Monday, November 19, 2012

ఒన్స్‌మోర్ ఒబామా!

మళ్లీ ఒబామా గెలిచాడు. రిపబ్లికన్ రోమ్నీ గట్టి పోటీ ఇస్తున్నాడని ఎన్ని సర్వేలు చెప్పినా ఒబామాయే గెలుస్తాడని అనిపించింది. ఎందుకంటే, అందరు డెమొక్రాట్ అధ్యక్షుల లాగే, పదవీకాలం ముగిసే సరికి ఒబామా కూడా నికార్సయిన రిప్లబికన్‌గా తయరయ్యాడు. అలాగే, మైకెల్ జాక్సన్ లాగే అతను కూడా తన నల్లచర్మాన్ని ఒలుచుకుని శ్వేతసౌధానికి తగ్గట్టు ధగధగలాడాడు.

రిపబ్లికన్ పార్టీకి, డెమొక్రాటిక్ పార్టీకి ఏమి తేడా ఉన్నదో కనిపెట్డడం కష్టమే. వాళ్ల వాళ్ల పార్టీ గుర్తులయితే ఒకటి గాడిద, మరొకటి ఏనుగు. ఆ జంతువులకు భారతదేశంలో ఉన్న హోదాయే అమెరికాలోనూ ఉండాలని లేదు. కానీ, రిపబ్లికన్ పార్టీకి అభిమానులుగా ఉండేవారు అతివీర మితవాదులుగానూ, అమెరికా అగ్రత్వ ఆరాధకులుగానూ ఉండడం తెలుసు. అలాగే, డెమొక్రాటిక్ పార్టీ అభిమానులు ఎంతో ఉదారవాదులుగా, వీలయితే వీర విప్లవవాదులుగా మాట్లాడడం కూడా తెలుసు. కానీ, వాస్తవంలో అంతటి భిన్నత్వం ఆ పార్టీ విధానాల్లో కనిపించదు. రిపబ్లికన్లు యుద్ధాలు ప్రారంభిస్తారు. డెమొక్రాట్లు వాటిని కొనసాగిస్తారు. ఒక్కోసారి మితవాదం చేయలేని పనిని ఉదారవాదం కర్కశంగా కఠినంగా చేస్తుంది.

అయితే, ఒక నల్లజాతి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టే ఔదార్యం రిప్లబికన్ పార్టీకి ఇప్పట్లో లభించకపోవచ్చు. అంతటి వాస్తవ దృష్టి, సంసిద్ధత ఉండి ఉంటే, కండొలిజా రైజ్‌ను అభ్యర్థిగా ఎంచుకుని ఉంటే నల్లజాతి
మహిళా అభ్యర్థిని నిలబెట్టినట్టూ అయ్యేది, జార్జి బుష్‌ని మించిన యుద్ధప్రేమికురాలిని రంగంలోకి దింపినట్టూ అయ్యేది. బరాక్ ఒబామాను అభ్యర్థిగా ఎంపిక చేసి డెమొక్రాటిక్ పార్టీ ఒక చారిత్రక అవరోధాన్ని అధిగమించింది. ఒబామా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడం ఒక చారిత్రక సన్నివేశమే. అతను అధ్యక్షుడు కావడం వల్ల అమెరికనిజం సారంలో మార్పు రాదని ముందే తెలిసినప్పటికీ, రూపంలో వచ్చే మార్పు కూడా ఆవశ్యకమైనదే.

చారిత్రకంగా అణగారిపోయినవారికి అవకాశాలు లభించినప్పుడు, వారి మీద పనిచేసే ఒత్తిడులు అనేకం. 'ఇతరులు' నిర్ణయించిన నిబంధనల ప్రకారం, 'ఇతరుల' వేదికల మీద, 'ఇతరుల'తో పోరాడవలసి వచ్చేటప్పుడు, వారు తమను తాము 'పరాయి'గా మలచుకోవలసి వస్తుంది. తాము కూడా సమర్థులమేనని నిరూపించుకోవలసి రావడంతో పాటు, తాము ఫలానా అస్తిత్వానికి చెందడం వల్ల బలహీనంగానో ఉదారంగానో కఠినంగానో ఉన్నామన్న పేరు కూడా తెచ్చుకోగూడదనే ఒత్తిడి వారి మీద పనిచేస్తూ ఉంటుంది. ఒబామా అభ్యర్థిగా నిలబడినప్పుడు, అతని నల్ల అస్తిత్వం కంటె, అతని పేరులో హుస్సేన్ అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఒబామాకూ ఒసామాకూ ఒక్క అక్షరమే తేడా- అని మీడియా వెక్కిరించింది. ఒసామా బిన్‌లాడెన్‌ను వేటాడి వధించింది ఒబామా ప్రభుత్వమే కావడం విశేషం.

రెండోసారి గెలిచింతరువాత ఒబామా యుద్ధాలు లే ని రోజుల గురించి మాట్లాడుతున్నాడు. అందరికీ అవకాశాలిచ్చి లాలించిన అమెరికా గడ్డ మాతృత్వం గురించి మాట్లాడుతున్నాడు. అతను వల్లె వేసిన జాబితాలో నేటివ్ అమెరికన్లు కూడా ఉండడం అచ్చుతప్పు కాదు, అమెరికన్ అధ్యక్షులందరికీ ఉన్న అబద్ధాల అలవాటు. ఏ రంగు వారయినా ఏ భాష వారయినా ఏ మతం వారయినా పనిచేయడానికి సిద్ధపడితే అమెరికా అవకాశాలిచ్చిందంటున్నాడు. ఒబామా పూర్వీకులు కానీ, అమెరికాలోని నల్లజాతివారి పూర్వీకులు కానీ అట్లా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినవారు కాదని, వారిని ఆఫ్రికా ఖండం నుంచి పశువుల వలె ఓడల మీద తరలించుకుని తెచ్చారని ఈ విజయోత్సవ వేళ మరచిపోవడం అవసరమే కావచ్చు. అమెరికా అనేది సర్వ వర్ణాల, సకల అవకాశాల సమాన వేదికగా ఉంటే, ఉండదలిస్తే, చరిత్రను మరచిపోయి అయినా, అందుకు ఆహ్వానం పలకవలసిందే. ఒబామా నిజంగా అందుకు కృషి చేస్తే ఒప్పుకోవలసిందే.

ఫలితం స్పష్టమైన వెంటనే చేసిన విజయోత్సవ ప్రసంగంలో ఒబామా కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, సైనికంగా అజేయంగా ఉన్నదని చెబుతూ- ఇవి మాత్రం ప్రపంచం దృష్టిలో గౌరవాన్ని తెచ్చిపెట్టేవి కావని, పరస్పర సహకారభావంతో మెలగడమే అమెరికా కీర్తిని ఇనుమడింపజేస్తుందని ఆయన చెప్పారు. పెద్దన్న తనం అనేది గౌరవప్రదమైనదని కాదన్న గుర్తింపు ఆయనకున్నందుకు అభినందించాలి. ప్రపంచంలో ఎక్కడికయినా సైన్యాన్ని నడిపించడం కానీ, ఏ దేశంలో ఎవరి నెత్తిమీదైనా డ్రోన్ దాడులు చేయడం కానీ అమెరికా అంటే భయాన్ని కలిగించవచ్చును కానీ, ఆ దేశాన్ని ప్రపంచ నాయకురాలిని చేయలేవు. అంతేకాదు, అమెరికా కష్టాలను ప్రపంచం మీద రుద్ది, నష్టాలను తగ్గించుకోవాలనే దృష్టి కూడా మంచిదికాదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను హీనంగా చూస్తూ, వారి తల మీద నిత్యం కత్తి వేలాడదీస్తున్న అమెరికా ప్రభుత్వం, తమవారికి ఉపాధి కోసం ఇతర దేశాల మీద విధానాలను రుద్దడం, తాము అమ్మదలచుకున్నవాటికి ప్రపంచాన్ని మార్కెట్‌గా భావించడం న్యాయం కాదు. అమెరికన్లకు లాగే, తక్కిన ప్రపంచపౌరులందరికీ ఉజ్జ్వలమైన భవిత అవసరం. సంపదలోను, హంగులోను అధికంగా ఉన్నవారు సోదరులతో వాటిని పంచుకోవడం ఔదార్యం అవుతుంది.

యుద్ధం ముగిసిందని, ఇకపైన ఉండదని చెప్పిన ఒబామా, కేవలం ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌లను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. యుద్ధం ఇప్పుడు మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు విస్తరించింది. ఇరాన్‌తో దోబూచులాడుతోంది. కొత్త యుద్ధాలు చేయడానికి అమెరికాకు ఇప్పుడు ఆర్థికశక్తి సరిపోకపోవచ్చు. కానీ, యుద్ధం అంటే కేవలం బాంబుదాడులు మాత్రమే కాదు. అది ఒక వాతావరణం కూడా. అది ప్రపంచంలోని దేశాల మధ్య, పౌరుల మధ్య, సంస్క­ృతులు మధ్య సంబంధాలను నిర్వచిస్తుంది. యుద్ధం ఒక సాకుగా ఉండి, తక్కిన ప్రపంచాన్ని బెదిరిస్తుంది. యుద్ధం అలుముకున్న ప్రపంచంలో చర్చలు, వ్యాపార ఒప్పందాలు, పర్యటనలు- అన్నీ తుపాకీనీడలో జరుగుతున్నట్టే ఉంటాయి. ఆ వాతావరణాన్ని రద్దు చేయగలిగితే, ప్రపంచం భద్రంగా ఉంటుంది. బిన్ లాడెన్ లేని ప్రపంచంలో మెరుగైన భద్రత ఉంటుందని అమెరికా భావించింది. నిజమే కావచ్చు. కానీ, యుద్ధోన్మాదాన్ని తగ్గించుకున్న అమెరికా వల్ల ప్రపంచభద్రత కొన్ని రెట్లు పెరుగుతుంది.

యుద్ధాల నడుమ, ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం నడుమ, ఒబామా నెగ్గుకువచ్చారు. సమస్యలకు వాస్తవ పరిష్కారం సాధించడం ద్వారా ఈ విజయం సంభవించిందని ఆయన అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఓటర్లను ఉద్వేగాలతో రంజింపజేసే చర్యలు, వాగ్ధాటి, వాదనాపటిమ- వంటి ఉపకరణాలు ఆయనను మరోమారు గద్దెనెక్కించాయి. ఈ సారి ఆయనను ఎంచుకున్న వారు మార్పు కోరలేదు. యథాతథస్థితితోనే సంతృప్తి చెందారు. పరిస్థితి దిగజారే ప్రమాదం ఉన్న చోట, యథాతథాన్ని నిలుపుకోవడమే మెరుగైన ఎంపిక అవుతుందని అమెరికన్లు భావించారేమో. ఈ సంకేతాన్ని ఒబామా తగిన అర్థంలో స్వీకరించకపోతే, తనను తాను మరింత రిపబ్లికనీకరణ చెందించుకుని, మరింతగా మితవాద ఉన్మాదధోరణులను చేరదీసే ఆస్కారం ఉన్నది. అలాకాక, తొలినాటి 'మార్పు' నినాదాన్ని వాస్తవికతలోకి అనువదించే ప్రయత్నం చేస్తే, చరిత్ర తనకు ఇచ్చిన అవకాశానికి ఆయన న్యాయం చేసినవారవుతారు. నల్లవాడయినందుకు ఏదో ఒక చిన్న ప్రత్యేకతను, విభిన్నతను చూపించకపోతే, అణగారిన శ్రేణుల ప్రతీకలుగా నిలిచేవారిపై విశ్వాసం పోతుంది.

No comments:

Post a Comment