Wednesday, September 5, 2012

ఘన నాయకులు, ఖల్ నాయకులు


కొలువుకూటంలో ఉన్న పెద్దమనుషులందరినీ పొగడరా కవీ అని ఒక రాజుగారు ఆజ్ఞాపిస్తే, అసలే కడుపుమండి ఉన్న ఆ కవి- ఈ సభలో ఉన్నవారిలో ఎవరికి ఎవరూ తీసిపోరు, కొందరు భైరవాశ్వములు అయితే, మరికొందరు కృష్ణజన్మమున కూసినవారలు.. అంటూ ఇంత పొడుగు విశేషణాలు చదివి, చివరకు అందరు అందరే మరియు అందరు అందరె అందరందరే- అని ముగించాడు. అందులోని అర్థాన్ని గ్రహించి రాజు ఆ కవికి కొరడాసత్కారం చేశాడో, కఠినపదాల వెనుక ఏదో ప్రశంసే ఉన్నది లెమ్మని కనకాభిషేకం చేశాడో తెలియదు.

అలీనోద్యమ శిఖారగ్రసదస్సు కోసం ఇరాన్ రాజధానిలో మోహరించిన మహామహులను చూసినప్పుడు ఆ చాటుపద్యం గుర్తుకు వచ్చింది. అంతర్జాతీయ వేదికల మీద వీరంతా బలహీనులు, బడుగుదేశాధినేతలు కావచ్చును కానీ, వారి వారి దేశాల్లో నిరంకుశులు, చండశాసనులే. ప్రజాస్వామ్యంలా కనిపించే మన వంటి దేశాలను వదిలేద్దాం. ప్రభాకరన్‌ను తుదముట్టించింది తానే అన్న అతిశయం ఇంకా వీడని రాజపక్సే టెహరాన్ మెహ్రాబాద్ విమానాశ్రయంలో కూడా రొమ్మువిరుచుకునే కనిపించారు. అమెరికా కీలుబొమ్మగా ఆఫ్ఘనిస్థాన్‌ను ఏలుతున్న కర్జాయ్ కూడా తగుదునమ్మా అంటూ సదస్సుకు వచ్చాడు.

ఇరాక్ ప్రధానమంత్రి కూడా తన గొంతు వినిపించడానికి వచ్చారు. తన భూభాగాన్ని అప్పనంగా అమెరికా యుద్ధకార్యాలకు వేదిక చేసి, ఇప్పుడు చింతిస్తున్న పాకిస్థాన్ కూడా అలీనరాగాన్ని ఆలపించడానికి వచ్చింది. మానవరహిత విమానాల ద్వారా తమ దేశంపై అమెరికా దాడులు చేయడం అన్యాయం అని పాక్ విదేశాంగ మంత్రి టెహరాన్ పత్రికాసమావేశాల్లో ధైర్యంగానే మాట్లాడుతున్నారు. పాక్, ఆఫ్ఘనిస్థాన్ మాత్రమేకాదు,
నామ్‌సదస్సుకు వచ్చిన అనేక దేశాలు అమెరికాతోనో, మరే పాశ్చాత్యదేశంతోనో గాఢాలింగనంలో ఉన్నవే. మరికొన్ని ఇజ్రాయెల్ స్నేహంలో పరవశిస్తున్నవే. పాలకుల్లో అధికులు ప్రజలను కాల్చుకుతింటున్నవారే. పోలీసుకాల్పులు జరపడమా, అనధికార హత్యలు చేయడమా, విమానంలోనుంచి బాంబులు వేయడమా- అన్న తేడాలున్నాయి తప్ప, జనకంటకుడు కాని ఏలిక లేడు.

వీరందరూ కలిసి ప్రపంచంలో ఏ స్వేచ్ఛను స్థాపిస్తారబ్బా అన్న అనుమానం కలగకతప్పదు. అలీనోద్యమం అంటే స్వాతంత్య్రమే, అది ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా.. అని హోర్డింగుల మీద సూక్తులు పలకరిస్తున్నాయి. ఎన్నిదేశాల్లో ఎన్ని ప్రత్యేక, మైనారిటీ జాతులు, ఉపజాతులు, సాంస్కృతిక సమూహాలు- జాతీయవాద, మతోన్మాద ప్రభుత్వాల కింద నలిగిపోతున్నాయి. వాటిలో అధికం మూడోప్రపంచదేశాల ప్రభుత్వాలే. వీటన్నిటికీ కలిపి ఉమ్మడిగా ఉన్న సమస్యలు కూడా తక్కువే. లేదా, ఉమ్మడి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నవి తక్కువే. ప్రతి ఒక్క దేశమూ ఆంతరంగికంగా ఉద్యమాలను, ప్రతిఘటనపోరాటాలను ఎదుర్కొంటున్నవే.

అవి కాక, ఆర్థికసంస్కరణల కారణంగానో, అంతర్జాతీయ ఆర్థికసంస్థల వడ్డీవ్యాపారం కారణంగానో, పొరుగుదేశాల నుంచి ప్రమాదం కారణంగానో సొంత సమస్యలలో మునిగిపోయి ఉన్నాయి. అమెరికాతో ఆయా దేశాలకు ఉన్న దగ్గరితనం లేదా దూరం ఆధారంగా వివిధ అంతర్జాతీయ సమస్యల మీద వారి వైఖరులు ఆధారపడి ఉన్నాయి. సిరియాపై సైనికచర్య జరగవలసిందే అన్న తీరులో, ఈజిప్టు మాట్లాడుతున్నది.

తమ దేశంలో జరిగిన -శాంతియుత విప్లవం- లాంటిది సిరియాలో సాధ్యంకాదు కాబట్టి, అధికారమార్పిడి ఏదో రకంగా జరగవలసిందే అన్నది ఈజిప్టు వాదన. దాని వెనుక అమెరికా గొంతు వినిపిస్తూనే ఉన్నది. ఉత్తర ఆఫ్రికా, అరబ్ దేశాల్లో వచ్చిన ఉద్యమాలను సానుకూలంగా ప్రస్తావించిన ఇరాన్ మాత్రం సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం వెనుక బయటి హస్తం ఉన్నదంటున్నది. ఎన్నికలు నిర్వహించి, అక్కడి సమస్యను పరిష్కరించవచ్చునని చెబుతోంది. అన్నిటిలోనూ మధ్యేమార్గం మంచిదనుకునే భారత్ ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం ద్వారానే సమస్య పరిష్కారం కావాలంటున్నది. ప్రభుత్వ పక్షానికి, ప్రతిపక్షానికి సమదూరం పాటిస్తున్నది. పాశ్చాత్యహస్తం గురించి మౌనం పాటిస్తున్నది.

ఐక్యరాజ్యసమితి పనితీరును మెరుగుపరచాలన్నది మూడోప్రపంచంలో నోరున్న కొన్ని దేశాల అభిమతం. ఐరాస కానీ, భద్రతాసంఘం కానీ అగ్రరాజ్యాల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నాయన్నది తెలిసిన విషయమే. భద్రతాసంఘం అధికారాలకేమీ లోటులేదు కానీ, అందులో తనకు కాక మరికొన్ని దేశాలకు కూడా వీటో హక్కు ఉండడం అమెరికాకు అసహనంగా ఉన్నది. అందుకని, అన్నిటినీ తోసిరాజని, ఐరాసను ధిక్కరించి, తనకు కావలసినరీతిలో తాను వ్యవహరిస్తున్నది. వెన్నుముకతో ఎట్లా ఉండాలో అలీనోద్యమం నుంచి నేర్చుకొమ్మని ఇరాన్ నేతలు ఐరాసకు సూటిపోటి హితవులు చెబుతున్నారు.

అదేసమయంలో ఐరాస ప్రధాన కార్యదర్శి నామ్ సదస్సుకు తప్పనిసరిగా హాజరు కావడం కోసం శతవిధాల ప్రయత్నించి విజయం సాధించారు. గ్లోబల్ గవర్నెన్స్‌ను పదహారో నామ్ సదస్సు ప్రధాన నినాదం చేయడం వెనుక, ప్రపంచ రాజకీయాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పాలన్న ఆకాంక్షే కనిపిస్తున్నది. నామ్ పేరు ఉచ్చరించడానికే నిరాకరించే అమెరికా- ఈ ప్రయత్నాలను సాగనిస్తుందనుకోవడం కల్ల.

ఈ నామ్ సదుస్సు ఇరాన్‌లో జరిగింది కాబట్టి, అలీనోద్యమానికి తిరిగి కొంత శక్తి సమకూరే అవకాశం ఉన్నది. ఈ సదస్సులోనే ఉద్యమ నాయకత్వ బాధ్యతలను ఇరాన్ స్వీకరించింది. ఇరాన్ తన మనుగడ కోసం ఎంతో కీలకమయినదిగా భావిస్తున్న ఈ బాధ్యత- అలీనోద్యమానికి కొత్త పరిమళాన్ని అందించే అవకాశమున్నది. కేవలం భౌగోళిక రాజకీయాలకో, మూడోప్రపంచదేశాల హక్కుల గురించో మాట్లాడడం కాకుండా, విలువల ప్రాతిపదికన సిద్ధాంత వివరణ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నది. సాంస్కృతిక, చారిత్రక భేదాల కారణంగా మనుషులు వేరువేరుగా కనిపిస్తారు తప్ప, అంతరంగంలో అంతా ఒకటే- అని ఇరాన్ ఆధ్యాత్మిక నాయకుడు తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు.

కమ్యూనిస్టు ప్రయోగం ఇరవయ్యేళ్లకిందటే విఫలమయింది, కేపటిలిజం ఇప్పుడు పతనం అయింది. ప్రత్యామ్నాయం మూడో ప్రపంచంలో ఉన్నది, ఇస్లామిక్ ప్రపంచంలో కనిపిస్తున్న చైతన్యంలో ఉన్నది- అన్నారాయన. సాంస్కృతిక వైవిధ్యం, పరస్పర సహనం వంటి మాటలను ఇరాన్ అధినేత నుంచి వినడం నామ్ సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. ఐడియాలజీ రహితంగా మారిన మూడోప్రపంచదేశాల రాజకీయాలకు, ఏదో ఒక భూమికనివ్వడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నది.

అయితే, ఇరాన్ మాత్రం ద్వంద్వాలకు అతీతమయినదా? ఇరవయ్యేళ్ల కిందటి విప్లవం పాశ్చాత్య అనుకూల శక్తులను తుడిచిపెట్టింది, దానితో పాటు, వామపక్షవాదులనూ నిర్మూలించింది. అయితే, షా కాలంలోని సంపద కేంద్రీకరణను దారిమళ్లించి, ఎంతో కొంత జనంలోకి దాన్ని తెచ్చింది. ప్రభుత్వ ప్రయివేటు రంగాల సమన్వయంతో, సంక్షేమమార్గాన్ని విడవకుండా అభివృద్ధిమార్గంలో నడుస్తోంది.

తొలినాటి తీవ్రభావాలు ఉపశమించి, ఇప్పుడు కొంత ఉదారతతో, ప్రజాస్వామికతతో నడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఆ దేశం మనుషులంతా ఒక్కటే అని భావిస్తున్నదని అనుకోలేము. ఇతర మతస్థుల విషయంలో సహనం చాలానే ఉన్నది కానీ, ఇస్లాంలోనే కొన్ని మైనారిటీ తెగల విషయంలో ఇరాన్ ప్రభుత్వ విధానం దమననీతితోనే కూడుకుని ఉన్నది.

ఇక స్త్రీల విషయంలో- వారిని గడపలుదాటనివ్వని ఛాందసం లేదు కానీ, అపార్థయిడ్ పద్ధతిలో స్త్రీలను కొన్ని ఉద్యోగాలకు, చదువులకు, జీవనరంగాలకు పరిమితం చేసే విధానాన్ని అక్కడి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నది. ఏదో ఒక సంరంభం సృష్టించి, నామ్‌ను ఇరాన్ ప్రపంచ వేదిక మీద ప్రముఖంగా ప్రదర్శించగలిగింది. తాను ఒంటరి కాదని నిరూపించగలిగింది. ప్రపంచం మరిచిపోయిన సిద్ధాంతాలనేవో వల్లించగలిగింది. ఇంత చరిత్ర కలిగీ ఇండియానే డొల్ల మాటలకే తన ఉనికిని పరిమితం చేసుకుంది.

మూడో ప్రపంచదేశాల నేతలందరూ, తమ పైన అగ్రరాజ్యాల పెత్తనాన్ని తగ్గించి, ఆ మేరకు ప్రజలపై పీడననూ సడలించగలిగితే వారి ఉద్యమానికి ప్రజల మద్దతూ ఉంటుంది. లేకపోతే, నలభైఏళ్ల కిందట టంకశాల అశోక్ అలీనోద్యమనేతను సంబోధించి అన్నట్టు- బయట నువ్వేమయినా కావచ్చు, ఇంట్లో మాత్రం పిల్లివే, కుక్కవే, నక్కవే....

6 comments:

 1. శ్రీనివాస్ గారు,
  ఇప్పటి వరకు మీరు ఒక న్యుట్రల్ స్టాండ్ తో వ్యాసాలు రాస్తారని భావిస్తూ వచ్చాను. కాని ఈ మధ్య మీవ్యాసాలలో కనిపించే ధోరణి చూస్తే ప్రొ|| హరగోపాల్ గుర్తుకు తెస్తున్నారు. ఆయన చాలా మెత్తని మాటలతో, మార్క్సిస్ట్ భావజాలాన్ని మసిబూసి మారేడు కాయ చేసి, కొత్త పద్దతిలో ప్రజల బుర్ర లో ఇంకించటానికి ప్రయత్నిస్తారు. కొత్త వారు ఆయన చెప్పేది వెంటనే గుర్తించలేకపోవచ్చు కాని కమ్యూనిస్ట్ ఐడియాలజి అవగాహన ఉన్నవారికి ఆయన చెప్పేది ఎక్కడికి దారి తీస్తుందో అర్థమౌతుంది . విషయానికి వస్తే భారత దేశ కోణం లో ఈ సదస్సు ఉపయోగాలను రాసి ఉండిఉంటే బాగుంట్టుంది. ఉపయోగం లేకపోతే ఆ మాటే రాసి ఉండవచ్చు. మీరు ఆ సంగతి వదలి అందరిని విమర్శిస్తూ పైగా వారిని ఖల్ నాయకులు అంట్టు రాయటం ఎమీ బాగా లేదు.

  "ప్రభాకరన్‌ను తుదముట్టించింది తానే అన్న అతిశయం ఇంకా వీడని రాజపక్సే టెహరాన్ మెహ్రాబాద్ విమానాశ్రయంలో కూడా రొమ్మువిరుచుకునే కనిపించారు."

  రాజపక్సే అతని దేశంలో పాతుకు పోయిన,ఎంతో మంది అధ్యక్షులు సాధించలేకపోయిన దానిని సాధించాడు. అతను ఆ క్రేడిట్ ఎందుకు తీసుకోకుడదు? అదే కాక భారతదేశం తమిళ ఈలం ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. అటువంటి తీవ్రవాదులను దానిని అతను అరికడితే అభినందించవలసింది పోయి, ప్రభాకరన్ ను గొప్ప వీరుడిలాగా మీరు చిత్రికరిస్తున్నట్టు అనిపిస్తున్నాది. ఈ అభిప్రాయం రావటానికి ఇంతక్రితం వ్యాసం (తరమెళ్లిపోతోంది) కూడా ఒక కారణం.

  SriRam

  ReplyDelete
 2. శ్రీనివాస్ గారు,
  నేను రాసిన పై వ్యాఖ్య మీరేలా అర్థం చేసుకొంటారో తెలియదు. మిమ్మల్ని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు కూడాను. మన దేశ పయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్పష్టంగా రాసి ఉంటే బాగుండెదని చెప్పటమే నా ఉద్దేశం.

  SriRam

  ReplyDelete
 3. శ్రీరామ్ గారు,
  మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. నా దృష్టికోణం తప్పు అని మీరు భావిస్తే, వ్యతిరేకంగా రాయడంలో తప్పేం ఉంది?
  నిజానికి నేను రాసింది, అలీన సదస్సులో కనిపించిన ఒక పార్శ్వం గురించిన వ్యాఖ్య మాత్రమే. ఈ కాలమ్ కు ముందు, ఆంద్ర జ్యోతి లో నేను నామ్ సదస్సు గురించిన మరో రెండు మూడు పరిశీలనలు రాసి ఉన్నాను.
  అలీనోద్యమం నిర్మాతలలో ఒకరిగా భారత్ కు ఎక్కువ బాధ్యత ఉందని నేను భావిస్తాను. కాని, ఉద్యమ లక్ష్యాల నుంచి మన దేశం పక్కకు తొలగిందని అనిపిస్తోంది. అయినప్పటికీ, భారత్ హాజరు ను ఇరాన్ చాలా విలువైనదిగా పరిగణించింది. భారత్ ఇరాన్ మధ్య సంబంధాలు బలంగా ఉండాలని, అటువంటి పరస్పర సంబంధాలు ఆపత్కాలంలో ఒకరినొకరు ఆదుకొనడానికి పనికి వస్తాయని నా అభిప్రాయం. కాని, గతంలో ఇరాక్ విషయంలో కాని, ఈ మధ్య ఇరాన్ విషయంలో కాని, మనం స్నేహ ధర్మం పాటించ లేదు. యెన్ డీ ఏ హయాంలో ఇరాన్తో సంబంధాలకు చొరవ చూపారు. కాంగ్రెస్ ఎందువల్లనో అంటీ ముట్టనట్టుగా ఉంది. అమెరికా ఒత్తిడి మన మీద ఏంటో కొంత పనిచేస్తోంది. ఇటువంటి పరిశీలనలు నేను జ్యోతి లో రాశాను.
  సందర్భం కాలమ్ లో మాత్రం, అలీన దేశాధినేతలు వారి వారి స్వదేశాలలో ఎటువంటివారో చెప్పదలచుకున్నాను. ఆ వేదిక మీద స్వేచ్చ, హక్కులు అని మాట్లాడుతున్న వారంతా తమ దేశంలో ప్రజలను అణచివేసిన వారేనని సూచించడం అక్కడ ఉద్దేశం. మన దేశంలో ఎమర్జన్చి ని పెట్టిన ఇందిరాగాంధీ కి బయట, అలీన నేత గా ఎటువంటి కీర్తి ఉండేదో తెలుసును కదా..
  ప్రభాకరన్ ఆశయాన్ని అంగీకరించేవారు కూడా ఆయన పద్ధతిని వ్యతిరేకించారు. అటువంటి ఉద్యమాల పద్ధతులను మనం విమర్శిస్తున్నప్పుడు, వాటిని అణచివేసే వారి పద్ధతులను కూడా విమర్శించాలి కదా. దేశం కోసం, పది పన్నెండేళ్ళ పిల్లలను చంపవలసిన అవసరం, స్త్రీలను రేప్ చేయవలసిన అవసరం ఉందంటారా?
  హరగోపాల్ గారు నాకు తెలిసి, బాహాటమైన మార్క్సిస్ట్. ఆయన మసి పూసి మాయచేయవలసిన అవసరం ఏముంది? నా అభిప్రాయాలను తీర్చిదిద్దడం లో కూడా మార్క్సిస్ట్ భావాల ప్రభావం ఉంది. అలాగే, ఇతర భావాల ప్రభావాలూ ఉన్నాయి. ఉంటే తప్పేమిటి? నిష్పాక్షిత అంటే, అభిప్రాయం లేకపోవడం కాదు కదా?

  ReplyDelete
 4. /హరగోపాల్ గారు నాకు తెలిసి, బాహాటమైన మార్క్సిస్ట్. ఆయన మసి పూసి మాయచేయవలసిన అవసరం ఏముంది?/

  కమ్యూనిస్టులు మసి పూసి మారేడుకాయ చేయరని, పచ్చి నిజాలు మాట్లాడుతారని మీరు భావిస్తారా?! :))

  ReplyDelete
 5. మీ ప్రశ్న ఆసక్తికరం. మసిపూసి మారేడుకాయ చేయడం అనే లక్షణం, అబద్ధాలు చెప్పడం అనే దుర్గుణం అన్నిరకాల మనుషుల్లోనూ ఉండొచ్చు. ఫలానా భావాలు కలిగినవారు అట్లా వ్యవహరిస్తారని ఎలా అనగలం? హరగోపాల్ గారు తానూ మార్క్సిస్టు అనే దాన్ని కప్పు పుచ్చి మార్క్సిజాన్ని నూరిపోస్తుంటారు అనే అర్థం లో ఒక మిత్రుడు వ్యాఖ్యానిస్తే, నేను ఆయనకు ఆ అవసరం లేదు, ఆయన బాహాటంగానే తానూ మార్క్సిస్తునని చెప్పుకుంటారు అని జవాబిచ్చాను. నా సమాధానం అంతవరకే పరిమితం.

  ReplyDelete