Monday, October 15, 2012

ఉద్యమాల నుంచి కూడా ఉక్కుపాదమేనా?

సెప్టెంబర్ 30 నాడు ఏమి జరిగింది? తెలంగాణ జనకవాతు అనుకున్న ఫలితాన్ని సాధించిందా? శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పిన జెఎసి మాట నిలబెట్టుకుందా? అక్టోబర్ ఒకటో తేదీన తెలుగు పత్రికలే కాదు, రాష్ట్రంలో వెలువడిన అన్ని భాషల పత్రికలూ నెక్లెస్‌రోడ్‌లో కిక్కిరిసిన జనసందోహం బొమ్మను ఎంతో ప్రభావవంతంగా అచ్చువేసి, మార్చ్ విజయవంతమైందన్నట్టుగానే పతాకశీర్షికల్లో వార్తలు ప్రచురించాయి.

ఆ రోజు జరిగిన సంఘటనలను కూడా ప్రముఖంగానే ప్రస్తావించాయి. మార్చ్‌కు ముందునుంచే ఉద్యమకారుల ప్రవర్తన మీద అనుమానాలను, హింసాఘటనల ఊహాగానాలను నిర్మిస్తూ వచ్చిన పోలీసులు, మార్చ్ అనంతరం జెఎసి నేతలు మాట నిలబెట్టుకోలేకపోయారని, హింసాత్మక సంఘటనలను నివారించలేకపోయారని విమర్శించారు. ఆ మరునాటి నుంచి సమైక్యవాద నేతలు మార్చ్‌కు పెద్దగా జనం రాలేదని, కోదండరామ్‌ను అరెస్టు చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీని రద్దుచేయాలని రకరకాల వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఒకటి రెండు ఇంగ్లీషు పత్రికలలో తప్ప మార్చ్ గురించి సొంతంగా ప్రతికూల వ్యాఖ్యానాలు చేసిన తెలుగు పత్రికలే వీ లేవు. అయినా, మార్చ్ గురించిన 'హింసా' ప్రచారం సాగుతూనే ఉంది. నిజానికి సెప్టెంబర్ 30 నాడు హింస ఏదైనా జరిగితే అది పోలీసుల వైపు నుంచే జరిగింది.

దారుణమైన పద్ధతిలో లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగాలు జరిగాయి. ఉద్యమకారుల వైపు నుంచి జరిగింది విధ్వంసకాండ మాత్రమే. ఆస్తుల ధ్వంసం అభిలషణీయమైనదని కాదు, కానీ, అది హింసాకాండ కంటె తక్కువ స్థాయిది. వాస్తవం అదే అయినప్పటికీ, పత్రికలు మీడియా ఎంత సంయమనంతో, జనకవాతుపై
ఎంతో సహనంతో వ్యవహరించినప్పటికీ- తెలంగాణ ఉద్యమంపై ప్రత్యర్థుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మీడియా వైఖరులు ఉద్యమాలపై సమాజంలో జరిగే అనుకూల, ప్రతికూల ప్రచారాలను నియంత్రించలేవు, మీడియాను బెదిరిస్తే, బాధిస్తే, నష్టపరిస్తే ఉద్యమాలకు ప్రత్యర్థులు మాయమైపోరు.

ఉద్యమకారులు పాల్పడిన విధ్వంసాలకు బలి అయిన ఆస్తులలో రెండు మీడియా వాహనాలున్నాయి. అందులో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వాహనం కూడా ఉన్నది. ఏయే చానెళ్లు ఆదరించదగ్గవో, ఏ చానెళ్లు దాడిచేయదగ్గవో సూచిస్తూ ఒక బ్యానర్ సభాస్థలంలో కట్టి ఉన్నది. ఆ బ్యానర్ సూచనను అందుకుని కొందరు ఈ దాడులు చేశారు. విధ్వంసం జరుగుతుంటే, కొందరు రాజకీయ నేతలు విజయగర్వంతో సంకేతాలు పంపారు.

ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు, దాన్ని సమర్థించే రాజకీయపార్టీలు కొన్ని ఉన్నప్పుడు, వ్యతిరేకించే పార్టీలూ ఉంటాయి, వ్యక్తులూ ఉంటారు, యంత్రాంగాలూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం ప్రత్యర్థులు లేని ఉద్యమం కాదు. భావాల పరంగాను, ప్రయోజనాల పరంగాను దాన్ని వ్యతిరేకిస్తున్నవారికి, అడ్డుకుంటున్నవారికి కొదవలేదు. ఈ మొత్తం ఘర్షణను పత్రికలు తప్పనిసరిగా ప్రతిఫలించితీరాలి. అది మీడియా బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించడంలో తాము సబబు అనుకున్న వ్యాఖ్యలు చేయడానికి పాత్రికేయులకు హక్కు ఉంటుంది. రాష్ట్రవిభజన గురించి తెలుగువారిలో ప్రధానంగా రెండు రకాల వాదనలు ఉన్నాయి కాబట్టి, పత్రికలు ఈ ఉద్యమం విషయంలో ఏదో ఒక విధానాన్ని పాటించాలనుకోవచ్చు, తటస్థంగా ఉండాలనుకోవచ్చు. పాత్రికేయుల వ్యాఖ్యల ఔచిత్యాన్ని, పత్రికల విధానాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. ఆ ప్రశ్నలు, విమర్శలు ఉద్యమసంస్కారాన్ని ప్రతిఫలించాలి తప్ప, వ్యక్తుల కుసంస్కారాన్ని కాదు.

రెండు సంవత్సరాల కిందట మీడియాకు, తెలంగాణ ఉద్యమానికి మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, జెఎసి చైర్మన్ కోదండరామ్ చానెళ్లు, పత్రికల బాధ్యులతో సమావేశమయ్యారు. అపోహలను, సమస్యలను తొలగించుకోవడానికి, సమన్వయం పెంచుకోవడానికి సంప్రదింపుల మార్గం మంచిదన్న గుర్తింపును ఆ సమావేశం ప్రకటించింది. సమస్యలు వచ్చినప్పుడు, సమీక్షించుకుని పరిష్కరించుకోవాలన్న సూచనతో పాటు, మీడియాపై రాజకీయనేతలు ఆవేశపూరితమైన బహిరంగ ప్రకటనలను మానుకునేట్టు చూడాలని కోదండరామ్‌ను ఆంధ్రజ్యోతి తరఫున కోరడం జరిగింది.

బాధ్యుల స్థాయిలో జరగవలసిన విమర్శ, ప్రతివిమర్శలను- బహిరంగసభల్లో, సాధారణ జనంలో ఉద్రేకాలను రెచ్చగొట్టేవిధంగా చేస్తే- దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయులకు ప్రమాదకరంగా ఉంటుందని ఆయనకు వివరించాము కూడా. ఆ సమావేశం తరువాత అటువంటి సామరస్య ప్రయత్నాలు మరి జరగలేదు. వేదికలపైనా, ప్రెస్‌కాన్ఫరెన్స్‌లలోను రాజకీయనేతల మీడియాదూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పర్యవసానమే మార్చ్‌లో విధ్వంసకాండ.

ప్రజా ఉద్యమాలకు, మీడియాకు మధ్య అనుబంధం పరస్పర ప్రయోజనాలకు సంబంధించింది మాత్రమే కాదు. విలువలకు సంబంధించింది కూడా. నిర్దిష్ట హక్కుల కోసం పోరాడే ప్రజా ఉద్యమం, తక్కిన శ్రేణుల హక్కుల మీద కూడా సానుభూతితో ఉండాలి, అవసరమైనప్పుడు కలసి పోరాడాలి. 2008లో ఎమ్మార్పీఎస్ దాడి చేసినప్పుడు, ఎడిటర్‌ను అరెస్టు చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం, దాని రాజకీయ నాయకత్వంతో సహా పత్రికాస్వేచ్ఛవైపు నిలబడిన విషయం ఆంధ్రజ్యోతి కృతజ్ఞతతోనే గుర్తుచేసుకుంటుంది. ఆ విలువ తన విషయం వచ్చే సరికి ఏమయిందన్నదే ప్రశ్న. ఎమ్మార్పీఎస్ వివాదం సందర్భంలోనే హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ మీడియాకు ప్రజా ఉద్యమాలకు ఉండవలసిన సంబంధం గురించి విలువైన వ్యాఖ్యలు చేశారు.

మారుతున్న మీడియా ప్రమాణాల గురించి, పరిధులు అతిక్రమించడం గురించి విమర్శ చేస్తూనే, పత్రికాస్వేచ్ఛ అనే విలువను కాపాడుకోవడం బలవంతుల కంటె బలహీనులకే ఎక్కువ అవసరమని, ప్రజా ఉద్యమాలు ఆ తెలివిడితో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆంధ్రజ్యోతి దానికి అనుకూలంగా సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది. 2002లో పునఃప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ విషయంలో కూడా సానుకూలమైన వైఖరిని ప్రకటిస్తూ వచ్చింది. ఈ వైఖరులు పత్రికాసంస్థ తన ప్రజాస్వామిక వైఖరుల్లో భాగంగా స్వచ్ఛందంగా తీసుకున్నవే తప్ప, ఎవరినో మెప్పించడానికి కాదు. కానీ, వర్గీకరణ వ్యతిరేకులు కానీ, సమైక్యవాదులు కానీ ఆంధ్రజ్యోతిపై ఎప్పుడూ భౌతికదాడులకు దిగలేదు. ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకుంటే దాడులు ఎదురవుతాయన్న భయం ఉంటే, పత్రికలు ప్రజాస్వామిక ఉద్యమాలను సమర్థించే సాహసం చేయగలవా? అని బాలగోపాల్ వేసిన ప్రశ్నను ప్రజా ఉద్యమాలు మరోసారి గుర్తు చేసుకోవాలి.

తమకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్నదానితో నిమిత్తం లేకుండా, పత్రికల ఉనికిని, వాటి స్వేచ్ఛను పటిష్ఠపరచేందుకు ఉద్యమాలు కట్టుబడి ఉండాలి. తనపై దాడులు జరిగినంత మాత్రాన వర్గీకరణను సమర్థించడం కానీ, దళితసమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కానీ, తెలంగాణ అంశంపై వైఖరిని కానీ ఆంధ్రజ్యోతి మార్చుకోలేదు, మార్చుకోదు. అటువంటి కట్టుబాటునే ఉద్యమాలు కూడా చూపించాలని కోరుకోవడంలో దురాశ ఏముంది?

అంతిమంగా విజయాన్ని సాధిస్తాయా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా, సమాజంలో ప్రజా ఉద్యమాలు కొన్ని విలువలను స్థిరపరుస్తాయి. ఆ విలువలు సమాజసంస్కారంలో అంతర్భాగమవుతాయి. ఆ దృష్టితో చూస్తే, పత్రికలు ఉద్యమాలనుంచి ఎంతో నేర్చుకుంటాయి. తమను తాము సరిదిద్దుకుంటాయి. సున్నితత్వాన్ని అలవరచుకుంటాయి. అలాగే, మీడియాలో వచ్చే విమర్శను, వ్యాఖ్యలను స్వీకరించి ఉద్యమాలు తమను తాము విమర్శించుకుంటాయి. ఇదొక పరస్పర అధ్యయన ప్రక్రియ. పత్రికలు వేదికగా జరిగే భావసంఘర్షణలు, వాదోపవాదాలు ప్రజల ఆలోచనలను పదునెక్కిస్తాయి. సమష్టి జ్ఞానాన్ని అభివృద్ధిపరుస్తాయి. ఆ పారస్పర్యాన్ని అర్థం చేసుకోకపోతే, సదవగాహన పెంపొందించుకోకపోతే, పత్రికాస్వేచ్ఛకు ప్రభుత్వాల నుంచి, పోలీసులనుంచి, పెత్తందార్లనుంచి, కార్పొరేట్లనుంచి ఉన్నట్టే ప్రజా ఉద్యమాలనుంచి కూడా నిత్యం ప్రమాదం ఎదురవుతూ ఉంటుంది.

కోదండరామ్ కానీ మల్లేపల్లి లక్ష్మయ్య కానీ రాజకీయాల నుంచి వచ్చిన నాయకులు కారు. ఒకరు విద్యారంగం నుంచి, మరొకరు పాత్రికేయ రంగం నుంచి వచ్చినవారు. తెలంగాణ ఉద్యమాన్ని ఇంత విస్త­ృతమూ బలోపేతమూ చేసిన రెండు రంగాలు అవి. ఆ రంగాల ప్రతినిధుల నాయకత్వంలో జరిగిన జనకవాతులో మీడియాపై దాడి జరగడమే ఆశ్చర్యకరం, విషాదకరం. మార్చ్ రోజున జరిగినదానికి కోదండరామ్ పశ్చాత్తాపం ప్రకటించారు కానీ, అది సరిపోదు. అటువంటివి పునరావృత్తం కాకుండా చేయడానికి ఆయన కేవలం విజ్ఞప్తులు చేస్తే చాలదు. మీడియా విషయంలో ఎందుకు సహనంతో ఉండాలో ఆ విలువలను ఆయన ఉద్యమంలో బలంగా ప్రతిష్ఠింపజేయాలి.

No comments:

Post a Comment