై తెలుగు సాహిత్యక్షేత్రాన్ని సుభిక్షం చేస్తున్న ఆదిమేధావికి, అరుదైన సంస్కారికి అక్షరప్రపంచమంతా అభివాదం చేస్తున్నది.

'ఆయన జన్మించింది 19వ శతాబ్దిలో, వ్రాసింది 20వ శతాబ్ది కోసం, 21వ శతాబ్ది కోసం'- 1962 సెప్టెంబర్21 నాడు గురజాడ శతజయంతి సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో నాటి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రాసిన సంపాదకీయం తొలివాక్యాలు అవి. గురజాడ రచనల అర్థాన్ని, పరమార్థాన్ని సమకాలికులే కాదు, అనంతర దశాబ్దాల సాహిత్యకారులు కూడా గ్రహించలేక పోయిన మాట నిజం. కాలాతీత వ్యక్తిత్వం ఒక ప్రశంసగానో అతిశయోక్తిగానో బాగానే ఉంటుంది కానీ, సమకాలానికి చెందకుండా ఎవరూ ఉండరు. కానీ, ఒక కాలపు అత్యుత్తమ సృజనా దార్శనికతా ఏదో ఒక స్థలానికి సమూహానికి చెందిన వ్యక్తులనో, వ్యక్తినో వాహిక చేసుకుని అవతరిస్తుంది. బహుశా, గురజాడను కాలమే ఎంపిక చేసుకుని ఉండాలి. ఏకకాలంలో అనేక కాలాలు, సమాజాలు సహజీవనం చేసే భారతదేశం వంటి దేశంలో, అత్యున్నతమైన భావధారను వెనువెంటనే అందరూ స్వీకరించే పరిస్థితి ఉండదు.

అంతెందుకు, అనేక ఉద్యమాలతో పెనవేసుకుని ఎదిగిన తెలుగుసాహిత్యరంగమే, ఇంకా గురజాడను పూర్తిగా ఆవిష్కృతం చేసుకోలేకపోయింది. తెలుగునాట ప్రగతిశీల, సామాజిక సాహిత్య ఉద్యమాలు
ముందుకు తీసుకువచ్చిన అనేక అంశాలు, భావనలు గురజాడలో బీజప్రాయంగానో, స్పష్టమైన వ్యక్తీకరణగానో ఉన్నట్టు గుర్తించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అతని అసాధారణ ప్రతిభకు ముగ్ధులము కావడంకాక, గురజాడను పూర్తిగా, లోతుగా అధ్యయనం చేయడం, అతని ఆలోచనాశీలతనుంచి, సృజనాత్మకతనుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించడం చేయవలసి ఉన్నది. అట్లాగే, అతని పరిమితులను, లోపాలను కూడా నిర్మొహమాటంగా గుర్తించవలసి ఉన్నది.

కన్యాశుల్కం, దాని వల్ల వృద్ధులకు చిన్న పిల్లలను అమ్ముకునే దురాచారం- ఈ ఇతివృత్తంతో నాటకం రాసినప్పటికీ, గురజాడ తీసుకున్న కథాచట్రం, అందులో ప్రవేశపెట్టిన పాత్రలు, వాటి ఆధారంగా జరిగిన విలువల చర్చ, ఘర్షణ, అపహాస్యం ముఖ్యమైనవి. పాత సమాజం నిష్క్రమిస్తున్న సూచనలు, పొడసూపుతున్న కొత్త సమాజం- ఈ సంధికాలం రచయిత సమకాలీన వాస్తవికతను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడడమే కాక, ఆగామికాలంలోని పర్యవసానాలను సూచించడానికి కూడా ఉపయోగపడింది. 'కన్యాశుల్కం' ముగింపులో గిరీశానికి కథ అడ్డం తిరగడం నాటకీయత మాత్రమే, అతను ప్రాతినిధ్యం వహించిన 'ఆభాస ప్రగతిశీలతే' ప్రాబల్యంలో మిగులుతుందని నాటకగమనం సూచిస్తూనే ఉంటుంది. నేటి రాజకీయాలను సామాజిక పరిస్థితులను విమర్శించడానికి, వెక్కిరించడానికి 'కన్యాశుల్కం' లాగా పనికివచ్చే సాహిత్యరచన మరొకటి లేదు.

కులమత భేదాలను ఉదారభావాలతో నిరసించడం కాక, కుల వివక్షను, మత వివక్షను కూడా గురజాడ ప్రశ్నించాడు. దళితులను ఆలింగనం చేసుకోలేనివాడికి జాతీయత గురించి, ఐక్యత గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు. అప్పుడప్పుడే ఆరంభమైన చరిత్రరచనలో తొంగిచూస్తున్న మతతత్వాన్ని గుర్తించాడు. బుద్ధుడిని దేశం నుంచి తరిమివేసి దేశం చాలా నష్టపోయిందని ప్రకటించాడు. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని నమ్మకంగా చెప్పాడు. మగడు వేల్పన పాత మాట అని భార్యాభర్తల మధ్య స్నేహం ఉండాలని అన్నాడు. అంధ విశ్వాసాలను, మత తతంగాలను నిరాకరించాడు. శాస్త్రవిజ్ఞాన దృష్టి ఆధునిక జీవితానికి ఆవశ్యకమని చెప్పాడు. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొకటే నిలిచి వెలుగును- అన్నాడు. విద్యారంగం ఆరంభదశలో ఉన్నప్పుడే, భావి తెలుగు సమాజంలో సార్వత్రక విద్య అవసరమని, అందుకోసం జనభాష మాధ్యమంగా ఉండాలని పోరాడాడు.

ఒక ప్రాంతం శిష్ట భాషను పాఠ్యభాషగా ఉండాలని కోరుతూనే, సకల మాండలికాలూ నూతన వ్యావహారికాన్ని సమగ్రమూ సంపూర్ణమూ చేయాలని ఆశించాడు. సాహిత్యంలోనూ సమాజంలోనూ కొత్తపాతల మేలి కలయిక కావాలని ఆకాంక్షించాడు. ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలకాలని - తన వ్యక్తీకరణ రీతినీ నిర్వచించుకున్నాడు. వ్యాసాలు, చరిత్ర, కథలు, డైరీలు, చదివిన పుస్తకాలపై రాసుకున్న నోట్సు, పాఠపుస్తకాల కమిటీలో పాఠ్యభాషపై సమర్పించిన పత్రాలు- గురజాడ వాఙ్మయం రాసిలోనూ మరీ చిన్నదేమీ కాదు. ఇంతటి బహుముఖత్వం, ఇంతటి బౌద్ధికత, ఇంతటి సృజనాత్మకత, భావుకత- కలిగిన రచయిత అతని సమకాలంలో తెలుగులోనే కాదు, మరే భారతీయభాషలో అయినా మరెవరన్నా ఉన్నారా అన్నది సందేహమే.

గురజాడ అప్పారావూ రవీంద్రనాథ్ ఠాగూరూ 1862లోనే జన్మించారు. ఇద్దరి నూటాయాభైఏళ్ల జయంతి ఉత్సవాలూ 2012లోనే జరుపుకుంటున్నాము. ఇద్దరూ సమవయస్కులు కావడమే కాదు, ఒకరినొకరు ఎరిగినవారు కూడా. ఠాగూరు అంత విస్త­ృతంగా రచనలు చేయకపోయి ఉండవచ్చును కానీ, గురజాడ ఘనత అంతా వాసిలోనే ఉన్నది. శ్రీశ్రీ అయితే, నిస్సంకోచంగా ఠాగూరు కంటె గురజాడకే పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మహారచయితల మధ్య తారతమ్య పరీక్ష వాంఛనీయం కాదు కానీ, బెంగాలీలకూ తెలుగువారికీ మధ్య ఉన్న తేడాను మాత్రం చెప్పుకుని తీరాలి. దేశజాతీయోద్యమానికి, సంస్క­ృతీసాహిత్యాలకు బెంగాలీల దోహదం తక్కువేమీ కాదు కానీ, వారికి వారి భాషా సాహిత్యాల మీద వ్యక్తుల మీద ఉన్న గౌరవం ఆ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది.

అందువల్లనే సాక్షాత్తూ ప్రధానమంత్రి సారథ్యంలో ఠాగూర్ నూటయాభై ఏళ్ల వేడుకలు జరిగాయి. గురజాడను ఆ స్థాయిలో తెలుగువారం గౌరవించుకోలేకపోయాము. ఇందుకు కారణం- మన సమాజానికి, పాలకులకు భాషాసాహిత్యాల మీద తగిన గౌరవం లేకపోవడమే. ఇంతవరకు గురజాడ పేరిట ఒక పోస్టల్ స్టాంప్ కూడా మనం సాధించుకోలేకపోయాము. ఇప్పుడు నూటాయాభై ఏళ్ల వేడుకలను చివరిఘట్టంలో ఘనంగానే జరుపుతున్నారు కానీ, అది గురజాడ స్ఫూర్తిని కొనసాగించడానికి పెద్దగా ఉపయోగపడేది కాదు. తెలుగు వారు తమ రచయితలను, సంస్కర్తలను, వైతాళికుల స్మృతిని తమ చరిత్రలో, వర్తమానంలో అవిభాజ్యమైన సాంస్క­ృతిక, సామాజిక అంశంగా స్వీకరించడానికి గట్టి ప్రయత్నం ప్రజారంగంలో జరగాలి. అది గురజాడతోనే ప్రారంభం కావాలి.అదే ఆయనకు నిజమైన నివాళి.

No comments:

Post a Comment