Tuesday, October 23, 2012

ఎవరో సంధించిన బాణాలేనా, ఇంకా..?

ఇరవయ్యేళ్ల కిందట 'రోజా' అనే సినిమా భారతీయ చలనచిత్ర భాషకు కొత్త వ్యాకరణాన్ని రచించింది. ఎఆర్ రెహమాన్అనే సంచలన సంగీతకారుడిని దే శానికి పరిచయం చేయడమే కాక, దేశభక్తిని చారిత్రక స్ఫురణల నుంచి సమకాలిక ప్రతీకలవైపు ఉద్వేగపూరితంగా మళ్లించింది. అందులో నాయకుడు దేశభక్తితో రగిలిపోతూ, కాశ్మీర్ మిలిటెంట్ల చేతికి బందీగా చిక్కుతాడు. నాయిక మాత్రం పతిభక్తితో అపరసావిత్రిలాగా భర్తను విడిపించుకోగలుగుతుంది. ఆ సినిమా మీద జరిగిన సునిశిత చర్చల్లో ఒక ప్రశ్న ఆసక్తికరంగా వినిపించింది. మగవాళ్లకు మాత్రమే 'దేశభక్తి' ఉంటుందా?

స్త్రీలకు భర్తభక్తి ఉంటే సరిపోతుందా? ఎందుకంటే, 'రోజా' నాయికకు నాయకుడి ఆలోచనలతో, మంచిచెడ్డల విచక్షణతో ఎటువంటి సంబంధం ఉండదు. భర్తప్రాణాల కోసం ఆమె మిలిటెంట్లనూ ప్రభుత్వాన్నీ వేడుకుంటుంది, నిలదీస్తుంది, ఎదిరిస్తుంది. ఆమె ఒక మిలిటెంట్ భార్య అయి ఉంటే కూడా, భర్త కోసం అంతే నిష్ఠతో సంకల్పబలంతో ప్రయత్నించి ఉండేది.

ఆడవాళ్లకు సామాజిక జీవితం, రాజకీయ జీవితం ఉంటాయని సమాజం అనుకోదు కాబట్టి, సమాజంతో పేచీలేనివాళ్లెవరూ- ఆడవాళ్లతో సహా- వాళ్లను రాజకీయ, సామాజిక వ్యక్తులుగా భావించరు. ఒక వేళ రాజకీయ, సామాజిక జీవితాల్లో ఆడవాళ్లు ప్రముఖంగా కనిపిస్తే, వాళ్లు కుమార్తెలుగానో, భార్యలుగానో, అక్కచెల్లెళ్లుగానో మాత్రమే, ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. లేదా అకస్మాత్తుగా పురుషపెద్ద చనిపోయినప్పుడు లభించిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుని రాణిస్తారు. చాలా అరుదుగా మాత్రమే అందుకు అపవాదాలు, తామే స్వయంగా ఎదిగివచ్చే ఉదాహరణలు, కనిపిస్తాయి.

షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టనున్నారని వార్తలు వచ్చినప్పుడు, సహజంగానే ఒక సందేహం కలిగింది. ఆమె వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయగా అటువంటి ప్రయత్నం చేస్తున్నారా, జగన్మోహన్‌రెడ్డి సోదరిగా చేస్తున్నారా? లేక షర్మిల అనే వ్యక్తిగా చేస్తున్నారా? ఈ మూడు ప్రశ్నలూ ఒకటే కదా అనిపించవచ్చును. జాగ్రత్తగా చూస్తే తేడా తెలిసిపోతుంది. లేదా, మరో రకమైన ప్రశ్న కూడా వేసుకోవచ్చు. ఆమె తండ్రి స్మ­ృతిని నిలబెట్టడానికి
పాదయాత్ర చేస్తున్నారా; ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో పాదయాత్ర చేస్తున్నారా, లేక సోదరుడు జగన్ కోసం ఆయన బదులుగా పాదయాత్ర చేస్తున్నారా? - ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పెద్దగా కష్టపడనక్కరలేకుండానే షర్మిలే స్పష్టత అందించారు. అన్న కోసమే ఆమె యాత్ర. జగన్ రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచి వింటున్న 'జనం కోసమే జగన్' నినాదం మనకు చిరపరిచితమే.

ఆయన కూడా రాజన్న రాజ్యం స్థాపించడం కోసమే రాజకీయం చేస్తున్నానని చెబుతారు కానీ, అది ఒక నేపథ్యం మాత్రమే. తాను తండ్రి స్మ­ృతి కోసం కాదు, వారసత్వంగా రాజకీయం చేస్తున్నానని స్పష్టంగానే చెబుతారు. మరి షర్మిల కూడా వారసురాలే కదా? పైగా, జగన్‌కు ఉన్న కళంకాలు షర్మిలకు లేవు కూడా. తాను వారసత్వం కోసం రంగంలోకి దిగినట్టు జనం అనుకోవడం, జగన్ అనుకోవడం కూడా ఆమెకు ఇష్టం లేదు. అందుకే, ఆమె జనం కోసం కాక, 'అన్న' కోసమే పాదయాత్ర చేపడుతున్నారు. తానొక స్వతంత్రురాలైన, సమర్థురాలైన నాయకురాలిగా
ఆమె చెప్పుకోవడం లేదు. తాను జగన్ వదిలిన బాణాన్నని వినయంగా చెప్పుకున్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే, గాయపడిన బ్యాట్స్‌మన్ బదులు ఆమె రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

అన్నా చెల్లెళ్ల మధ్య అపోహలు కలిగించడం మంచిది కాదు కానీ, షర్మిల జగన్‌కు పోటీ అవుతుందా అన్న కుతూహలం జనంలోనే ఉంది. జగన్ అరెస్టయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని విజయలక్ష్మి, షర్మిల కొనసాగించినప్పుడు ఆ అనుమానబీజం నాటుకుంది. విజయలక్ష్మికి రాజకీయభాష, సరళి అలవడలేదు కానీ, కీచుగొంతుతో అయినా షర్మిల తనదైన ముద్రను వేయగలిగారు. ఆ విషయం జగన్‌పార్టీలో ఎంతో కొంత కలవరం కలిగించింది కాబట్టే, ఉప ఎన్నికల అనంతరం విజయలక్ష్మి మాత్రమే ప్రముఖంగా కనిపించసాగారు. ఇప్పట్లో జగన్ జైలు నుంచి బయటకు రావడం అసాధ్యంగా కనిపించడంతో, జనంలో తమ ఉనికి మరుగున పడకుండా జగన్ పార్టీకి షర్మిల రంగప్రవేశం అవసరం అయింది. మహిళ అయి ఉండీ, మునుపు ఎవరూ చేయనంత సుదీర్ఘమైన పాదయాత్రను చేపడుతున్న షర్మిల- పార్టీ మనుగడ గురించి జనానికి నమ్మకం కలిగించడం కంటె, తనకు వేరే ఉద్దేశ్యాలు లేవని జగన్‌కు నమ్మకం కలిగించడమే ముఖ్యమని భావించడమే విచిత్రం.

జవహర్‌లాల్ నెహ్రూకు మగసంతానం ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో? తన ఇంటిపేరులో ఉన్న గాంధీకి మహాత్మాగాంధీకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, దాని ఆధారంగా ఒక చారిత్రకమైన ఆమోదనీయతను, నెహ్రూ కుమార్తెగా వారసత్వ ప్రతిపత్తిని సాధించినవారు ఇందిరాగాంధీ. పాలనాసామర్థ్యం కలిగిన మహిళగా ఆమె తనను తాను నిరూపించుకున్న మాట నిజమే కానీ, ఆ స్థానానికి చేరుకోవడానికి ఆమెను నడిపించిన సానుకూల పరిస్థితులు వేరు. ఇందిరాగాంధీకి ఆడసంతానం ఉండి ఉంటే ఏమై ఉండేది? ఏమీ అయ్యేది కాదు. అప్పుడు కూడా సంజయ్‌గాంధీ, తరువాత రాజీవ్‌గాంధీ వరుస కొనసాగి ఉండేది.

సాధారణంగా పురుష రాజకీయనాయకుల వారసత్వం, ముఖ్యంగా అకాలంలో మరణించిన వారి వారసత్వం- తక్షణం పొందే అవకాశం భార్యలకుంటుంది. అటువంటి అవకాశం సోనియాగాంధీకి దక్కలేదు. 2004లో ఆమె నిరాకరించిన మాట నిజమే అయి ఉండవచ్చును కానీ, 1991లో ఆమెను ఆమోదించే పరిస్థితులు లేవు. ఆమెను భార్యగా చూశారు కానీ, వారసురాలిగా కాదు. ఆ విషయం గ్రహించిన సోనియా గాంధీ వారసత్వం కోసం ప్రయత్నించకుండా, మైన ర్ పిల్లలను యుక్తవయస్సుదాకా పెంచి పెద్ద చేసే రీజెంట్‌గా వ్యవహరించారు. సోనియాకు ఒక కొడుకు, ఒక కూతురు. ప్రియాంక గాంధీ వాద్రా, రూపంలో ఇందిరను స్ఫురింపజేస్తారు. సోదరుడి కంటె మాటకారి, వ్యవహర్త అయినప్పటికీ, వారసత్వాన్ని సోదరుడి కోసమే వదిలివేస్తున్నారు.

ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి, ఇరవయ్యేళ్ల కిందటే రాణింపునకు వచ్చి ఉంటే, ఎన్టీరామారావు వారసత్వం గురించి కొంత పోటీ ఉండి ఉండేది. సినీజనాదరణ ఉన్న బాలకృష్ణ రాజకీయాలకు సిద్ధం కాకపోవడం వల్ల, సమర్థుడుగా, చతురుడిగా అప్పటికే చంద్రబాబు స్థిరపడిపోవడం వల్ల అల్లుడే వారసుడిగా స్థిరపడిపోయారు. ఎన్టీయార్ భార్యగా లక్ష్మీపార్వతి ఎంత ప్రయత్నించినప్పటికీ జనం ఆమోదించలేదు. సంతానం, తక్షణ కుటుంబం పోటీకి తగిన అభ్యర్థులు కారని భావించినప్పుడు ప్రజలు తమ విచక్షణను ఉపయోగించి వారసత్వాన్ని నిర్ణయిస్తారు. సంతానం లేని ఎంజిఆర్ విషయంలో ఆయన భార్యను కాక, సన్నిహిత అనుచరురాలైన జయలలితనే జనం వారసత్వానికి ఎంపిక చేసుకున్నారు.

కుమారుడికి, కుమార్తెకు ఇద్దరికీ రాజకీయాల మీద, వారసత్వం మీద ఆసక్తి ఉన్నప్పుడు, తండ్రికి అదొక జటిలమైన సమస్యే. సంతానంలోనే స్పర్థలు రాకుండా ఉండడానికి ముందస్తు ఏర్పాటు చేయవలసి వస్తుంది. పురుషస్వామ్యం కాబట్టి, పెద్దపీటను కొడుకుకే సిద్ధం చేయాలి. బహుశా అందుకే, కెసిఆర్ తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి, కుమార్తెకు సాంస్క­ృతిక వ్యవహారాలు, సాహిత్యం, పుస్తకప్రచురణ వంటి రంగాలను కేటాయించి ఉంటారు. ఎక్కువ కుటుంబాలు, అధికసంతానం ఉన్న కరుణానిధి వంటి వారికి వారసులపోరే పెద్ద తలనెప్పిగా మారుతుంది. కనిమొళి, అళగిరి, స్టాలిన్- మధ్య పోటాపోటీ సాగుతూ ఉన్నది.

మమతాబెనర్జీ వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అగ్రకుల స్త్రీ కావడం మినహా, ఆర్థికంగాకానీ, రాజకీయంగా కానీ ఆమెకు అండదండలేమీ లేవు. ఎవరి వారసురాలు కాకపోయినా, దిగ్గజంగా ఎదిగిన మహిళా నేత ఆమె. మాయావతిది కూడా దాదాపు అదే కోవ. కాన్షీరామ్ ఆశీస్సులు, ప్రోత్సాహం ఉన్నప్పటికీ, దళిత నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన అరుదైన నేత మాయావతి. వారిద్దరూ మరెవరికో ప్రతినిధులుగానో వారసులుగానో కాకుండా, తమను తాము వ్యక్తులుగా పరిగణించుకుంటారు. రాజకీయాన్ని కూడా కుటుంబ బాధ్యతగా గాక, వ్యక్తి అభిరుచిగానో బాధ్యతగానో గుర్తిస్తారు. స్త్రీలకు రాజకీయ, సామాజిక జీవితాలుంటాయని, వాటిలో వారు పురుషుల వలెనే స్వయంప్రకాశంతో రాణించగలరని నిరూపించిన మహిళలు వారు.

1 comment:

 1. @స్త్రీలకు భర్తభక్తి ఉంటే సరిపోతుందా?

  హ్మ్మ్ భర్త భక్తీ అన్న భావం మణిరత్నం చూపించడు ఏమో అని నా అనుకోలు. అది ప్రేమ మాత్రమె, అదే ప్రేమ ను మిలిటెంట్ల దగ్గర బందీ గా ఉన్న హీరో కూడా ప్రదర్సిస్తాడు.
  ఆమె ఉన్న పరిస్థితుల్లో మగ స్నేహితుడు లేదా ఇతర కుటుంబ సభ్యులు అయినా ఎంతో కొంత ఆమె చేసినటువంటి ప్రయత్నం చేస్తారు కదా :)

  @ఆడవాళ్లతో సహా- వాళ్లను రాజకీయ, సామాజిక వ్యక్తులుగా భావించరు
  భావించరు అనడం కన్నా అంగీకరించరు అంటే సరిపోతుందేమో

  @ అన్న కోసమే ఆమె యాత్ర. @మరి షర్మిల కూడా వారసురాలే కదా?

  వై ఎస్ ఆర్ తన మరణాన్ని ఊహించి ఉండరు. కాబట్టి తన తర్వాత కొడుకుని వారసడి గా, కూతురుని అతనికి సపోర్ట్ ఇవ్వగల కుటుంబ సభ్యురాలిగా మాత్రమె ఎడుగుతున్నపుడు అభ్యంతర పెట్టలేదు.ఇప్పుడు ఆమెకి ఇంకాస్త మంచి అవకాసం దొరికింది.
  జగన్ కు ఉన్న ప్రజాదరణను బట్టి ఆమె అన్నకోసమే పాదయాత్రలు చేస్తున్నట్లు చెప్పుకోవాలి. తప్పదు, కాని ఆమె కి రావలసిన క్రెడిట్ రాకుండా పోదు.

  @పార్టీ మనుగడ గురించి జనానికి నమ్మకం కలిగించడం కంటె, తనకు వేరే ఉద్దేశ్యాలు లేవని జగన్‌కు నమ్మకం కలిగించడమే ముఖ్యమని భావించడమే విచిత్రం.

  జగన్ కి మాత్రమె కాదు, జనం కి కూడా ఈ నమ్మకం కల్పించడమే ముఖ్యం. తండ్రి ఉండగా జగన్ ఎలా ప్రవర్తించాడో, ఇప్పుడు జగన్ తో షర్మిలా అలానే ఉండాలి. జగన్ జనం అంగీకరించిన నాయకుడు, షర్మిల పేరు చాల కొద్ది మందికి మాత్రమె పరిచయం.


  @సోనియాగాంధీ

  ఇవే పరిస్థితులు రాజీవ్ గాంధీ అసహజ మరణం కు వర్తిస్తాయి. అప్పటికి సోనియా గాంధీ ప్రజలకి పరిచితురాలుకాడు. ప్రియాంక గాంధీ కొంతవరకు పరిచితురాలే కాని, అనుభవం, భద్రతా కారణాలు ఇప్పటి జగన్ స్థానం లో ప్రియాంక అప్పట్లో రాణించలేక పోయింది.
  రాజీవ్ గాంధీ బ్రతికి ఉంది ఉంటె, ప్రియాంక గాంధి కి ఖచ్చితం గా అవకాసం లభించి ఉండేది.


  @పురందేశ్వరి,

  ఎం టీ ఆర్ మరణం, పదవీ విమోచనం కూడా దాదాపు అసహజ పరిస్థితులే. అప్పటివరకు ఆయన కూతురు పనిచేయ్యాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కూడా ఆమె పెద్దగా రాణించింది అని చెప్పలేము (మీ వ్యాస పరిధి లో). ముందే ఆమె రాజకీయాల్లోకి వచ్చినా ఇంతకన్నా పెద్దగా సాధించగలిగే వారు అని నేను అనుకోవడం లేదు. ఇందుకు దగ్గుబాటి ఉదాహరణ.


  @కుమారుడికి, కుమార్తెకు ఇద్దరికీ రాజకీయాల మీద, వారసత్వం మీద ఆసక్తి ఉన్నప్పుడు, తండ్రికి అదొక జటిలమైన సమస్యే.

  కాదు. అప్పుడు ఇద్దరి సామర్ధ్యాలను బట్టి ఉంటుంది. ప్రియాంక సమర్ధురాలు కాబట్టి ఆమె కి అవకాసం వచ్చి ఉండేది తప్పకుండా. కేవలం వారసత్వం కారణం గా కుమార్తె ని పోటి గా భావించనవసరం లేదు.

  ReplyDelete