Saturday, October 6, 2012

జనకవాతు జయిస్తుంది!

మనుషులు నడవాలి. చేతులు చేతులు పట్టుకుని స్నేహంగా నడవాలి. నెమ్మదిగా నింపాదిగా అడుగు తీసి అడుగు వేసుకుంటూ నడవాలి. పొద్దున్నే పని దిక్కుకు, రాత్రికి ఇంటి దిక్కుకు సంతోషంగా నడవాలి. బడికి, గుడికి, పొలానికి, ఫ్యాక్టరీకి, యాత్రలకు, జాతర్లకు నడవాలి. నడక జీవితపు గడియారం. నడక ఒక జీవన వ్యాపారం.

నడవాల్సిన మనుషులు కవాతు చేయాల్సిరాకూడదు. సున్నితంగా సుతారంగా స్ప­ృశించవలసిన భూతల్లిని పదఘట్టనలతో దద్దరిల్లజేయవలసిన అవసరమే రాకూడదు. కానీ మనుషులను మనుషులుగా ఉండనిస్తున్నదెక్కడ? గుసగుసలు చెప్పుకుని ముచ్చట్లాడుకుని కథలు చెప్పుకుని పాటలు పాడుకునే పెదాల మీద క్రోధగీతం ఎందుకు స్థిరనివాసం ఏర్పరచుకున్నది? కాయకష్టంతో కాయలు కాసే అరచేతులు పిడికిళ్లుగా ఎందుకు మారవలసివస్తున్నది? కన్నీళ్లు ప్రవహించి ప్రవహించి ఎండిపోయిన కళ్లు జీరలతో నెర్రలు బాసిన ఎర్రరేగళ్లు ఎందుకు కావలసివచ్చింది?

గత్యంతరం లేనప్పుడు మనుషులు దండుబాటు పడతారు. నడక మాని కవాతు చేస్తారు. వందల వేల లక్షల విడివిడి శరీరాలను ఒకే ఉనికిగా అల్లుకుని, ఒక గొంతుగా పేనుకుని ఒకే ఆకాంక్షను రెపరెపలాడిస్తారు, ఒకే ఆక్రందనను నినదిస్తారు. ఏమిటి ఆ ఉనికి? ఏమిటి ఆ ఆక్రందన? నెత్తుటిగాయాలతో, వెన్నున దిగిన కత్తులతో, దిక్కులు పిక్కటిల్లిన అరణ్యరోదనలతో చరిత్ర దీర్ఘరహదారుల వెంట దగాపడి నడుస్తూ వస్తున్న ఆ ఉనికి పేరేమిటి?

తెలంగాణ. లోకమంతా తెలిసిన పేరు. పోరాటాలకు నమూనా. విప్లవాలకు పరామర్శ గ్రంథం. కానీ ఏమి చరిత్ర దానిది? కాకతీయుల కాలంలో, కుతుబ్‌షాహీల హయాంలో ఒకటి రెండు శతాబ్దాలు నిలకడగా ఉన్నదేమో కానీ, తక్కిన అంతా అనిశ్చితే, నిత్యరణరంగమే. రెండేళ్లకోసారి దండయాత్ర చేసి తుగ్లక్ దోచుకుని పోవడమే. ఔరంగజేబుకు కన్నుకుట్టి నెలల యుద్ధంలో నేలమట్టం కావడమే.

శిస్తు కాంట్రాక్టర్ల చేతిలో నలిగిన రైతాంగం, యుద్ధప్రభువులు చెలాయించిన జాగీర్దారీ జులుం, ఇంగ్లీషువాడి వడ్డీవ్యాపారానికి నడ్డివిరిగిన నిజాం రాజ్యం, రైత్వారీ రాగానే అవతరించిన దొరలరాజ్యం, విద్య లేక, పాలనలో పాలు లేక నలిగిన తెలుగు తెలంగాణం, భూస్వామ్యంపై ఎత్తిన గొంతుకలపై విరుచుకపడ్డ రజాకార్లు, నిజాంను ప్రభుత్వంలోను, దొరలను కాంగ్రెస్‌లోను కలుపుకుని జనాన్ని వంచించిన విలీనం- తెలంగానమొక బాలసంతు దీనగానం. మిలటరీయాక్షన్‌లో ఐదువేల మంది, తొలి ప్రత్యేక ఉద్యమంలో నాలుగువందల మంది, ఆ ఆతరువాత విప్లవోద్యమ ఉధృతిలో నేలకొరిగిన వేలజనం, నేటి ఉద్యమంలో వేయిబలిదానాలు.... కృష్ణాగోదావరులు నీరివ్వకున్నా, మూసీమంజీరలు ఎండిపోయినా, జీవనదిలా ప్రవహిస్తున్నది ఇక్కడ నెత్తురొక్కటే కదా?

అణగారిపోవడమో అసహాయంగా మిగలడమో మాత్రమే కాదు, అవమానాలు కూడా పడిన నేల ఇది. ఒకవైపు ముళ్లకిరీటాలు, మరోవైపు నిందారోపణలు. అలనాడెప్పుడో జరిగిపోయినదయితే, కాలదోషం పట్టిన నిజాములపై కత్తిగట్టినదయితే, సొంతసమాజంలోని దుష్టదొరలను దునమాడినదైతే- అప్పుడది వీరతెలంగాణ. కానీ, తనలోకి తాను చూసుకుని, తనకంటూ ఒక సొంతప్రగతిమార్గాన్ని కోరుకుంటున్నదయితే, స్వయంపాలన
కోసం తపనపడుతున్నదయితే- అప్పుడది వేరు తెలంగాణ, తీవ్ర తెలంగాణ, ప్రమాదకర తెలంగాణ, అసాంఘిక తెలంగాణ. అంతేకాదు, తెలంగాణను నిందించడానికి చరిత్రతో చెలగాటమాడవచ్చు, ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాట మాట్లాడవచ్చు. అనువును బట్టి తెలంగాణ అంతా కమ్యూనిస్టులు, నక్సలైట్లు అని భయపెట్టవచ్చు. మరో సందర్భంలో తెలంగాణ అంటే భూస్వాములూ ఫ్యూడలిజమూ అని నిందించవచ్చు. ఆ రెండు వాస్తవాలూ తెలంగాణవే, వాటి మంచిచెడ్డల లబ్ధిదారూ బాధితురాలూ ఈ ప్రాంతమే. అయినప్పటికీ, ఆ వాస్తవం తెలంగాణ మెడ మీద నిలిపిన రెండంచుల కత్తి.

ఇంత గడిచి కూడా, తెలంగాణది ఒక అనితరసాధ్యమైన వ్యక్తిత్వం. అది ఎంతటి విప్లవకారిణో అంతటి సత్యాగ్రహి. ఎంతటి అసహనమో అంతటి సహనం. ఎంతటి భిన్నత్వమో అంతటి ఏకత్వం. నేల ఎంతటి దుర్భిక్షమో గుండె అంతటి సుభిక్షం. లేకపోతే, సాయుధ, మిలిటెంట్ రాజకీయాలతో యాభైసంవత్సరాల పాటు పోరాడిన తెలంగాణ ఇప్పుడెంతగా అహింసను పాటిస్తున్నది? తెలంగాణ సమాజం ఇంకా విధ్వంసాన్ని, సంక్షోభాన్ని భరించలేదని, సకలజనుల సమష్టి భాగస్వామ్యంతో పునరుజ్జీవనం సాధించాలని కృతనిశ్చయంపూని, సమస్త హింసలను పంటిబిగువున భరిస్తున్నది.

పదేళ్లు దాటిన పోరాటం, ఎన్ని ఆశాభంగాల మధ్య, నిస్ప­ృహల మధ్య కుంగిపోకుండా తనను తాను నిలబెట్టుకుంటున్నది. తొలినాడు కొన్ని శ్రేణులకు పరిమితమైన ఆకాంక్ష, ఇప్పుడు పల్లె పల్లెకు విస్తరించింది. ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, నిలదీతలు, వేరుకుంపట్లు, సామాజిక రాజకీయ వాదవివాదాలు- వీటితో ఉద్యమం వేయిరేకల పుష్పం వలె వికసించిందే తప్ప, చీలికలు పేలికలు కాలేదు. సమయం వచ్చినప్పుడు, పిల్లకాలవలు, వాగులు, వంకలు అన్నీ కలిసి ఒక మహాప్రవాహమై పరవళ్లు తొక్కుతోంది. ఆంతరంగిక విమర్శను కొనసాగిస్తూనే, అపురూపమైన ఐక్యతను ప్రదర్శిస్తున్న అందమైన ఇంద్రధనస్సు తెలంగాణ సమాజం. కలసి ఉండడమే తిరుగులేని విలువ అని అమాయకంగానో, నిశ్చయపూర్వకంగానో విశ్వసిస్తున్నవారు ఉండవచ్చు.

వారిని గౌరవించవలసిందే. అభివృద్ధి అంతరాలు, వివక్షలు సమస్యలుగా మారినప్పుడు స్నేహపూర్వకంగా విడిపోవడమే ఉభయుల మధ్య ప్రేమలను స్నేహాన్ని మిగుల్చుతాయని వారికి నచ్చచెప్పవచ్చు. ఉమ్మడి అస్తిత్వంతో ముడిపడిన అంశాలను చెప్పి, విడిపోతే తమకు నష్టమని బాధపడేవారున్నారు. భయాలను, అపోహలను, సందేహాలను నివృత్తిచేసి, న్యాయమైన పరిష్కారాన్ని సూచించి వారిని ఒప్పించవచ్చు. కలసి ఉండలేకపోయినా కలసి ఉండాల్సిందే అని దబాయించేవారు ఉన్నారు. వారిని గౌరవించలేము. రెండు అస్తిత్వాల సహజీవనం ఇద్దరూ ఒప్పుకుంటేనే సాధ్యమయ్యేది. ఏ ఒక్కరు ఒప్పుకోకున్నా సాధ్యంకానిది. మమ్మల్ని మాకు వదిలేయండి, మా భవిష్యత్తు మేం తీర్చిదిద్దుకుంటాం - అని అడుగుతున్నవారి ఆకాంక్షను అంగీకరించడం తప్ప మరో న్యాయమైన మార్గం లేదు.

ఆ ఆకాంక్ష ఎంత బలమయినదో ప్రదర్శించడానికి తెలంగాణ సమాజం అన్ని పద్ధతులనూ ఉపయోగించింది. రాజకీయమైన, ఉద్యమపరమైన మార్గాలు అన్నీ అయిపోయాయి. గడువులు, నిరీక్షణలు అన్నీ ముగిసిపోయాయి. కనీవినీ ఎరుగని రీతిలో సకలజనుల సమ్మె జరిగింది. ప్రజాస్వామిక మార్గాలను గౌరవిస్తే, ఇతరేతర మార్గాలకు చెలామణీ ఉండదని చిలకపలకులు పలికే నేతలు- ప్రజల సహనాన్ని పరీక్షించడమే పనిగా పెట్టుకున్నారు. సహనం కోల్పోకుండానే, ఆకాంక్షను పలచబడనీయకుండా తెలంగాణ కాపాడుకుంటోంది. ఈ అనిశ్చితి- ఉభయప్రాంతాలకూ మంచిది కాదు. ఎంతకాలమైనా ఈ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది. పరిష్కరించడమొక్కటే మార్గం. ఆ వాస్తవాన్ని ఒక హెచ్చరికగా వినిపించేందుకే - తెలంగాణ కవాతు జరుగుతోంది. అది వినిపిస్తున్న గుండెచప్పుడును విందాం. తెహ్రీర్ స్క్వేర్ గురించి, మల్లెల విప్లవాల గురించి మాట్లాడుకుంటాం కదా, కళ్లెదుట జరిగేదాన్ని కళ్లు తెరిచి చూద్దాం.

ప్రత్యేకరాష్ట్రం ఆకాంక్షలోని మంచిచెడ్డల చర్చ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకుంటున్నారా లేదా చూడండి. వారు ఆ విషయాన్ని ఎంత బలంగా చెబుతున్నారో చూడండి, ఎంతకాలంగా ఓపికగా ఉన్నారో గమనించండి. ఎన్ని ఆత్మబలిదానాలు జరిగాయో గుర్తు తెచ్చుకోండి. ఈ ఆకాంక్ష ఎన్నికల వేళల్లో వీచే గాలివాటం ప్రభంజనం కాదని, నిలకడగా మన రాష్ట్ర ఆకాశం మీద నిలబడిన వాయుగుండమని గుర్తించండి. ఇంతమంది మనుషులు, ఇన్ని రకాల మనుషులు, ఇంత కాలం నిలుపుకున్న కోరికను మన్నించలేకపోతే, ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటో అన్వేషించండి. మౌనంలోని, నిరాకరణలోని, నిర్లక్ష్యంలోని హింసను వ్యతిరేకిద్దాం.

2 comments:

  1. ప్రజాస్వామ్యంలో ఓకే రాష్ట్రంలోని మెజారిటీని ద్వేషిస్తూ, వలసవాదులు అని నోరుపారేసుకుంటే, అవసరానికి పుట్టుకొచ్చే సెంటిమెంట్లకు, పిల్లిశాపాలకు ఉట్లు తెగవు అన్నది గ్రహించాల్సిన నీతి. ఇలాంటి శాంతిభద్రతల సమస్య సృష్టించే నక్సల్ ప్రేరేపిత వుబుసుపోని ఉజ్జమాలను, ప్రజాస్వామ్య పద్దతుల్లో ఎలా శాంతింపచేయాలో పోలీసులకు స్వేచ్చనిస్తే తెలుస్తుంది. ప్రజాస్వామ్యనికి ఎవరికి వారు భాష్యాన్ని బాగానే ఇచ్చుకుంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. బతుకనీకి వచ్చినవలస, బతుకుల ముంచనీకి వచ్చిన వలసవాదం వేరన్నది మీకు తెల్సీ మల్ల మల్ల అదే దబాయింపులెందుకన్నా? వుబుసుకుపోని వుద్యమమైతే, ఎప్పటినుంచి రగులుతున్నది, ఊరు, ఊరు కదులుతున్న సంగతులు మీకు తెల్వకనా? అసలైన ఆంధ్రుడెవడూ ఇట్లా ఈడ వన పడుతున్నదని, ఆడ ఛత్రి పత్తుకున్నట్టు, వుచ్చ తొక్కుడు "ఉజ్జమాలే" చేయడు. మంది బలహీనతను ఆసరగ, తమ ప్రాంతంల ఎలాంటి అభివృద్ధి లేకున్నా, తమ బతుకులు మాత్రమే బాగుండాలనుకోడు. విజయవాడ - గుంటురు బెల్ట్ రాజధానిగ మారితే మీకున్న తెలివికి (సరైన దారిల ఆలోచిస్తే) ఎంత అభివృద్ధైన జరుగుద్ది. ఈ ఉద్యమం ఒకప్పుడు ఆరేది కాదు. ప్రజా చైతన్యం ఒకప్పటి కన్న ఇప్పటికే ఎంతనో పెరిగింది. ఇంక పెరిగేదె తప్ప తగ్గేది కాదు. ఎట్లన్న విడిపోవుడు తప్పనప్పుడు అందరు బాగుండాలనే మంచి మాటగ విడిపోతెనే మంచిది. మీకు తెల్వని సంగతేదికాదిది. కని వుట్టి జిద్దు చేస్తున్నరంతే, దయుంచి అదేవద్దు.

      Delete