Monday, November 12, 2012

ఆక్సిజన్ అందని అభివృద్ధి రహదారులు

చావుబతుకులు దైవాధీనాలన్న మాట నిజమేనేమో కానీ, గాలిలో దీపం పెట్టి నీవే దిక్కు అంటే దేవుడు మాత్రం ఏమి చేయగలడు? జాతీయస్థాయి పార్లమెంటేరియన్‌గా ఎదిగిన ఉత్తరాంధ్ర జననేత కింజారపు ఎర్రంనాయుడు ప్రాణాన్ని కాపాడడం సాధ్యమయ్యేదో కాదో చెప్పలేము కానీ, ఆయనను రక్షించడానికి జరగవలసిన మానవప్రయత్నం జరగలేదని మాత్రం చెప్పగలము. ప్రమాదసమయానికీ, ఆస్పత్రికి చేరే సమయానికి మధ్య గడచిన గంటసేపటిలో ఎర్రంనాయుడికి ప్రాణవాయువు అంది ఉంటే, ఆలస్యంగా వచ్చి ఆయనను తరలించిన హైవే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సదుపాయం ఉండి ఉంటే, ఆయన బతికేవారేమో? వ్యక్తిగత భద్రత, అధికారవాహన సదుపాయం సవ్యంగా ఉండి ఉంటే ఎర్రంనాయుడు పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేది. అవేవీ లేకపోవడం వల్ల, మహారహదారుల్లోని సార్వజనీన భద్రతారాహిత్యానికి ఆయన కూడా బలికావలసి వచ్చింది. ప్రముఖులు దుర్మరణమైనప్పుడైనా, సమస్య మూలాలను చర్చించకపోతే, రహదారులపై జనక్షేమం అనాథగానే మిగులుతుంది.

ఎర్రంనాయుడు దుర్మరణవార్తను విని, అమెరికా నుంచి ఒక ప్రవాసాంధ్ర వైద్యుడు 'ఆంధ్రజ్యోతి'కి ఫోన్‌చేసి, ఆక్సిజన్ లేక చనిపోవడమేమిటని ఆవేదన చెందారు. రాష్ట్రంలో అత్యవసర వైద్యంతో సహా ప్రజారోగ్యం భ్రష్ఠు పట్టిపోయిందని, ఆరోగ్యశ్రీ పేరిట వేల కోట్లు కార్పొరేట్ ఆస్పత్రులకు కట్టబెట్టడమేమిటి, అంబులెన్సులు కూడా సవ్యంగా నిర్వహించలేకపోవడమేమిటి- అని ఆయన బాధపడ్డారు. ఈ పరిస్థితిని బాగుచేయడానికి
సమాజమే పూనుకోవాలని, అమెరికానుంచి తమలాంటివారంతా కలసి అందుకు ఆర్థికంగా కలసివస్తామని కూడా ఆయన చెప్పారు. అమెరికాలో 911 సర్వీసు కింద పనిచేసే అంబులెన్సులు ఏ హంగులతో ఉంటాయో వివరించారు కూడా.

అమెరికాతో పోల్చుకుంటామా, అనిపించవచ్చును కానీ, అన్నిరంగాలలోకి అమెరికానే కదా దిగుమతి చేసుకుంటున్నాము! ఎర్రంనాయుడిని మింగేసిన స్వర్ణచతుర్భుజి కూడా ప్రపంచీకరణలో భాగంగా వెలసిన మహారహదారే కదా! అక్కడి లాంటి రోడ్లు, అక్కడిలాంటి సైన్‌బోర్డులు, అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి, వాణిజ్య కాంప్లెక్సులు, అక్కడి లాంటి చిల్లరకొట్లు- అన్నిటినీ కలగంటున్నాము, నిర్మించుకుంటున్నాము కదా! మరి ప్రాణాలు కాపాడుకునే వ్యవస్థలు మాత్రం దేశవాళీగా, నాటుగా, మోటుగా ఎందుకుండాలి? లక్షల కోట్లతో రోడ్లు నిర్మించడం, అందుకు ప్రతిఫలంగా కోట్ల కోట్లలో టోల్ వసూలు చేసుకోవడం చేస్తున్నప్పుడు, కొద్దిపాటి ఖర్చుతో ప్రాణాలకు భరోసా కల్పించే పని ప్రభుత్వాలు ఎందుకు చేయవు? అసలు రహదారినిర్మాణ ప్రాజెక్టులో రోడ్డుభద్రతావ్యవస్థల కల్పన ఎందుకు అంతర్భాగంగా ఉండదు?

అన్ని మరణాలకూ ఏదో ఒక జవాబుదారీ ఉంటుంది, నిలదీయడానికి ఏదో ఒక వ్యవస్థ ఉంటుంది కానీ, రోడ్డుప్రమాద మరణాలకు మాత్రం ఉండదు. ఎంతెంత మంది చస్తున్నా, అవన్నీ ప్రమాదం కోటాలోకి, హంతకులెవరూ లేని దయనీయమరణాల కోవలోకి వెళ్లిపోతాయి. ప్రమాదాలను నివారించాలనికానీ, రహదారిభద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని కానీ ఎవరూ డిమాండ్ చేయరు. దోషులని తేలినవారికి పడే శిక్షలు తక్కువ. వాహనాలను, లైసెన్సులను తనిఖీ చేసే యంత్రాంగాలు అవినీతిమయంగా ఉంటాయి. రహదారుల పక్కన మద్యం దుకాణాలపై అదుపు లేదు. నగరాల్లో అమలుచేస్తున్న 'డ్రంకెన్ డ్రైవింగ్' వ్యతిరేక చర్యలేవీ జాతీయరహదారులపై ఉండవు. కనీసం సీట్‌బెల్ట్ నిబంధన కూడా అక్కడ అమలులో ఉండదు. ఎవరి ప్రాణానికి వారే బాధ్యులు.

గతుకుల రోడ్లు, సింగిల్ రోడ్ల కాలం కంటె, ఇప్పటి పలువరసల రోడ్ల మీదనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాహనాల సంఖ్య పెరుగుదల నిష్పత్తితో చూస్తే, ప్రమాదాల సంఖ్య గత ముప్ఫై సంవత్సరాల కాలంలో తగ్గింది. కానీ, వాస్తవ ప్రమాదాల సంఖ్య మాత్రం పెరిగింది. ప్రమాదాలలో ప్రాణనష్టమూ జరిగింది. ఎక్స్‌ప్రెస్ హైవేలు, సాధారణ హైవేల నిర్మాణం- సరుకుల రవాణావ్యవస్థగా జరిగినట్టుగా సమగ్రప్రజారవాణావ్యవస్థగా జరగడం లేదు. మహానగరాల మధ్య, మార్కెట్‌ల మధ్య అనుసంధానంగా సాగే రహదారులు, దారిలో వచ్చే గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకోవు. రహదారుల డిజైనింగ్‌లో సైతం స్థానిక అవసరాలను, ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకోరు. అనేకచోట్ల ఈ రోడ్లు ఊర్లను నిలువునా చీల్చాయి. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లడం స్థానికవాహనదారులకు కష్టతరంగా మారింది. హైవేలలో ప్రమాదాలు అధికంగా దూరప్రాంత రవాణా వాహనాలకూ స్థానిక వాహనాలకూ మధ్యనే జరుగుతాయి.

ప్రమాదాలను లెక్కవేసి, అందుకు కారణాలను క్రోడీకరించే కేంద్రప్రభుత్వ రహదారి భద్రతా పరిశోధన విభాగం దృష్టిలో వాహనచోదకులే ప్రధాన దోషులు. వారు పరిశీలించే కారణాలలో- రహదారి భద్రతా, వైద్యసహాయ వ్యవస్థల లోపం అన్నది లేనే లేదు. అనేక ఘోర ప్రమాదాలలో సైతం, సకాలంలో వైద్యసహాయం అందితే ప్రాణరక్షణ జరిగే అవకాశం ఉంటుంది. జాతీయ రహదారి అథారిటీ (ఎన్‌హెచ్ఐ) ప్రకారం, హైవేలలో ఉపయోగించే అంబులెన్స్‌లలో రెండు స్ట్రెచర్లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్, రెగ్యులేటర్, ఇతర సాధనాలు, మాస్క్, బిపి పరికరం, మెడగాయాలకు, కాలర్ ఎముక గాయానికి కట్టే కట్లు తప్పనిసరిగా ఉండాలి.

అంతే కాక, బిఎస్‌సీ నర్సింగ్ డిగ్రీ, జనరల్ నర్సింగ్‌లో డిప్లమా కలిగిన నర్సులు, ప్రథమ చికిత్సలో శిక్షణ కలిగిన వాహన డ్రైవర్ అంబులెన్స్‌లో ఉండాలి. ఈ మార్గదర్శకాలు ఇలా ఉండగా, సమీకృత హైవే ట్రౌమా కేర్ సిస్టమ్‌ను ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించి, దానిని తొలివిడతలో అమలుజరిపే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా పేర్కొన్నది. 3వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల వెంట ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక అత్యాధునిక అంబులెన్స్ అందుబాటులో ఉండాలని, అందులో పోర్టబుల్ వెంటిలేటర్లతో సహా అన్ని ప్రాణరక్షక వ్యవస్థలనూ ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ప్రమాదబాధితుల కోసం ప్రత్యేక ట్రౌమా సెంటర్లను ఏర్పాటు చేయడానికి వంద ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపికచేసి, ఒక్కో ఆస్పత్రికి నాలుగు కోట్ల రూపాయల గ్రాంటును ప్రకటించారు. ఆ నిర్ణయం జరిగి సంవత్సరం గడుస్తున్నా, రాష్ట్రప్రభుత్వాల చొరవ లోపమో, కేంద్రం తాత్సారమో- ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు.

మద్యపానమో, నిద్రలేమియో, నిబంధనలకు విరుద్ధమైన డ్రైవింగో- ప్రమాదాలకు తక్షణ కారణమై ఉండవచ్చును. వాటిని నివారించడం ఎంతటి అవసరమో, మూలకారణాన్ని వెదికి చికిత్స చేయడం అంతే అవసరం. ఎక్స్‌ప్రెస్ హైవేలు- సురక్షిత ప్రయాణం కోసం కాక, వేగవంతమయిన ప్రయాణానికి ఉద్దేశిస్తున్నారు. నిదానమే ప్రధానము, వేగం కన్న భద్రత మిన్న వంటి నినాదాలు ఇప్పటికీ కనిపిస్తాయి కానీ, వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించేవారే లేరు. ప్రైవేటు బస్సులతో పాటు, ఆర్టీసీ బస్సులు కూడా వేగనియంత్రణకు స్వస్తి పలుకుతున్నాయి. ప్రతి నిర్ణీత దూరానికి నిర్దిష్ట గరిష్ఠ వేగాన్ని నిర్ణయించడమే కాక, రకరకాల వ్యవస్థల సహాయంతో నియంత్రించే వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నది. జాతీయరహదారులపై వేగ నియంత్రణే లేదు. శీఘ్రమైన పికప్‌ను, అధిక వేగాన్ని వాగ్దానం చేసే వాహనాల తయారీపై ఎటువంటి ఆంక్షలూ లేవు.

ఆర్థికసంస్కరణల కాలంలో విశృంఖలమైన వేగం ఒక ఆరాధ్యవిలువగా మారింది. వేగం ఒక మాదకద్రవ్యంగా కూడా మారింది. యంత్రం లేని వాహనాలు, సైకిళ్లు, రిక్షాలు, ఎడ్ల బండ్లు, జట్కాలు, ఇంకా ఉనికిలోనే ఉన్న కాలం ఇది. ద్విచక్ర వాహనాల్లో, నాలుగుచక్రాల వాహనాల్లో రకరకాల వేగాలతో ఉన్నవి మార్కెట్‌లో ఉన్నాయి. అన్నీ ఒకే రహదారిని పంచుకోవాలి. సహజంగానే, బలమున్నవాడి వేగమే జయిస్తుంది. మృతుల్లో అధికులు సామాన్యులే అయి ఉంటారు.

ఒక్కొక్క తమ్ముడూ ఒరిగిపోతుంటే, నిర్లిప్తంగా స్వర్గారోహణం చేసే ధర్మరాజు లాగా, మనందరం రోడ్ల పక్కన ధ్వంసమయిన వాహనాలను, పచ్చిగానే కనిపించే నెత్తుటి చారికలను చూస్తూ, హైవేలపై వేగవేగంగా ప్రయాణిస్తూనే ఉంటాం.

No comments:

Post a Comment