Wednesday, November 28, 2012

ఆవేశాలదే రాజ్యం అయితే, సత్యం ఎక్కడ?

రామ్‌గోపాల్ వర్మ ఎంత మాటన్నాడు?
ఏ ఉద్దీపన కలాపమూ లేకుండానే ముగిసిపోయిన రతిక్రియ లాగా ఉందట అజ్మల్ కసబ్ ఉరితీత! కసబ్‌ని ఖండఖండాలుగా నరికి నడివీధిలో చంపేయాలని తనతో సహా భారతీయులెందరో కోరుకున్నారట, అలా జరగకపోయేసరికి ఎంతో నిరుత్సాహమూ కలిగిందట. ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఆయన ఇంటి మీద ఎవరూ దాడులు చేయలేదు, ఏ పోలీసులూ అతని మీద కేసులూ పెట్టలేదు. పోలికల్లో కొంచెం సంస్కారం లోపించింది కానీ, చాలా మంది మనసుల్లో మెదిలిన భావాలనే కదా అతను చెప్పింది, సాక్షాత్తూ గాంధీయుడు అన్నా హజారే కూడా నడివీధి ఉరితీతను కోరుకున్నాడు కదా?అననైతే అన్నాడు కానీ వెంటనే ఒక డిస్‌క్లెయిమర్ కూడా వదిలాడు వర్మ. భావోద్వేగాలు వేరు, నాగరిక వ్యవహారం వేరు. చట్టబద్ధంగా వ్యవహరించక తప్పదు అని ముక్తాయించాడు. బహుశా, మిస్అయిపోయిన ఉద్దీపన కలాపాన్ని అతను తన సినిమా ద్వారా పూర్తిచేస్తాడు.

కసబ్ నిష్క్రమణ కొంతకాలం పాటు దేశభక్తులకు తీరనిలోటులానే కనిపిస్తుంది. మూలమేమిటో తెలియని సమస్యకు, ఒక ఆకారం అంటూ లేని శత్రువుకి కసబ్ ఒక రూపం. మన దుఃఖాన్ని, నిస్సహాయతను, ఆగ్రహాన్ని చూపించడానికి అందుబాటులో ఉండిన ప్రతీక అతను. ప్రభుత్వాల చేతకాని తనానికి, మన దేశం మీద మనమే చేసుకునే వెటకారాలకు అతనొక ఆలంబన. ఇక మన రాజ్యఖడ్గానికి మరింత పదును ఇవ్వడానికి, సమాజాన్ని మరింత భావోద్వేగ భరితం చేయడానికి తీవ్రజాతీయవాద శక్తులకు అతనొక సాధనం. ఉన్నట్టుండి అతను రంగం నుంచి మాయమయ్యేసరికి, చేతిలోని ఆయుధాన్ని లాగేసుకున్నట్టు, నోటి దగ్గర ముద్దను గుంజుకున్నట్టు, ఏదో శూన్యం ఏర్పడినట్టు కొందరికి అనిపిస్తోంది.

రావలసినంత మజా రాలేదని వర్మకు కలిగిన అసంతృప్తే జనంలోనూ చాలా మందికి కలిగి ఉంటుంది. అయితే అది వారి విజయోత్సాహానికి అడ్డు కాలేదు. దీర్ఘకాలంగా నిర్మితమైన ఉద్రిక్త భావాల నుంచి వారి స్పందనలు అట్లాగే ఉంటాయి. ఒక మరణాన్ని పండగ చేసుకోవడంలో ఉండే అనాగరికత వారికి ఆ సమయంలో స్ఫురించదు. తీవ్ర స్పందనలు లేని జనం మీద ఆ వాతావరణం ఒక నిర్బంధప్రభావాన్ని కూడా వేస్తుంది. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన గోపాలకృష్ణగాంధీ బాల్ ఠాక్రే, కసబ్ మరణాల తరువాత జనస్పందనల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే మరణానికి దుఃఖించడమూ, కసబ్ ఉరితీతకు ఆనందించడమూ స్వచ్ఛందంగా జరిగినట్టే, నిర్బంధంగానూ జరిగాయని, రెండు సందర్భాలలోనూ భయం ఒక ముఖ్యమైన పాత్రధారిగా పనిచేసిందని ఆయన రాస్తారు.

ఠాక్రే మరణానికి ముంబయి నగరం శోకించింది. ఆ శోకం వెనుక దుఃఖం ఉన్నమాట నిజమే. కానీ, ఠాక్రే సజీవులుగా ఉన్నప్పుడు ఆయన రాజకీయాలతోను, పనితీరుతోను విభేదించినవారు, వాటి వల్ల బాధితులైనవారు కూడా ఆయన మరణానికి అంతే తీవ్రతతో దుఃఖించే అవకాశం లేదు. వారి విషయంలో సంతాపం ఒక నిర్బంధం అయింది. లేకపోతే, ముంబయి నగరం స్తంభించిపోవడం భక్తి వల్ల కాక భయం వల్ల అని ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించిన, ఆ వ్యాఖ్యను సమర్థించిన ఇద్దరు మహిళలకు సాంఘిక దౌర్జన్యం, పోలీసు కేసులు ఎందుకు ఎదురవుతాయి? సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో సహా ఇంటర్నెట్ సమాచార వినిమయంలో నియంత్రణ కోసం పెట్టిన చట్టాల మంచిచెడ్డలటుంచి, ఆ దౌర్జన్యం వెనుక ఉన్నది భావోద్వేగాల బీభత్సమే కదా? నాగరికత రద్దయిన ఉద్రిక్త వాతావరణమే కదా?

భావోద్వేగాలు అని నిందార్థం వాడుతున్న మనోభావాలు అన్నీ దుర్మార్గమయినవి కావు. హేతువును, సాధారణ న్యాయాన్యాయాలను పక్కనబెట్టి దొమ్మీతత్వంతో ఆలోచించే ఒక సామూహికతలో మాత్రమే చెలరేగే భావోద్వేగాలే ప్రమాదకరమయినవి. అవి మనుషులు ఎట్లా ఆలోచించాలో, దేనికి నవ్వాలో, దేనికి ఏడ్వాలో శాసిస్తాయి. అతిక్రమించినవారిని శిక్షిస్తాయి, భయపెడతాయి. అవి ప్రబలంగా ఉన్న సమయంలో సత్యం బిక్కుబిక్కుమంటూ అణగారిపోతుంది. ఠాక్రే మంచిచెడ్డలు, కసబ్ ఉరితీతలోని అర్థాలు చర్చించకుండా ఒక నిషేధ వాతావరణం కమ్ముకుంటుంది. కసబ్ ఉరి జరిగిన వెంటనే కూడా దానికి సంబరపడకూడదని రాసిన వ్యాఖ్యాతలూ ఉన్నారు. కానీ, ప్రతిస్పందనల వెల్లువలో అవి ఒకటోరెండో మాత్రమే. అలాగే, బాధితుల్లో సైతం కొందరు ఆవేశాలలో కొట్టుకుపోకుండా స్పందించినవారూ ఉన్నారు. 'ఇది చట్టపరమైన అనివార్యత, అయితే దీనికి నేను సంబరపడడం లేదు' అని ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ వ్యాఖ్యానించారు. అందరికీ అంతటి స్థితప్రజ్ఞత ఉండాలని ఆశించలేము.

జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానించడమే వృత్తీ, ప్రవృత్తీ అయిన పాత్రికేయులు, పరిశీలకుల్లో కొందరయినా ఇటువంటి సందర్భాలలో కాళ్లూచేతులూ కట్టివేసినట్టు, నోటికెవరో పగ్గం వేసినట్టు గిలగిలలాడతారు. వాతావరణమంతా గాలివాటంగా, గొర్రెదాటుగా కనిపిస్తున్నప్పుడు, ఉలిపికట్టెగా కనిపించడం ఉనికికే ప్రమాదం.అటువంటి సందర్భం ఈ మధ్య మనరాష్ట్రంలోనూ, అదీ రాజధాని నగరంలో వచ్చింది. చారిత్రక కట్టడం చార్మినార్‌ను ఆనుకుని 'భాగ్యలక్ష్మి' దేవాలయంగా ప్రసిద్ధమైన నిర్మాణాన్ని శాశ్వత ప్రాతిపదికన విస్తరిస్తున్నారని పాతబస్తీలో బలంగా ఉన్న ఎమ్ఐఎమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆ అంశంపై అక్కడ కొంత కాలంగా ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. అదే విషయాన్ని కారణంగా చెబుతూ ఆ పార్టీ కాంగ్రెస్‌ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. ఈ విషయంపై సత్యాసత్యాలను నిర్ధారించే ప్రయత్నం చేయడానికి మీడియా సంకోచించింది. స్థానికంగా ఉన్న హింసాయుత పరిస్థితులతో పాటు, మతపరమైన అంశమనే అభిప్రాయం మౌనస్పందనలకు దారితీసింది. కానీ, ఆ విషయంపై వాస్తవాలను నిర్ధారించుకోవడం చరిత్రకు, వర్తమానానికీ, భవిష్యత్తుకూ కూడా అవసరం. వివాదంలోని రెండువాదనలను పరిశీలించడమో, ఏదో ఒకటి సత్యమని నిర్ధారించడమో చేసినంత మాత్రాన- ఒక పక్షాన్ని సమర్థించినట్టు కాదు. కానీ, భావోద్వేగాల వాతావరణం సత్యాన్ని కట్టడి చేసింది.

చారిత్రక కట్టడాల పరిరక్షణపై కట్టుబాటు ఉన్న పార్టీ యేమీ కాదు ఎమ్ఐఎమ్. గోల్కొండ, కుతుబ్‌షాహి సమాధుల దగ్గరి ఆక్రమణల విషయంలో, కబ్జాదారుల తరఫున పురాతత్వ అధికారులనే ఆ పార్టీ ఇబ్బందిపెట్టిన సందర్భాలున్నాయి. చార్మినార్ విషయంలో ఆ పార్టీ వ్యక్తం చేస్తున్న ఆందోళనలో వారి రాజకీయ,స్థానిక ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు. కానీ, చార్మినార్ పరిరక్షణ అనేది నగరవాసులు, రాష్ట్రప్రజలు, దేశప్రజలు, ఆ మాటకొస్తే అంతర్జాతీయ సమాజం- అందరి అంశం కదా? దాని రూపురేఖలను మార్చే విధంగా తాత్కాలికమో, శాశ్వతమో నిర్మాణాలు చేస్తే నష్టపోయేది ఎవరి వారసత్వం? వారసత్వ కట్టడాలకు కూడా మతప్రాతిపదిక ఉంటుందా? చార్మినార్‌ను ఆనుకుని ప్రస్తుతం కనిపిస్తున్న దేవాలయం ఇప్పుడున్న స్థితిలో గతంలో లేదని, హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా ఉంటున్నవారందరికీ తెలిసిందే అయినా, 'హిందూ' పత్రిక పాత ఫోటోలను ప్రచురిస్తే కానీ విపరీత వాదనలకు తెరపడలేదు.

చార్మినార్ కట్టడం పక్కనే ఒక శిలను మహిమగల శిలగా గుర్తించి జనం పూజించడం జరుగుతూ ఉండేదని, ఇటీవలి దాకా దానికి ఎటువంటి ఆలయనిర్మాణమూ లేదని పాతనగరం పెద్దలు చెబుతారు. ముప్పై ఏళ్ల కిందట అతి చిన్న ఆలయం కట్టినప్పడు వివాదం జరిగినా ఇంతకాలం ఆ అంశం రభస కాలేదు. తిరిగి, ఆలయ విస్తరణ సన్నాహాలతో, అనుమానాలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ కంటె ముందే ఉన్నదని, ఆలయం మీదనే చార్మినార్ నిర్మించారని విపరీత వాదనలు మొదలయ్యాయి. చార్మినార్ కట్టడం మసీదు కూడా అని, అక్కడ ప్రార్థనలు ప్రారంభించాలని మరో వర్గం వారు వాదిస్తున్నారు.

హైదరాబాద్ నగర నిర్మాణం జరుగుతున్న కాలంలోనే, ప్లేగు వ్యాధి సంభవించి వేలాది మంది మరణించినప్పుడు, వారికి స్మారకచిహ్నంగా కుతుబ్‌షాహీలు చార్మినార్‌ను నిర్మించారు. గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీలు మతసామరస్యపాలనకు పేరుపొందినవారు. అయితే, ఆ కట్టడం ఇస్లామిక్ వాస్తుకళ ప్రకారం జరిగింది కాబట్టి, తొలి నలుగురు ఖలీఫాల గౌరవసూచకంగా మినార్లు నిర్మించారని, అందులో ప్రార్థనలకు కూడా స్థలం కేటాయించారని చెబుతారు. తొలిరోజుల్లో సంగతి తెలియదు కానీ, చార్మినార్ కట్టడంలో ప్రార్థనలు జరగడం లేదు.

చార్మినార్ పక్కన ఎటువంటి నిర్మాణం జరిగినా, దాన్నొక మతస్థలంగా మార్చివేసినా చారిత్రక కట్టడం రూపురేఖలు, ప్రాచీనత ప్రభావితమవుతాయి. నాలుగువందలేళ్ల అపురూప కట్టడం మన వారసత్వ చిహ్నం. చరిత్ర ఆనవాలు. దాన్ని పరిరక్షించుకోవడం మతాలకు అతీతమైన బాధ్యత. ఈ వివాదం ముదిరి నగరానికి శాశ్వతమయిన రుగ్మతగా మారకుండా మొగ్గలోనే తుంపివేయాలి. అందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌరసమాజం అందరూ పూనుకోవాలి. ముఖ్యంగా ఈ అంశంపై మతాలవారీగా కాకుండా, లౌకికమయిన ప్రాతిపదికపై మాట్లాడే గొంతులు పెరగాలి.భావోద్వేగాలు సత్యాన్ని నియంత్రించకుండా చూడాలి.

3 comments:

 1. కనీసం మీరైనా ఈ విషయాన్ని సంపాదకీయంలో చర్చించినందుకు ధన్యవాదాలు.
  చార్మినార్ పాత, ప్రస్తుత ఫోటోలను పోల్చుతూ మొదటిరోజు హిందూ పత్రిక ప్రచురించినపుడు, అనేక మంది ఆ ఫోటోల కశ్చితత్వంపై సందేహాలు వెలిబుచ్చారు.(క్రింద కామెంట్ల రూపంలో) తిరిగి రెండవరోజు తన ఆర్కీవ్స్ నుండి వెతికి తీసి, మరిన్ని పాత చార్మినార్ ఫోటోలను ప్రచురించి, అక్కడ గుడి నిర్మానం కేవలం 4 దశాబ్ధాల క్రితమే జరిగిందని సాక్ష్యాధారాలతో నిర్థారించాక.. ఈ వివాదం చుట్టూ జరుగుతున్న రాజకీయాల్ని నిరసిస్తూ, గుడిని తక్షణమే మరో చోటికి తరలిస్తే సముచితంగా ఉంటుందని దాదాపు 90% మంది అభిప్రాయ పడ్డారు. ఈ పాఠకులలో హిందూ మతస్థులే ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. నిజానిజాల్ని విడమర్చి చెబితే, హిందూ మతస్తుల్లో అనేకులు( ఆ మాటకొస్తే ఏ మతంలో ఐనా) సమ్యమనంతో వ్యవహరిస్తారనే విషయాన్ని , ఆ విధంగా 'హిందూ ' పత్రిక నిరూపించింది. మరి మన తెలుగు పత్రికలు ఈ పని ఎందుకు చేయలేకపోయాయి..? దీనికి మెజారిటీ అప్పీస్మెంట్ కారణం కాదంటారా..? అయోధ్య వివాదం కొన్ని శతాబ్ధాల కాలం నాటిది కావడం వల్ల, సరైన సాక్ష్యాధారాలు లేక ఆ వివాదం రాజకీయ రాబందుల పాలిట కల్పవృక్షం లా మారింది. కానీ మన కళ్ళ ముందే పెరిగి పెద్దదవుతున్న ఈ అనవసర వివాదాన్ని నివారించడంలో తెలుగు మీడియా చొరవ తీసుకోవలసిన అవసరం లేదా? అగ్ర హీరో కూతురు ప్రేమ వ్యవహారాన్ని, 24 గంటలూ చేజ్ చేసి మరీ ప్రసారాలు చేసే మన తెలుగు మీడియా, భవిష్యత్తులో మన రాష్ట్రం పాలిట రాచపుండుగా మారే ఈ వివాదం గురించిన నిజాల్ని ప్రసారం చేయక పోవడం క్షమార్హం కాని నేరం కాదా..?

  ఈ వివాదం పై గతంలో రాసిన నా బ్లాగ్ పోస్ట్. - http://andamainacheekati.blogspot.in/2012/11/blog-post.html

  ReplyDelete
 2. ఇలా అయితే కాశీ, మధుర, బాబ్రీ ఇంకా చాలా చోట్ల ప్రపంచంలో ఇంకెక్కడా చోటులేనట్టు గుడులను కూల్చి మరీ మసీదులు కట్టారు. మరి అవన్నీ తొలగిస్తారా? 40ఏళ్ళక్రిందనే అయితే ఇప్పుడెందుకు అభ్యంతరం పెడుతున్నట్టో!? బేవార్సుగా వున్న దొంగ సెక్యులరిస్టులే చెప్పాలి.

  ReplyDelete
 3. పై దురావేశానికి సమాధానం ఈ రెండు పోస్టులలో ఉంది.
  http://www.andamainacheekati.blogspot.in/2012/11/2.html
  http://www.andamainacheekati.blogspot.in/2010/12/blog-post_24.html

  ఇప్పుడు సమస్య అక్కడ గుడి 40 ఏళ్ళనుండి ఉండటం కాదు, దానిని క్రమంగా విస్తరిస్తుండటం అని వార్తా పత్రికలు చదివే వారికి ఎవరికైనా, కనీసం కామెంటు పెట్టే ముందు, పైన శ్రీనివాస్ గారి వ్యాసం పూర్తిగా చదివినా అర్థమవుతుంది. అయినా, కొందరికి నిజానిజాల్తో సంబంధం లేదు. విద్వేషాలు,వెగటు కామెంట్లు తప్ప.

  ReplyDelete