Thursday, November 22, 2012

నేల విడిచిన సాము : 2014

ఎన్నికలు వస్తాయో రావో కానీ, ఎన్నికలు వస్తాయేమోనన్న వాతావరణం మాత్రం వచ్చింది. ఈ సారి ఎన్నికలు రాజకీయపార్టీల జనాదరణపైనో, విధాన బలాలపైనో గాక- ప్రచారనిర్వహణ సామర్థ్యం మీద, ప్రత్యర్థులను బలహీనపరిచే చాణక్యం మీదా ఆధారపడనున్నాయని స్పష్టమైపోయినందున, అస్త్రాలకు ముందుగానే పదునుపెట్టవలసిన అవసరం ఏర్పడింది. ఎన్నికలు ఎప్పుడన్నా జరగనీ, ఇప్పటి నుంచి రానున్న కాలమంతా రాజకీయంగా సంచలనాత్మకంగా ఉండబోతున్నది. అయితే అవి, వాస్తవమైన సామాజిక, రాజకీయ ప్రతిపాదనల వల్ల కాక, వాగాడంబర వాదప్రతివాదాల వల్ల సంభవించే శుష్క సంచలనాలు మాత్రమే.

ఎన్నికలు ఒక నిర్ణీత వ్యవధిలో ఓటర్లు చేసుకునే రాజకీయ ఎంపిక. భారతదేశం వంటి బహుళపక్ష రాజకీయ వ్యవస్థలో, ఎన్నికలు- కనీసం స్వాతంత్య్రానంతరం మొదటి మూడు నాలుగు దశాబ్దాలు- వ్యక్తుల ఎంపికతో పాటు, విధానాల ఎంపికగా కూడా పనిచేశాయి. దేశ రాజకీయగమనం, సామాజికార్థికాభివృద్ధి విధానాలు స్థూలంగా కొన్ని మార్గాలుగా సమీకరణం పొంది, వివిధ రాజకీయ పక్షాల విధానాలుగా ఓటర్ల ముందుకు వస్తాయి. ఎన్నికల
నాటికి సమాజంలో రూపుదిద్దుకున్న వాతావరణాన్ని బట్టి, మూడ్‌ని బట్టి ఎంపిక జరిగిపోతుంది. అట్లాగని, క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయిదాకా ఎన్నికగానీ, ఎంపిక గానీ ఓటర్లు చైతన్యయుతంగా, తగిన పరిజ్ఞానంతో చేసినవని భావిస్తే పొరపాటే. దేశంలో రాజకీయ వ్యవస్థ పునాదులు, పై అంచెలు ఏ ప్రాతిపదికలపై నిర్మితమవుతాయో, అవే ఎన్నికల్లో నిగూఢంగా నిర్ణాయక అంశాలుగా పనిచేస్తాయి.

లెక్క ప్రకారం మరో ఏడాదిన్నరలో రావలసిన ఎన్నికలు త్వరితంగా వస్తే గనుక, అందుకు జాతీయ రాజకీయ వాతావరణం త్వరగా మార్పునకు సంసిద్ధం కావడం కారణమయితే సంతోషించవలసిందే. వ్యవస్థను సమూలంగా మార్చే శక్తి ఈ పార్టీలకు లేనప్పటికీ, తరచు ఒకరిస్థానంలో మరొకరు రావడం, ప్రత్యర్థిపార్టీల మధ్య స్పర్థలు తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ స్పర్థలు విధానాలు, సిద్ధాంతాల పునాదిపై ఉంటే ఆ మేలు మరింత మెరుగైన స్థాయిలో ఉంటుంది. కానీ, ప్రత్యర్థిత్వం ఎన్నికల కోసం అభినయించేది మాత్రమే అయినప్పుడు, పోరాటం బృందాల మధ్యనే తప్ప విధానాల మధ్య కానప్పుడు- జనానికి ఒరిగేది ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యం, ఎన్నికలు కేవలం సాంకేతిక అంశాలుగా మిగిలిపోతాయి.

నిజానికి అవినీతి, ఆర్థిక విధానాలపై ఆధారపడిన అవినీతి, ఈ సారి ఎన్నికలలో ఒక ముఖ్యమైన పోరాటాంశం కావలసింది. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ప్రజలకు నేరుగాను, చాటుగానూ నష్టం కలిగించే అభివృద్ధి విధానాలు- మార్పు కావాలన్న ఆకాంక్షను జనంలో కలిగిస్తున్నాయి. కాకపోతే, అన్ని శ్రేణుల ప్రజలకూ నేటి దుస్థితికి మూలకారణం ఏమిటో తెలియకపోవచ్చు. ఉన్నతస్థాయిలో జరిగినట్టు కనిపిస్తున్న వేల, లక్షల కోట్ల అవినీతియే దోషిగా వారు కనిపెట్టలేకపోవచ్చు. తమ జీవన ప్రమాణాలు మెరుగుపడడం, జీవనాధారాలకు, తాము ఆశ్రయించిన ప్రకృతివనరులకు నష్టం కలగకుండా చూడడం, తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆర్థిక సంస్కరణల నుంచి సంక్షేమరక్షణలు ఇవ్వడం- ప్రజలు కోరుకుంటూ ఉండవచ్చు. వారి ఆకాంక్షలు అధికారపార్టీ వ్యతిరేకతగా కొన్నిచోట్ల, ఫలానాపార్టీ అనుకూలతగా మరోచోట వ్యక్తం కావచ్చు. జనం జేజేలు కొడుతున్న కొత్త శక్తులను గమనిస్తే నిరాశ కూడా కలుగుతుంది. ఎట్లాగూ మూకుమ్మడి దోపిడీ ఆగనప్పుడు, సంక్షేమం పేరుతో ప్రభుత్వం నుంచి నాలుగు డబ్బులు ఎక్కువ పిండుకుంటే చాలు, అదే మహాప్రసాదమని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది.

మొదట అన్నాహజారే, తరువాత కేజ్రీవాల్ అవినీతిని ఎజెండా మీదకు తేవడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ, వారు చేసిన పని అందరూ దొంగలేనని తెలుసుకోవడానికి ఉపయోగపడినంతగా, ప్రత్యామ్నాయాన్ని సూచించడానికి పనికిరాలేదు. జాతీయస్థాయిలో బరిలో ఉన్న రెండు ప్రధాన కూటములు దొందూదొందే అని ఖాయపడిన తరువాత, అవినీతి ఒక ఎన్నికల అంశమే కాకుండా పోయిందేమో అనిపిస్తుంది. అంతర్గత కలహాలతో, నాయకత్వ లేమితో, అవినీతి ఆరోపణలతో కుంగిపోయి బిజెపి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, అవినీతి అంశాన్ని మాయచేయడానికి కాంగ్రెస్ సాహసిస్తోంది. ప్రధానప్రతిపక్షం కూడా అవినీతిపరురాలే అని చెప్పడం, అన్నా-కేజ్రీవాల్ విశ్వసనీయతను దెబ్బతీయడం వంటి వ్యూహాలు సరిపోక, ఇప్పుడు 2జి స్పెక్ట్రమ్ వివాదంలో గజం మిథ్య పలాయనం మిథ్య అని నిరూపించడానికి, కాగ్ కొమ్ములు కత్తిరించడానికి ప్రయత్నిస్తోంది.

అధికారంలో ఉండడం వల్ల, కుటుంబపాలనే కీలకంగా పార్టీయంత్రాంగం పనిచేయడం వల్ల కాంగ్రెస్ దబాయింపు వ్యూహం బాగానే రాణిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అవినీతి ఒక అంశంగా లేకుండా చేయడమే కాంగ్రెస్ ఉద్దేశ్యం. ప్రతిపక్షాలకు నాయకత్వం లేకుండా చేయడం, పోరాట అంశం లేకుండా చేయడం- ఆ శూన్యంలో రాజకీయ మేనేజ్‌మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చి రాహుల్‌ను ప్రధాని చేయడం- ఇదీ నేటి కాంగ్రెస్ వ్యూహం. అట్టడుగుస్థాయినుంచి పార్టీని పునర్నిర్మించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని కలలు కన్న రాహుల్‌గాంధీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక, ఇప్పుడిక ఈ అడ్డదారే రహదారిగా అవతరించింది.

ఇంతా చేసి, ఇదంతా వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో గండం గడచి గట్టెక్కడానికి చేస్తున్న విన్యాసమని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు సిద్ధమని, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరడం, ప్రభుత్వాలు భయపడడం పాత మాట. ఇప్పుడు ఎన్నికలు తెస్తామని అధికారపక్షమే ప్రతిపక్షాన్ని బెదిరిస్తోంది. చిల్లర వర్తకంలో విదేశీపెట్టుబడుల అంశంపై పార్లమెంటులో ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం తాటాకు చప్పుళ్లు చేసి ఉండవచ్చు. ప్రతిపక్ష కుందేళ్లు బెదరనూ వచ్చు. వచ్చేసారి మళ్లీ గెలుస్తామో లేదో అని అధికారపక్షమూ అయిదేళ్ల కాలం చివరి క్షణందాకా ఉండాలని, ప్రతిపక్షమూ అనువుగాని వేళ ఎన్నికలెందుకని ఆఖరినిమిషం వరకూ వాయిదావేయాలని ప్రయత్నిస్తున్నాయి.

అనువైన వేళ ఎప్పుడు వస్తుంది? ఈ దేశంలో రాజకీయపార్టీలన్నీ అనుకోకుండా ఎదురయ్యే మలుపుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రజలనుంచి ఏవైనా ఉద్యమాలు తలెత్తితే, వాటిని ఆధారం చేసుకోవాలనుకుంటున్నాయి. అంతే తప్ప, ప్రజల్లోని అసంతృప్తిని ఒక క్రమపద్ధతిలో రాజకీయ ఆకాంక్షలుగా తీర్చిదిద్దాలని, తామే ఉద్యమాలు నిర్మించాలని రాజకీయపక్షాలు మరచిపోయాయి. ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం నేతలు పాదయాత్రలు నిర్వహించడం- జనానికి బాగానే ఉంటుంది కానీ, సమస్యలు పార్టీ అధినేతలకు తెలియవలసిన పద్ధతి అది కాదు. ఎన్నికల ప్రచార సందర్భాలు వేరు.

రాష్ట్రంలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. కేంద్రంలో యుపిఎ లాగానే 2004 నుంచి రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నది. అయినా తొమ్మిదేళ్ల పాలనను సగర్వంగా చెప్పుకునే పరిస్థితి అధికారపార్టీకి లేదు. అప్రతిష్ట పాలయిన పరిణామాలకు బాధ్యులయినవారే బయటకు పోయి, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబునాయుడుకు అవినీతి అంశాన్ని ఎన్నికల అంశంగా చేయాలని బలంగానే ఉన్నది కానీ, జనం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అనుమానమూ ఉన్నది. అందుకని సంక్షేమ వాగ్దానాలపైనే అధికంగా ఆధారపడుతున్నారు. వైఎస్సార్‌పార్టీకి రాజన్నరాజ్యం తప్ప మరో సిద్ధాంతం లేదు. కాంగ్రెస్‌కు అది కూడా లేదు. పైగా తన గతంతో తానే పోరాడవలసిన పరిస్థితి. ఏదో ఒక లక్ష్యంతో ఉనికిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రసమితి, కానీ లక్ష్యసాధన మార్గాన్ని ఇదమిత్థంగా చెప్పగలిగే పరిస్థితి దానికీ లేదు.

పార్టీలకు భావదారిద్య్రమూ, ఎజెండాల దారిద్య్రమూ ఉండవచ్చు. జనం తలచుకుంటే, 2014కు ఒక పోరాట అంశాన్ని ముందుకు తేగలరు. పాతనాయకత్వాలకు కొత్త రక్తం ఎక్కించగలరు, పూర్తి కొత్త నాయకత్వాలనూ తేగలరు. గెలుచుకోవలసిన రాజ్యం ఏదీ లేకుండానే పోరాడవలసిరావడమే జనం సమస్య. దాన్ని వారే పరిష్కరించుకోవాలి.

No comments:

Post a Comment