Monday, October 22, 2012

ప్రకృతి నేర్పుతున్న పాఠం వైవిధ్యం

పోయిన సోమవారం నాడు హైదరాబాద్ పోలీసులు తమ వక్రదృష్టిని మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబయి)కి చెందిన ఒక పరిశోధకుడిని, అతనికి సహాయం చేస్తున్న ఒక పాత్రికేయుడిని రెండుగంటల పాటు నిర్బంధించి ఇబ్బందిపెట్టారు. అందుకు వేరే కారణం ఏమీ లేదు. పరిశోధకుడి పేరు షరిబ్ అలీ, పాత్రికేయుడి పేరు ఇస్మాయిల్ ఖాన్ కావడమే కారణం. మతపరమయిన ఉద్రిక్తతలకు సంబంధించిన సంఘటనలపై పరిశోధనలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలలో సమాచార సేకరణ, అభిప్రాయ సేకరణ చేస్తున్న షరిబ్ అలీ, మక్కా మసీదు పేలుళ్ల సంఘటన గురించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మక్కామసీదు పేలుళ్ల నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదిని కూడా అతను కలుసుకోగోరాడు.

కలుసుకోవడానికి అంగీకరించిన న్యాయవాది, పోలీసులకు కూడా సమాచారమిచ్చాడు. న్యాయవాది ఏమని చెప్పారో, ఎందుకు చెప్పారో తెలియదు కానీ, పోలీసులు అత్యుత్సాహం చూపించి, ఒక ఉగ్రవాదిని బంధించిన తరహాలో షరిబ్ అలీని, అతనికి స్థానికంగా సహాయం చేస్తున్న పాత్రికేయుడు ఇస్మాయిల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ, ఇతరులు రంగప్రవేశం చేసిన తరువాత, వదిలిపెట్టారు. అసలు అటువంటి పరిశోధన ఎందుకు చేయాలని, అందులో భాగంగా మరో మతానికి చెందిన ఆ న్యాయవాదిని ఎందుకు కలవాలని పోలీసులు అతన్ని ప్రశ్నించారట. హైదరాబాద్‌లో జరిగిన చేదు అనుభవంపై హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే, ఇతర పట్టణాల్లో తన పరిశోధనకు ఆటంకమవుతుందని, ఆ పరిశోధక విద్యార్థి సరిపెట్టుకున్నాడట. పరిశోధనలో చివరకు ఏమి నిరూపణ జరుగుతుందో కానీ, మతపరమైన విభజనలు సమస్త యంత్రాంగాలలోకి, మనస్థితులలోకి ఎట్లా ప్రవేశించాయో హైదరాబాద్ అతనికి అర్థం చేయించింది.

మనుషుల పేర్లను బట్టి, గడ్డాలను బట్టి- వారిని తక్షణం అనుమానితులుగా పరిగణించే తత్వం పేరు ఏదైనా కావచ్చును కానీ, పోలీసింగ్ మాత్రం కాగూడదు. కర్ణాటకలో వేర్వేరు మతాలకు చెందిన ఆడ, మగ పిల్లలు కలసి తిరగకూడదని మతోన్మాదమూకలు లాఠీలు పట్టుకుని బెదిరించడానికీ, పరిశోధకులు ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో పోలీసులు నిర్ణయించడానికీ తేడా ఏమున్నది? మామూలు మనుషుల్లో ఎటువంటి మూస అభిప్రాయాలుంటాయో ప్రభుత్వ యంత్రాంగంలోనూ అవే ఉంటే, ఇక పరిపాలన నిష్పాక్షికంగా
ఎలా ఉంటుంది? అప్పుడిక మనుషులు కులాల వారీగా, మతాల వారీగా ఒకరినొకరు కలవకుండా బతకాలి, భవనాలు, వీధులు, వాడలు- అన్నీ వేర్వేరుగా ఉండాలి. ఒకరికొకరు ఎదురుపడిన వెంటనే అనుమానంతో కోపంతో రగిలిపోవాలి. అటువంటి స్థితి వస్తే అప్పుడు మనం జీవించేది సమాజం మాత్రం కాదు. గోధుమరంగు చర్మం ఉంటే చాలు, ఎత్తైన భవనాల వంక ఆసక్తిగా చూస్తే చాలు- టెర్రరిస్టేమో అని భయపడిపోయి గగ్గోలు పెట్టే అమెరికన్ సమాజం లాగానే మనం కూడా తయారవుతున్నామా?

జీవవైవిధ్యం అంటే జంతువృక్షజాలం అంతా ప్రమాదం లేకుండా వర్ధిల్లడమని మాత్రమే అని అర్థం కాదు. అది ఒక ప్రాకృతిక విలువ. అడవుల్లోని మృగాలు పరస్పరం చంపుకుంటుంటాయని, అక్కడ బలమున్నవాటిదే రాజ్యమని మనం సరదాకి చెప్పుకుంటాం కానీ, ఆ ఆటవికతలో ఒక పరస్పరత ఉన్నది. ఆ పరస్పరతే వాటి మనుగడకు పూచీ ఇస్తున్నది. మనుషుల్లేని ప్రకృతి అందిస్తున్న జీవనమార్గాన్ని మనుషుల్లోని వికృతి ఏనాడో కాలదన్నింది కాబట్టే, ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. నీరు విషం, గాలి విషం, గొడుగుపడుతున్న ఓజోన్ పొరకు గాయం, అంతరించిపోతున్న ప్రతిప్రాణితో పాటు అంతరిస్తున్నది మనుషుల భవిష్యత్తే. మనుషుల్లోని ఏ స్వార్థం, ఏ దురాశ, ఏ అప్రాకృతికత పర్యావరణానికి, జీవజాలానికి ముప్పుగా పరిణమించాయో, ఆ దుర్గుణాలే మనుషులు తమలో తాము పరస్పరత లేకుండా, వైవిధ్యం లేకుండా బతకడానికి ప్రేరేపిస్తున్నాయి. తను కానిదాన్ని సహించలేని తనమే, తనలాగా లేనిదాన్ని, తన లాగా ఆలోచించనిదాన్ని భరించలేని తనమే- షరిబ్ అలీని చూసి ఉగ్రవాదిగా భయపడ్డది. వైవిధ్యం అధికారానికి శత్రువు. వ్యాపారానికీ శత్రువు. అన్నిటా తానే ఉండాలని, అన్నిటినీ తానే అమ్మాలనే మనిషికి శత్రువు.

ప్రకృతికీ మనిషికీ నిత్య వైరుధ్యం ఉంటుందన్న నమ్మిక, ప్రకృతి విధ్వంసాన్నే అభివృద్ధిగా భ్రమింపజేస్తుంది. అడవులను తొలగించి, తోటలను పెంచే తత్వం చివరకు ఒకే పంట, ఒకే రకం వంగడం, ఒకే బ్రాండ్ పశువు, ఒకే జీవనవిధానం, ఒకే మతం, ఒకే రాజకీయ విశ్వాసంగా పరిణమించింది. నాటుకోళ్లన్ని అంతరించి బ్రాయిలర్లే బతుకుతున్నాయి. తరతరాల బంగారుతీగెల బియ్యం పోయి ఇంగ్లీషునెంబర్ల బియ్యం బీటీ బియ్యం వస్తున్నాయి. నాగలి వ్యవసాయమూ బండ్లూ లేవు కాబట్టి, మగపశువులు చచ్చిపోవాలి, కట్నపు ఖర్చులూ గుండెలపై కుంపట్లూ కాబట్టి ఆడపిల్లలు తగ్గిపోవాలి. డార్విన్ చెప్పినట్టు ఎవరు నెగ్గుతారో వారే బతుకడం కాదు, ఎవరికి గిరాకీ ఉందో వారికే బతుకు ఉంటుంది. వ్యాపారం కోసం జీవజాలాన్ని తారుమారు చేసిన వ్యవస్థ, అధికారం కోసం మనుషులను కూడా కొందరిని శిష్టులుగా, కొందరిని హీనులుగా, కొందరిని దీనులుగా మారుస్తుంది. కొందరయితే, చచ్చిపోదగ్గవాళ్లే, అణగారిపోదగ్గవాళ్లే.

ప్రకృతిని జయించి కాదు, ప్రకృతిని అర్థం చేసుకుని మనిషి జీవించాలి. ప్రకృతి పాస్‌వర్డ్ తెలిసి ప్రవర్తించాలి. మనిషి మృత్యుపాదం సోకనిచోట ఇంకా పచ్చపచ్చగా ఉన్న ఆదిమప్రకృతి నుంచి నేర్చుకోవాలి. చెరువులో చేపలాగా ప్రకృతిలో మనిషి ఉండాలి. వనరులమీద సొంతదనం కోసం పోరాటం ఉంటుంది. కానీ, అది వనరులనే మింగేసేటంతగా ఉండకూడదు. స్వార్థం మీద పోరాటం, గుత్తాధిపత్యం మీద పోరాటం, అసహనాలను పెంచే రకరకాల ఉన్మాదాల మీద పోరాటం, పంచుకోవడం లేకుండా పెంచుకోవడం మీదనే దృష్టిపెట్టే దురాశల మీద పోరాటం- అన్నీ జీవవైవిధ్యం కోసం జరిగే పోరాటాలే.

అంత విధ్వంసం జరిగిన తరువాత చెర్నోబిల్ అణుకేంద్రం చుట్టూ మనిషి చొరబడకుండా కంచెవేస్తే, పాతికేళ్లలో మళ్లీ చిగుళ్లు లేచాయి, చిన్నాచితకా జీవజాలం తలెత్తింది. ఆదివాసులు అడవి ఒడిలో బిడ్డల్లా బతికితే, ఆకు తరగలేదు, పచ్చదనం పారిపోలేదు. నాగరికుడే, స్వార్థపరుడైన నాగరికుడే, వ్యాపారీ అధికారీ అయిన నాగరికుడే అడుగుపెట్టిన చోట భస్మం. కొలంబస్ కనిపెట్టిన తరువాత, పేరులేని ఒక మహాసంస్కృతి మాయం. వాస్కోడిగామా కాలికట్ చేరుకున్నాక, దేశం దేశమే అల్లకల్లోలం. ఇప్పుడిక సాహసయాత్రలూ క్రుసేడ్లతో పనిలేని గ్లోబల్ యుగంలో మూడో ప్రపంచమంతా ఒక పండోరాగ్ర హమే. సతతహరితారణ్యాలను చూసి కలప కోసం కత్తిదూస్తాడు బేహారి.

వేయి పూలు వికసించాలి, వేలరంగుల పూలు వికసించాలి. వేయి గొంతులు పాడాలి, వేరు వేరు పాటలు పాడాలి. వానపామునీ నల్లచీమనీ బతకనిస్తున్న ప్రకృతిలాగా, బడ్డీకొట్టుని కిరాణాకొట్టుని కూడా బతకనివ్వాలి. సజ్జలూరాగులూ కొర్రలూ కూడా కంకులెత్తి ఊగాలి. కత్తిదూసిన పత్తి స్థానంలో మళ్లీ బంగారు జొన్నలూ వరహాల ఆముదాలూ పండాలి. అలాయిబలాయి తీసుకుని మనుషులంతా పండగ చేసుకోవాలి.

మనుషులమొక్కళ్లమే ఉండలేము, మనతో పాటు సమస్తచరాచర ప్రకృతీ ఉండాలి. మనుషుల్లోనూ ఒక్కళ్లమే బతకలేము, ఇరుగూపొరుగూ ఉండాలి. ఇంద్రధనుస్సులాగా, బతకమ్మలాగా మనుషులు పూసగుచ్చిన వైవిధ్యం లాగా ఉండాలి. ఏకత్వం ఉండాలంటే భిన్నత్వాన్ని గౌరవించాలి.

No comments:

Post a Comment