Thursday, November 1, 2012

మంచో చెడో, కేజ్రీవాల్ మన అవసరం

చరిత్రను, వర్తమానాన్నీ, జనగాథలను స్వాప్నిక వాస్తవికతతో మేళవించి రచనలు చేసినందుకు చైనీస్ రచయిత మో యాన్‌కు సాహిత్యంలో నోబెల్ ఇస్తున్నట్టు ప్రకటన వెలువడిన తరువాత, హిందూస్థాన్ టైమ్స్‌లో మనస్ చక్రవర్తి అనే పాత్రికేయ కాలమిస్టు, ఒక చక్కటి వ్యంగ్య రచన చేశారు. స్వాప్నిక వాస్తవికత అన్న భావనకు పగటికలలు కనడమో, భ్రమాలోకంలో విహరించడమో అన్న అర్థాలు ఆపాదిస్తూ, మన రాజకీయాలలో వినిపిస్తున్న అనేక అసంబద్ధ వ్యక్తీకరణలకు కూడా నోబెల్ ఇవ్వవచ్చు కదా అనే ధోరణిలో ఆ వ్యంగ్య రచన సాగుతుంది. ఆ కాలమిస్టు వెక్కిరించినవాటిలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఇండియా అగెనస్ట్ కరప్షన్ (ఐఎసి) సంస్థ మేనిఫెస్టో కూడా ఉంది. 'మింట్' పత్రికలో 'లూజ్ కేనన్' పేరుతో మరో కాలమ్ రాసే చక్రవర్తికి ఆ శీర్షికకు తగ్గట్టుగానే నోటిదురుసు ఎక్కువ. అందుకే ఆయన ఐఎసి సంస్థను 'ఇండియా అగెనస్ట్ కాన్‌స్టిపేషన్' (మలబద్ధకంపై భారత్ పోరాటం) అని చమత్కరించారు.

కేజ్రీవాల్ ఉద్యమం వెనుక అజీర్తి, మలబద్ధకం వంటి కారణాలున్నాయో లేదో కానీ, అతని ఆలోచనలు, వ్యూహాలు, ప్రకటనలు మాత్రం రాజకీయనేతలకు, పాత్రికేయ విశ్లేషకులకు, మొత్తంగా భారతీయ మధ్యతరగతి పౌరసమాజానికి జీర్ణం అవుతున్నట్టు లేవు. అతనికి అనేక రాజకీయ దురుద్దేశాలను ఆపాదించేవారి దగ్గరనుంచి, అతని ఆలోచనలు అపరిపక్వమైనవని, అవగాహన లేనివని నిరాకరించేవారిదాకా కనిపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి, యుపిఎకు లాభం చేకూర్చడానికే కేజ్రీవాల్ పనిచేస్తున్నారని ప్రతిపక్షకూటమి నిందిస్తుంటే, కేజ్రీవాల్‌ను లెక్కచేయనక్కరలేదన్నట్టు అధికారకూటమి వ్యవహరిస్తోంది. పెద్ద పెద్ద తలకాయలకు గురిపెడుతున్నాడు నిజమే కానీ, విరామం లేకుండా, ఒకరి మీద నిలకడగా పోరు చేయకుండా ఈ విచ్చలవిడి దాడులేమిటి- అని కేజ్రీవాల్ పద్ధతుల మీద కొందరు చిరాకు పడుతున్నారు. కాలం చెల్లిన గాంధేయుడని
ఒకరంటే, మారువేషంలోని మావోయిస్టు అని మరికొందరంటున్నారు. తాను మాత్రం వ్యవస్థలోపలి నుంచే పోరాడతానని కేజ్రీవాల్ స్పష్టంగా చెబుతున్నాడు.

అన్నా హజారే-కేజ్రీవాల్ జమిలిగా ఉద్యమం చేస్తున్నప్పుడు- అవినీతి మూలకారణాలు వీరికి తెలుసునా, లోక్‌పాల్ వంటి నియంత్రణావ్యవస్థ మీదనే అమితంగా ఆశలు పెట్టుకున్నారా అన్న అనుమానాలు కలిగాయి. అవి కాక, సంఘపరివార్ అండదండలున్నాయని, ఫోర్డ్ ఫౌండేషన్ నిధులు అందుతున్నాయని రకరకాల విమర్శలూ వచ్చాయి. కొంచెం పట్టువిడుపులు ప్రదర్శిస్తే, జనలోక్‌పాల్ బిల్లు ఏదో ఒక రూపంలో ఆచరణ రూపం తీసుకునేదని, అవినీతి నిరోధం పేరుతో ప్రజాస్వామిక స్ఫూర్తికే అన్నా-కేజ్రీవాల్ ద్వయం గండికొడుతున్నారని విమర్శకులు భావించారు.

అన్నా నుంచి వేరయిన తరువాత, కేజ్రీవాల్ తీరులో మార్పు కనిపించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం అట్టడుగుస్థాయి ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయని, ఇప్పటికే జరుగుతున్న వివిధ ప్రజా ఉద్యమాలతో కలసి నడవాలని కేజ్రీవాల్ భావించారు. కూడంకుళం సందర్శించి, ఉద్యమకారులతో ప్రజలతో కేజ్రీవాల్ సంభాషించారు కూడా. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్న ప్రజా ఉద్యమాలను అనుసంధానం చేయాలన్న ఆకాంక్షను కేజ్రీవాల్ స్థాపించిన 'ఐఎసి' ప్రకటించింది. అభివృద్ధివిధానం లాభాపేక్ష దృష్టితో కాక, సమన్యాయం ప్రాతిపదికన ఉండాలని కూడా ఐఎసి భావించింది. దానితో, కేజ్రీవాల్ మీద సరికొత్త విమర్శలు ప్రారంభమయ్యాయి. కాలం చెల్లిన సోషలిస్టు సూత్రాలను ఆయన ముందుకు తెస్తున్నారని మార్కెట్ వాదులు ధ్వజమెత్తారు. అవినీతితో సహా భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ తీవ్రసంస్కరణలు మాత్రమే పరిష్కారమని వారి అభిప్రాయం.

దేశంలో ఎక్కడా ఏ అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానం నుంచి కూడా కేజ్రీవాల్ గెలవలేడని, అతను కేవలం మీడియాసృష్టి మాత్రమేనని భావిస్తున్నవారున్నారు. నిజమే, అవినీతిమీద పోరాటానికి కాంగ్రెస్‌నుంచి, కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చిరంగంలోకి దూకిన వి.పి.సింగ్ వంటి వ్యక్తి కాదు కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి విరమించుకున్న కేజ్రీవాల్ మధ్యతరగతి విద్యావంతులకు, జాతీయ మేగజైన్లకు సెలబ్రిటీ కావచ్చును కానీ, జనాదరణ ప్రమాణాల రీత్యా మాత్రం అతను ఓట్లు రాల్చగలిగే నాయకుడు కాదు. వాద్రా మీద, గడ్కరీ మీద, ఖుర్షీద్ మీద కేజ్రీవాల్ సంధించిన అస్త్రాలు మీడియాలో సంచలనం సృష్టించాయి. అందరూ అందరే అనే సత్యాన్ని ప్రకటించడానికా అన్నట్టు, ఆయన ఒక స్థిరమైన లక్ష్యం లేకుండా వెంటవెంటనే ఆరోపణలు చేసి అమ్ములపొదిని ఖాళీ చేసుకుంటున్నారు.

అవినీతి జాడ్యం లేని పార్టీ అంటూ లేదు కానీ, ఆ వాస్తవాన్ని బలంగా సోదాహరణంగా ప్రచారం చేయడం వల్ల- అది ఒక అనివార్య వాస్తవికతగా ప్రజలు స్వీకరించే అవకాశం లేకపోలేదు. రాజకీయాల లోతుపాతులు తెలియనందువల్ల కేజ్రీవాల్ అట్లా వ్యవహరిస్తున్నారా, లేక, అంతిమంగా తన ఉద్యమం అధికారపక్షాన్ని మాత్రమే అధికంగా నష్టపరుస్తుందని తెలిసి ఆ దిశగా పనిచేస్తున్నారా అని సందేహం కలుగుతుంది.

ఎవరికెన్ని సందేహాలున్నా, కేజ్రీవాల్ ఇప్పటి జాతీయరాజకీయాలకు అవసరమైన వ్యక్తి. ప్రజా ప్రయోజనాల రీత్యా ఉండవలసిన వ్యక్తి. అతని ప్రభావాన్ని, అతని ఉనికి పర్యవసానాలను (అవి దేశరాజకీయాలను పెనుమలుపు తిప్పేవి కాకపోవచ్చు) అంచనా వేయలేము కానీ, అవినీతి మూలాల స్ప­ృహ పెంచుకుంటున్నందున అతని ప్రయత్నాలు విలువైనవి. వ్యవస్థను లోపలినుంచి సంస్కరిస్తానంటున్న కేజ్రీవాల్‌కు, అతను వాంఛించే సంస్కరణలు ఎంతటి విప్లవాత్మకమైనవో తెలియకపోవచ్చు. గ్రామసభలు, పట్టణ ప్రజా కమ్యూనిటీలకు నిర్ణయాధికారాలు కావాలన్న ఐఎసి డిమాండ్ గాంధేయ వికేంద్రీకరణ వాదానికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఆయా జనసమూహాలు తగిన చైతన్యంతోను, పరిజ్ఞానంతోను ఉన్నప్పుడే నిర్ణయాధికారాన్ని సాధికారతగా మలుచుకోగలవు.

ఆర్థికసంస్కరణల యుగంలో వివాదాస్పద ప్రాజెక్టులకు గ్రామసభలనుంచి బలవంతంగానో, మభ్యపెట్టో సమ్మతులు సాధించుకున్న ఉదాహరణలు అనేకం. తన విజన్ డాక్యుమెంట్‌లో కేజ్రీవాల్ చెప్పిన మాటలు ".. పెట్టుబడి, మార్కెట్, లాభాపేక్ష - ఇవి మాత్రమే మన ఆర్థిక వ్యవస్థను నడిపే చోదకులుగా ఉండడాన్ని అనుమతించకూడదు''- చాలా పెద్ద మాటలు. మార్కెట్ వాదాన్ని నిరాకరించడం అంటే మధ్యతరగతి విశ్వాసాన్ని పణంగా పెట్టడమే అని కేజ్రీవాల్‌కు తెలియకపోలేదు. గత రెండు దశాబ్దాలుగా మన మధ్యతరగతి సంస్కరణల లబ్ధిదారుగా, సమర్థకురాలుగా వ్యవహరిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం- వంటి భావనాత్మక ఆదర్శానికి ఆకర్షితమై, ముందుకు వచ్చేది కూడా ఇదే మధ్యతరగతే. తమ సంపాదనలకు, సంస్కృతికి, విలువలకు, అవినీతి మూలాలకు సంబంధం ఉన్నదన్న స్ఫురణ తీసుకువస్తే చాలు, ఆ తరగతి మౌలిక పోరాటాలకు దూరం జరుగుతుంది. అంతే కాదు, ఇంతకాలం ముద్దుగా చూసిన మీడియా కూడా అటువంటి మాటలు మాట్లాడేవారిని, సోషలిస్టులో మావోయిస్టులో అనేస్తుంది.

అయినా సరే, కేజ్రీవాల్‌లోని వైరుధ్యాలు కూడా ఆహ్వానించదగినవే. లోపలినుంచి బాగుచేస్తామనేవారు వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంచడానికే పనికివస్తారనే విమర్శలో వాస్తవం లేకపోలేదు కానీ, లోపలినుంచి పోరాడేవారు లేకపోతే, బయటి నుంచి పోరాటానికి సానుకూలతే సిద్ధించదు. వ్యవస్థ మీద విశ్వాసంతో దాన్ని సంస్కరించాలనుకునే వారికి నైతికత ఒక ఆయుధం. తన డాంబికపు విలువలను నిజమని నమ్మి, నిలబడేవాడిని ఏం చేయాలో వ్యవస్థకు అర్థం కాదు.

శక్తి లేకపోవచ్చు, జనాకర్షణా లేకపోవచ్చు, లౌక్యమూ వ్యూహమూ తెలియకపోవచ్చు, కానీ, కేజ్రీవాల్ వంటి వాడు ఒకడుండాలి. ఎప్పటికో ఒకప్పటికి అతను నేర్చుకుంటాడు. లేదా మరెవరో సమర్థులు వచ్చేదాకా, కత్తి పదును కాపాడతాడు. ఎందరినో నమ్మి భంగపడిన జాతికి, ఇంకొక భ్రమలో పోయేదేమిటి?

4 comments:

 1. @జ్రీవాల్ వంటి వాడు ఒకడుండాలి...
  అవును ..అవినీతిని వ్యతిరేకించే వాళ్ళు,అవినీతి పై పోరాడే వాళ్ళు మనకు కావాలి...వాళ్ళకు మద్దతునివ్వడం మన కనీస భాద్యత..

  ReplyDelete
 2. మీ విశ్లేషణ బాగుంది . కాని కేజ్రివాల్ ను గట్టిగ సమర్దించటం ప్రస్తుత సమాజానికి ఏంతో అవసరం

  ReplyDelete
 3. ఈజీచేర్లో కూచుని తాపీగా కాఫీ చప్పరించే కొందరు విమర్శకులను మెప్పించడం వుద్యమ ప్రధాన వుద్దేశ్యం కాదు. 'ఏదో ఓ లోక్పాల్' తేవడమో అయితే ఎప్పుడో వున్నాయి, మన ఆంధ్ర లోక్పాల్ లాగా. అలాంటివి ఎందుకున్నాయో మనకు తెలుసు, కాంగ్రెస్ అనుకూల రిటైడ్ జడ్జిలకు పునరావాసానికే.

  ఒకరినో టార్గెట్ చేసుకోవడమంటే మరొకరు నిజాయతీ అనికాదు. ముఖ్య వుద్దేశ్యం కుళ్ళిన రాజకీయ పార్టీలను ఎండగట్టడం.

  చివరి పేరాలో మీ అభిప్రాయమే నాదీను. కేజ్రివాల్ రాజకీయాల్ని మారుస్తాడో, తానే మారి అమ్ముడుపోతాడో, అన్న అనుమానాలు ఇప్పుడు అనవసరం. ఇప్పటికైతే అతడు అంధకారంలో ఓ చిన్న దివ్వె, ఎపుడో ఆరిపోతుందేమో అని వాడకోక పోవడం మూర్ఖత్వం. అతడు విఫలమైనా, మనకున్న అవినీతి పార్టీలు ఎలాగూ వున్నాయి, కాబట్టి వర్రీ చెందనవసరం లేదు. :)

  ReplyDelete