Monday, October 1, 2012

మన చిల్లర, వారికి శ్రీమహాలక్ష్మి!


"ఈ దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో నేను దృఢంగా వ్యవహరిస్తాను. కానీ, భారతదేశ ప్రజలతో వ్యవహరించేటప్పుడు మాత్రం మృదుహృదయంతో ఉంటానని మాట ఇస్తున్నాను. సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించాలన్న ఈ జాతి తిరుగులేని, దృఢమైన సంకల్పం విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు.

అన్ని ఆర్థిక ప్రక్రియలూ అంతిమంగా మన ప్రజల ప్రయోజనం కోసమే అని నేనెప్పుడూ మరచిపోను. ...పేదరికం, అవిద్య, అనారోగ్యం అన్న రుగ్మతలను తొలగించడానికి అవసరమైన ఈ సామాజిక, ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావాలంటే ఉన్నతమైన ఆదర్శాలు, త్యాగశీలత, అంకితభావం అవసరం''- ఇరవయ్యొక్క సంవత్సరాల కిందట ఆర్థికమంత్రిగా మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ డాక్టర్ మన్మోహన్‌సింగ్ అన్న మాటలవి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడమే కాదు, ఆర్థికశక్తిగా ఎదగడానికి కూడా సంస్కరణలు అవసరమని, భారతదేశాన్ని ఒక ఆర్థిక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలయిందని చెబుతూ - ఒక ఆలోచనకు అనువైన
సమయం ఆసన్నమైనప్పుడు దాన్నెవరూ ఆపలేరన్న విక్టర్ హ్యూగో మాటలతో మన్మోహన్ నాటి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.

ఈ రెండు దశాబ్దాల కాలం అంతా ఆయనే ఆర్థికమంత్రిగానో, ప్రధానమంత్రిగానో లేరు. నిజమే. కానీ, ఆయన ప్రారంభించిన ఆర్థిక విధానాలే కొనసాగుతున్నాయి. విదేశీచెల్లింపుల విషయంలో వచ్చిన సంక్షోభం, మొత్తంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్రమైన ద్రవ్యలోటు కారణంగా మనదేశం అప్పుడు బంగారం విదేశాల్లో తాకట్టుపెట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు దాపురించిందో, దాని వెనుక నేపథ్యమేమిటో ఇప్పుడు అనవసరం కానీ, ఆ దుస్థితి ఆర్థికసంస్కరణలని పిలుస్తున్న తీవ్రవిధానాలు ప్రారంభించడానికి అదునుగా మారింది. శుక్రవారం నాడు ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన్మోహన్‌సింగ్ ఇరవయ్యేళ్ల కిందటి పరిస్థితిని ఒకసారి గుర్తుచేశారు.

మళ్ళీ అటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పారు. తానప్పుడు చేసిన వాగ్దానాలని, అరచేతిలో చూపించిన స్వర్గాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఇప్పుడు కూడా మరోసారి తీవ్రమైన విధానచర్యలు తీసుకోవలసి
వచ్చిందని చెబుతూ, దానివల్ల సమకూరే ప్రయోజనాలను రంగులకలగా పరిచారు. దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలను, సంక్షోభాలను జీర్ణం చేసుకునే శక్తి పబ్లిక్‌రంగానికి లేకపోవడం అలనాటి పరిస్థితికి ఒక ముఖ్యకారణంగా చెప్పిన మన్మోహన్, నేటి పరిస్థితికి భరించలేనంతగా పెరిగిపోయిన ఇంధన సబ్సిడీని దోషిగా నిలబెట్టారు.

మన్మోహన్‌సింగ్ మీడియా ప్రసంగం చూస్తున్నప్పుడు- సరళమైన భాషలో సుబోధకంగా మాట్లాడి ఉండవచ్చును కానీ- ఎటువంటి ఉద్వేగాలూ కవళికలూ లేని దారుముఖమే కనిపించింది. బహుశా అది ఆయన దృఢచిత్తానికి గుర్తు అయి ఉండవచ్చు. కానీ, ఇంత కాలం నుంచి, కించిత్తు కూడా ఆత్మవిమర్శ లేకుండా ఆయన తన మార్గానికి కట్టుబడి ఉండడం విశేషంగానే కనిపించింది. మన్మోహన్‌ను రంగంమీదకు తెచ్చి, సంస్కరణలకు సిగ్నల్ ఇచ్చిన పి.వి. నరసింహారావు కూడా తరువాత కాలంలో, నేను ఆశించింది ఇటువంటి పరిణామాలు కాదని మాటవరసకైనా అన్నారు.

కానీ, మన్మోహన్‌సింగ్‌లో మాత్రం ఎటువంటి పునరాలోచనా లేదు. ఆయనకు తన విధానాల మీద ఎంతటి నమ్మకం అంటే, ప్రతిపక్షాల వారిని, విమర్శకులను, ప్రజలను అందరినీ పరమ అజ్ఞానులుగా పరిగణించేంత. చిల్లరవ్యాపారంలోకి విదేశీపెట్టుబడులను రప్పించడం వల్ల పదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని, వ్యవసాయం నుంచి వినియోగం దాకా ఉన్న ప్రక్రియ అంతా కొత్త పెట్టుబడితో కళకళలాడుతుందని, ఇంధన సబ్సిడీలను తగ్గించడంవల్ల విదేశీపెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుందని ఆయన నిస్సంకోచంగా ప్రకటించారు. డీజిల్ అనేది సంపన్నులు వాడే ఇంధనమని కూడా ఆయన కనిపెట్టారు. ఇవన్నీ చేయకపోతే ఎట్లా, డబ్బులు చెట్లకు కాస్తాయా? అని ఆయన కోప్పడ్డారు కూడా.

వాల్‌మార్ట్ వంటి గొలుసు కంపెనీలు నగరాల్లో, శివార్లలో పెద్ద పెద్ద దుకాణాలు పెట్టడం వల్ల చిన్న వ్యాపారులకు నష్టం ఉండదని కూడా ప్రధాని నచ్చచెబుతున్నారు. దేశీయ గొలుసుకట్టు దుకాణాలు ఇప్పటికే ఉన్నాయని, వాటివల్ల జరగని నష్టం విదేశీపెట్టుబడి వల్ల ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్న. చిల్లర వ్యాపారం లోతుల్లోకి వెళ్లడం ఇక్కడ అనవసరం కానీ, దేశీయ చిల్లరవ్యాపారులు ఇప్పుడేమంత గొప్పగా వ్యాపారం చేయడం లేదు. అందుకు కారణం పెట్టుబడి లోపమేమీ కాదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలే ఆ రంగంలో ఉన్నాయి. మధ్యతరగతికి అవసరమైన సమస్త వినియోగ, ఆహార వస్తువుల విక్రయాన్ని పెద్ద ఎత్తున లాభసాటిగా సాగించాలంటే, సరుకుల సేకరణ దగ్గర నుంచి నిల్వ చేయడం, ప్యాకింగ్ దాకా ప్రక్రియ అంతా ఆధునికీకరణ జరగాలని-అందుకు పెట్టుబడులు రావడం లేదని ఒక వాదన.

వాల్‌మార్ట్ వచ్చినా వారి దృష్టి కొనుగోలు, అమ్మకాల మీద తప్ప తక్కిన వ్యవస్థలలో పెట్టుబడులు పెట్టడం మీద ఉండదని, ఇతర దేశాల అనుభవాలను ఉటంకిస్తూ ఎఫ్‌డిఐ వ్యతిరేకులు చెబుతున్నారు. వ్యవసాయదారులకు తమ సరుకుకు గిట్టుబాటు ధర దొరకడం కూడా అబద్ధమని, కొనుగోలు- అమ్మకం రెంటిలోనూ గొలుసు దుకాణాల వారిదే గుత్తపెత్తనం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి-అన్న పరిస్థితి కల్పించకపోతే గుత్తవ్యాపారికి లాభాశ తీరేదెట్లా?

ఇన్ని వివరాలూ విశ్లేషణలూ అక్కరలేకుండానే మన దేశంలోని కోట్లాది చిల్లర వ్యాపారులు కొత్త పరిణామాల విషయంలో భయపడుతున్నారు. పెద్దలూ పిన్నలూ అందరూ ఈ వ్యాపార ప్రపంచంలో సహజీవనం చేయవచ్చుననే ప్రధాని సూక్తి వారికెందుకో నిజమనిపించడంలేదు. చిల్లర వ్యాపారంలో విదేశీకంపెనీలు రావడం వల్ల రైతాంగానికి గిట్టుబాటు ధర దొరుకుతుందన్న సమర్థన కూడా నమ్మశక్యంగా కనిపించడం లేదు. ప్రభుత్వ అవసరాలేమైనా, వ్యవస్థ అవసరాలేమైనా సంబంధిత ప్రజాశ్రేణులకు విశ్వాసం కలిగించడం, వారిని విశ్వాసంలోకి తీసుకోవడం ముఖ్యం. కానీ, మన్మోహన్‌సింగ్ దురదృష్టవశాత్తూ విదేశీపెట్టుబడిదారులకు నమ్మకం కలగడం మీదనే ఎక్కువ ఆసక్తిచూపుతారు, ప్రజా విశ్వాసం మీద కాదు.

మన్మోహన్ మన దేశంలో ఏమి చెబుతున్నప్పటికీ, అమెరికాలో వేడుక వాతావరణం వాస్తవాలను ప్రకటిస్తూనే ఉంది. మన దేశంలో చిల్లరవ్యాపారాన్ని విదేశీయులకు తెరచినందువల్ల, వారికి బోలెడు ఉద్యోగాలొస్తాయట. ఇండో అమెరికన్ అణు ఒప్పందం సమయంలో కూడా అమెరికన్ మీడియా ఇటువంటి సంబరాన్నే ప్రకటించింది. అణురియాక్టర్ల, ఇంధనాల వ్యాపారం కారణంగా అమెరికాకు చాలా ఉద్యోగాలొచ్చాయట. పబ్లిక్ రంగంలో సిద్ధాన్నాన్ని కబళించాక, ఇక దేశీయ ప్రైవేటు రంగంలో ఉన్న పెద్ద మార్కెట్‌ను హక్కుభుక్తం చేసుకునే ప్రక్రియ మొదలయింది.

50 వేల కోట్ల డాలర్ల వ్యాపారం మరి! మొత్తానికి ఎన్నికల సంవత్సరంలో ఒబామాకు మన్మోహన్ మంచి వరమే ఇచ్చాడన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వారికి కావలసిన ఉద్యోగాలు వారికీ, మనకు కావలసినవి మనకీ కుప్పలుతెప్పలుగా తెచ్చిపెట్టే విదేశీవ్యాపారమేదో సర్వరోగ నివారిణిలాగా కనిపిస్తోంది.

'ఆసియాలో ఆర్థికాభివృద్ధి-కార్పొరేట్ వాతావరణంలో వస్తున్న మార్పులు' అన్న అంశం మీద శనివారం నాడు ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తుండగా, ప్రధానికి ఒక చేదు అనుభవం ఎదురయింది. సంతోష్ కుమార్ సుమన్ అనే న్యాయవాది చొక్కా విప్పి నిరసన తెలియజేశాడు. ఆ నిరసనకారుడు లాలూప్రసాద్ పార్టీ ఢిల్లీ శాఖ న్యాయవిభాగం అధ్యక్షుడట. రాష్ట్రీయ జనతాదళ్‌కూ రామ్‌మనోహర్ లోహియా సోషలిస్టు సిద్దాంతానికీ ఇంకా సంబంధం ఉందనుకునే భ్రమలో ఆ న్యాయవాది అటువంటి నిరసన చేపట్టి ఉంటాడు, కానీ లాలూ మాత్రం ఏకంగా పార్టీ ఢిల్లీ శాఖనే రద్దుచేసిపారేశారు.

ప్రజల విషయంలో మృదువుగా ఉంటానని చెప్పిన మాటను ప్రధానమంత్రి తప్పారు. ఇరవయ్యేళ్ల తరువాత దేశం తిరిగి అప్పటి స్థితికే చేరిందని ఆయనే ఒప్పుకున్నారు. ఇంకో ఇరవయ్యేళ్ల తరువాత కూడా దేశం ఇటువంటి స్థితిలోనే కాకపోతే మరింత సంక్షోభంలో ఉండకతప్పదు. ఆ సమయానికి మన్మోహన్ వంటి స్థితప్రజ్ఞుడు దేశాధినేతగా ఉండకపోవచ్చు. అప్పుడిక తూటాలూ లాఠీలు చెట్లకు కాస్తే తప్ప జనాన్ని అదుపుచేయడం కష్టం కావచ్చు.

2 comments:

  1. చక్కగా వ్రాసారండి.

    ReplyDelete
  2. బాగా రాశారు. మన రాజకీయ పార్టీలు వాటిలోని కొన్నిరకాల అస్పృశ్యతాభావాల వల్ల దేశాన్ని తాకట్టుపెట్టడాన్ని కళ్లప్పగించి చూస్తున్నాయి

    ReplyDelete